
- అతడిది వికృత, చెత్త మనస్తత్వమని ఘాటు వ్యాఖ్యలు
- కొంతకాలం పాటు ‘షో’లకు దూరంగా ఉండాలని ఆదేశం
- అరెస్టుల నుంచి యూట్యూబర్‌కు దక్కిన ఊరట
న్యూఢిల్లీ: పబ్లిక్‌గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియాపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. పాపులారిటీ కోసం అంత అసభ్య భాష మాట్లాడతారా? అంటూ మండిపడింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు అతని వికృతమైన, చెత్త మనస్తత్వానికి నిదర్శనమని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు అలాంటి భాష ఎవరైనా మాట్లాడతారా అని కోర్టు అసహనం వ్యక్తం చేసింది.
‘ఇండియాస్ గాట్ లేటెంట్’ షోలో తాను చేసిన వ్యాఖ్యలపై వేరు వేరు ప్రాంతాల్లో నమోదైన కేసులను కలిపి విచారించేలా ఆదేశాలివ్వాలని అల్హాబాదియా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌ను మంగళవారం(ఫిబ్రవరి 18) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్.కోటిశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా న్యాయమూర్తులు అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బుర్రలో ఇంత చెత్త ఉందా అని తీవ్రంగా మందలించారు. కొంత కాలం పాటు ఎలాంటి షోలలో పాల్గొనరాదని అల్హాబాదియాను ఆదేశించారు. అయితే వ్యాఖ్యలకుగాను నమోదైన కేసుల్లో అల్హాబాదియాకు సుప్రీంకోర్టు ధర్మాసనం ఊరటనిచ్చింది. ఈ కేసుల్లో అతడిని అరెస్టు చేయకుండా స్టే విధించింది. బీర్‌బైసెప్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాలపులర్ అయిన అల్హాబాదియా అతని స్నేహితుడు సమయ్ రైనాషోలో పాల్గొన్నప్పుడు నోరు జారారు.
అతని అశ్లీల వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.ఏకంగా మహారాషష్ట్ర,అస్సాం సీఎంలు ఈ విషయమై స్పందించారంటే పరిస్థితి ఎక్కడిదాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌పై కేంద్రానికి నోటీసులు..
యూట్యూబ్‌లో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రణ్‌వీర్ అల్హాబాదియా కేసు విచారణ సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అలాంటి నిబంధనలేవైనా రూపొందిస్తే తాము సంతోషిస్తామని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment