న్యూఢిల్లీ: గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన నేపథ్యంలో కేంద్రం నేడు కీలక విషయాలు వెల్లడించింది. అది ఏంటంటే మనం తుమ్మినా, దగ్గినా తుంపర్లు సాధారణంగా రెండు మీటర్ల దూరం ప్రయాణిస్తాయి. కానీ ఏరోసోల్స్ అంటే అతి సూక్ష్మమైన తుంపర్లు ఏకంగా 10 మీటర్ల దూరం ప్రయాణం చేస్తాయని కేంద్ర ప్రభుత్వం అధీనంలోని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కార్యాలయం గురువారం విడుదల చేసిన నూతన మార్గ దర్శకాల్లో వెల్లడించింది. ఫలితంగా వైరస్ కట్టడి కోసం మాస్క్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలని తెలిపింది.
సూచనలు..
ఈ క్రమంలో వైరస్ కట్టడికి మాస్క్, భౌతిక దూరం పాటించడంతో పాటు ఇళ్లల్లో వెంటిలేషన్‌ని పెంచుకోవాలి. కరోనా సోకిన వ్యక్తి నుంచి వైరస్ సోకే ముప్పును వెంటిలేషన్ తగ్గిస్తుంది. ఇంట్లో ఉండే కిటికీలు, తలుపులు వంటి ఎగ్జాస్ట్ సిస్టంతో చెడు వాసనలు బయటకు వెళ్లాయి. అలానే అదే ప్రాంతంలో ఫ్యాన్‌లు పెడితే వైరస్‌తో కూడిన గాలి బయటకు పోయి కోవిడ్ సోకే ముప్పు తగ్గుతుంది అని తెలిపింది.
లక్షణాలు లేని వ్యక్తులు కూడా వైరస్‌ని వ్యాప్తి చేస్తారు. సాధారణంగా కరోనా బారిన పడి వ్యక్తి నుంచి విడుదలయ్యే లాలాజలం, ముక్కు నుంచి వెలువడే తుంపర్లు, ఏరోసోల్స్ రూపంలో ఉండే అతి సూక్ష్మ తుంపర్లు వైరస్ వ్యాప్తికి ప్రధాన కారకాలు. పెద్ద తుంపర్లు భూమీ ఉపరితలం మీద పడతాయి. అవి పడిన ప్రదేశాలను ఇతరులు తాకితే వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఇంటి లోపల నేల, తలుపు హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. చేతులను తరచుగా సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
ఇక చిన్న తుంపర్లు అయిన ఏరోసోల్స్ గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడూ మూసి ఉన్న గదుల్లో ఈ ఏరోసోల్స్ ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అందుకే ఇంట్లో వెంటిలేషన్ బాగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లోకి గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచాలి.
పని చేసే ఆఫీసుల్లో ఏసీలు వేసి, మొత్తం మూసేస్తారు. దాని వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే తలుపులు, కిటికీలు తెరిచి ఉంచడంతో పాటు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేయాలి అని సూచించారు.
రెండు మాస్క్‌లు వాడటం మేలు..
కరోనా కట్టడిలో మాస్క్ కీలకం. రెండు మాస్క్‌లతో మరింత ప్రయోజనం అంటున్నారు నిపుణులు. సర్జికల్ మాస్క్‌తో పాటు కాటన్ మాస్క్ కలిపి పెట్టుకోవాలి. ఎన్ 95 మాస్క్ వాడటం శ్రేయస్కరం. భారతదేశంలో ఇప్పటి వరకు కనీసం 2.57 కోట్ల మంది ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 2.87 లక్షల మంది మరణానికి దారితీసింది.
చదవండి: Black Fungus: ఆయుర్వేదంతో చెక్
Comments
Please login to add a commentAdd a comment