ప్రతిష్ట పాతాళానికి..
ఏయూపై మంత్రి గంటా పెత్తనమేంటి?
తుపాను నష్టం రూ.230 కోట్లా!?
క్లాసులే జరగనప్పుడు పరీక్షలా?
కలకలం రేపిన ఏయూ
విభాగాధిపతుల వ్యాఖ్యలు
‘ఏయూపై మంత్రి గంటా పెత్తనమేమిటి?...ఆయన క్యాంపస్‌కు పదేపదే వచ్చి అధికారికంగా నిర్ణయాలు ప్రకటించేయడమేమిటి?... వీసీతో సహా ఏయూ అధికారులు అం తా ఆయనకు సాగిలపడటమేమిటి?... ఏయూ చరి త్రలో ఇంతవరకు ఇలాంటి దుస్థితి దాపురించలేదు. ఇ లా అయితే ఏయూ ప్రతిష్ట దిగజారి అదఃపాతాళానికి పడిపోతుంది’ ‘హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్లు నష్టం వచ్చిందని ఏ ప్రాతి పదికన ప్రకటించేశారు?, అంత నష్టం ఎక్కడ జరిగింది?. భవనాలు ఏమీ దెబ్బతినలేదు. ల్యాబ్‌లకు నష్టం జరగలేదు. చెట్లు కూలిపోయిన మాట వాస్తవం. కానీ దాన్ని రూ.230 కోట్లుగా లెక్కించలేం కదా? ఆస్తి నష్టం జరగనప్పుడు అంత నష్టమని ఎ లా ప్రకటిస్తారు. దీని వెను క ఉన్న లోగుట్టు ఏమిటి?. దాతల నుంచి కేవలం ధన రూపంలోనే సహా యం కోరడం వెనుక మర్మమేమిటీ?’
ఏయూ విభాగాధిపతుల ఆవేదన ఇదీ. ప్రశ్న ల శరపరంపర ఇదీ. ఏయూ కేంద్రంగా సాగుతున్న అక్రమాలను సూటిగా నిలదీసిన వైనం ఇదీ. గత కొన్నేళ్లలో ఎన్నడూలేని రీతిలో విభాగాధిపతులు ఏయూ వ్యవహారాలపైన విరుచుకుపడ్డారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వ్యవహారం ఇలా సాగింది...
విభాగాధిపతుల సమావేశమే వేదికగా...
ఏయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవీ విభాగాధిపతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే గాయత్రీదేవీ మాట్లాడుతూ నవంబర్ 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. దాంతో విభాగాధిపతులు అందరూ అవాక్కయ్యారు. తమను కనీసం సంప్రదించకుండా పరీక్షల షెడ్యూల్‌ను నిర్ణయించేయడమేమిటని విస్తుపోయారు. కొంతకాలంగా ఏయూ వ్యవహారాలలై ఆగ్రహంతో ఉన్న విభాగాధిపతులు దాంతో ఒక్కసారిగా తమ నిరసనను తెలిపారు. ‘తుపాను అనంతరం క్లాస్‌లు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నాం. ఇంకా 10 శాతం మంది విద్యార్థులు కూడా క్లాస్‌లకు రావడం లేదు. సిలబస్‌లు పూర్తికాలేదు. అలాంటిది నవంబర్ 10 నుంచి పరీక్షలు ఎలా నిర్వహిస్తారు?. తేదీలను ఖరారు చేసేముందు మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం లేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు ఏయూలో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలను ప్రస్తావిస్తూ అంశాలవారీగా ఇలా నిలదీశారు.
మంత్రి గంటా పెత్తనమేమిటీ?...
ఏయూ వ్యవహారాలన్నింటినీ మంత్రి గంటా శ్రీనివాసరావు హైజాక్ చేసేస్తున్న తీరును విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘అసలు యూనివర్సిటీపై విద్యాశాఖ మంత్రి పెత్తనం ఏమిటి? ఏయూ విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం వీసీకి, పాలకమండలికే ఉంది. విభాగాధిపతులను సంప్రదించి వీసీ పాలకమండలిలో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. వీసీ నేరుగా గవర్నర్‌కే జవాబుదారిగా ఉండాలి. కానీ ఇవేవీ లేకుండా మంత్రి గంటా చీటికిమాటికి క్యాంపస్‌కు వచ్చేసి సమావేశాలు పెట్టడం ఏమిటి?. మన ఇద్దరు ఉన్నతాధికారులు చిత్తందొరా అని వంతపాడటమేమిటి?అని తీవ్రస్థాయిలో నిరసించారు.
ఏయూకు రూ.230 కోట్ల నష్టమా?.. హవ్వా!
హుదూద్ తుపాను వల్ల ఏయూకు రూ.230 కోట్ల నష్టం వచ్చినట్టు వీసీ జి.ఎస్.ఎన్.రాజు ప్రకటించడాన్ని విభాగాధిపతులు తప్పుబట్టారు. ఏ ప్రాతిపదికన లెక్కించి ఇంత భారీ నష్టం వచ్చినట్టు ప్రకటించారని ప్రశ్నించారు. ‘తుపాను వల్ల ఏయూ భవనాలకుగానీ ల్యాబ్‌లకుగానీ ఎలాంటి నష్టం కలగలేదు. కేవలం నాన్‌టీచింగ్ స్టాఫ్ క్వార్టర్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆ నష్టం రూ.50 లక్షల వరకు ఉండొచ్చు. ఇతర చిన్నాచితక నష్టం కలిగింది. అంతకుమించి ఏయూ ఆస్తులకు ఎలాంటి నష్టం కలగలేదు. మరి రూ.230 కోట్ల నష్టం అని ఎలా ప్రకటించారు? క్యాంపస్‌లో చెట్లు భారీగా కూలిపోయినమాట వాస్తవం. కానీ ఆ నష్టాన్ని డబ్బురూపేణా అంచనా వేయలేం కదా! కానీ రూ.230 కోట్లు నష్టం ఏర్పడినట్టు ప్రకటించడం వెనుక ఉద్దేశమేమిటి?’అని సందేహం వ్యక్తం చేశారు. ఇంతవరకు నాన్‌టీచింగ్ సిబ్బంది క్వార్ట్‌ర్స్‌కు నీరు, విద్యుత్తు సౌకర్యాన్ని పునరుద్ధరించకపోవడాన్నీ ప్రశ్నించారు. ఏయూలో తుపాను నష్టాలను తాము సరిచేస్తామని దాతలు వస్తుంటే మీరు వస్తు రూపేణా ఎలాంటి సహాయం చేయొద్దు... ఆ మొత్తాన్ని ఏయూ అకౌంట్‌లో వేయమని కోరుతున్నారు?, ఇదెంత వరకు సబబు?.. దాతలే నేరుగా దెబ్బతిన్న భవనాలకు మరమ్మతులు చేస్తామంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు?.. దీనివెనుక లోగుట్టు ఏమిటి?’అని కూడా ప్రశ్నించారు.
ఇలా విభాగాధిపతులు ఒక్కొక్కరుగా నేరుగా ప్రశ్నల శరపరంపర కురిపించడంతో ఆ సమావేశం ఆద్యంతం వాడిగా వేడిగా సాగింది. విభాగాధిపతులు లేవనెత్తిన అంశాలను వీసీ దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ గాయత్రీదేవి సమావేశాన్ని ముగించారు.
మేమే బాధితులం.. మా జీతాల నుంచి కోతా?
తుపాను బాధితులకు ఏయూ ఉద్యోగుల రెండురోజుల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్టు మంత్రి ప్రకటించడాన్ని కూడా విభాగాధిపతులు తప్పుబట్టారు. ‘తుపాను వల్ల విశాఖలో నివసిస్తున్న ఏయూ ఉద్యోగులు నష్టపోయారు. వారిని ఆదుకోవాలి. ప్రభుత్వం నిధులు ఇవ్వడమే...ఇతర ప్రాంతాల ఉద్యోగులు, దాతల నుంచి విరాళాలు సేకరించడమే చేయాలి. అంతేగానీ తుపాను బాధితులు అయిన ఏయూ ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తే ఎలా? అసలు ఈ నిర్ణయాన్ని మంత్రి గంటా ఎలా ప్రకటిస్తారు? అందుకు ఏయూ ఉన్నతాధికారులు ఎలా ఆమోదిస్తారు? అని కడిగిపారేశారు. తాము అసలు జీతాల నుంచి కోతను ఆమోదించేది లేదని తేల్చిచెప్పేశారు.