రొటీన్... | Routine | Sakshi
Sakshi News home page

రొటీన్...

Published Sat, Jun 20 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 4:04 AM

రొటీన్...

రొటీన్...

మెట్రో కథలు
నిన్నటి వరకూ ఆమె రొటీన్‌లో మార్పు లేదు.
ఉదయాన్నే ఐదుంపావుకు సరిగ్గా ఎవరో తట్టి లేపినట్టుగా లేచి కూచుంటుంది. మరో నాలుగైదు నిమిషాల్లో టీ పెట్టుకుని బాల్కనీలో- అక్కడ కూచుంటే కింద నుంచి బాగా ఆకులేసిన బొప్పాయి చెట్టు కనిపిస్తుంది- దానిని చూస్తూ కూచుంటుంది. ఐదున్నర నుంచి ఆరువరకు ప్రాణాయామం. ఆరుకు పాపను లేపిందంటే, దానికి బ్రష్ చేయించి, బ్రేక్‌ఫాస్ట్ పెట్టి, మళ్లీ స్నాక్స్ కోసం కాసింత న్యూటెల్లా రాసిన బ్రెడ్ ముక్కలు డబ్బాలో కూరి, యూనిఫామ్ తొడిగి, ఏడున్నరకు బస్ ఎక్కించేదాకా తీరదు. ఆ తర్వాత ట్రాక్ ప్యాంట్ వేసుకొని పైన టీషర్ట్ లాక్కుని లిఫ్ట్‌లో కిందకు దిగి అలా హైటెక్ సిటీ వరకు సైక్లింగ్‌కు బయలు దేరిందంటే ఎనిమిదిన్నర వరకూ అది తన టైమ్. పదిన్నరకు ఆఫీస్. సాయంత్రం నాలుక్కు పాప వచ్చే సమయానికి ఇల్లు.
కాస్త డబ్బు ఎక్కువే అయినా జె.ఎన్.టి.యులో ఈ గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ కొనుక్కున్నప్పటి నుంచి ఆమెకు స్థిమితంగా ఉంది. కొత్త కన్‌స్ట్రక్షన్. మంచి అమినిటీస్. ఒక గడపకూ మరో గడపకూ సంబంధం లేనట్టుగా ప్రైవసీ. అందరికీ ఐ.డి. కార్డ్స్. అవి చూపితే తప్ప ఎంట్రీ ఇవ్వని సెక్యూరిటీ... చెప్పాలంటే ఇక్కడికొచ్చాక భర్తే కాపాడాలి అనే భయం దాదాపు పోయింది.
త్రీ బెడ్‌రూమ్స్ ఉన్న ఆ ఫ్లాట్‌లో ఒక బెడ్‌రూమ్‌లో భర్త ఉంటున్నాడు. ఆరు నెల్ల క్రితం ఒకరోజు నేను ఆ రూమ్‌లో పడుకుంటాను అన్నాడు. పడుకో అంది. అంతే. వాదన పెట్టుకోలేదు. అతడి కోసం ఆమె చాలా మారింది. ఇది కూడా పెద్ద మార్పే. కొత్తల్లో పెద్ద పెద్దగా వాదనకు దిగేది. ఇప్పుడు ఏ విషయాన్నైనా చిన్న గొంతుతో అంతే తీవ్రంగా చెప్పడం నేర్చుకుంది.
చిన్నప్పటి నుంచి రెండు వదలొద్దనుకుంది. ఒకటి సైక్లింగ్. రెండు ఉద్యోగం. రెంటినీ వాళ్లూ వీళ్లూ వద్దన్నా తండ్రి లెక్క చేయలేదు. భర్త లెక్క జేస్తాడని అనుకోలేదు. ఉద్యోగం చేసే అమ్మాయి వద్దు అని ముందే చెప్పేయాల్సింది. కాని చెప్పలేదు. చేసుకున్నాడు. చక్కగా ఉద్యోగం చేస్తుంది. చక్కగా ఇల్లు చూసుకుంటుంది. చక్కగా పాపనూ. చక్కగా మొగుణ్ణీ. అయినా చాల్లేదు.
ఇంట్లో ఫోన్లు తగ్గించు అన్నాడు ఒకరోజు.
మగాళ్లతో మాటలు తగ్గించు అన్నాడు ఇంకోరోజు.
క్యాంపులు తగ్గిస్తే మంచిది అని మరో రోజు.
ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇళ్లకు చేరే ఆడవాళ్లంటే భయం ఉండదు చాలామందికి. కాని ఆఫీస్ పని మీద ఒక్కరోజైనా సరే ఊరెళ్లొచ్చే ఆడవాళ్లంటే మాత్రం భయం. ఏం... చేయాలంటే అక్కడే చేయలా? ఇక్కడ చేయకూడదా? సరే ఎందుకొచ్చిన గొడవ అని క్యాంపులు డ్రాప్ చేసింది. అతడు చూస్తుండగా ఫోన్లూ మానేసింది. నిజానికి తన టాలెంట్‌కు ఎక్కడో ఉండాలి. కుటుంబం కోసం కుదించుకుంది.
తృప్తి లేదు.
ఏం చేయాలి? చూడ్డానికి బావుంటుంది. నవ్వితే బాగుంటుంది.
ఇదంతా నీ కోసమే. సత్యంగా నీ కోసమే.
ఊహూ. నమ్మకం లేదు.
పెళ్లయినప్పటి నుంచి గమనిస్తోంది. ఎప్పుడు పక్కన పడుకున్నా మధ్యలో వేరెవరో వచ్చి పడుకోవాలి అన్నట్టుగా ఎడం ఇచ్చి పడుకుంటాడు. అసలు ఎప్పుడైనా సంపూర్ణంగా హృదయంలోకి తీసుకున్నాడా అని. పెళ్లికి ముందు, తర్వాత ఎంతో హుషారుగా, దుముకుతున్నట్టుగా ఉండేది. తను స్తబ్దుగా అయ్యే కొద్దీ తానూ స్తబ్దుగా అయిపోతూ వచ్చింది. ఆ రూపూ.. ఆ ఆకారం..
