Chiranjeevulu
-
సీనియర్ సివిల్ జడ్జీ సస్పెన్షన్
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జీ కరణం చిరంజీవులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు జిల్లా జడ్జి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంత కాలంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చిరంజీవులు జరిపిన దర్యాప్తులో ఆరోపణలు రుజువవడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా న్యాయాధికారి తెలిపారు. -
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం
-
అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తాం
'సాక్షి' ఫోన్ ఇన్ కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలు, ప్లాట్లు, లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోకపోతే ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దించి సమూలంగా కూల్చివేస్తామని హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు హెచ్చరించారు. అనుమతి లేని లేఅవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకుండా నిరోధించడంతో పాటు ఆయా ప్లాట్లపై ఎలాంటి లావాదేవీలకు అవకాశం లేకుండా స్తంభింపజేస్తామని కమిషనర్ ప్రకటించారు. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొనే విషయంలో ప్రజలకు తలెత్తుతోన్న వివిధ సందేహాలను నివృత్తి చేసేందుకు ‘సాక్షి’ ఆదివారం ప్రత్యేకంగా ‘ఫోన్ ఇన్’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు నేరుగా హెచ్ఎండీఏ కమిషనర్‌కు ఫోన్ చేసి ప్రశ్నల వర్షం కురిపించారు. లేఅవుట్లకు అనుమతిచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు లేదని, హెచ్ఎండీఏ అనుమతి లేకుండా ఏర్పాటైన వాటిని అక్రమ లేఅవుట్లుగా పరిగణిస్తామని చిరంజీవులు తెలిపారు. పంచాయతీ సెక్రటరీలు ఇష్టం వచ్చినట్లు అనుమతులివ్వకుండా పంచాయతీ కమిషనర్ ద్వారా ఉత్తర్వులు ఇప్పిస్తామన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను తొలగించేందుకు ప్రత్యేకంగా 4 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు. తొలుత చౌటుప్పల్ ప్రాంతంపై దృష్టి సారించామని, ఇక్కడ లెక్కకు మించి ఉన్న అక్రమ లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. మహానగర పరిధిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, ఈ మేరకు అక్రమాలను సరిదిద్దేందుకు నవంబర్ 2న ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ల ద్వారా రెగ్యులరైజేషన్‌కు అవకాశం కల్పిస్తూ జీవో నెం.151 విడుదల చేసిందన్నారు. క్రమబద్ధీకరణ రుసుం కూడా చాలా తక్కువగా ఉందని.. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబర్ 31తో గడువు ముగియనున్నందున సకాలంలో స్పందించాలని కోరారు. అయితే... నిబంధనలకు లోబడి ఉన్న వాటినే క్రమబద్ధీకరిస్తాం తప్ప చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల్లో నిర్మించిన భవనాలు, లేఅవుట్లను అనుమతించమని స్పష్టం చేశారు. డాక్యుమెంట్లు లేకపోయినా... హెచ్ఎండీఏకు సమర్పించాల్సిన డాక్యుమెంట్ల విషయంలో ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి, తగిన డాక్యుమెంట్లు లేకపోయినా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల కింద దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ సూచించారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు తమ సిబ్బంది వచ్చినప్పుడు వాటిని అందిస్తే సరిపోతుందన్నారు. ప్రస్తుతం మీకు అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లు సేల్‌డీడ్, బిల్డింగ్ ప్లాన్ వంటివి సమర్పిస్తే మిగతా వాటిని ఆయా విభాగాల నుంచి తామే తెప్పిస్తామని వివరించారు. ముఖ్యంగా 18 మీటర్ల ఎత్తు (5 అంతస్తుల) వరకు ఉండే భవనాలకు ఫైర్, ఎయిర్పోర్ట్ అథార్టీ అనుమతులు అవసరం లేదని ఆపైన నిర్మించే వాటికి విధిగా ఆయా విభాగాల నుంచి ఎన్వోసీ లు తీసుకురావాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనే తరుణంలో మీ మొబైల్ నంబర్ ఇస్తే వెంటనే ఓ పాస్వర్డ్ జనరేట్ అవుతుందని, దీని ఆధారంగా మీ దరఖాస్తు ఏ దశలో ఉందో ఆన్లైన్లోనే చూసుకోవచ్చన్నారు. దళారుల మాటలు నమ్మొద్దని, ఇన్స్పెక్షన్ అధికారులు మీకు ఫోన్ చేసి వస్తారు.. మీ కళ్లముందే కొలతలు తీసుకొని చెల్లించాల్సిన ఫీజు మొత్తాన్ని వెల్లడిస్తారని తెలిపారు. ముఖ్యంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే సమయంలో మీ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇతరులకు ఇవ్వకుండా మీరే ఆపరేట్ చేయాలని, అవి లేనివారు మండల కేంద్రంలోని ఫెసిలిటేషన్ సెంటర్లో ఇచ్చే ఓచర్‌ను తీసుకెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేయాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా వచ్చిన దరఖాస్తులను 6 నెలల్లోగా పరిష్కరించి అనుమతి పత్రాలు జారీ చేస్తామని కమిషనర్ వెల్లడించారు. -
8 నుంచి డీఈఈసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో చేరేందుకు డీఈఈసెట్-2015 పరీక్షకు హాజరై అర్హత సాధించిన విద్యార్థులకు ఈనెల 8 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు డీఈఈసెట్ చైర్మన్, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు తెలిపారు. మార్కుల ఆధారంగా నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. ఓసీ/బీసీ అభ్యర్థులైతే 100 మార్కులకు గాను 35 మార్కులు వస్తే అర్హులేనని, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేమీ లేవని, పరీక్షకు హాజరైతే వారిని అర్హులుగానే ప్రకటించినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో (డైట్) తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్/తత్సమాన, ఎస్ఎస్సీ/తత్సమాన, 1 నుంచి 10వ తరగతి వరకు చదివిన స్టడీ సర్టిఫికెట్ లేదా రెవెన్యూశాఖ జారీ చేసిన నివాస, కులం సర్టిఫికెట్లతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు tsdeecet.cgg.gov.in వెబ్‌సైట్‌ను పరిశీలించాలన్నారు. -
డైట్‌సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న డైట్‌సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ చిరంజీవులు వెల్లడించారు. చిరంజీవులు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 1,11,206 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 లకు ముగుస్తుందన్నారు. కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రాథమిక విద్యా కమిషనర్ చిరంజీవులు తెలిపారు. -
పుష్కరాలు జరిగే ప్రాంతాల్లో.. స్కూళ్లకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: పుష్కరాలు జరిగే ఆయా ప్రాంతాల్లోనే పాఠశాలలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించిందని తెలంగాణ పాఠశాల విద్యా డైరెక్టర్ చిరంజీవులు సోమవారం పేర్కొన్నారు. మిగిలిన ప్రాం తాల్లో యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. -
పకడ్బందీగా బదిలీల ప్రక్రియ
పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని పాఠశాల విద్యా కమిషనర్ టి.చిరంజీవులు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. బదిలీల ప్రక్రియ ఏర్పాట్లను ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. బదిలీ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేలా ఐదు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బదిలీ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పదోన్నతుల కోసం టీచర్ల తుది సీనియారిటీ జాబితాల పరిశీలన, ఖాళీల వివరాల పరిశీలన బాధ్యతలను వేర్వేరుగా ఆయా బృందాలకు అప్పగించాలన్నారు. ప్రత్యేక కేటగిరీ, అదనపు పాయింట్లు పొందనున్న టీచర్లు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణపత్రాలను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. -
కేయూ ఇన్చార్జి వీసీగా చిరంజీవులు!
నేడు వెలువడనున్న ఉత్తర్వులు పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్‌గా ఉన్న చిరంజీవులు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జీ వీసీ గా తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్ టి.చిరంజీవులును నియమిం చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కె.వీరారెడ్డి గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీ నుంచి కాకతీయ యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఇన్చార్జీ వీసీగా బాధ్యతలను నిర్వర్తించారు. ఆయ న పదవీ కాలం శుక్రవారంతో ముగిసింది. దీంతో కేయూ ఇన్చార్జి వీసీగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్, కమిషనర్‌గా ఉన్న చిరంజీవులు కుబా ధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలిసింది. సంబంధిత ఫైల్‌పై రెండు రోజు లక్రితమే సీఎం సంతకం కూడా అయినట్లు సమాచారం. విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సంతకమైన తర్వాత ఆ ఉత్తర్వులు శుక్రవారం రాత్రి లేదా శనివారం ఉదయం వెలువడే అవకాశాలున్నాయి. కేయూకు రెగ్యులర్ వీసీగా బి.వెంకటరత్నం పదవీకాలం 2014, మే 17న ముగి సింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు యూనివర్సిటీకి రెగ్యులర్ వైస్‌చాన్సలర్ లేరు. వెంకటరత్నం పదవీ విరమణ తర్వాత... ముగ్గురు ఇన్చార్జి వీసీలు మారారు. 2014, మే 18 నుంచి జూలై 9 వరకు ఇన్చార్జి వీసీగా ఐఎఫ్ఎస్ అధికారి ఆర్ఎం డోబ్రియాల్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ పనిచేశారు. సెప్టెంబరు 24 వరకు ఇన్చార్జి వీసీ గాపనిచేసిన ఆయన ఒక్కసారి కూడా యూనివర్సిటీ ముఖం చూడలేదు. ఈ సమయంలో యూనివర్సిటీలో పాలన మరిం త గాడితప్పింది. తర్వాత సెప్టెంబర్ 25న బాధ్యతలు స్వీకరించిన వీరారెడ్డి రెండుసార్లే వర్సిటీకి వచ్చారు. ఆయన పదవీకాలంముగియటంతో ఆయన స్థానంలో చిరంజీవులును నియమించనట్లు తెలుస్తోంది. చిరంజీవులు వరంగల్ జిల్లకు చిరపరిచతులే. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన చిరంజీవులు గతం లో జిల్లాలో ఆర్డీఓగా, డీఆర్వోగా, డీఆర్డీఏ జిల్లా పీడీగా పని చేశారు. సుమారు ఎనిమి దేళ్లు ఆయా బాధ్యతలను నిర్వర్తించారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటయ్యాక ఇటీవల ఆయన పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్‌గా, కమిషనర్‌గా నియమితులయ్యూరు. కాగా శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి వీసీగా మాత్రం వీరారెడ్డినే కొనసాగించనున్నారని తెలిసింది. -
‘పది’కి కొత్త పరీక్షలు!
నూతన విధానంలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి పరీక్ష సమయం అదనంగా 15 నిమిషాలు పెంపు రాష్ట్రంలో నూతన విధానంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇన్నాళ్లుగా పాఠం చివరిలో ఇచ్చిన ప్రశ్నలకే పరీక్షల్లోనూ సమాధానాలు రాస్తున్న దానికి బదులుగా... అసలు ఎలాంటి ప్రశ్నలు వస్తాయో తెలియని విధానంలో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అందులోనూ ఈసారి పరీక్షల్లో ఆబ్జెక్టివ్ పేపర్ విడిగా ఉండదు. విద్యార్థులు ప్రశ్నలను బాగా చదివి అర్థం చేసుకోవడం కోసం అదనంగా 15 నిమిషాల సమయం ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో సబ్జెక్ట్‌లో 80 మార్కులకే (ఒక్కో పేపర్ 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు) పరీక్షలు జరుగనుండగా... ఇంటర్నల్స్‌కు 20 మార్కులు వేయనున్నారు. 25న ప్రారంభమయ్యే ఈ పరీక్షలకు 5.65 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. - సాక్షి, హైదరాబాద్ ఏర్పాట్లన్నీ పూర్తి.. రాష్ట్రంలో ఈ నెల 25వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 2,600 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 5,65,000 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు వెల్లడించారు. ఈసారి కొత్త విధానంలో పరీక్షలను నిర్వహిస్తున్నందున విద్యార్థులు ప్రశ్నలను బాగా చదివి అర్థం చేసుకునేందుకు అదనంగా 15 నిమిషాల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రశ్నలు ఏ రూపంలో ఉంటాయో కూడా తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని... ప్రశ్నలను అర్థం చేసుకొని జవాబులు రాయాలని చిరంజీవులు సూచించారు. ఇక 49,410 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. వీరికి ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. మరోవైపు అన్ని సబ్జెక్టులకు రెండు పేపర్ల చొప్పున ఉండగా ద్వితీయ భాషకు ఒకే పేపర్ ఉంటుందని, ఆ పరీక్ష రోజున మాత్రం విద్యార్థులకు 3:15 గంటల సమయం (ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు) ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పరీక్షల విభాగం డెరైక్టర్ శేషుకుమారి తెలిపారు. పాఠం చివరన ప్రశ్నలు లేకపోవడం, విద్యార్థులే ఆలోచించి నేర్చుకునేలా అమల్లోకి తెచ్చిన ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానంలో మొదటిసారిగా విద్యార్థులు ఈ నెల 25 నుంచి పరీక్షలు రాయనున్నారు. పకడ్బందీగా పరీక్షలు: చిరంజీవులు పదో తరగతిలో ఫలితాలు ముఖ్యం కాదని, పకడ్బందీగా పరీక్షలను నిర్వహించాలని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు అధికారులను ఆదేశించారు. మాల్‌ప్రాక్టీస్‌కు ఏ మాత్రం అవకాశం లేకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరీక్షల ఏర్పాట్లపై మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, విద్యాశాఖ, రెవెన్యూ, విద్యుత్, వైద్యారోగ్య శాఖల అధికారులతో చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. ‘‘పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ను అమలు చేయాలి. పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలి. తాగునీరు, ఫర్నీచర్, టాయిలెట్ సదుపాయం కల్పించాలి. రూమర్స్, పేపర్ లీక్ వంటి వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలి. పరీక్షల సమయంలో ఆయా ప్రాంతాల్లో కరెంటు కోత విధించవద్దు. వైద్యారోగ్య సిబ్బంది అందుబాటులో ఉండాలి. రవాణా సదుపాయం కల్పించాలి. చీఫ్ సూపరింటెండెంట్ మినహా మరెవరు కూడా సెల్‌ఫోన్ తీసుకెళ్లవద్దు..’’ అని ఆయన సూచించారు. పరీక్షా కాలం.. 10,978 ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలు.. 2,600. ఇందులో రెగ్యులర్ విద్యార్థులకు 2,383 కేంద్రాలు, ప్రైవేటు విద్యార్థులకు 231 కేంద్రాలు. పరీక్షలు రాసే మొత్తం విద్యార్థులు 5,65,000. ఇందులో రెగ్యులర్ 5,15,590, ప్రైవేటు విద్యార్థులు 49,410 మంది. ఇక వొకేషనల్ విద్యార్థులు 11,041 మంది. పరీక్షలు రాసేవారిలో 2,92,764 మంది బాలురు, 2,72,236 మంది బాలికలు. మాస్ కాపీయింగ్‌ను నిరోధించేందుకు 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్లు ఉంటాయి. ద్వితీయ భాష మినహా ఒక్కో పేపర్లో 40 మార్కులకు (ఒక సబ్జెక్టులో మొత్తంగా 80 మార్కులకు) రాత పరీక్ష ఉంటుంది. ఒక్కో సబ్జెక్టులో ఇంటర్నల్స్‌కు 20 మార్కుల చొప్పున ఉంటాయి. ఈ కొత్త విధానంలో ఆబ్జెక్టివ్ పేపర్ ఉండదు. ప్రైవేటు విద్యార్థులకు మాత్రం ఉంటుంది. ఓఎంఆర్ జవాబు పత్రంపై హాల్‌టికెట్ నంబర్ వేసేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఫెయిలై ఇప్పుడు పరీక్ష రాస్తున్న ప్రైవేటు విద్యార్థులు ఈసారితోపాటు వచ్చే జూన్/జూలైలో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలే పాత విధానంలో చివరి అవకాశం. ఆ తర్వాత (2016 మార్చి నుంచి) కొత్త విధానంలోనే వారు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. పది నిమిషాలకు మించితే నో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలి. పరీక్ష హాల్లోకి 15 నిమిషాల ముందు అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభమయ్యాక గరిష్టంగా 10 నిమిషాల వరకు మాత్రమే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. అంతకు మించి ఆలస్యమైతే వెనక్కి వెళ్లాల్సిందే. ఇక ఎండాకాలం అయినందున విద్యార్థులు పరీక్షకు వచ్చేప్పుడు భోజనం చేసి రావడం మంచిది. వీలయితే వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలి. మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. -
స్కూళ్లను పట్టించుకోని ఎంఈఓలు!
ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడి సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వ పాఠశాలలను మండల విద్యాధికారులు (ఎంఈఓ) పట్టించుకోవడం లేదు. స్కూళ్లకు టీచర్లు సరిగ్గా వస్తున్నారా.. లేదా? చూడటం లేదు.. పోనీ వారు స్కూళ్లలో అందుబాటులో ఉంటున్నారా? అంటే అదీ సరిగ్గా లేదు. ఏమంటే తాను ఇన్‌ఛార్జి ఎంఈఓ మాత్రమేనని, మరో స్కూల్లో హెడ్ మాస్టర్‌నని చెబుతున్నారు. మరోవైపు స్కూళ్లలో విద్యా బోధన సరిగ్గా సాగడం లేదు. ఇంగ్లిషు బోధన అయితే మరీ అధ్వానం. ఉపాధ్యాయుల బోధనపై పర్యవేక్షణ లేదు’ ఇదీ క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి. మూడు వారాలుగా పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సహా విద్యాశాఖ అధికారులు, అదనపు డెరైక్టర్లు ఇటీవల పాఠశాలల్లో చేసిన ఆకస్మిక తనిఖీల్లో వెల్లడైన అంశాలు. బుధవారం పాఠశాల విద్యా డెరైక్టరేట్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో పాఠశాలలు, విద్యా బోధన గాడిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చింది. ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతుందని, ఇలాగే కొనసాగితే ప్రభుత్వ పాఠశాలలు మరింత అధ్వానంగా తయారవుతాయని అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని భావించింది. ఇందులో భాగంగా పాఠశాలల నిర్వహణ, విద్యాబోధన, పర్యవేక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలపై అవసరమైతే చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సస్పెండ్ చేసేందుకు కూడా వెనుకాడవద్దని తనిఖీ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు బోధన పద్ధతుల విషయంలో ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. -
రెండు నెలల పింఛన్ ఇవ్వాల్సిందే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రతి లబ్ధిదారుడికి రెండు నెలల పింఛన్ నగదు రూపంలో ఇవ్వాలని, ఎక్కడైనా లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ రాకుంటే తనకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు చెబుతున్నారు. జిల్లాలో బుధవారం నుంచి పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఆహారభద్రత కార్డులు కూడా డిసెంబర్ చివరి కల్లా ఇస్తామని అంటున్నారాయన. జిల్లాలో వాటర్‌గ్రిడ్ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం వస్తుందని, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని, యాదగిరిగుట్టను త్వరలోనే టెంపుల్‌టౌన్‌గా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు కలెక్టర్. అదే విధంగా జిల్లాలో భూరికార్డుల నిర్వహణ సరిగా లేని కారణంగా, టైటిల్ సమస్యలు వస్తున్నాయని, దీనిని నివారించేందుకుగాను త్వరలోనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు మరింత శ్రమించాలని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కొంత ఇబ్బంది అయినా అంకితభావంతో పనిచేయడం ద్వారా భావి తరాలకు మేలు చేయాలని అంటున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. సామాజిక పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి? పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలోని 3.04లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ ఇస్తాం. ప్రతి లబ్ధిదారునికి నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించాం. జిల్లాలో ఎక్కడైనా ఎవరికైనా రెండు నెలల పింఛన్ ఇవ్వకుంటే కలెక్టరేట్లోని టోల్‌ఫ్రీనంబర్ 18004251445కు ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా పింఛన్ల మంజూరుకు మరో 80వేల వరకు విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. అందులో మరో 25వేల వరకు అర్హత సాధించవచ్చని అంచనా. అన్నీ కలిపితే జిల్లాలో 3.30లక్షల మందికి సామాజిక పింఛన్లు అందే అవకాశం ఉంది. అయితే, ఈ 25వేల మందికి ఈనెల 20-25 వరకు పింఛన్లు ఇస్తాం. ఎవరూ పింఛన్లు రాలేదని నిరాశపడొద్దు. పింఛన్లు, ఆహారభద్రత కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ. అనవసర ఆందోళనకు గురయి దళారులను ఆశ్రయించవద్దు. ఆహార భద్రత కార్డుల పరిస్థితి ఏంటి? ఆహారభద్రత కార్డుల కోసం జిల్లాలో దాదాపు 11లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోం ది. ఇప్పటివరకు 7.24లక్షల దరఖాస్తులు పరిశీలించాం. అందులో 71 శాతం అంటే 5.14లక్షల దరఖాస్తులు అర్హత సాధించాయి. మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసి డిసెం బర్31కల్లా లబ్ధిదారుల తుదిజాబితా తయారుచేస్తాం. జనవరి1 నుంచి కొత్త కూపన్లపై రేషన్ ఇస్తాం. ఫిబ్రవరికల్లా కార్డులు కూడా వస్తాయి. గతంలో మాదిరిగా రేషన్‌బియ్య ంపై సీలింగ్ లేదు. ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం కిలో రూపాయికి అందిస్తాం. అదే విధంగా జనవరి నుంచి సం క్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఇందుకోసం వార్డెన్ల నుంచి ఇండెంట్ తెప్పిస్తున్నాం. వాటర్‌గ్రిడ్ పైలాన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు? అసలు జిల్లాలో వాటర్‌గ్రిడ్ ప్రణాళికలేంటి? ఎప్పటివరకు ఈ ప్రణాళిక పూర్తవుతుంది? దీర్ఘకాలికంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న జిల్లాకు వాటర్‌గ్రిడ్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు అందుతాయి. గతంలో తలసరి నీటి వినియోగం 40లీటర్లు కాగా, ఇప్పుడు 100 లీటర్లుగా పరిగణించి జిల్లాకు 8టీఎంసీల నీరు కావాలని అంచనా వేస్తున్నాం. ఇందుకోసం మూడు చోట్ల మేజర్గ్రిడ్లు, కొన్ని సబ్గ్రిడ్లు, ట్రంక్లయిన్స్, పైప్లైన్ల విస్తరణ, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను మొత్తం 3,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అయితే, పూర్తిస్థాయి ప్రణాళిక మరోవారం పది రోజుల్లో రెడీ అవుతుంది. యాదగిరిగుట్ట అభివృద్ధి కార్యాచరణ ఏమిటి? గుట్టను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటికే ఆలయ భూమి 130 ఎకరాలుంది. మరో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇస్తున్నాం. మిగిలిన 1500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ సేకరించాల్సిన భూమిని కూడా గుర్తించాం. త్వరలోనే దేవస్థాన నిర్వహణ కమిటీని కూడా ప్రకటించవచ్చు. అదే విధ ంగా యాదగిరిగుట్టను టెంపుల్‌టౌన్‌గా ప్రకటిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సే యోచనలో ఉంది. హరిత హారం ఏ దశలో ఉంది? హరితహారం కింద జిల్లాలో 14.40కోట్ల మొక్కలు నాటాల ని నిర్ణయించాం. ఇందుకోసం 480నర్సరీలను ఎంపిక చే శాం. ఈ నర్సరీలకు భూమి కూడా గుర్తించాం. వనసేవకులకు శిక్షణనిస్తున్నాం. ఔట్‌సోర్సింగ్‌ద్వారా కొందరు ఉ ద్యోగులను నియమించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో భా గంగా 50శాతం టేకు మొక్కలను నాటాలని నిర్ణయించాం. మిగిలినవి పెరటిమొక్కలు, ఇతర మొక్కలను నాటుతాం. జిల్లాలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఇంకా ప్రారంభం కానట్టుంది? జిల్లాలో మిషన్‌కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు 25 చెరువులకు టెండర్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 4600 చెరువులకు గాను 900 చెరువులను ఈ ఏడాది పునరుద్ధరిస్తాం. టెండర్లు పూర్తయితే కానీ ఖర్చు లెక్క రాదు. దళితులకు భూపంపిణీ నత్తనడకన నడుస్తోందా? ఈ ప్రక్రియలో కొంత వెనుకబాటు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఇందుకు భూసమస్యలున్నాయి. భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండి, అమ్మడానికి పట్టాదారులు సిద్ధంగా ఉన్నా టైటిళ్లు సరిగా లేవు. ఈ టైటిళ్ల సమస్య కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. అసలు జిల్లాలో భూరికార్డుల నిర్వహణ కూడా అంత సమగ్రంగా లేదు. అందుకే జనవరి 16 నుంచి మార్చి 30వరకు రెవె న్యూ సదస్సులు పెట్టబోతున్నాం. ఆ సదస్సుల్లో రికార్డుల ను కంప్యూటరీకరించే ప్రక్రియకు పూనుకుంటున్నాం. దళి తులకు భూపంపిణీకి సంబంధించి ఇప్పటివరకు 66 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మరో 60 ఎకరాలు ప్రాసెస్‌లో ఉంది. వరుసగా వస్తున్న కార్యక్రమాలతో ప్రభుత్వ ఉద్యోగులపై పనిఒత్తిడి కనిపిస్తోంది? మీపై కూడా కొందరు ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్టున్నారు? నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కనుక అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోంది. ఈ కార్యక్రమాలను శరవేగంతో అమలు చేయడంతో పాటు అమలులో పారదర్శకత ఉండాలి. ఇందుకు ఉద్యోగులు మరింత శ్రమ చేయాల్సి వస్తోంది. ఇది కొందరికి ఇబ్బంది అనిపించినా తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలంటే ఒత్తిడి అనివార్యం. అయినా, పోరాడి సాధించుకున్న రాష్ట్రం కోసం అంకితభావం, ఉత్సాహంతో పనిచేయడం ఉద్యోగుల బాధ్యత. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మనస్ఫూర్తిగా స్వీకరించి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంకితభావంతో పనిచేసినప్పుడే భావితరాలకు మేలు చేసిన వాళ్లవుతాం. ఈ అసంతృప్తి సమస్య అన్ని జిల్లాల్లో ఉంది. మన దగ్గరే కాదు. అయినా, అన్ని ప్రభుత్వ పథకాల అమలులో మనమే ముందున్నాం. -
హుదూద్...అప్రమత్తం
రాంనగర్ : ‘‘హుదూద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది... రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా సమర్థంగా పనిచేయాలన్నారు. ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు 108 వాహనాలను సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్లు, ఇతర అధికారులు సెలవులో వెళ్లరాదని, విధిగా హెడ్‌క్వార్టర్లలోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి నీటిసామర్థ్యంతో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, బలహీనంగా ఉన్నవాటిని ముందస్తుగానే గుర్తించి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం భారీ వర్షాలు కురిస్తే పాఠశాలలకు అవసరమైతే సెలవు ప్రకటించాలని డీఈఓకు సూచించారు. పట్టణాలలో మురుగుకాల్వలు, పెద్ద డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండి కాలనీలు జలమయం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిం చారు. ముఖ్యంగా రైల్వేట్రాక్ వెంట భారీగా వరద నీరు ప్రవహించడాన్ని గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలనుంచి సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 1800-425-1442 నంబర్‌తో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏైవైనా సమస్యలు, సమాచారం ఉంటే ఈ నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పాలని కోరారు. -
ప్యాకేజీ ఇస్తాం.. ఖాళీ చేయండి
‘కిష్టాపురం, చింత్రియాల, అడ్లూరు, వెల్లటూరు గ్రామాల ప్రజలు తాము నివసిస్తున్న ప్రాంతాలను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాలి...ప్యాకేజీ వెంటనే అందజేస్తాం’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులతో శుక్రవారం కలెక్టర్ కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీప్రభుత్వం విడుదల చేసిన రూ. 20కోట్లు గ్రామాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు. కోదాడరూరల్ : పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ చెల్లిస్తామని, తమతమ ప్రాంతాలను ఖాళీ చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. శనివారం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో పులిచింతల ముంపు ప్రాంతాలైన కిష్టాపురం, చింత్రియాల, అడ్లూరు, వెల్లటూరు ప్రజలతో గ్రామాల వారీగా సమావేశమయ్యారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, ముంపు బాధితులు తమకు కేటాయించిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేయడానికి సిద్ధమైందని, దీంతో ముంపు గ్రామాలలోకి నీరు చేరుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వచేయాలని అధికారులను ఆదేశించిందని, అ స్థాయిలో నీటిని స్టోరేజీ చేస్తే ముంపు గ్రామాలు 13 పూర్తిస్థాయిలో, 4 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని చెప్పారు. అయితే మరో ఏడాది వరకు ప్రాజెక్ట్‌లో 7 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పునరావాస నిర్వాసితులకు రూ.292 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు 172 కోట్ల రూపాయలను అందజేశామని, మిగిలిన రూ.120కోట్లు కూడా విడుదల చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని, వాటిని గ్రామాల వారీగా అందజేస్తామన్నారు. త్వరలోనే ముంపు గ్రామాల పర్యవేక్షణకు ఆర్డీఓ స్థాయి అధికారిని దత్తత అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. 18ఏళ్లు నిండిన వారికి నాటి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, దానిని 2013 నాటికి అమలు చేయాలని పలువురు ముంపువాసులు కలెక్టర్‌ను కోరారు. 2007లో ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా ఇచ్చిన హామీనే అమలు చేస్తామని, అది కూడా 18 ఏళ్లు నిండి విద్యార్థి కాకూడదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రాప్రాంతంతో పనిదినాలను ఎక్కువగా చూపించారని, కూలిని రూ.161 చెల్లించారని, తమకు మాత్రం పనిదినాలు అనుకున్న ప్రకారం కల్పించలేదని, కూలిని రూ.97, రూ.110 చెల్లించారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ అనుకున్న పనిదినాలను కల్పించి కూలి రేటును రూ.165 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస ప్రాంతాలలో అధికారులు సరిగా వసతులు కల్పించడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన శాఖల వారీగా మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, కోదాడ తహసీల్దారు పసుపులేటి రామకృష్ణ, ఆయా శాఖల డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు. -
బినామీ డీలర్లు..!
