చెరుకులో తీపేది
Published Wed, Nov 16 2016 3:03 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
జిల్లాలో 5 వేల హెక్టార్లలో సాగు
ఆందోళనలో రైతులు
మద్దతు ధర ప్రకటించని యాజమాన్యం
టన్నుకు రూ. 3,600 ధర ఇవ్వాలని విజ్ఞప్తి
క్రషింగ్‌కు సిద్ధమైన ఫ్యాక్టరీ
అందరికీ తీపిని పంచే చెరుకు రైతుకు మాత్రం చేదు అనుభవాలే మిగులుతున్నాయి. ఏడాదంతా శ్రమించినా.. పంటకు మద్దతు ధర లభించడం లేదు. ఈ ఏడాది క్రషింగ్ సీజన్ సమీపిస్తున్నా.. ఫ్యాక్టరీలు మద్దతు ధర ప్రకటించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మద్దతు ధర ఇవ్వాలని యాజమాన్యాలను కోరుతున్నారు.
నిజాంసాగర్ : కామారెడ్డి జిల్లాలో అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగిలలో గాయత్రి చక్కెర కర్మాగారాలు ఉన్నాయి. ఈ కార్మాగారాల పరిధిలో సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో 12 మండలాల్లో 5 వేల హెక్టార్లల్లో చెరుకు పంట సాగవుతోంది. కామారెడ్డి జిల్లాలో 2 వేల హెక్టార్లలో, సంగారెడ్డి జిల్లాలో 3 వేల హెక్టార్లలో చెరుకును సాగు చేస్తున్నారు. మూడేళ్లుగా వర్షాభావ పరిస్థితులు ఉండడంతో రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ చెరుకు సాగు చేశారు. ప్రస్తుతం పంట కోత దశకు చేరింది. ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రకటించే మద్దతు ధర కోసం ఎదురు చూస్తున్నారు. పెట్టుబడులు పెరిగినందున టన్నుకు రూ. 3,600 మద్దతు ధర ఇస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని పేర్కొంటున్నారు. అయితే యాజమాన్యాలు రూ. 2,600 లకు మించి మద్దతు ధర ఇచ్చేలా కనిపించడం లేదు. మద్దతు ధర ప్రకటించకుండానే క్రషింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామాల వారీగా చెరుకు నరికివేత, క్రషింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసింది. గానుగ కోసం చెరుకును ఫ్యాక్టరీకి తరలించాలని రైతులకు సూచించింది.
నేడు బాయిలర్ పూజలు
కామారెడ్డి జిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి, మాగి గాయత్రి కార్మాగారాల్లో చెరుకు క్రషింగ్ కోసం యాజమాన్యం సిద్ధమైంది. మాగిలోని గాయత్రి కర్మాగారంలో బుధవారం బాయిలర్ పూజలు చేయనున్నారు. పూజల అనంతరం క్రషింగ్ తేదీలు ఖరారు చేయనున్నారు. పూజల్లో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సరితారెడ్డి, వైస్ చైర్మన్ సందీప్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొంటారని ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు.
Advertisement
Advertisement