Ventilation
-
స్పైస్‌జెట్ విమానంలో పనిచేయని ఏసీ.. ప్రయాణికుల అవస్థలు
న్యూఢిల్లీ: విమానంలో సాంకేతిక లోపాలు, అనుచిత ఘటనలు, బెదిరింపు కాల్స్.. వంటివి తరుచూ చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓ విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గాలి లేక ఉక్కపోతతో కొందరు అవస్థలు పడ్డారు. ఈ ఘటన స్పైస్ జెట్ విమానంలో చోటుచేసుకుంది.న్యూ ఢిల్లీ నుంచి దర్బంగా వెళుతున్న SG 476 విమానంలో సుమారు గంటకు పైగా ఏసీ పని చేయలేదు దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో అల్లాడారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. వెంటిలేషన్ లేకపోవడం వల్ల గాలి కోసం తమ చేతిలో ఉన్న వస్తువులతో విసురుకుంటూ కనిపించారు. వృద్ధులు చిన్నపిల్లలతో సహా అనేక మంది ప్రయాణీకులు ఉక్కపోతతో అవస్థలు పడ్డారు. విమానంలోని పరిస్థితిని తోటి వారు డియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది."నేను ఢిల్లీ నుంచి దర్భంగాకు స్పైస్ జెట్‌లో ప్రయాణిస్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో చెక్ ఇన్ తర్వాత గంట వరకు ఏసీ ఆన్ చేయలేదు. విమానం లోపల ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంది. విమానం టేకాఫ్ కాగానే ఏసీ ఆన్ చేశారు’’ అని ప్రయాణీకుడు రోహన్‌కుమార్ తెలిపారు.#WATCH | SpiceJet passengers travelling from Delhi to Darbhanga (SG 476) had to wait inside an aircraft without air conditioning (AC) for over an hour amid the ongoing heatwave, with several feeling unwell. pic.twitter.com/cIj2Uu1SQT— ANI (@ANI) June 19, 2024 వీడియోపై స్పందించిన విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సాంకేతిక సమస్యతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటి ఘటన మరోసారి పునరావృతం కాకుండా చూసుకుంటామని వివరణ ఇచ్చింది. -
హీటింగ్, వెంటిలేషన్, ఏసీలకు డిమాండ్
నోయిడా: మౌలికరంగ అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తుండడంతో రానున్న రోజుల్లో హీటింగ్, వెంటిలేషన్, ఏసీ (హెచ్‌వీఏసీ) రంగానికి అసాధారణ వృద్ధి అవకాశాలు రానున్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. మౌలిక రంగానికి 2024–25 మధ్యంతర బడ్జెట్లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించడం తెలిసిందే. యాక్రెక్స్ ఇండియా 23వ ఎడిషన్ కార్యక్రమం సందర్భంగా పరిశ్రమ వర్గాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాయి. వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనపై 1.45 ట్రిలియన్ డాలర్లను ఖర్చు చేయనుండడంతో అసాధారణ వృద్ధికి అవకాశాలున్నట్టు హెచ్‌వీఏసీ పరిశ్రమ మండలి ‘ఐఎస్హెచ్ఆర్ఏఈ’ ప్రెసిడెంట్ యోగేష్ ఠాకూర్ తెలిపారు. సీ, రిఫ్రిజిరేషన్ రంగంలో పర్యావరణ అనుకూల విధానాల అమలుకు ఈ కార్యక్రమ తోడ్పడుతుందని ఇన్ఫార్మా మార్కెట్స్ ఇండియా ఎండీ యోగేష్ ముద్రాస్ పేర్కొన్నారు. ఐఎస్హెచ్ఆర్ఏఈ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన అనూప్ బల్లే మాట్లాడుతూ.. కర్బన ఉద్గారాలను తగ్గింపునకు, నైపుణ్యాల అభివృద్ధికి పరిశ్రమ ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 2030 నాటికి 10 