నీలగిరి : జిల్లాలో ప్రజాపంపిణీ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. డీలర్లు కాకుండా రేషన్‌దుకాణాలపై బినామీలు పెత్తనం చెలాయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించేవారు లేకపోవడంతో వారే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బినామీలుగా చెలామణి కావడమేగాక డీలర్ల సంఘానికి నాయకత్వం వహిస్తున్నా, జిల్లా పౌరసరఫరాశాఖ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో గ్రామస్థాయిలో ప్రజాపంపిణీ వ్యవస్థపై అజమాయిషీ లేకుండా పోయింది. ఏడాది కాలం తర్వాత శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ టి.చిరంజీవులు అధ్యక్షతన జరిగిన జిల్లా ఆహార సలహాసంఘం సమావేశంలో పలువురు సభ్యులు గగ్గోలు పెట్టారు. ప్రజాపంపిణీ వ్యవస్థ, రేషన్‌కార్డులు, ఆధార్ సీడింగ్, ఐకేపీ, ఆహార పదార్థాల్లో కల్తీ వ్యవహారం, గ్యాస్ ఏజెన్సీల నిర్వాహణపై చర్చించారు. ప్రధానంగా రేషన్ డీలర్ల పనితీరుపై సభ్యులు మండిపడ్డారు. దుకాణాలు తెరవడంతో డీలర్లు సమయపాలన పాటించడం లేదన్నారు. ఆలేరులో ఓ డీలరు ఒకే ఇంట్లో రెండు దుకాణాలు నడుపుతున్నాడని ఎమ్మెల్యే గొంగడి సునీత ఫిర్యాదు చేశారు. భువనగిరి డివిజన్ పరిధిలో 35 దుకాణాలు బినామీ చేతుల్లో నడుస్తున్నాయని మరో సభ్యుడు అహ్మద్ అలీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భార్య డీలర్‌గా ఉన్న ప్రతిచోట భర్త పెత్తనం ఎక్కువగా ఉందని, దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు. భువనగిరి పట్టణంలో ఐదుగురు రేషన్‌డీలర్లు బినామీలుగా పనిచేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. యాదగిరిగుట్ట మండలం మోటకొండూరు రేషన్‌డీలర్ అయితే విదేశాల్లో ఉంటూ ఇక్కడి వ్యవహారాలు చక్కపెడుతున్నారు. ఈ విషయమై సివిల్ సప్లై అధికారులకు అనేకమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. భువనగిరి డివిజన్ ఏఎస్ఓ డిప్యుటేషన్ మీద హైదరాబాద్ కే పరిమితమయ్యారని...స్థానికంగా జరుగుతున్న అక్రమాల వైపు కనీసం కన్నెత్తికూడా చూడడం లేదని తెలిపారు. వీరిపై చర్య తీసుకోవాల్సిన తహసీల్దార్లు డీలర్లకు కొమ్ముకాస్తున్నారని, ఆర్డీఓకు ఏ మాత్రం సహకరించడం లేదని కలెక్టర్‌కు వివరించారు. బియ్యం పంపిణీలో అక్రమాలు... సంస్థాన్‌నారాయణపురం మండలంలో అంత్యోదయ కింద మృతిచెందిన కుటుంబాల పేరు మీద డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్నారని జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రసూల్ తెలిపారు. దీనిపై కొద్ది మాసాల క్రితం అధికారులు విచారణ కూడా నిర్వహించి, ఎలాంటి చర్యలు తీసుకోకుండా పక్కన పడేశారని చెప్పారు. పాలలో యూరియా, సోయాబీన్ పిండి కలిపి కల్తీ చేస్తున్నారని సభ్యులు ఆరోపించారు. అయితే దీనిపై స్పందించిన ఫుడ్ ఇన్స్పెక్టర్ పాలల్లో ఎలాంటి కల్తీ జరగడం లేదని చెప్పారు. రేషన్‌కార్డులు రద్దుకావు ఆధార్ సీడింగ్ నమోదు చేసుకోని రేషన్‌కార్డుదారులను తొలగిస్తారని వార్తలు వస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిజమైన లబ్ధిదారులను తొలగించబోమని చెప్పారు. ఈ నెల 15వ తేదీలోగా లబ్ధిదారులు ఆధార్ సీడింగ్ నమోదు చే యించుకోవాలని తెలిపారు. లేకపోతే అలాంటి వారిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన అనంతరం వాటిని తొలగిస్తామని చెప్పారు. మండల, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు ప్రత్యేక అధికారుల పాలనలో సమావేశాలు నిర్వహించకుండా నిలిచిపోయిన ఆహార సలహా సంఘం కమిటీలను తిరిగి ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కమిటీలకు డివిజన్‌స్థాయిలో ఆర్డీఓ చైర్మన్‌గా, గ్రామ కమిటీలకు సర్పంచ్, మండల కమిటీలకు కోచైర్మన్లుగా ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు వ్యవహరిస్తారు. గ్రామ సలహాసంఘం కమిటీ సమావేశం నెలకోసారి, మండలస్థాయి కమిటీ సమావేశాలు రెండు మాసాలకోసారి నిర్వహిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలు, ఫిర్యాదులపై వచ్చే సమావేశం నాటికి చర్యలు చేపట్టాలని సివిల్ సప్లయ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, సలహా సంఘం కమిటీ సభ్యులు, డీఎస్ నాగేశ్వర్రావు, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సివిల్స్‌పై దృష్టి పెట్టండి
నేటి యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు బదులు సమాజసేవకు ఉపకరించే ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలపై దృష్టి సారించాలని నల్గొండ కలెక్టర్ చిరంజీవులు సూచించారు. సివిల్స్ పరీక్షలపై అవగాహన కోసం ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నారు. సాక్షి, ముంబై: నేటి యువతీయువకులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు కావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర ఎన్నో రంగాలున్నప్పటికీ వాటిపై ఆసక్తి కనబర్చడం లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. యూపీఎస్సీ, సీఎస్ఈ, ఎంపీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న యశ్వంత్ భవన్ హాలులో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవులు అనేక అంశాలపై విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చా రు. ‘సాఫ్ట్వేర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు సంపాదిస్తే కేవలం కార్యాలయంలో పనిచేయడానికే పరిమితమవుతారు. అదే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు వస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశముంటుంది. లోకజ్ఞానం కూడా సంపాదించుకోవచ్చు’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి ఐపీఎస్ అధికారి, ఠాణే జిల్లా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ నెట్వర్కింగ్ సైట్లపై కాకుండా చదువుపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. వాటివల్ల నష్టమే తప్ప లాభం లేదు. మీకు తెలియకుండా నే వారు ఫేస్బుక్, వాట్సప్ వంటి సైట్లు చూస్తూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. ఈ సమయాన్ని చదువుకునేందుకు కేటాయిస్తే మంచి భవిష్యత్ ఉం టుంది. మనం ఏ కాలేజీలో చదువుకున్నామో అదే కాలేజీకి ఒక ముఖ్య అతిథిగా వెళితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. మనం ఇతరుల ఆటోగ్రాఫ్ కోసం పాకులాడే బదులుగా మన ఆటోగ్రాఫ్ కోసం ఇతరులు ఎగబడేస్థాయికి ఎదగాలి. కన్నవారిని, గురువులను గౌరవించే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది’ అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి హాజ రైన అతిథులకు పద్మశాలి సేవాసంఘం అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ శాలువ, పుష్పగుచ్ఛాలు, మెమొంటోలు ఇచ్చి ఘనం గా సత్కరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అతిథులు, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇటీవల తెలంగాణలో సకలజన సర్వే సక్రమంగా జరగలేదని, ఎన్యుమలేటర్లందరూ సక్రమంగా విధులు నిర్వహించనందున, మరోసారి సర్వే చేపట్టాలని కోరుతూ పోతు రాజారాం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కూరపాటి అరుణ (జెడ్పీటీసీ-నిజామాబాద్), ఎనుగందుల అనిత (జెడ్పీటీసీ-మోర్తాడ్), జోగు సంగీత (జెడ్పీటీసీ-బాల్కొండ), పోతు నర్సయ్య (మండల అధ్యక్షుడు-ఆర్మూర్), జక్కని సంధ్యారాణి (ఎంపీటీసీ-ఏర్గట్ల), ఎనుగందుల అశోక్ (ఎంపీటీసీ-పాలెం), పెంటు గంగాధర్ (ఎంపీటీసీ-ముప్కాల్), చిలుక గోపాల్ (ఎంపీటీసీ-ముప్కాల్), తాళ్ల భూషణ్ (సర్పంచి-వన్నెల్ బి), గుర్రం నారాయణ (సర్పంచి-బోదేపల్లి), తాటికొండ శివకుమార్ (వ్యాపారవేత్త)ను సన్మానం పొందినవారిలో ఉన్నారు. ఈ సెమినార్లో ఐఏస్ అధికారి సంతోష్ రోకడే, ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సెవై రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక శైలజ , సిద్ధివినాయక్ మందిరం ట్రస్టుకు చెందిన ఏక్నాథ్ సంగం తదితరులు హాజరయ్యారు. -
సర్వే.. సక్సెస్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: కుటుంబ సమగ్ర సర్వే జిల్లాలో సక్సెస్ అయింది. ఉదయం మందకొడిగా మొదలైన సర్వే, రాత్రిదాకా కొనసాగింది. కలెక్టర్ చిరంజీవులు నల్లగొండ మున్సిపాలిటీలోని 6వ వార్డు, పద్మావతి కాలనీతోపాటు నార్కట్‌పల్లి మండలంలో పర్యటించి సర్వే తీరును పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా సూర్యాపేట మున్సిపాలిటీ, కోదాడ, నడిగూడెం, మునగాల మండలాల్లో పర్యటించారు. సర్వే సందర్భంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఇదే పరిస్థితి కనిపించింది. సర్వే సందర్భంగా అన్ని చోట్లా దాదాపు ఒకేరకమైన సమస్యలు తలెత్తాయి. ఎన్యుమరేటర్లకు సరైన శిక్షణ లేకపోవడం కొంత ప్రభావం చూపించింది. కుటుంబాల సంఖ్యకు తగిన రీతిలో ఎన్యుమరేటర్ల సంఖ్య కూడా లేదు. చాలాచోట్ల ఇళ్లకు నంబర్లు కేటాయించడంలో జరిగిన పొరపాట్లు సర్వేను ప్రభావితం చేశాయి. గ్రామాల్లో ఎన్యుమరేటర్లతో ప్రజలు వాగ్వాదానికి దిగారు. నంబర్లు కేటాయించని కారణంగా చాలా కుటుంబాలు సర్వేలో తమ వివరాలను నమోదు చేయించుకోలేకపోయారు. నల్లగొండ పట్టణంలో సాయంత్రం వరకు ఎన్యుమనేటర్ల కోసం ఎదురు చూశారు. దూర ప్రాంతాల నుంచి సొంత గ్రామాలకు వచ్చిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో సర్వేకు వచ్చిన ఎన్యుమరేటర్లతో ఆందోళనకు దిగి నంబర్లు వేయించుకోవాల్సి వచ్చింది. దాంతో ఒక్కో ఎన్యుమనేటర్కు కేటాయించిన కుటుంబాల సంఖ్య పెరిగింది. నల్లగొండ పట్టణంలో ఇంటి నంబర్లు వేయలేదని గాంధీనగర్‌కు చెందిన 20 మంది మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. కాగా, కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్, ఎమ్మెల్సీ పూల రవీందర్ నల్లగొండ పట్టణంలోనే సర్వే ఫారాలు నింపారు. నల్లగొండ మండలంలోని అన్నేపర్తి, రాములబండ, అప్పాజిపేట, నర్సింగ్‌భట్ల గ్రామాలలో హైదరాబాద్‌కు వలస వెళ్లిన వారి ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. దాంతో బై నంబర్లు వేసి సర్వేలో నమోదు చేశారు. తిప్పర్తి మండల కేంద్రంలోని కొన్ని ఏరియాలలో ఇంటి నంబర్లు వేయకపోవడంతో ఆలస్యంగా 12 గంటలకు సర్వే ప్రారంభమైంది. పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, మాడ్గులపల్లి గ్రామాలలో 50 చొప్పున ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. నోడల్ అధికారులు అదనపు సర్వే ఫారాలను తెప్పించి సర్వే నిర్వహించారు. కనగల్ మండలంలోని అన్ని గ్రామాల్లో కూడా ఇంటి నంబర్లు కోసం ఆందోళనలు జరిగాయి. నోడల్ అధికారలు స్పందించి బై నంబర్లు ఇవ్వడంతో సర్వే కొనసాగింది. కనగల్ మండలంలో ఎన్యుమనేటర్లు కాకుండా వారి బంధువులు సర్వే చేయడం వల్ల తప్పలు దొర్లినట్లు పలువురు పేర్కొన్నారు. భువనగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దూర ప్రాంతాలకు వలస వెళ్లిన ప్రజలు సర్వేకోసం గ్రామాలకు చేరుకునే సరికి వారి ఇళ్లకు నంబర్లు లేవన్న సాకుతో ఎన్యుమరేటర్లు కుటుంబాల వివరాలు సేకరించ లేదు. భువనగిరి మున్సిపాలిటీ, భువనగరి మండలం, బీబీనగర్, పోచపల్లి, వలిగొండ మండలాల్లో సర్వే సందర్భంగా పెద్ద ఎత్తున కుటుంబాల సంఖ్య పెరిగింది. ఇక ఎన్యుమరేటర్ల కోసం ప్రజలు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇళ్లల్లోంచి బయటకు వెళ్లకుండా వేచి ఉన్నారు. వీధుల్లో జనసంచారం ఎక్కడా కనిపించలేదు. దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి, చందంపేట వంటి మండలాల్లో సర్వే నిర్వహణకు ఎన్యుమరేటర్లకు ట్రైనింగ్ ఇచ్చినా చివరికి సిబ్బంది సరిపోక అధికారులు అప్పటికప్పుడు ఏమాత్రం శిక్షణ తీసుకోని విద్యార్థులకు, ప్రైవేట్ వ్యక్తులకు కూడా ఎన్యుమరేటర్ బాధ్యతలు అప్పగించారు. ఇంటి నంబర్లు వేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోని వైనం సర్వే సందర్భంగా బయట పడింది. చాలా కుటుంబాలకు ఇంటి నంబర్లు వేయలేదు. దీంతో ఎన్యుమరేటర్లకు పరిమితి సంఖ్యలో సర్వే ఫారాలు ఇవ్వగా అవి సరిపోక, చాలా కుటుంబాలు తమ పేర్లను నమోదు చేయించుకోలేకపోయాయి. పట్టణాలలో బతుకు దెరువుకు వెళ్లిన పలువురు సర్వే కారణంగా గ్రామాలకు, తండాలకు చేరుకునే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రవాణా సౌకర్యాలు లేక చాలా మంది సర్వేకు అందుకోలేకపోయారు. తప్పనిసరిగా ఆధార్‌కార్డు నంబరు వేయాలని సూచించడం, చాలా మందికి ఆధార్ కార్డులు లేక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లు ఆధార్‌ను తప్పనిసరిగా చూపించాలనడంతో కొన్ని గ్రామాల్లో వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి. హుజూర్నగర్ నియోజకవర్గంలోని నాగార్జునసాగర్ ఆయకట్టులో వరినాట్లు ముమ్మరంగా జరుగుతున్నా పనులకు వెళ్లకుండా సర్వేలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనేందుకు దూర ప్రాంతాలలో నివసిస్తున్న వారు హుజూర్నగర్ నియోజకవర్గంలోని తమసొంత గ్రామాలకు చేరుకున్నారు. అయితే సర్వే నిర్వహణకు ముందుగా ఒక్కొక్క ఇంటికి ఒక నంబర్ మాత్రమే కేటాయించారు. ఒకే ఇంటిలో రెండు, మూడు కుటుంబాలు నివసిస్తుండటంతో తమను కూడా సర్వేలో భాగస్వాములు చేయాలని మిగిలినవారు కోరారు. దీంతో ఎన్యుమరేటర్లు తమ జాబితాలో పేరు లేదని నిరాకరించడంతో దాదాపు అన్ని గ్రామాల్లో వివాదం చెలరేగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు ఆయా గ్రామాలకు చేరుకొని వారికి కూడా సర్వేలో భాగస్వాములు చేస్తామని హామీలు ఇచ్చారు. ఎన్యుమరేటర్లు తమకు కేటాయించిన జాబితా కుటుంబాల వారిని మాత్రమే సర్వే చేస్తామని అదనపు కుటుంబాలకు సర్వే నిర్వహించమంటూ అన్ని గ్రామాల్లో నిరాకరించారు. హుజూర్నగర్ పట్టణంలోని 19, 20 వార్డుల్లో ఎన్యుమరేటర్లకు కేటాయించిన ఇళ్లు ఒకేచోట లేక సర్వే నిర్వహణకు ఇబ్బందులు పడ్డారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు, విద్యార్థులను ఎన్యుమరేటర్లుగా నియమించడంతో సర్వే పత్రాలు నింపడానికి వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండలంలో కొన్ని గ్రామాల్లో ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు ఉండగా ఒకే నంబరు వేయడంతో మిగితా కుటుంబాలను సర్వే చేయకపోవడంతో ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. అధికారులు అన్ని కుటుంబాలను సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్యుమరేటర్లకు ఉదయం టిఫిన్ , మధ్యాహ్న భోజనం సమయానికి అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నియోజకవర్గంలో సమగ్ర కుటుంబ సర్వే ప్రశాంతంగా ముగిసింది. తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో చాలా చోట్ల కుటుంబాలు ఎక్కువగా ఉండి ఫారాలు సరిపోను అందక సర్వే ఆలస్యమైంది. శాలిగౌరారం మండలం వల్లాల, చిత్తలూరు గ్రామాల్లో ఇళ్లకు నంబర్లు కేటాయించలేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు వచ్చి ప్రజలను సముదాయించారు. మోత్కూరు మండలంలో సర్వే ఫారాలు సరిపోక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎన్యుమరేటర్లకు సమయానికి భోజనం అందించలేక పోయారు. రాత్రి వరకు సర్వే కొనసాగింది. ప్రతి గ్రామంలో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. సూర్యాపేట నియోజకవర్గంలో సమగ్ర సర్వే చిన్నచిన్న సమస్యల నడుమ కొనసాగింది. దూర ప్రాంతంలో ఉన్న వారు సైతం సొంతూళ్లకు రావడంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. సూర్యాపేట, పెన్‌పహాడ్, చివ్వెంల, ఆత్మకూర్.ఎస్ మండలాల్లో సర్వే రాత్రి వరకు కొనసాగింది. సూర్యాపేట మండలం యండ్లపల్లి గ్రామంతో పాటు పలు గ్రామాలకు వచ్చిన ఎన్యుమరేటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో సర్వే కొంత ఆలస్యంగా మొదలైంది. కొన్ని గ్రామాల్లో తాళం వేసిన ఇళ్లకు డోర్ నంబర్లు వేయకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం, గాజులమల్కాపురం గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో సర్వే ఫారాలు నింపడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లో విద్యావంతులు, యువకుల సాయంతో కూడా సర్వే ఫారాలను నింపిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో సర్వేను జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కోదాడ నియోజకవర్గంలో సమగ్ర సర్వే ప్రశాంతంగా సాగింది. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ఎన్యుమరేటర్లు ఉదయం ఏడు గంటలకే సర్వే ప్రారంభించారు. ముందుగా వేసిన ఇంటినంబర్ల ఆధారంగా సర్వే నిర్వహించారు. పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయులనే నియమించడంతో ప్రశాంతంగా సాగింది. సర్వే జరుగుతున్న తీరును కోదాడ మున్సిపల్ కమిషనర్ పరిశీలించారు. కోదాడ పట్టణంతో పాటు గ్రామాల్లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో వీధులన్ని నిర్మానుష్యంగా మారాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. గ్రామాల్లో సర్వే వివరాలు చెప్పడానికి పలువురు తటపటాయిస్తుండటంతో ఒక్కొక్క ఇంటివద్ద 20 నుంచి 30 నిమిషాల సమయం తీసుకున్నారు. చౌటుప్పల్‌లో అద్దెకున్న వారి వివరాలను చాలా చోట్ల నమోదు చేయలేదు. ఇంటి యజమాని వివరాలను తీసుకున్న ఎన్యుమరేటర్లు, ఆ ఇంటిలో అద్దెకున్న వారికి బై నంబర్లు వేసి వివరాలు తీసుకోవాలి. కానీ, అలా తీసుకోలేదు. ఇతర ప్రాంతాల్లో నివాసముండే వారు అక్కడ వివరాలు ఇవ్వకుండా, స్వగ్రామంలోనే సర్వేలో పాల్గొంటామని వచ్చారు. అలాంటి వారి వివరాలను కూడా ఎన్యుమరేటర్లు నమోదు చేయలేదు. ఒక కుటుంబంలో తండ్రి, ఇద్దరు కొడుకులు ఉంటే, వారికి వివాహమైతే, మూడు కుటుంబాలుగా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లను కోరారు. అందుకు వారు ఒకే ఇంట్లో ఉంటున్నందున ఒకే కుటుంబంగా పరిగణిస్తామని చెప్పారు. డి.నాగారం గ్రామంలో గ్రామస్తులు ఈ విధంగానే వీఆర్వోను నిలదీశారు. పోలీసులు వచ్చి గ్రామస్తులను పంపించి వేశారు. మునుగోడు, ఊకొండిలలో ఎన్యుమరేటర్లు అవగాహన లోపంతో వివరాల నమోదులో కోడ్లకు బదులుగా వివరాలు రాశారు. చండూరులో సర్వే ఫామ్స్ లేక గంటన్నర ఆలస్యంగా సర్వే ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు ఉంటే వారి వివరాలను నమోదు చేయలేదు. ఆలేరు నియోజకవర్గంలో సమగ్ర సర్వే సందర్భంగా పెద్దఎత్తున కుటుంబాలు అదనంగా నమోదయ్యాయి. ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, గుండాల, ఆత్మకూరు (ఎం), తుర్కపల్లి, బొమ్మలరామారం మండలాల్లో ఇళ్లకు నంబర్లు వేయకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఆలేరు పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఎన్యుమరేటర్లు అదనపు కుటుంబాల వివరాలు సేకరించకుండానే పోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. దీంతో సర్వే సమయంలో గంటల తరబడి ఒక్కోకుటుంబం వివరాలు సేకరించారు. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆయా కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. ఆలేరు, తుర్కపల్లి మండలాల్లో ఈ పరిస్థితి కన్పించింది. నాలుగు ఇళ్లు ఉంటే ఒక్కటే నంబరు వేశారు. దీంతో ఆయా కుటుంబాలు ఆందోళన చెందాయి. బొమ్మలరామారం మండలం మర్యాలలో సర్వే కోసం వచ్చిన ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భక్తులు లేక యాదగిరికొండ వెలవెలబోయింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో సర్వే అస్తవ్యస్తంగా జరిగింది. హాలియా, పెద్దవూర, నిడమనూరు, త్రిపురారం, గుర్రంపోడు మండలాల్లో పెద్ద ఎత్తున కొత్త కుటుంబాలు నమోదయ్యాయి. ఆయా మండలాల్లో ఒక ఇంటికి ఒకటే నంబర్ ఇవ్వడం, అందులో నివాసం ఉండే ఇతర కుటుంబాలకు బై నంబర్లు ఇవ్వకపోవడంతో పలువురు ఆందోళన చెందారు. ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇంటి నంబర్లను మాత్రమే సర్వే చేశారు. హాలియా మండలంలో ఎన్యుమరేటర్లు తమకు ఇచ్చిన ఇళ్లనే సర్వే చేసి అదనపు ఇళ్లను సర్వే చేయకుండానే వెళ్లిపోయారు. ఎన్యుమరేటర్లకు సరైన అవగాహన కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యార నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లకు నంబర్లు వేయలేదని వాటిని వదిలిపెట్టడంతో ఆ కుటుంబాల వారు అధికారుల చుట్టూ తిరిగారు. హాలియా, త్రిపురారం, నిడమనూరు, నాగార్జునాగర్లలో ఈ పరిస్థితి కనిపించింది. నకిరేకల్ నియోజకవర్గంలో ఆయా మండలాల్లో కుటుంబాల సంఖ్య ఎక్కువగా కావడం, ఇంటినంబర్లు తక్కువ వేయడంతో సర్వే ఫారాల కొరత ఏర్పడింది. దీంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. చందుపట్ల గ్రామంలో కుటుంబాలు ఎక్కువగా ఉండడం, సరిపడా పత్రాలను ఇవ్వకపోవడంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కట్టంగూర్ మండలం ఈదులూరు, పరడ, కట్టంగూర్, కల్మెర గ్రామస్తుల నుంచి నిరసన వ్యక్తమైంది. చిట్యాలలో దుకాణాల వెనుక నివాసం ఉంటున్న కుటుంబాలకు నంబర్లు కేటాయించలేదు. -
సర్వేను సామాజిక బాధ్యతతో నిర్వహించాలి
రాంనగర్ :ప్రభుత్వం మంగళవారం చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను సామాజిక బాధ్యతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. ఆదివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో జరిగిన ఎన్యుమరేటర్ల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా సర్వేలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సర్వే చేసేటప్పుడు వారు చెప్పిందే కాకుండా ఎన్యుమరేటర్లు కూడా కొంత పరిశీలించి సమాచారం సేకరించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు వాస్తవాలను తెలియజేయాలని కోరారు. ఎవరికైనా రెండు చోట్ల ఆస్తులు ఉంటే ప్రస్తుతం ఉన్న చోట మాత్రమే తమ పేరు నమోదు చేయించుకోవాలన్నారు. సర్వే సమయంలో అందుబాటులో ఉండని విద్యార్థులు, ఆస్పత్రిలో ఉన్నవారి వివరాలను వారి కుటుంబ సభ్యులు ఆధారాలతో ఎన్యుమరేటర్లకు చూపించి పేర్లు నమోదు చేయించుకోవాలన్నారు. కుటుంబంలోని వారి అకౌంట్ వివరాలు తెలియజేస్తేనే ఎన్యుమరేటర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగులందరూ సమన్వయంతో పనిచేసి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏజేసీ వెంకట్రావ్, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, సీపీఓ నాగేశ్వరరావు, మోహన్‌రావు పాల్గొన్నారు. -
దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ
కనగల్ :దళితులకు భూపంపిణీ నిరంతర ప్రక్రియ అని జిల్లా కలెక్టర్ టి. చిరంజీవు లు తెలిపారు. కనగల్ మండలం తుర్కపల్లి గ్రామ పరిధిలోని హైదలాపురంలో గురువారం ఆయన భూపంపిణీ పథకం లో భాగంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల తో సమావేశమయ్యారు. మొదటి విడత భూ పంపిణీకి ఎంపికైన ఆదిమల్ల లక్ష్మ మ్మ, మాధవి, సరిత, శివకుమారి, పగడాల అంజలి వివరాలను అడిగి తె లుసుకున్నారు. భూపంపిణీకి వీరు అర్హులేనా అని గ్రామసభలో ప్రజలను అడిగారు. గ్రామంలో సాగుకుయోగ్యమైన ప్రభుత్వ భూమి లేకపోవడంతో ఇతరుల నుంచి 17 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తహసీల్దార్ వివరించారు. గ్రామ ంలో ఎకరం భూమి ఎంత ధర పలుకుతుందని కలెక్టర్ అడిగారు. సుమారు రూ 3లక్షల నుంచి రూ. 3.5 లక్షల దాకా పలుకుతుందని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకుయోగ్యమైన భూమిని లబ్ధిదారులకు చూపించి వారు నచ్చితేనే కొనుగోలు చేయాలన్నారు. దళితులకు పంపిణీ చేసే భూములను అమ్మడానికి కొనడానికి వీల్లేదన్నారు. ఒక వేళ క్రయవిక్రయాలు జరిపినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూమిలేని ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఒకవేళ అర ఎకరం, ఎకరం భూమి ఉన్నవారికి సైతం ఆ భూమి మినహా మిగతా భూమి ని ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలి పారు. నల్లగొండ నియోజకవర్గ పరిధిలో హైదలాపురం గ్రామాన్ని భూపంపిణీకి ఎంపిక చేసినట్లు తెలిపారు. మొదటి విడత ఆగస్టు 15న మహిళా లబ్ధిదారులకు భూ పట్టాలను అందజేస్తామన్నారు. అనంతరం దళితులకు పంపిణీ చేసే భూమిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆర్డీఓ ఎండీ జహీర్, కనగల్ తహసీల్దార్ ఎం. వెంకన్న, ఆర్ ఐ ధర్మారెడ్డి, ఎంపీటీసీ కట్టెబోయిన నాగరాజు, వీఆర్ఓ రాంచందర్‌రావు, సర్వేయర్ శ్రీధర్ పాల్గొన్నారు. అలాగే నార్కట్‌పల్లి మండలం పల్లెపహాడ్ గ్రామంలో కూడా దళితులకు పంపిణీ చేయనున్న భూమిని కలెక్టర్ పరిశీలించారు. -
కుటుంబ సర్వే పకడ్బందీగా నిర్వహించాలి
రాంనగర్ :తెలంగాణ పునర్నిర్మాణంలో తొలి అడుగుకు ఉపయోగపడే సమగ్ర కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో మండల, పట్టణస్థాయి రిసోర్సు పర్సన్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేను ప్రభుత్వం ఒకే రోజు జరపడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కోరారు. రాబోయే కాలంలో తెలంగాణ ప్రభుత్వంలో అర్హులైన లబ్ధిదారుల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు ఈ సర్వే కీలకం కానుందన్నారు. ఎంత వ్యయ ప్రయాసల కోర్చి అయినా ఒక్క రోజే సర్వే పూర్తి చేసి డేటా ఎంట్రీ నిర్వహించి సర్వే ఫారాలను ఆర్డీఓలకు అందజేయాలన్నారు. జిల్లాలో 9 లక్షలకు పైగా కుటుంబాలుంటే 10 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయని, మరో 4 లక్షల మంది రేషన్‌కార్డులు కొత్తగా కావాలని కోరుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులన్నీ ప్రజలు పన్నుల రూపంలో చెల్లించేవని గ్రహించాలన్నారు. ప్రజా సంక్షేమానికి ఉపయోగపడేవిధంగా ఈ సర్వే దోహదపడుతుందని చెప్పారు. పింఛన్లు, గృహ నిర్మాణాలు, రేషన్‌కార్డులు, ఇతర లబ్ధి మొత్తం ఈ సర్వే డేటా ఆధారంగానే ప్రభుత్వం అమలు చేయనుందన్నారు. గతంలో చాలా రకాల సర్వేలు చేసినా ఈ సర్వేకు చాలా తేడా ఉన్నట్లు తెలిపారు. అవినీతి, అక్రమాలు చోటు చేసుకోకుండా సర్వే ద్వారా పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. గృహాల సర్వే విషయంలో వయస్సు నిర్ధారణ కోసం రేషన్‌కార్డు, ఓటర్ ఐడీ, ఆధార్‌కార్డులు పరిశీలించాలని అధికారులకు సూచించారు. సమాచార సేకరణ అనేది ఒక కళ అని, సమాచార సేకరణలో వృత్తి నైపుణ్యం ప్రదర్శించి సమగ్ర సమాచారం సేకరించాలని కోరారు. సర్వే కోసం ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు ఒక నోడల్ అధికారిని నియమిస్తామని తెలిపారు. ఎక్కువ నివాసాలు ఉన్న బ్లాకులకు సహాయ నోడల్ అధికారులను నియమిస్తామన్నారు. ఇద్దరు సహాయకులతో వెళ్లి నివాసాలకు నోటిఫైడ్ నంబరు కేటాయించి జాబితాలను ఎన్యుమరేటర్లకు అందజేయాలని సూచిం చారు. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 30 ఇళ్లు కేటాయిస్తామని, 9 లక్షల కుటుంబాలకు గాను 32 వేల మంది సిబ్బంది నియమిస్తున్నట్లు తెలిపారు. అలాగే మరో 5 శాతం అదనపు సిబ్బంది సేవలను వినియోగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీఓ కిషన్‌రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, మోహన్‌రావు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
రాంనగర్ :తెలంగాణ ఉత్సవాలు నిర్వహించిన తరహాలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాంస్కృతి సాహిత్యం ప్రతిబింబించేలా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌ను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలైన మన ఊరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే, హరితహారం కార్యక్రమాలపై స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో పొందుపర్చాలని చెప్పారు. వివిధ అభివృద్ధి సంక్షేమ శాఖలు, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని డీఆర్డీఏ పీడీని ఆదేశించారు. ఏజేసీ, జెడ్పీ సీఈఓలు సభ్యులుగా స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఉత్తమ అధికారులను, సిబ్బందిని అవార్డులకు ఎంపిక చేయాలన్నారు. పరేడ్ గ్రౌండ్లో 30 నిమిషాలపాటు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహించేలా డీఈఓ, డీపీఆర్ఓ, వ్యవసాయశాఖ జేడీ కమిటీలో ఎంపిక చేసిన ప్రదర్శనలు మాత్రమే ప్రదర్శించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి ఏర్పాట్లు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. తెలంగాణ సిద్ధాంత కర్త, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి తెలంగాణ ఏర్పడక ముందే మరణించిన ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినరోజు వేడుకలను ఈ నెల 6వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలల్లో, పాఠశాలలో ఘనంగా నిర్వహించాలని చెప్పారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా కేంద్రంలోని అన్ని కార్యాలయాలతో పాటు మండలస్థాయి కార్యాలయాలలోనూ, అదే విధంగా 11గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసే ప్రొఫెసర్ జయశంకర్ జయంతి రోజు వేడుకలకు అధికారులు హాజరుకావాలనిఆదేశించారు. ఈ నెల 19న తేదీన జరుగనున్న సమగ్ర కుటుంబ సర్వేకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఉపాధిహామి పథకం క్షేత్ర సహాయకులు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వయోజన విద్య కోఆర్డినేటర్లు, వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది జాబితాలను ఈ నెల 7వ తేదీ వరకు సిద్ధం చేసి 11వ తేదీన మండలస్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమాలకు సన్నద్ధం చేయాలన్నారు. పర్యవేక్షక అధికారులందరూ తమకు కేటాయించిన మండలాలకు వెళ్లి వార్డులు, గ్రామాలలో ఇంటింటికి వేసిన నోషనల్ నంబర్లను పరిశీలించాలని ఆదేశించారు. సమగ్ర కుటుంబ సర్వే కోసం ప్రతి గ్రామ పంచాయతీకి 1176 నోడల్ అధికారులను, 210 వార్డులకు మరో 210 నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే నేపథ్యంలో కుటుంబ యజయాని రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు, గ్యాస్ నంబరు, పింఛను, వయస్సు ధ్రువీకరణ, వికలాంగ ధ్రువీకరణ, పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్, కరెంట్ మీటర్, ఇతర వివరాలతో 19వ తేదీన సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారులు అనుమతి లేకుండా కార్యస్థానం వదిలి హైదరాబాద్ వెళుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఈ విషయంలో ఎంతమాత్రం ఉపేక్షించబోమని కలెక్టర్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏజేసీ వెంకట్రావు, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, డ్వామా పీడీ సునంద, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
నల్గొండ, సూర్యాపేట మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నికలు రేపటికి వాయిదా వేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్ చిరంజీవులు వెల్లడించారు. గురువారం నల్గొండలో కలెక్టర్ చిరంజీవులు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని వివిధ మున్సిపాలిటీలకు ఎన్నికైన వారి వివరాలను ఈ సందర్బంగా తెలిపారు. కోదాడ మున్సిపల్ ఛైర్మన్‌గా అనిత (కాంగ్రెస్), మిర్యాలగూడ మున్సిపల్ ఛైర్మన్ నాగలక్ష్మి (కాంగ్రెస్), భువనగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా లావణ్య (బీజేపీ) ఎన్నికైనట్లు ప్రకటించారు. అలాగే హుజూర్నగర్ నగర పంచాయతీ ఛైర్మన్‌గా జక్కుల వెంకయ్య (కాంగ్రెస్), దేవరకొండ నగర పంచాయతీ ఛైర్మన్‌గా మంజూ నాయక్ (కాంగ్రెస్)లు ఎన్నికైనట్లు తెలిపారు. -
పారిశుద్ధ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
- ఫ్లోరైడ్ విరుగుడుకు భూగర్భజలాలు పెంచాలి - కలెక్టర్ చిరంజీవులు - మల్లాపురంలో శ్రీసత్యసాయి మంచినీటి పథకం ప్రారంభం పెద్ద అడిశర్లపల్లి, న్యూస్‌లైన్, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చిరంజీవులు అన్నారు. పెద్దఅడిశర్లపల్లి మండ లం మల్లాపురంలో భగవాన్ శ్రీసత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సత్యసాయి ప్రేమామృతధార’ మంచినీటి పథకాన్ని ఆదివారం ఆయన ప్రారంభిం చారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డి నిర్మించుకోవాలని చెప్పారు. మురుగునీటి పారుదల కోసం నిర్మించిన డ్రెయినేజీలను శుభ్రంగా ఉంచాలన్నారు. ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించేందుకు భూ గర్భజలాలను పెంచాలన్నారు. ఎక్కువలో తులోనుంచి బోర్లద్వారా నీటిని తోడడం వల్ల ఫ్లోరిన్ సమస్య తీవ్రమవుతుందని చెప్పారు. సమస్య పరిష్కారానికి అన్ని గ్రామాల్లో ఇంకుడుగుంతలు నిర్మించాలని, చెట్లను పెంచాలని సూచించారు. సత్యసాయి సేవాసమితి 5 లక్షల వ్యయంతో స్వచ్ఛం దంగా గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. త్వరలో అన్ని గ్రామాలకు కృష్ణాజలాలు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారుల కోలాట బృందం, గ్రామస్తులు కలెక్టర్‌కు ఘనస్వాగతం పలి కారు. అనంతరం మహిళలు సాయివ్రతాలు ఆచరించారు. అలాగే భక్తులకు అన్నదానం చేశారు. సత్యసాయి మండల సేవాసమితి కన్వీనర్ కల్వకొల్లు శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణారావు, సేవాదళ్ కన్వీనర్ శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్ జి.రాజయ్య, ఎంపీడీఓ బి.నర్సింగరావు, సత్యసాయి సేవాసమితి సభ్యులతో పాటు సర్పంచ్ ఆర్.శంకర్‌నాయక్, జైపాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, కార్యదర్శి చలమయ్య, వెంకటయ్య, జగన్ తదితరులు పాల్గొన్నారు. -
అంబేద్కర్ కలలను సాకారం చేయాలి
కలెక్టర్ చిరంజీవులు ఘనంగా అంబేద్కర్ జయంతి నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,బడుగు బలహీనవర్గాలు ఉన్నత విద్యను అభ్యసించి పేదరికం నుంచి బయటపడడం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయాలని కలెక్టర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి సోమవారం కలెక్టర్ తోపాటు పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నేటికీ జిల్లాలో 33 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉండడం శోచనీయమన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవడానికి చదువుకున్న వారు కృషి చేయాలని చెప్పారు. ఎన్ని పండుగలు ఉన్నా బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ జయంతి మాత్రమే నిజమైన పండుగని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా అంబేద్కర్ యావత్ మానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచిన వ్యక్తి అని కొని యాడారు. మానవచరిత్రను మార్చిన మహనీయులలో గౌతమబుద్ధుడు, కారల్‌మార్క్స్ తోపాటు అంబేద్కర్ కూడా నిలిచారన్నారు. జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సాంఘిక దురాచారాలు, అంటరాని తనాన్ని సమాజం నుంచి పాలద్రోలడానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు బొర్ర సుధాకర్, కత్తుల నర్సింహ, ఎంఎన్ భూషి. బీసీ సంఘం నాయకులు రామరాజు,వైద్యుల సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి, కూతురు శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, సయ్యద్‌హాషం, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రత్నాకర్‌రావు, బీఎస్పీ నాయకులు సిద్దార్ధపూలే తదితరులు పాల్గొన్నారు. -
అన్నివిధాలా ఆదుకుంటాం
పెద్దవూర, న్యూస్‌లైన్: లైంగికదాడికి గురైన అభంశుభం తెలియని 12మంది బాలికలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం మండలంలోని పులిచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గల బాసోనిబావితండాను సందర్శించి బాధిత బాలికలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బాధిత చిన్నారులు, వారి తల్లిదండ్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బాలికలను ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పార్టీలకతీతంగా ఖండించాలి ఏనెమీది తండా సంఘటనను యావత్ సమాజం పార్టీలకు అతీతంగా ఖండించాలని మంత్రి జానారెడ్డి కోరారు. బాధితులను పరామర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ముక్కుపచ్చలారని చిన్నారులు, విద్యార్థినులు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న మానవ మృగాలను సమాజం నుంచి వెలివేయాలన్నారు. అమాయకులైన బాధిత చిన్నారులకు మానసిక గాయాలు లేకుండా చూసి వారికి గౌరవప్రదమైన స్థానంకల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలికలకు తగిన భద్రత కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అన్ని సౌకర్యాలున్న పాఠశాలల్లో చేర్పించి ఉన్నత విద్య పూర్తయ్యే వరకు ప్రభుత్వమే చదివిస్తుందని తెలిపారు. ఈమేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు, సంబందిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లైంగికదాడికి పాల్పడిన మానవరూపంలోని క్రూరుడికి విధించే శిక్ష ఇతరులకు గుణపాఠం అయ్యేలా చూస్తామన్నారు. మంత్రి వెంట కలెక్టర్ చిరంజీవులు, ఎస్పీ ప్రభాకర్‌రావు, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, మాజీ ఎంపీపీ కర్నాటి లింగారెడ్డి, పీసీసీ సభ్యుడు కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు కురాకుల అంతయ్యయాదవ్, హాలియా ఏఎంసీ చైర్మన్ రమావత్ శంకర్‌నాయక్, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. పరామర్శ లైంగిక దాడికి గురైన బాలికలను, వారి కుటుంబ సభ్యులను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు మాలె శరణ్యారెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నీలం సహానీ, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఐసీడీఎస్ జేడీ శ్యామసుందరి, పీడీ ఉమాదేవి, డ్వామా పీడీ కాలిందిని, ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. -
గ్రామదర్శిని..మళ్లీ తెరపైకి
చిలుకూరు, న్యూస్‌లైన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టే పథకాలను సక్రమంగా అమలు చేసేందుకు గ్రామదర్శనం కార్యక్రమం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో గ్రామదర్శిని పేరుతో జరిగిన కార్యక్రమాన్ని ఇప్పుడు గ్రామదర్శనంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమం తిరిగి శుక్రవారం నుంచి జిల్లాలో అమలు కానున్నది. ఈ మేరకు మండల స్థాయి అధికారులకు బుధవారం జిల్లా కలెక్టర్ చిరంజీవులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గత జిల్లా కలెక్టర్ ముక్తేశ్వరరావు ఈ పథకాన్ని 2012 ఫిబ్రవరిలో జిల్లాలో ప్రవేశపెటినా అశించిన స్థాయిలో అమలు కాలేదు. తిరిగి నూతనంగా వచ్చిన కలెక్టర్ చిరంజీవులు ఈ గ్రామదర్శనం పథకం పకడ్బందీగా అమలు చేసేందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. మండల పరిషత్ ప్రత్యేక అధికారి సమక్షంలో మండలంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని అక్కడ గ్రామదర్శనం కార్యక్రమం నిర్వహించాలి. గ్రామాల్లో పథకాల పనితీరును పర్యవేక్షించడం, ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంపొందించడం, మనంకోసం మనం కార్యక్రమం విజయవంతం చేయడం, గ్రామస్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించడం, ప్రభుత్వ పాఠశాలల పనితీరు, రహదారులు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, తాగునీరు తదితర పనులను పర్యవేక్షించి వాటిని సక్రమంగా అమలు చేయడమే గ్రామదర్శనం ప్రధాన ఉద్దేశ్యం. ప్రతి శుక్రవారం అమలు ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి శుక్రవారం అమలు చేస్తారు. కార్యక్రమానికి మండలస్థాయి అధికారుల నుండి గ్రామస్థాయి అధికారులు అందరూ హజరవుతారు. మండల పరిషత్ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈవో, మండల పశువైద్యాధికారి, ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, వ్యవసాయాధికారి, అంగన్వాడీ సూపర్వైజర్, ఉపాధిహమీ ఏపీఓ, ఐకేపీ ఏపీఎం, సాక్షర భారత్ మండల కోఆర్డినేటర్, హౌసింగ్, పంచాయితీ రాజ్, విద్యుత్ ఏఈలు తదితరులు పాల్గొంటారు. వీరేకాకుండా గ్రామస్థాయి అధికారులు పాల్గొంటారు. వీరంతా గ్రామంలో ప్రభుత్వ పథకాల అమలు తీరును పర్యవేక్షించి లోపాలను సవరించి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగులపై జవాబుదారీతనం పెరుగుతుంది.