దీదీ...
మెట్రో కథలు
దీదీకి మసాజ్ టేబుల్ ఎంత ఎత్తు ఉంటుందో తెలియదు.మెడ నుంచి మొదలుపెడతారా పాదాలు నొక్కుతూ ప్రారంభిస్తారా తెలియదు.
ఆయిల్ వాడతారని తెలుసు. ఏ ఆయిలో తెలియదు.కాని ఒప్పుకుంది. ఎనిమిది వందలు అంటే మాటలు కాదు.గదికి బాగా వెంటిలేషన్ ఉంది. రెండు పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. సింగిల్ కాట్ బెడ్ ఉంది.ఆ కర్టెన్స్ వేసేయ్ దీదీ అని వెళ్లిపోయింది. కర్టెన్స్ వేస్తుంది సరే ఆ తర్వాత ఏం చేయాలి?
దీదీని జుట్టు కొసలు కట్ చేయమంటే క్షణాల్లో చేసేస్తుంది. హెన్నా పెట్టమంటే చక్కగా పెడుతుంది. ఫేషియల్ ఓ మోస్తరు తెలుసు. ఐబ్రోస్ దిద్దడంలో పర్‌ఫెక్ట్. అంతకు ముందు ఆమెను మెహందీ దీదీ అని అనేవారు. ఇంటింటికీ తిరిగి మెహందీ పెట్టేది. మెల్లగా ఇవి కూడా నేర్చుకుంది. ఇప్పుడు మసాజ్‌లోకి దిగాలి. వచ్చింది. నైటీలో ఉంది. ఇలా పడుకోనా దీదీ అంది. వాలకం చూస్తే వెల్లికిలా పడుకునేలా ఉంది. వెల్లికిలాయేనా? నీకు తెలియదా దీదీ?నాకు తెలియదు. నాకూ తెలియదే. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
ఉదయం యథావిధిగా ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ లేదు. ఐబ్రోస్ చేసి హెన్నా పెట్టి వెళ్లిపోవాలి. దాని కంటే ముందు ఏదైనా పెడుతుంది తిందాం అనే ఆలోచన కూడా లేకపోలేదు. ఆ ఇంటికి రావడం అంటే అందుకే దీదీకి ఉత్సాహం. కాఫీ టీ ఇస్తుంది. అప్పుడప్పుడు పాత చీరలు పడేస్తుంది. చాలా ఫ్లాట్స్ తిరుగుతుంటుంది కదా. ఇది కొంచెం బాదరబందీ లేని ఫ్లాటే. పిల్లలిద్దరూ హైస్కూల్ కాలేజీలకు వచ్చేసినట్టున్నారు. అతను కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కునేపాటి బిజీ ఉద్యోగం చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో ఉడ్‌వర్క్ ఏమీ పెండింగ్ లేదంటే పర్వాలేదన్న మాటే.
ఈమె ఇంట్లో ఉంటుంది. ఆదరంగా మాట్లాడుతుంది. ఫేషియల్ గట్రా చేస్తుంటే ఇలా చెయ్ అలా చెయ్ అని ఇతర ఆడవాళ్లలా నస పెట్టకుండా ఊరికే ఉంటుంది. ఇంతకు ముందు మాటల్లో ఒకటి రెండుసార్లు దీని ప్రస్తావన తెచ్చింది. అదేమిటో తెలియక దీదీ ఊరుకుంది. కాని ఇవాళ చేసంచి దించి సామాగ్రి సర్దుకుంటూ ఉంటే ఈ పనికి పట్టుపట్టింది. అప్పటికీ దీదీకి ఇది లంపటంగానే అనిపించింది.
హెన్నా పెడతాను. వేణ్ణీళ్ల స్నానం చేసి పడుకో బేటీ.
వింటేనా?
రెండు చేతులనూ తల కింద దిండులాగా అమర్చుకుని కళ్లు మూసుకుని పడుకుంది. ఇద్దరు పిల్లల తల్లి. చక్కటి ముఖం. కుదురైన రూపం. పరిపూర్ణతను దిద్దుకున్న ఆకారం. దీదీ ఒక క్షణం తేరిపారా చూసింది. రాని పని చేయాలి. మోడా లాక్కుని మంచం చివర కూచుంది. పాదాలను చూసింది. పక్కపక్కన పడుకున్న జంట శిశువుల్లా ఉన్న వాటిలోని ఒక దానిని మెల్లగా చేతిలోకి తీసుకుంది. నులివెచ్చని నూనెలో వేలి కొసలను ముంచి సుతారంగా తాకించింది. జలదరించింది. మరో పాదాన్ని నిమిరింది. నిలువెల్లా ఒణికింది.
దీదీ తన జీవితంలో ఎవరి పాదాలూ పట్టుకోలేదు. భర్తవి కూడా. కూతురు పుడితే చిన్నప్పుడు దాని పుష్టి కోసం క్రమం తప్పకుండా నూనె పట్టించింది. అది గుర్తుకు వచ్చింది. వాటికీ వీటికీ తేడా ఏమిటి? స్పర్శను కొనసాగించింది. సుతారంగా ఆర్ద్రంగా తన స్పర్శ అంతా ఆమె స్పర్శకు అందే విధంగా...
ముఖం వైపు చూస్తూ ఉంది.
కనురెప్పలు మూతపడిన ఆ ముఖం మెల్లమెల్లగా తేట పడుతూ ఉంది. పాడైపోయిన ముడి ఏదో క్రమంగా వదులవుతున్నట్టుగా ఉంది. ఎన్నాళ్ల బరువో రుద్దీ రుద్దీ తేలిక పడుతున్నట్టుగా ఉంది. అది పరవశం కాదు. ఊపిరి అందని చోట ఒక తెమ్మర తాకడం. ఒక నిమిషం... రెండు నిమిషాలు... మూడు నిమిషాలు....కళ్ల నుంచి నీళ్లు ఉబకడం మొదలుపెట్టాయి. ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి.ఏడుస్తున్న పసిపాప. ఏమీ చెప్పుకోలేని ఆడశిశువు.
దీదీ చేతులు ఇప్పుడా శిశువును లాలిస్తూ ఉన్నాయి. శరీరమంతా నిమురుతూ ఉన్నాయి. దేహమంతటినీ సంపూర్ణంగా తడుముతూ ఉన్నాయి. కాని అవి ఆత్మను వెతుకులాడుతున్నట్టుగా కనిపించాయి. ఎందుకు బేటీ? అడగాలనిపించింది. కాని ఆ ప్రశ్న స్పష్టంగా వినిపించింది. స్పర్శ కావాలి. నీ భర్త ఇస్తున్నాడు కదమ్మా.తీసుకుంటున్నాడు దీదీ. ఇవ్వడం లేదు. అర్థం కాలేదు బేటీ.
కాసేపు దగ్గర కూడి తాకడానికి కోరిక చాలు దీదీ. కాని మీద చేయి వేసి పక్కన పడుకోవడానికి ప్రేమ కావాలి. చాలా ప్రేమ కావాలి. ఇల్లు బట్టలు ఫేషియల్‌కి డబ్బులు ఇవి ఇస్తే సరిపోతుందనుకుంటారు. కాని పక్కన చేయి పట్టుకొని కూచోవడం అక్కర్లేదను కుంటారు. ఆ దప్పిక ప్రాణం తీస్తుందని ఎవరు చెప్పాలి దీదీ... ఎలా చెప్పాలి... ఇదంతా ఉగ్గబట్టుకుని ఎలా నిలబడాలి... ఎంతకాలం నిలబడాలి....
ఆ ప్రశ్నతో ఎవరికీ వినిపించని ఆ సంభాషణ ముగిసింది.
కర్టెన్లు తొలిగాయి.తెరిపిన పడి లేచి కురులు ముడి వేసుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి టీ పెట్టుకుని వచ్చింది. ఇద్దరూ తాగారు.ఆ తర్వాత డబ్బులు ఇస్తే తీసుకుని దీదీ అక్కణ్ణుంచి వచ్చేసింది. దీదీకి మసాజ్ టేబుల్ ఎంత ఎత్తు ఉంటుందో ఇప్పటికీ తెలియదు. మెడ నుంచి మొదలుపెడతారా పాదాల నుంచి మొదలుపెడతారా కూడా తెలియదు. కాని అడిగేవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకుంది. రేటు కూడా పన్నెండు వందలకు ఒక్క రూపాయి తగ్గించడం లేదని వార్త.
- మహమ్మద్ ఖదీర్‌బాబు