మొన్నొకరోజు కలీగ్ బలవంతంగా కళ్లజోడు తీయించింది.
చూడు. కళ్ల కింద ఎంతెంత పెద్ద చారలు ఉన్నాయో. నువ్వు సంతోషంగా లేవు కదూ.
ఏం చెబుతుంది?
ఇంకెవరో బంధువు అసలు గుర్తు పట్టనే లేదు. చాలా పొడవైన జుట్టు ఉండేది తనకు. పూర్తిగా బాయిష్ లుక్‌లో హెయిర్ కట్ చేయించుకుంది. చీరలు, చుడీదార్లు.... చాలా బాగుంటాయి. పూర్తిగా మానేసి ప్యాంట్ షర్ట్స్‌లో దిగిపోయింది. లిప్‌స్టిక్... కాటుక... వద్దనే వద్దు.
నాకు పని చేయడం ముఖ్యం... బయటి ప్రపంచానికి నేను మగాడి కిందే లెక్క... వేరే ఏ బేరాల్లోనూ ఇంట్రెస్టు లేదు.... హ్యాపీగా ఉందా...
ఊహూ. దిలాసా లేదు.
ఇంకా ఏం చేస్తే మారుతాడా అని అలోచించి ఆలోచించి, తన ఎద ఎత్తుగా ఉంటుంది, సర్జరీ చేయించి అణిచేద్దామా అని డాక్టర్ దగ్గరకు వెళితే మీ మైండ్ ఖరాబ్ అయ్యింది వెళ్లండి అని పంపించేశాడు. డాక్టర్‌కు ఏం తెలుసు? ఈ ఖరాబును తాను భరించగలదు. కాని ఇతడి కోసం పని మానేసి ఇంట్లో కూచుంటే పూర్తిగా పిచ్చిదైపోతుంది. అయినా ఎందుకు మానేయాలి? ఆడవాళ్లు పనికే కదా పోతున్నారు. ఊళ్లోవాళ్లకి పైట జార్చడానికి పోతున్నారా?
ఈ ఫ్లాట్ కొనకముందు ఏదో ఇన్వెస్ట్‌మెంట్ కోసం డబ్బు అడిగాడు.
తాను అక్కర్లేనప్పుడు తన డబ్బు మాత్రం ఎందుకు?
ఇవ్వను అంది. మనసులో పెట్టుకున్నాడు.
ఆ తర్వాత ఈ ఫ్లాట్ కొంటుంటే వాళ్లూ వీళ్లూ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయించుకోమని సలహా ఇచ్చారు. వద్దని తన పేరు మీదే చేయించుకుంది. ఇప్పుడు తనకో ఇల్లుంది. కూతురుంది. ఉద్యోగం ఉంది. మొగుడు కూడా ఉంటే ఉంటాడు. నిన్న రాత్రి అదీ తేలిపోయింది.
డైనింగ్ టేబుల్ మీద భోం చేస్తుంటే- ఇలాగైతే ఉండను. వెళ్లిపోతాను అన్నాడు.
దూరంగా పాప పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తోంది. వాలకం చూస్తే గొడవ జరిగేలా ఉంది. పెద్ద గొడవ జరిగినా చిన్న గొడవ జరిగినా ఫలితం మాత్రం తాను ముందే నిశ్చయించుకుని ఉంది. అందుకని గొంతు పెంచకుండా మెల్లగా తీవ్రంగానే అంది.
ఇంకొక్క మాట మాట్లాడావంటే పళ్లు రాలిపోతాయి. మర్యాదగా ఇంట్లో నుంచి బయటకు నడు. మళ్లీ వచ్చావంటే కాళ్లు విరగ్గొడతా.
ఆ... అని ముందుకు ఉన్నవాడల్లా కుర్చీలో వెనక్కు వాలి నోరెళ్లబెట్టాడు.
పాపను తీసుకుని బెడ్‌రూమ్‌లోకి వెళ్లిపోయింది. మరో అరగంటకు ఏం ప్యాక్ చేసుకున్నాడో పాడో వెళ్లిపోయాడు.
తెల్లారింది. మెలకువ వచ్చింది. బొప్పాయి చెట్టును చూస్తూ టీ తాగడం పూర్తయ్యింది. పాప స్కూలుకు కూడా వెళ్లిపోయింది. ఏం కొంప మునిగిపోలేదు. నిన్న గడిచినట్టే ఇవాళ కూడా గడుస్తుంది.
టైమ్ చూసుకుంది. ట్రాక్ ప్యాంట్ వేసుకుంది. టీషర్ట్ లాక్కుని కిందకు దిగి సైకిల్‌తో రోడ్డు మీదకు వచ్చాక ఒక క్షణం అనిపించింది. రేపతను మళ్లీ రావచ్చు. కాళ్లబేరం చేసుకోవచ్చు. తాను దయతలిచి  ఇంట్లోకి అడుగుపెట్టనివ్వొచ్చు. కాని ఈ రొటీన్‌లో మాత్రం తేడా ఉండకూడదు. అయితే ఒక్కటి మాత్రం తేడా పాటించాలనుకుంటోంది.

ఇక మీదట జుట్టు పొడుగ్గా పెంచాలనుకుంటోంది.
 ఏం... ముచ్చటగా చీర కట్టుకుని ఆఫీసుకు వెళ్లకూడదా?
 - మహమ్మద్ ఖదీర్‌బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement