సాక్షి, అమరావతి: వరద ఉధృతికి కొట్టుకుపోయిన పులిచింతల గేటు బిగింపు పనులు, మరమ్మతులు తుదిదశకు చేరుకున్నాయని పసిగట్టిన ‘ఈనాడు’ ఆదరాబాదరగా ఓ అడ్డగోలు కథనాన్ని అచ్చేసి చంకలు గుద్దుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక వంటకాన్ని సిద్ధం చేయాలనే ఆదుర్దాతో ‘పులిచింతల గేటు ఏర్పాటు ఎప్పటికి?’ అంటూ బురద చల్లేందుకు ప్రయత్నించింది.
మరో 15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా 30 శాతం పనులే జరిగాయంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది. గేట్ల బిగింపు పనులు ఇప్పటికే 90 శాతం పూర్తయ్యాయి. కాలినడక వంతెన పనులు 70 శాతం పూర్తి కాగా 23 పియర్ల కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ కూడా పూర్తైంది.
ఈనాడు ఆరోపణ: వరదలకు కొట్టుకుపోయిన 16వ గేటు స్థానంలో కొత్తది ఏర్పాటు, మరమ్మతుల పనులకు పరిపాలన ఆమోదం కోసం 9 నెలల సమయం పట్టింది.
వాస్తవం: ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిపుణుల కమిటీని నియమించింది. ప్రాజెక్టు పరిస్థితిపై సాంకేతికంగా మదింపు చేసి మిగిలిన 23 గేట్ల పనితీరును నిశితంగా పరిశీలించిన నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ చేయాలని సూచించింది.
కమిటీ సూచనల మేరకు జల వనరుల శాఖ రూపొందించిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. నిపుణుల కమిటీతో సమగ్ర అధ్యయనం జరిపించింది. పనులను రెండు భాగాలుగా విభజించి బెకెమ్ సంస్థకు అప్పగించారు. కాలినడక వంతెన పనులను స్వప్న కన్‌స్ట్రక్షన్స్‌కు కేటాయించారు.
ఆరోపణ: నిధులు ఇవ్వక పోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది.
వాస్తవం: గేట్లకు సంబంధించి రూ.1.59 కోట్లు, కాలినడక వంతెన పనులకు సంబంధించి రూ.1.29 కోట్ల బిల్లులను ప్రభుత్వం త్వరలో చెల్లించనుంది.
ఆరోపణ: గేటు తయారీ, బిగింపులో ఆలస్యం జరుగుతోంది.
వాస్తవం: గేటు తయారీలో అతి ప్రధానమైన ట్రూనియన్ బుష్ బేరింగ్‌లను జపాన్ నుంచి ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. గేటును పియర్స్‌కు బిగించడానికి అవసరమైన కాంక్రీట్ పనులు 90 శాతం పూర్తయ్యాయి. క్యూరింగ్‌కు 15 రోజులు పడుతుంది. గేటు తయారీ పూర్తయింది. మిగిలిన పియర్స్ కాంటీలివర్ భాగంలో కాంక్రీట్ గ్రౌటింగ్ పూర్తయింది.
15 రోజుల్లో గేటు బిగింపు పూర్తి కానుండగా ‘ఈనాడు’ 30 శాతం పనులే పూర్తయినట్లు అవాస్తవాలు అచ్చేసింది. కాలినడక వంతెన పనుల్లో కూడా 70 శాతం (16వ గేటు వరకూ) పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. లీకేజీలకు అడ్డుకట్ట వేయడానికి ప్రతి గేటుకు స్టాప్‌లాగ్ గేటు అమర్చి రబ్బర్ సీళ్లను అమర్చే పనులు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా వాటిని పూర్తి చేసి ఈ సీజన్‌లో పూర్తి సామర్థ్యం మేరకు 45.77 టీఎంసీలను నిల్వ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఫ్యాక్ట్‌చెక్ : ‘గేటు’పై ఈనాడు అడ్డగోలు అబద్ధాలు
Published Fri, Apr 21 2023 4:03 AM | Last Updated on Fri, Apr 21 2023 4:03 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment