సాక్షి, అమరావతి: మిచాంగ్ తుపాను రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఎడతెరిపిలేని వర్షాలు, వేగంగా వీచిన ఈదురు గాలులకు వందలాది గ్రామాల్లో వేలాది విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. కిలోమీటర్ల కొద్దీ విద్యుత్ లైన్లు తెగిపోయాయి. ఈ విపత్కర పరిస్థితులను విద్యుత్‌శాఖ యంత్రాంగం సమర్థంగా ఎదుర్కొంటోంది. గ్రామాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను స్థానిక ఎనర్జీ అసిస్టెంట్లతో ముందుగానే గుర్తించి సరిచేయడం వల్ల పెనుప్రమాదాలు జరగకుండా అడ్డుకోగలిగారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించిన ఎనర్జీ అసిస్టెంట్ల సేవలు ఇప్పుడు ఎంతో మేలు చేశాయి. భారీనష్టం జరిగిన చోట కూడా రికార్డు సమయంలో.. 4 నుంచి 18 గంటల్లోనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గృహ, తాగునీటి సరఫరాకు అవసరమైన విద్యుత్ సర్వీసులకు ప్రాధాన్యం ఇచ్చి యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వినియోగదారుల నుంచి టోల్ ఫ్రీ నంబరు 1912కి, కంట్రోల్ రూమ్ నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను కాల్ సెంటర్ సిబ్బంది త్వరితగతిన క్షేత్రస్థాయి సిబ్బందికి తెలియజేయటం ద్వారా తక్కువ సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలుగుతున్నారు.
ఏపీసీపీడీసీఎల్ పరిధిలో వందశాతం సర్విసులను పునరుద్ధరించి విద్యుత్ సరఫరా అందిస్తున్నట్లు సంస్థ సీఎండీ జె.పద్మజనార్ధనరెడ్డి బుధవారం చెప్పారు. భారీవర్షాల కారణంగా నెల్లూరు జిల్లాలో అతలాకుతలమైన విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కె.సంతోషరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోనూ వేగంగా పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు సీఎండీ ఐ.పృథీ్వతేజ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment