- యలమంచిలి సబ్‌డివిజన్‌లో 16వేల ఎకరాల్లో నీటమునిగిన వరి
- 8,500 ఎకరాల్లో చెరకుకు నష్టం
యలమంచిలి : వరుస విపత్తులతో అన్నదాత కుదేలవుతున్నాడు. హుదూద్ తుపాను రూపంలో వరుసగా మూడో ఏడాది యలమంచిలి నియోజకవర్గంలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. ఈసారి పెనుగాలుల బీభత్సానికి పంటలతో పాటు మహావృక్షాలు నేలకొరగడంతో రైతులు మరింత ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది. యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో దాదాపు 25వేలకుపైగా ఎకరాల్లో పంటలు నీటమునిగినట్టు వ్యవసాయాధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.
16వేల ఎకరాల్లో వరి, 8,500 ఎకరాల్లో చెరకు, 515 ఎకరాల్లో పత్తి, కంది, మినుము, పెసలు, నువ్వు పంటలు ముంపులో ఉన్నట్టు ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని ఎస్.రాయవరం, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల్లో 25,015 ఎకరాల్లో పంటలు ముంపునకు గురైనట్టు యలమంచిలి అసిస్టెంట్ డెరైక్టర్ డి.మాలకొండయ్య గురువారం చెప్పారు.
ప్రస్తుతం పంట పొలాల్లో వర్షపునీరు మెల్లగా బయటకు వస్తోందని, రెండు మూడు రోజుల్లో పూర్తి నష్టం అంచనా తెలుస్తుందని చెప్పారు. నీటమునిగిన పొలాల్లో నీరు తొలగిన వెంటనే వరిపంటకు ఎకరానికి 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని, చెరకు తోటల్లో ఎకరానికి 25 కిలోల యూరియా, 25 కిలోల పొటాష్ కలిపిన ద్రావణాన్ని వినియోగిస్తే తెగుళ్లు సోకకుండా పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఏడీ సూచించారు.
ఎక్కువ చెరకు తోటల్లో గెడలు విరిగిపోవడంతో వాటిని ఎత్తికట్టడానికి కూడా వీలులేని పరిస్థితి ఉందన్నారు. పెనుగాలుల ధాటికి చెరకు పంటకు భారీగా నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ విస్తరణాధికారులు చెబుతున్నారు. మరోవైపు రైతులు రెండేళ్ల క్రితం నీలం తుపాను ప్రభావంతో నష్టపోయిన పంటలకే ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందించలేదని, ఈసారైనా త్వరితగతిన పరిహా రం అందించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.
ఉద్యానపంటలకూ నష్టం...
యలమంచిలి వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలో సంప్రదాయ పంటలతో పాటు ఈసారి ఉద్యానపంటలకూ తీవ్ర నష్టం సంభవించింది. హుదూద్ తుపాను ప్రభావంతో వీచిన పెనుగాలుల తాకిడికి మామిడి, జీడితోటల్లో చెట్లు నేలకొరిగాయి. కొబ్బరిచెట్లు తలలు తెగినట్లు మోడువారాయి. పంటచేతికందే సమయంలో హుదూద్ తుపాను రూపంలో తమకు నష్టం చేకూర్చిందని యలమంచిలి ప్రాంతంలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు గగ్గోలు పెడుతున్నారు. వేలాది ఎకరాల్లో సంవత్సరాలు సంరక్షిస్తున్న మామిడి, జీడి, కొబ్బరి తోటలు నిర్జీవంగా మారిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. ప్రభుత్వం తమపై దయచూపి మెరుగైన నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.