‘కిష్టాపురం, చింత్రియాల, అడ్లూరు, వెల్లటూరు గ్రామాల ప్రజలు తాము నివసిస్తున్న ప్రాంతాలను వదిలి పునరావాస కేంద్రాలకు వెళ్లాలి...ప్యాకేజీ వెంటనే అందజేస్తాం’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులతో శుక్రవారం కలెక్టర్ కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఏపీప్రభుత్వం విడుదల చేసిన రూ. 20కోట్లు గ్రామాల వారీగా పంపిణీ చేస్తామని చెప్పారు.
కోదాడరూరల్ : పులిచింతల ప్రాజెక్టు పరిధిలోని ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ చెల్లిస్తామని, తమతమ ప్రాంతాలను ఖాళీ చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు కోరారు. శనివారం కోదాడ తహసీల్దార్ కార్యాలయంలో పులిచింతల ముంపు ప్రాంతాలైన కిష్టాపురం, చింత్రియాల, అడ్లూరు, వెల్లటూరు ప్రజలతో గ్రామాల వారీగా సమావేశమయ్యారు. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస ప్రాంతాల్లో అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని, ముంపు బాధితులు తమకు కేటాయించిన పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లో నీటిని నిల్వ చేయడానికి సిద్ధమైందని, దీంతో ముంపు గ్రామాలలోకి నీరు చేరుతున్నదని తెలిపారు. ప్రాజెక్ట్‌లో 11 టీఎంసీల నీటిని నిల్వచేయాలని అధికారులను ఆదేశించిందని, అ స్థాయిలో నీటిని స్టోరేజీ చేస్తే ముంపు గ్రామాలు 13 పూర్తిస్థాయిలో, 4 గ్రామాలు పాక్షికంగా మునిగిపోతాయని చెప్పారు.
అయితే మరో ఏడాది వరకు ప్రాజెక్ట్‌లో 7 టీఎంసీల నీటిని మాత్రమే నిల్వ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దీనిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పునరావాస నిర్వాసితులకు రూ.292 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు 172 కోట్ల రూపాయలను అందజేశామని, మిగిలిన రూ.120కోట్లు కూడా విడుదల చేసేం దుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రూ.20 కోట్లు విడుదల చేసిందని, వాటిని గ్రామాల వారీగా అందజేస్తామన్నారు. త్వరలోనే ముంపు గ్రామాల పర్యవేక్షణకు ఆర్డీఓ స్థాయి అధికారిని దత్తత అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. 18ఏళ్లు నిండిన వారికి నాటి ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటిస్తామని హామీ ఇచ్చిందని, దానిని 2013 నాటికి అమలు చేయాలని పలువురు ముంపువాసులు కలెక్టర్‌ను కోరారు. 2007లో ప్రాజెక్ట్ నిర్మాణం సందర్భంగా ఇచ్చిన హామీనే అమలు చేస్తామని, అది కూడా 18 ఏళ్లు నిండి విద్యార్థి కాకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రాప్రాంతంతో పనిదినాలను ఎక్కువగా చూపించారని, కూలిని రూ.161 చెల్లించారని, తమకు మాత్రం పనిదినాలు అనుకున్న ప్రకారం కల్పించలేదని, కూలిని రూ.97, రూ.110 చెల్లించారని పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కలెక్టర్ మాట్లాడుతూ అనుకున్న పనిదినాలను కల్పించి కూలి రేటును రూ.165 చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస ప్రాంతాలలో అధికారులు సరిగా వసతులు కల్పించడంలేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన శాఖల వారీగా మాట్లాడారు. పునరావాస కేంద్రాల్లోని సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, డీపీఓ కృష్ణమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివారెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, కోదాడ తహసీల్దారు పసుపులేటి రామకృష్ణ, ఆయా శాఖల డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు.
ప్యాకేజీ ఇస్తాం.. ఖాళీ చేయండి
Published Sun, Sep 21 2014 2:55 AM | Last Updated on Sat, Jun 2 2018 2:36 PM
Advertisement