సివిల్స్‌పై దృష్టి పెట్టండి | Focus on Civils | Sakshi
Sakshi News home page

సివిల్స్‌పై దృష్టి పెట్టండి

Published Sun, Aug 31 2014 10:46 PM | Last Updated on Mon, Oct 22 2018 7:42 PM

Focus on Civils

నేటి యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు బదులు సమాజసేవకు ఉపకరించే ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలపై దృష్టి సారించాలని నల్గొండ కలెక్టర్ చిరంజీవులు సూచించారు. సివిల్స్ పరీక్షలపై అవగాహన కోసం ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ మాటలన్నారు.
 
సాక్షి, ముంబై: నేటి యువతీయువకులు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కావడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర ఎన్నో రంగాలున్నప్పటికీ వాటిపై ఆసక్తి కనబర్చడం లేదని నల్లగొండ జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు అన్నారు. యూపీఎస్సీ, సీఎస్‌ఈ, ఎంపీఎస్‌సీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు మార్గదర్శనం చేసేందుకు ఓం పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం దీపక్ టాకీస్ సమీపంలో ఉన్న యశ్వంత్ భవన్ హాలులో సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవులు అనేక అంశాలపై విద్యార్థులకు సలహాలు సూచనలు ఇచ్చా రు.  
 
‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వంటి ఉద్యోగాలు సంపాదిస్తే కేవలం కార్యాలయంలో పనిచేయడానికే  పరిమితమవుతారు. అదే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాలు వస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశముంటుంది. లోకజ్ఞానం కూడా సంపాదించుకోవచ్చు’ అని అన్నారు. మరో ముఖ్య అతిథి ఐపీఎస్ అధికారి, ఠాణే జిల్లా జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీసు వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లపై కాకుండా చదువుపై దృష్టిసారిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనిస్తున్నారు. వాటివల్ల నష్టమే తప్ప లాభం లేదు. మీకు తెలియకుండా నే వారు ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సైట్లు చూస్తూ విలువైన కాలాన్ని వృథా చేస్తున్నారు. ఈ సమయాన్ని చదువుకునేందుకు కేటాయిస్తే మంచి భవిష్యత్ ఉం టుంది.
 
 మనం ఏ కాలేజీలో చదువుకున్నామో అదే కాలేజీకి ఒక ముఖ్య అతిథిగా వెళితే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒక్కసారి గుర్తుచేసుకోండి. మనం ఇతరుల ఆటోగ్రాఫ్ కోసం పాకులాడే బదులుగా మన ఆటోగ్రాఫ్ కోసం ఇతరులు ఎగబడేస్థాయికి ఎదగాలి. కన్నవారిని, గురువులను గౌరవించే పిల్లలకు మంచి భవిష్యత్ ఉంటుంది’ అని ఆయన వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమానికి హాజ రైన అతిథులకు పద్మశాలి సేవాసంఘం అధ్యక్షుడు పోతు రాజారాం, ప్రధాన కార్యదర్శి వేముల శివాజీ శాలువ, పుష్పగుచ్ఛాలు, మెమొంటోలు ఇచ్చి ఘనం గా సత్కరించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు అతిథులు, నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలన చేశారు.
 
 ఇటీవల తెలంగాణలో సకలజన సర్వే సక్రమంగా జరగలేదని, ఎన్యుమలేటర్లందరూ సక్రమంగా విధులు నిర్వహించనందున, మరోసారి సర్వే చేపట్టాలని కోరుతూ పోతు రాజారాం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కూరపాటి అరుణ (జెడ్పీటీసీ-నిజామాబాద్), ఎనుగందుల అనిత (జెడ్పీటీసీ-మోర్తాడ్),  జోగు సంగీత (జెడ్పీటీసీ-బాల్కొండ), పోతు నర్సయ్య (మండల అధ్యక్షుడు-ఆర్మూర్), జక్కని సంధ్యారాణి (ఎంపీటీసీ-ఏర్గట్ల), ఎనుగందుల అశోక్ (ఎంపీటీసీ-పాలెం), పెంటు గంగాధర్ (ఎంపీటీసీ-ముప్కాల్), చిలుక గోపాల్ (ఎంపీటీసీ-ముప్కాల్), తాళ్ల భూషణ్ (సర్పంచి-వన్నెల్ బి), గుర్రం నారాయణ (సర్పంచి-బోదేపల్లి), తాటికొండ శివకుమార్ (వ్యాపారవేత్త)ను సన్మానం పొందినవారిలో ఉన్నారు. ఈ సెమినార్‌లో ఐఏస్ అధికారి సంతోష్ రోకడే, ముంబై ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు సెవై రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు గుంటుక శైలజ , సిద్ధివినాయక్ మందిరం ట్రస్టుకు చెందిన ఏక్‌నాథ్ సంగం తదితరులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement