ఉరుముతోంది ఉప్పెనలా.. | Today's afternoon storms Hudood takanunna coast at Visakhapatnam | Sakshi
Sakshi News home page

ఉరుముతోంది ఉప్పెనలా..

Published Sun, Oct 12 2014 1:07 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

ఉరుముతోంది ఉప్పెనలా.. - Sakshi

ఉరుముతోంది ఉప్పెనలా..

నేటి మధ్యాహ్నం విశాఖ వద్ద తీరం తాకనున్న హుదూద్ తుపాను
 
విశాఖపట్నం: భీకర రూపుదాల్చిన హుదూద్ తుపాను విశాఖపట్నం దిశగా దూసుకొస్తోంది. ఇది శనివారం రాత్రి 11 గంటల సమయంలో విశాఖపట్నానికి ఆగ్నేయంగా 210 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా విశాఖపట్నం వైపు కదులుతోంది. ‘‘ఈ తుపాను ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ ప్రాంతంలో తీరాన్ని తాకనుంది. దీని ప్రభావం ఉదయం నుంచే కనిపిస్తుంది. తుపాను తీరం తాకే వరకు గాలుల వేగం పెరుగుతూ ఉంటుంది. తీరాన్ని తాకే సమయంలోనూ, తాకిన తరువాత 12 గంటల పాటు తీవ్ర ప్రభావం కొనసాగుతుంది’’ అని విశాఖ, ఢిల్లీల్లోని వాతావరణ విభాగాల అధికారులు శనివారం వెల్లడించారు. తుపాను విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల పరిధిలో తీరందాట వచ్చని, తీరం దాటే లోగా అది దిశ మార్చుకునే అవకాశాలు పెద్దగా లేవని కూడా అంచనా వేస్తున్నారు. తుపాను ప్రభావముండే తీరం ప్రాంతాల నుంచి శనివారం రాత్రికి లక్షన్నర మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆదివారం ఉదయానికి మరో లక్షన్నర మందిని తరలించనున్నారు. దక్షిణ ఒడిశాలో సైతం మూడున్నర లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.

గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు...

తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో సాధారణ నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచే గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అర్థరా త్రి దాటిన తరవాత  వేగం గంటకు 100 నుంచి 140 కిలోమీటర్లకు చేరుకోవచ్చని చెప్తున్నారు. ఇక తుపాను తీరం దాటే సమయంలో గంటకు 195 కిలోమీటర్ల వేగంతో పెను గాలులు విధ్వంసం సృష్టించే అవకాశాలూ ఉన్నాయని అప్రమత్తం చేస్తున్నారు.

తీరం దాటే ముందు ఇంకా బలపడితే?!

తీరం దాటడానికి ముందే హుదూద్ తుపాను మరింత తీవ్రంగా మారి ప్రళయభీకరంగా విరుచుకుపడవచ్చని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాలు, దక్షిణ ఒడిశాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు సర్వత్రా మోహరించి నష్టనివారణ చర్యలను వేగవంతం చేస్తున్నాయి.

తీరం నుంచి బలవంతంగా ప్రజల తరలింపు...

ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో 312 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. తీర, లోతట్టు ప్రాంతాల నుంచి శనివారం సాయంత్రం వరకూ 1.30 లక్షల మందిని ఈ శిబిరాలకు తరలించారు. ఆదివారం ఉదయానికి మరో 1.50 లక్ష మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో మొదట 49 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ తుపాను తీవ్రత అమాంతంగా పెరగడంతో అదనంగా మరో 32 శిబిరాలను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో 130, తూర్పుగోదావరి జిల్లాలో 97, పశ్చిమగోదావరి జిల్లాలో 23 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే.. ఉత్తరాంధ్ర తీరంలో పలుచోట్ల సముద్రం గ్రామాల్లోకి చొచ్చుకువస్తున్నా ప్రజలు పునరావాస శిబిరాలకు వెళ్లేందుకు నిరాకరిస్తున్నారు. ఒకసారి పునరావాస శిబిరాలకు వెళ్లిన వారు మళ్లీ వెనక్కి వచ్చేస్తుండటంతో అధికారులకు సమస్యగా మారింది.