లక్షల జనాభాను మించిన పట్టణాలు 42 నుంచి 68కి పెరుగుతాయని, ఇది సీ సిస్టమ్‌లకు డిమాండ్‌ను పెంచుతుందని క్యారియల్ ఇండియా ఎండీ సంజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. ఆత్మనిర్భర్ భారత్ వంటి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ ఎయిర్ కండీషనింగ్, రిఫ్రిజిరేషన్ రంగం 9 బిలియన్ డాలర్ల మేర ఉన్నట్టు వోల్టాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముకందన్ మీనన్ పేర్కొన్నారు. -
బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ పరిస్థితి విషమం
లక్నో: పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య(79) ఆరోగ్య పరిస్తితి ఇంకా విషమంగానే ఉంది. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు వుడ్‌ల్యాండ్ హాస్పిటల్స్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ ఉదయం బుద్ధవేవ్ ఛాతీ భాగానికి సీటీ స్కాన్ తీసినట్లు వైద్యులు పేర్కొన్నారు. సీనియర్ వైద్య నిపుణల బృందం భట్టాచార్యకు చికిత్స అందిస్తుందని, ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. అయితే మొత్తం మీద బుద్దదేవ్ ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ప్రాణాపాయం నుంచి బయటపడలేదని వైద్యులు తెలిపారు. రక్తపోటు అదుపులోకి రావడంతో చికిత్సకు ఆయన సహకరిస్తున్నారని చెప్పారు. కాగా శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో శనివారం కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటట్‌లో చేరని విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా 2000 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ సీఎంగా భట్టాచార్య పనిచేశారు. చదవండి: పార్లమెంట్లో ఆరని మణిపూర్ మంటలు.. -
బీజింగ్‌లో కోవిడ్ బీభత్సం
బీజింగ్: కరోనా చైనాను చిదిమేస్తోంది. బీజింగ్‌లో కోవిడ్ రోగులు వెల్లువలా ఆస్పత్రులకు తరలివస్తున్నారు. నగరంలోని చుయాంగ్‌లియూ ఆస్పత్రిలో పరిస్థితే అక్కడి ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దర్పణం పడుతోంది. ఆస్పత్రిలోని బెడ్లు అన్నీ కోవిడ్ వృద్ధ రోగులతో నిండిపోయాయి. అయినా రోగులు వస్తుండటంతో బంధువులు వేచి ఉండే గదుల్లో, కారిడార్లలో వైద్యం చేస్తున్నారు. ఉన్న అన్ని వీల్చైర్లలో రోగులు కూర్చొనే ఆక్సిజన్ వెంటెలేషన్తో శ్వాసిస్తున్నారు. మరింత అత్యవసర వైద్యసేవలు అవసరమైన రోగులకు చికిత్సచేయడంలో వైద్యులు, నర్సులు మునిగిపోయారు. జీరో కోవిడ్ పాలసీతో కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు శతథా ప్రయత్నించి చైనా చేతులెత్తేయడంతో దేశంలో వైద్యారోగ్య పరిస్థితి దయనీయంగా తయారైంది. అత్యవసరమైతే తప్ప సొంతూర్లకు రావొద్దని అక్కడి హునాన్ప్రావిన్స్లోని షావోయాంగ్ కౌంటీ, అన్హుయీ ప్రావిన్స్‌లోని షాయూగ్జియాన్ కౌంటీలతోపాటు గన్సు ప్రావిన్స్‌లోని క్వింగ్యాంగ్ తదితర నగర పాలనాయంత్రాంగాలు ప్రజలను హెచ్చరించాయి. చైనాలో వైద్య అత్యయక స్థితిపై వాస్తవిక సమాచారం అందితే ఇతర దేశాలు సరైన విధంగా సమాయత్తం అయ్యేందుకు వీలుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అధ్యక్షుడు టెడ్రోస్ బుధవారం హితవుపలికారు. -
ఫిట్స్‌గా పొరబడే హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్..
చాలామందిలో ఆందోళన (యాంగ్జైటీ ఉన్నప్పుడు) పానిక్ అటాక్స్కు కారణమయ్యే అంశాల్లో ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ ఒకటి. హైపర్ వెంటిలేషన్ అంటే ఏమిటో చూద్దాం. కొందరు బాగా లోతుగా గాలి పీల్చుకుంటూ ఉంటారు. యాంగ్జైటీ సమయంలో లోతుగా, వేగంగా శ్వాసించడం వల్ల ఊపిరితిత్తుల్లోని కార్బన్ డైఆక్సైడ్‌ను ఎక్కువగా బయటకు వదులుతుంటారు. దాంతో దేహంలో కార్బన్‌డైఆక్సైడ్ శాతం తగ్గుతుంది. ఈ కండిషన్‌ను హైపోకాప్నియా అంటారు. ఇలా ఎక్కువగా గాలి పీల్చడం వల్ల జరిగే పరిణామాలను ‘హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్’ అంటారు. ఫలితంగా వారి ధమనుల్లో బైకార్పొనేట్ స్థాయులు పెరుగుతాయి. ఈ కండిషన్‌ను ఆల్కలోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్స్‌లో పేషెంట్‌కు గుండెవేగం పెరుగుతుంది. శ్వాస తీసుకునే వేగం హెచ్చుతుంది. నిద్రమత్తుగా అనిపిస్తుంది. తేలికపాటి తలనొప్పి కూడా కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనిషి తాత్కాలికంగా స్పృహ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సమయాల్లో రోగి కాళ్లూచేతులు బిగుసుకునిపోతాయి. దీన్నే ఒక్కోసారి ఫిట్స్‌గా అపోహపడుతుంటారు. అవి ఫిట్సా లేక హైపర్ వెంటిలేషన్ సిండ్రోమ్ కారణంగా వచ్చిన ప్యానిక్ అటాకా అని నిర్ధారణ చేసుకునేందుకూ వెంటనే వైద్యులను సంప్రదించాలి. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
Covid:గాలిలో 10 మీటర్లు దూరం వరకు
న్యూఢిల్లీ: గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం నేడు కీలక విషయాలు వెల్లడించింది. అది ఏంటంటే మనం తుమ్మినా, దగ్గినా తుంపర్లు సాధారణంగా రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. కానీ ఏరోసోల్స్ అంటే అతి సూక్ష్మమైన తుంపర్లు ఏకంగా 10 మీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం గురువారం విడుదల చేసిన నూతన మార్గ దర్శకాల్లో వెల్లడించింది. ఫలితంగా వైరస్ కట్టడి కోసం మాస్క్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది. సూచనలు.. ఈ క్రమంలో వైరస్ కట్టడికి మాస్క్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లల్లో వెంటిలేషన్‌ని పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుంది. ఇంట్లో ఉండే కిటికీలు, తలుపులు వంటి ఎగ్జాస్ట్ సిస్టంతో చెడు వాసనలు బయటకు వెళ్లాయి. అలానే అదే ప్రాంతంలో ఫ్యాన్లు పెడితే వైరస్‌తో కూడిన గాలి బయటకు పోయి కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుంది అని తెలిపింది. లక్షణాలు లేని వ్యక్తులు కూడా వైరస్‌ని వ్యాప్తి చేస్తారు. సాధారణంగా కరోనా బారిన పడి వ్యక్తి నుంచి విడుదలయ్యే లాలాజలం, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు, ఏరోసోల్స్ రూపంలో ఉండే అతి సూక్ష్మ తుంపర్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకాలు. పెద్ద తుంపర్లు భూమీ ఉపరితలం మీద పడతాయి. అవి పడిన ప్రదేశాలను ఇతరులు తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి లోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను తరచుగా సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఇక చిన్న తుంపర్లు అయిన ఏరోసోల్స్ గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచాలి. పని చేసే ఆఫీసుల్లో ఏసీలు వేసి, మొత్తం మూసేస్తారు. దాని వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలి అని సూచించారు. రెండు మాస్క్‌లు వాడటం మేలు.. కరోనా కట్టడిలో మాస్క్ కీలకం. రెండు మాస్క్‌లతో మరింత ప్రయోజనం అంటున్నారు నిపుణులు. సర్జికల్ మాస్క్‌తో పాటు కాటన్ మాస్క్ కలిపి పెట్టుకోవాలి. ఎన్ 95 మాస్క్ వాడటం శ్రేయస్కరం. భారతదేశంలో ఇప్పటి వరకు కనీసం 2.57 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.87 లక్షల మంది మరణానికి దారితీసింది. చదవండి: Black Fungus: ఆయుర్వేదంతో చెక్ -
సబ్బం హరికి కరోనా.. పరిస్థితి విషమం
సాక్షి, విశాఖపట్నం: మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత సబ్బం హరి కరోనా బారినపడ్డారు. మూడు రోజుల క్రితం పరీక్షలు నిర్వహించగా కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణైంది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి కాస్త విషమంగా ఉందని ఆస్పత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి. పది రోజుల క్రితం ఆయనకు కోవిడ్ సోకడంతో వైద్యుల సూచనతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే గత మూడు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
దీదీ...
మెట్రో కథలు దీదీకి మసాజ్ టేబుల్ ఎంత ఎత్తు ఉంటుందో తెలియదు.మెడ నుంచి మొదలుపెడతారా పాదాలు నొక్కుతూ ప్రారంభిస్తారా తెలియదు. ఆయిల్ వాడతారని తెలుసు. ఏ ఆయిలో తెలియదు.కాని ఒప్పుకుంది. ఎనిమిది వందలు అంటే మాటలు కాదు.గదికి బాగా వెంటిలేషన్ ఉంది. రెండు పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. సింగిల్ కాట్ బెడ్ ఉంది.ఆ కర్టెన్స్ వేసేయ్ దీదీ అని వెళ్లిపోయింది. కర్టెన్స్ వేస్తుంది సరే ఆ తర్వాత ఏం చేయాలి? దీదీని జుట్టు కొసలు కట్ చేయమంటే క్షణాల్లో చేసేస్తుంది. హెన్నా పెట్టమంటే చక్కగా పెడుతుంది. ఫేషియల్ ఓ మోస్తరు తెలుసు. ఐబ్రోస్ దిద్దడంలో పర్ఫెక్ట్. అంతకు ముందు ఆమెను మెహందీ దీదీ అని అనేవారు. ఇంటింటికీ తిరిగి మెహందీ పెట్టేది. మెల్లగా ఇవి కూడా నేర్చుకుంది. ఇప్పుడు మసాజ్లోకి దిగాలి. వచ్చింది. నైటీలో ఉంది. ఇలా పడుకోనా దీదీ అంది. వాలకం చూస్తే వెల్లికిలా పడుకునేలా ఉంది. వెల్లికిలాయేనా? నీకు తెలియదా దీదీ?నాకు తెలియదు. నాకూ తెలియదే. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఉదయం యథావిధిగా ఇంటికి వచ్చినప్పుడు ఈ ప్రోగ్రామ్ లేదు. ఐబ్రోస్ చేసి హెన్నా పెట్టి వెళ్లిపోవాలి. దాని కంటే ముందు ఏదైనా పెడుతుంది తిందాం అనే ఆలోచన కూడా లేకపోలేదు. ఆ ఇంటికి రావడం అంటే అందుకే దీదీకి ఉత్సాహం. కాఫీ టీ ఇస్తుంది. అప్పుడప్పుడు పాత చీరలు పడేస్తుంది. చాలా ఫ్లాట్స్ తిరుగుతుంటుంది కదా. ఇది కొంచెం బాదరబందీ లేని ఫ్లాటే. పిల్లలిద్దరూ హైస్కూల్ కాలేజీలకు వచ్చేసినట్టున్నారు. అతను కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కునేపాటి బిజీ ఉద్యోగం చేస్తున్నట్టున్నాడు. ఇంట్లో ఉడ్‌వర్క్ ఏమీ పెండింగ్ లేదంటే పర్వాలేదన్న మాటే. ఈమె ఇంట్లో ఉంటుంది. ఆదరంగా మాట్లాడుతుంది. ఫేషియల్ గట్రా చేస్తుంటే ఇలా చెయ్ అలా చెయ్ అని ఇతర ఆడవాళ్లలా నస పెట్టకుండా ఊరికే ఉంటుంది. ఇంతకు ముందు మాటల్లో ఒకటి రెండుసార్లు దీని ప్రస్తావన తెచ్చింది. అదేమిటో తెలియక దీదీ ఊరుకుంది. కాని ఇవాళ చేసంచి దించి సామాగ్రి సర్దుకుంటూ ఉంటే ఈ పనికి పట్టుపట్టింది. అప్పటికీ దీదీకి ఇది లంపటంగానే అనిపించింది. హెన్నా పెడతాను. వేణ్ణీళ్ల స్నానం చేసి పడుకో బేటీ. వింటేనా? రెండు చేతులనూ తల కింద దిండులాగా అమర్చుకుని కళ్లు మూసుకుని పడుకుంది. ఇద్దరు పిల్లల తల్లి. చక్కటి ముఖం. కుదురైన రూపం. పరిపూర్ణతను దిద్దుకున్న ఆకారం. దీదీ ఒక క్షణం తేరిపారా చూసింది. రాని పని చేయాలి. మోడా లాక్కుని మంచం చివర కూచుంది. పాదాలను చూసింది. పక్కపక్కన పడుకున్న జంట శిశువుల్లా ఉన్న వాటిలోని ఒక దానిని మెల్లగా చేతిలోకి తీసుకుంది. నులివెచ్చని నూనెలో వేలి కొసలను ముంచి సుతారంగా తాకించింది. జలదరించింది. మరో పాదాన్ని నిమిరింది. నిలువెల్లా ఒణికింది. దీదీ తన జీవితంలో ఎవరి పాదాలూ పట్టుకోలేదు. భర్తవి కూడా. కూతురు పుడితే చిన్నప్పుడు దాని పుష్టి కోసం క్రమం తప్పకుండా నూనె పట్టించింది. అది గుర్తుకు వచ్చింది. వాటికీ వీటికీ తేడా ఏమిటి? స్పర్శను కొనసాగించింది. సుతారంగా ఆర్ద్రంగా తన స్పర్శ అంతా ఆమె స్పర్శకు అందే విధంగా... ముఖం వైపు చూస్తూ ఉంది. కనురెప్పలు మూతపడిన ఆ ముఖం మెల్లమెల్లగా తేట పడుతూ ఉంది. పాడైపోయిన ముడి ఏదో క్రమంగా వదులవుతున్నట్టుగా ఉంది. ఎన్నాళ్ల బరువో రుద్దీ రుద్దీ తేలిక పడుతున్నట్టుగా ఉంది. అది పరవశం కాదు. ఊపిరి అందని చోట ఒక తెమ్మర తాకడం. ఒక నిమిషం... రెండు నిమిషాలు... మూడు నిమిషాలు....కళ్ల నుంచి నీళ్లు ఉబకడం మొదలుపెట్టాయి. ధారాపాతంగా కారిపోతూ ఉన్నాయి.ఏడుస్తున్న పసిపాప. ఏమీ చెప్పుకోలేని ఆడశిశువు. దీదీ చేతులు ఇప్పుడా శిశువును లాలిస్తూ ఉన్నాయి. శరీరమంతా నిమురుతూ ఉన్నాయి. దేహమంతటినీ సంపూర్ణంగా తడుముతూ ఉన్నాయి. కాని అవి ఆత్మను వెతుకులాడుతున్నట్టుగా కనిపించాయి. ఎందుకు బేటీ? అడగాలనిపించింది. కాని ఆ ప్రశ్న స్పష్టంగా వినిపించింది. స్పర్శ కావాలి. నీ భర్త ఇస్తున్నాడు కదమ్మా.తీసుకుంటున్నాడు దీదీ. ఇవ్వడం లేదు. అర్థం కాలేదు బేటీ. కాసేపు దగ్గర కూడి తాకడానికి కోరిక చాలు దీదీ. కాని మీద చేయి వేసి పక్కన పడుకోవడానికి ప్రేమ కావాలి. చాలా ప్రేమ కావాలి. ఇల్లు బట్టలు ఫేషియల్‌కి డబ్బులు ఇవి ఇస్తే సరిపోతుందనుకుంటారు. కాని పక్కన చేయి పట్టుకొని కూచోవడం అక్కర్లేదను కుంటారు. ఆ దప్పిక ప్రాణం తీస్తుందని ఎవరు చెప్పాలి దీదీ... ఎలా చెప్పాలి... ఇదంతా ఉగ్గబట్టుకుని ఎలా నిలబడాలి... ఎంతకాలం నిలబడాలి.... ఆ ప్రశ్నతో ఎవరికీ వినిపించని ఆ సంభాషణ ముగిసింది. కర్టెన్లు తొలిగాయి.తెరిపిన పడి లేచి కురులు ముడి వేసుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి టీ పెట్టుకుని వచ్చింది. ఇద్దరూ తాగారు.ఆ తర్వాత డబ్బులు ఇస్తే తీసుకుని దీదీ అక్కణ్ణుంచి వచ్చేసింది. దీదీకి మసాజ్ టేబుల్ ఎంత ఎత్తు ఉంటుందో ఇప్పటికీ తెలియదు. మెడ నుంచి మొదలుపెడతారా పాదాల నుంచి మొదలుపెడతారా కూడా తెలియదు. కాని అడిగేవాళ్లు చాలామందే ఉన్నారని తెలుసుకుంది. రేటు కూడా పన్నెండు వందలకు ఒక్క రూపాయి తగ్గించడం లేదని వార్త. - మహమ్మద్ ఖదీర్‌బాబు