డిస్టెన్స్
మెట్రో కథలు
బాస్ పిలిస్తే లోపలికెళ్లి బయటకు వచ్చాక మళ్లీ ఒకసారి కాల్ చేసి చూశాడు.
స్విచ్‌డ్ ఆఫ్ వస్తోంది.
సీట్‌లో కూచుని సెల్ వైపు చూసుకుంటూ తిరిగి కాల్ చేశాడు.
స్విచ్‌డ్ ఆఫే.
టైమ్ పదకొండు అవుతోంది. సాయంత్రం ఆరుకు ఆఫీస్ అయిపోతే ఏడుకు ఇల్లు చేరేదాకా ఈ నరకం తప్పదు.
ఉదయం బయలుదేరే ముందు చిన్నగా మాటా మాటా పెరిగింది.
సాయంత్రం వచ్చి తీసుకెళతారుగా అంది.
చూద్దాం అన్నాడు.
చూద్దాం ఏంటి? రెట్టించింది.
చెప్తానన్నాగా. నువ్వు రెడీ అయి కూచుని నా ప్రాణం తీయకు.
ఆ మాట చెప్పి టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేశాడు. అయితే అలా టూ వీలర్ ఎక్కి ఆఫీసుకు వచ్చేయడం అంత సులభం కాదు. ఏ రోజూ సులభం అవగా చూళ్లేదు. ట్రాఫిక్ ఉంటుంది. సిగ్నల్స్ దగ్గర చాలాసేపు వెయిటింగ్ ఉంటుంది. మధ్యలో పోలీసులు ఎందుకాపేస్తారో తెలియదు, పదీ పదిహేను నిమిషాలు అందరినీ ఆపేసి ఎవరికో దారి వదులుతారు. బాగా నిండిన మురుగు కాలువ అతి మెల్లగా కదిలినట్టు ఒక్కోసారి ఎంత విశాలమైన రోడ్డైనా బండ్లతో నిండిపోయి నల్లటి పొగ వదులుతూ అడుగులో అడుగు వేస్తూ ముందుకు కదులుతుంటుంది. ఓ కారు దాదాపు డ్యాష్ ఇస్తూ ముందుకుపోతుంది. యూ టర్న్ దగ్గర ఎవడిదో బైక్ మీదమీదకు వచ్చేస్తుంది. చాలా అదృష్టం కలిసి రావాలి. ఆఫీసుకు అప్పుడు చేరాలి.
ఎవరో ఒకరు సెక్షన్‌లోనో క్యాంటీన్‌లోనో
స్మోక్‌రూమ్‌లోనో మరొకరిని అడుగుతుంటారు- ఎక్కడ ఉంటున్నావ్?
ఏదో ఒక ఏరియా చెప్తారు.
అక్కడా? అంత దూరమా?
అబ్బే... ఏం దూరం... అరౌండ్ ఫిఫ్టీన్.
ఈ అరౌండ్ అనే మాటకు ఎవరి లెక్క వారికుంటుంది. అదనం రెండు కిలోమీటర్లు కావచ్చు. అదనం ఐదు కిలోమీటర్లు కావచ్చు. అదనం పది కిలోమీటర్లు కూడా కావచ్చు. పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్నా అరౌండ్ ఫిఫ్టీన్ అనే చెప్తారు.
మరేం చేస్తారు? మంచి ఆఫీసే. చెప్పుకోదగ్గ జీతం అంటే పద్దెనిమిది నుంచి పాతికవేల వరకూ ఉంటుంది. ప్రతి నెలా పదో తేదీకల్లా ఇచ్చేస్తారు. ఒకవేళ పది ఆదివారం అయితే తొమ్మిదిన- శనివారమే పడిపోతాయి. మరి జీతం సరిగ్గా ఇస్తున్నప్పుడు పద్ధతులు సరిగ్గా ఆశించడంలో తప్పు లేదు. టైముకు రావాలి. నెలకు ఒక సెలవు వాడుకోవాలి. లేటొచ్చినా ఆబ్సెంట్ అయినా శాలరీ కట్‌కు అంగీకరించాలి.
అందువల్ల అందరూ జాగ్రత్తగా పని చేస్తారు. బడ్జెట్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. పదీ పదిహేను కిలోమీటర్ల అవతలకు వెళ్లి- అన్నీ కలిపి ఐదున్నరా ఆరులో అయిపోయేలాగా ఒక పోర్షన్ తీసుకుని- జాగ్రత్తగా ఉండిపోతారు.
అయితే ఇలాంటి సందర్భాల్లోనే వస్తుంది సమస్య.
ముందు రోజు రాత్రే గుర్తు చేస్తూ అంది.
శిల్పారామం సంప్రదాయవేదికలో రేపు సాయంత్రం మావాళ్ల పెళ్లి. కార్డు చూశారుగా. అంత ఇదిగా వచ్చి పిలిచి వెళ్లాక వెళ్లకుండా ఉంటే ఏం బావుంటుంది.
ఏం జవాబు చెప్పలేదు. దిండు మడిచి తల కింద సర్దుకుంటూ నిద్రపోయాడు.
రెండు వారాల క్రితమే ఊళ్లో ఏవో కొంపలంటు కున్నాయంటే పోయేసి వచ్చాడు. ఇప్పుడు మళ్లీ లీవ్ పెట్టలేడు. ఒకవేళ పెడదామన్నా సాయంత్రం ఫంక్షన్ అయితే ఇప్పట్నించి ఇంట్లో ఉండి లీవ్ వేస్ట్ చేయడం ఎందుకు అంటుంది. గంట ముందు పర్మిషన్ అంటే అదో పెద్ద తతంగం. ఇక ఆరుకు బయట పడి, ట్రాఫిక్ అంతా దాటి, అన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకుని, గొంతులో టీనీళ్లైనా పోసుకోకుండా భార్యనూ పిల్లలనూ తీసుకొని తిరిగి ముప్పై కిలోమీటర్లు ట్రాఫిక్‌లో పడి, శిల్పారామం చేరుకుని.... ఇదా బతుకు... బస్సుల్లో తిరగలేరు. ఆటోలను భరించలేరు. టూ వీలర్ నడపలేరు.
చెప్తే అర్థం కాదా?
హూ. మీరు ఏ రోజు సుఖపెట్టారు కనుక.
నిజమే. ఆదివారం వస్తే నాలుగు వీధుల అవతల ఆమె చెల్లెలి ఇల్లు ఉంది అక్కడకు తీసుకెళ్లి పడేస్తాడు. దగ్గరలో
పాత థియేటర్ ఉంది. సినిమా చూపించేస్తాడు. మూడు నెలలకు ఒకసారి పిల్లలరైలు తిరిగే ఎగ్జిబిషన్ పెడతారు. తీసుకెళ్లి తీసుకొచ్చేస్తాడు. కాని సిటీలోకి మాత్రం రాడు.
అది ఆమెకు విసుగు.
ఇవాళైనా అంత గట్టిగా పట్టు పట్టేది కాదు. ఆమె బంధువుల్లో వీళ్లే కాస్తంత కలిగిన వాళ్లు. చూడు... శిల్పారామంలో పెళ్లి చేసేంత స్తోమత మా వాళ్లకూ ఉంది చూడు అని చూపిద్దామని తాపత్రయం. అదీగాక ఈ మధ్యే రెండు వేలు పెట్టి ప్యారెట్‌గ్రీన్ పీకాక్‌బ్లూ కాంబినేషన్‌లో అనార్కలి డ్రస్ కొంది. లక్కీగా స్టిచింగ్ కూడా కుదిరింది. అది వేసుకు చూపించాలని కోరిక. పెళ్లంటే ఈ మధ్య కనీసం డెబ్బై రకాల వంటకాలైనా పెడుతున్నారు. మీల్‌మేకర్ రైస్...
బేబీ కార్న్ దమ్ బిర్యానీ... తమ సంగతి ఏముందిగానీ పిల్లల నోటికి కాస్తంత అందివ్వచ్చు కదా. ఒక పూట వంట తప్పుతుంది. అన్నింటి కంటే ముఖ్యం- ఈ బందిఖానా నుంచి కాసేపైనా బయటపడొచ్చని ఆశ. కానీ...
పిల్లల్ని కూచోబెట్టుకుని అంతంత దూరం పోకూడదు.
ఇన్ని మాటలు ఎందుకు? ఇష్టం లేదని చెప్పెయ్యండి.
సిటీలో టూ వీలర్ నడపడం ఎంత రిస్కో ఆడవాళ్లకు అర్థం కాదు. ముందు పెద్దాణ్ణి కూచోపెట్టుకుని వెనక పిల్లదాన్ని ఒళ్లో పెట్టుకుని... మొత్తం నాలుగు ప్రాణాలు... క్షణం కూడా గ్యారంటీ లేదు. అదీగాక వెళ్లేటప్పుడు పిల్లలు ఉత్సాహంగా ఉంటారు. వచ్చేటప్పుడు నిద్రపోతారు. చాలాసార్లు అయ్యింది. పెద్దాడు అలా తూగుతూ ట్యాంక్ మీద వాలిపోయి నిద్రలో ఎక్కడ జారిపోతాడో అని దడ రేపి... కాని వినదు.
మళ్లీ ట్రై చేశాడు.
స్విచ్‌డాఫ్.
ఇక ఫోన్ తీయదు. తీయకపోతే పోయింది ఆ కోపంలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అల్లరి చేస్తుంటే నాలుగు పీకుతుంది. ఒకసారి ఇలాగే సోఫాలో నుంచి పెద్దాణ్ణి లాగి కిందకు పడేసింది. ఆ సంగతి తెలిసి రెండు రోజులు గుండె గుబగబలాడింది.
ఆమె చెల్లెలికి ఫోన్ చేశాడు.
ఇక్కడికి రాలేదు బావా. ఇందాక అటువైపు వెళుతూ చూశాను. ఇంట్లో కూడా లేదే.
మెల్లగా కడుపులో మంట మొదలయ్యింది.
ఈ మధ్య ఇంతే అవుతోంది. టెన్షన్ వస్తే ఎసిడిటీ పెరిగిపోతోంది.
గడియారం వైపు చూశాడు.
టైమ్ చాలా ఉంది.
ఎప్పటికి సాయంత్రం కావాలి? ఎప్పటికి ట్రాఫిక్ దాటాలి? ఎప్పటికి ఇంటికి చేరాలి? చేరి ఇంట్లో ఏం చూడాలి?
సెల్ పట్టుకుని వెనక్కి వాలాడు.
మంట ఛాతీని గుంజుతూ ఉంది.
- మహమ్మద్ ఖదీర్‌బాబు