నిండా మునిగిన రైతన్న
మొలకెత్తుతున్న వరి
పెట్టుబడి వర్షార్పణం
జిల్లాలోని అన్నదాతలకు పెద్ద కష్టమే వచ్చిపడింది. నిన్నటివరకు అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురవగా, నేడు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా పడుతున్న వానలకు కుదేలవుతున్నారు. ప్రభుత్వం ఖరీఫ్‌లో కాలువలకు చుక్క నీరు విడుదల చేయకున్నా.. వరుణుడి కరుణతో సాగు ప్రారంభించారు. అష్టకష్టాలు పడి పండించిన పంట చేతికొస్తుందనుకున్న తరుణంలో వర్షార్పణం కావడంతో రైతన్న నష్టాల ఊబిలో కూరుకుపోనున్నాడు.
మచిలీపట్నం : ఈ ఏడాది జిల్లాలోని 4.63 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుని పైరును కాపాడడంతో సాగు ఖర్చు ఎకరానికి రూ. 20 వేల నుంచి రూ. 22 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం వరి కోత దశలో ఉంది. ఈ తరుణంలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులను నిలువునా ముంచాయి. అల్పపీడన ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు కోతకు సిద్ధంగా ఉన్న వరి నేలవాలింది. వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమిక అంచనా వేసి 30 వేల ఎకరాల్లో వరి పైరు నీట మునిగిందని నిర్ధారించారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. సముద్రమట్టం నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తన ద్రోణి వ్యాపించటంతో మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో గురువారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నేల వాలిన వరి ఇప్పటికే నీటిలో తేలియాడుతుండగా వర్షం కారణంగా పైరు పైకి మరింత నీరు చేరుతోంది. రెండు, మూడు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే బీపీటీ 5204 వరి కంకులు మొలకెత్తుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే నేలవాలిన కంకులకు మొలకలు వచ్చాయి.
కౌలు రైతుకు అప్పుల తిప్పలు
జిల్లాలో 1.64 లక్షల మంది కౌలు రైతులున్నారు. ఎకరానికి 12 నుంచి 17 బస్తాల చొప్పున కౌలుగా చెల్లించి వరిసాగు చేపట్టారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న వరి నేల వాలి నీట మునగడంతో అప్పులే మిగులుతున్నాయని వారు వాపోతున్నారు. రైతులకు ఇంత నష్టం జరిగినా వీఆర్వోలు దెబ్బతిన్న పొలాలను చూసి వెళుతున్నారు తప్ప నష్టం అంచనా వేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఎకరాల సాగుకు రూ.45 వేలు ఖర్చు
నాకు రెండెకరాల సొంత భూమి ఉంది. బీపీటీ 5204 రకం సాగు చేశాను. కాలువకు చుక్కనీరు రాకపోవడంతో ఆయిల్ ఇంజన్ల ద్వారా నీటిని తోడి వరినాట్లు పూర్తి చేశా. అడపాదడపా కురిసిన వర్షాలకు తోడు ఇంజిన్ల ద్వారా నీటిని తోడు పైరును కాపాడుకున్నాను. ప్రస్తుతం వరికోతకు వచ్చింది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పైరు మొత్తం నేలవాలిపోయింది. కంకులు మొలకలు వస్తున్నాయి. ఇప్పటివరకు రెండు ఎకరాలకు కలిపి రూ. 45వేలు ఖర్చు చేశా. వాతావరణం అనుకూలిస్తే కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఇబ్బంది ఉండదనుకున్నా. కానీ వర్షం నిండా ముంచేసింది.
-పామర్తి శ్రీనివాసరావు, సీతారామపురం, బందరు మండలం
22 ఎకరాలు సాగుచేసి నష్టపోయా
నాకు, నా తండ్రి సత్యనారాయణ కలిపి 15 ఎకరాల భూమి ఉండగా, మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాం. సాగునీరు సక్రమంగా రాకున్నా ఆయిల్ ఇంజిన్ల ద్వారా నీటిని తోడుకుని పైరును కాపాడుతున్నాం. ఎకరానికి రూ. 20 వేలు ఖర్చు అయింది. బీపీటీ 5204 రకం వంగడం సాగు చేశాం. పంట బాగా పండింది. ఎకరానికి 30 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశించాం. ఎకరానికి 17 బస్తాలు చొప్పున కౌలుగా చెల్లించాలి. కోత మరో రెండు, మూడు రోజుల్లో మొదలుపెడదామనుకుంటే.. ఈలోగానే మూడు రోజుల పాటు వర్షం కురిసింది. పైరు మొత్తం నేల వాలి నీటిలోనే ఉండిపోయింది. కంకులు మొలకెత్తుతున్నాయి.
-బోలెం అర్జునరావు, ఎస్.ఎన్.గొల్లపాలెం, బందరు మండలం
ఎంత కష్టం.. ఎంత నష్టం!
Published Fri, Nov 20 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement
Advertisement