విశాఖ మీదుగా రైళ్లు, విమానాలు, బస్సు సర్వీసులు రద్దు..

తుపాను నేపధ్యంలో హౌరా - చెన్నై 16వ నంబరు జాతీయ రహదారిపై రాజమండ్రి నుంచి ఇచ్ఛాపురం వరకు.. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం వరకూ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. విశాపట్నం మీదుగా ప్రయాణించే అన్ని  రైలు సర్వీసులనూ ఆదివారం రద్దు చేశారు. శుక్రవారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన 37 రైళ్లకు అదనంగా శనివా రం మరో 15 రైళ్లను కూడా రద్దు చేశారు. నాలుగు రైళ్లను దారిమళ్లించారు. విశాఖ, రాజమండ్రి, సామర్లకోట, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి ప్రయాణాల కోసం రిజర్వేషన్లు చేయిచుకున్న ప్రయాణికులు చాలా మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. శనివారం ఉదయం 9 గంటల తరువాత విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. ఆర్‌టీసీ అధికారులు ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లో దూరప్రాంతాలకు ప్రయాణించే బస్సు సర్వీసులను, తీరప్రాంతాల్లో పర్యటించే పల్లె వెలుగు బస్సులను, విశాఖ నగరంలో సిటీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. శనివారం సాయంత్రం నుంచి  విశాఖపట్నం బీచ్ రోడ్డులో జనసంచారాన్ని నిషేధించారు. అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు.

తీరంలోకి చొచ్చుకొస్తున్న సాగరం...

తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలల ఉధృతికి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లోని గోడ కూలిపోయింది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ముందుకు చొచ్చుకొచ్చింది. విశాఖ జిల్లాలో పలు చోట్ల, విజయనగరం జిల్లా పూసపాటిరేగలలో సముద్రం 150 మీటర్లు ముందుకుచొచ్చుకువచ్చింది. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్లపేట వద్ద సముద్రం సుమారు 70 మీటర్ల మేరకు ముందుకు చొచ్చుకువచ్చింది. బందరువానిపేట, గణగళ్లపేట, ఇద్దివానిపాలెం, డొంకూరు తదితర తీర గ్రామాల్లోనూ సముద్రం ముందుకు రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉప్పాడ తీరంలో జియో ట్యూబ్ టెక్నాలజీతో నిర్మించిన రక్షణ గోడ దెబ్బతిని ఉప్పాడ గ్రామంలోకి సముద్ర నీరు పోటెత్తింది.

ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు...

హుదూద్ తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం, గంగవరం పోర్టుల్లో పదో నంబర్ ప్రమాద హెచ్చరికలు ఎగురవేశారు. కాకినాడ, మచిలీపట్నం పోర్టుల్లో ఎనిమిదో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. కృష్ణపట్నం, నిజాంపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలను ఎగురవేశారు. కాకినాడ లంగరు రేవు నుంచి శుక్ర, శనివారాల్లో సరుకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోయాయి. పోర్టులో బెర్త్‌లను ఖాళీ చేసి సుమారు ఎనిమిది నౌకలను తీరం నుంచి డీప్ సీ (సముద్రం మధ్యలోకి)కి తరలించి లంగరేశారు. ప్రైవేటు యాజమాన్యంలోని కాకినాడ డీప్ వాటర్ పోర్టులో మూడు నౌకలను శనివారం బెర్త్‌ల నుంచి ఖాళీచేసి సముద్రంలోకి పంపించేశారు. ఇదిలావుంటే.. తూర్పుగోదావరి జిల్లా యు. కొత్తపాలెం మండలానికి చెందిన 65 బోట్లు శనివారం రాత్రి కృష్ణాజిల్లా పల్లెపాలెం, పడతడిక గ్రామాలకు చేరుకున్నాయి. 10 రోజుల క్రితం సుమారు 700 మంది మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. హుదూద్ తుపాను ప్రభావంతో వీరు వెనుతిరిగారు. అయితే.. తీవ్రత ఎక్కువగా ఉండడంతో వారి స్వగ్రామాలకు చేరుకునేందుకు వీలుకాక కృష్ణాజిల్లా పల్లెపాలెం, పడతడిక గ్రామాలకు చేరుకున్నారు.
 
ఎదుర్కొనేందుకు యంత్రాంగం సన్నద్ధం...

తుపాను ప్రభావంతో కడలి కనివినీ ఎరుగని రీతిలో అల్లకల్లోలంగా మారనుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.  తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంసిద్ధమయ్యా యి. తుపాను తీరందాటిన తరువాత దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులు సన్నద్ధమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణీలు, బాలిం తలు వెంటనే ఆసుపత్రుల్లో చేరాల్సిందిగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు యాంటిబయటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, వ్యాక్సిన్లు, పాముకాటు మందులు, ఇతర మందులను పీహెచ్‌సీలలో సిద్ధంగా ఉంచారు.
 
ఉన్నతాధికారులు, మంత్రుల పర్యవేక్షణ...

 తుపాను సన్నద్ధతపై ఢిల్లీ నుంచి కేంద్ర కేబినెట్ కార్యదర్శి అజిత్‌సేథ్, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వి. ఆర్.కృష్ణారావులు శనివారం విడివిడిగా వీడియో కాన్ఫరెన్సులతో అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. అధికార యంత్రాంగం మొత్తం తుపాను నష్టనివారణ చర్యల్లో నిమగ్నమైంది.
 
 ఉదయం నుంచే పెను ప్రభావం -  భారత వాతావరణ శాఖ డీజీ రాథోడ్ వెల్లడి
 
న్యూఢిల్లీ: హుదుద్ తుపాను తీవ్రత, దాని ప్రభావం ఆదివారం ఉదయం 8 నుంచి 10 గంటల మధ్యలో కనిపించడం ప్రారంభమవుతుందని భారత వాతావరణ శాఖ డెరైక్టర్ జనరల్ డాక్టర్ ఎల్.ఎస్.రాథోడ్ వెల్లడించారు. శనివారం సాయంత్రం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తుపాను తీరం తాకే వరకు గాలుల వేగం పెరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో విశాఖ ప్రాంతంలో తీరాన్ని తాకనుంది. తీరాన్ని తాకిన తరువాత 12 గంటల పాటు ఈ ప్రభావం కనిపిస్తుంది. తీరాన్ని దాటిన తరువాత తుపాను వాయువ్య దిశగా కదులుతుంది. ఈ నెల 13 నుంచి 15 తేదీల మధ్య తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి’’ అని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశాలోని గంజాం, గజపతి, కోరాపుట్, రాయగడ, నవరంగ్‌పూర్, మల్కన్‌గిరి, కలహండి, పల్బనీ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో అతి భారీ నుంచి అంతకుమించి వర్షాలు కురుస్తాయి. అలాగే కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఒడిశాలోని ఉత్తర కోస్తా ప్రాంతంలోనూ ఈ వర్షాలు కురుస్తాయి’’ అని రాథోడ్ చెప్పారు.
 
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు సిద్ధం

తుపాను సమయంలో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఆర్మీ, నేవీ బలగాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు మొత్తం 22 బెటాలియన్ల ఎన్‌డీఆర్‌ఎఫ్ బలగాలను కేటాయించారు. విశాఖపట్నం జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి 6 బెటాలియన్లను కేటాయించారు. శనివారం ఒడిశా నుంచి మరో 6 బెటాలియన్లను రప్పిస్తున్నారు. శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 2, తూర్పుగోదావరి జిల్లాలో 4 బెటాలియన్లు సహాయ చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. రెండు కంపెనీల ఆర్మీ జవాన్లు విశాఖపట్నం చేరుకున్నారు. నేవీ 4 హెలికాప్టర్లతో 4 నౌకలను సిద్ధంగా ఉంచింది. సరిపడా ఆహారం, మందులు, దుప్పట్లు ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు 2 ప్లాటూన్ల బలగాలతో పాటు 30 మంది గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉన్నారు. గజ ఈతగాళ్లతో విశాఖ జిల్లాలో 12 బోట్లు, శ్రీకాకుళంలో 10 బోట్లు, విజయనగరం జిల్లాలో 2 బోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 8 బోట్లను సిద్ధం చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement