రెండు నెలల పింఛన్ ఇవ్వాల్సిందే | Must give two months' pension | Sakshi
Sakshi News home page

రెండు నెలల పింఛన్ ఇవ్వాల్సిందే

Published Wed, Dec 10 2014 3:41 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

రెండు నెలల పింఛన్ ఇవ్వాల్సిందే - Sakshi

రెండు నెలల పింఛన్ ఇవ్వాల్సిందే

సాక్షి ప్రతినిధి, నల్లగొండ  :సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రతి లబ్ధిదారుడికి రెండు నెలల పింఛన్ నగదు రూపంలో ఇవ్వాలని, ఎక్కడైనా లబ్ధిదారులకు రెండు నెలల పింఛన్ రాకుంటే తనకు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు చెబుతున్నారు. జిల్లాలో బుధవారం నుంచి పింఛన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, ఆహారభద్రత కార్డులు కూడా డిసెంబర్ చివరి కల్లా ఇస్తామని అంటున్నారాయన. జిల్లాలో వాటర్‌గ్రిడ్ ద్వారా ఫ్లోరోసిస్ సమస్యకు పరిష్కారం వస్తుందని, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో వచ్చే నెల నుంచి ప్రారంభిస్తామని, యాదగిరిగుట్టను త్వరలోనే టెంపుల్‌టౌన్‌గా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు కలెక్టర్. అదే విధంగా జిల్లాలో భూరికార్డుల నిర్వహణ సరిగా లేని కారణంగా,  టైటిల్ సమస్యలు వస్తున్నాయని, దీనిని నివారించేందుకుగాను త్వరలోనే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు. కొత్త రాష్ట్రంలో ఉద్యోగులు మరింత శ్రమించాలని, తెలంగాణ పునర్నిర్మాణం కోసం కొంత ఇబ్బంది అయినా అంకితభావంతో పనిచేయడం ద్వారా భావి తరాలకు మేలు చేయాలని అంటున్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, భవిష్యత్ ప్రణాళికలు, కార్యాచరణపై మంగళవారం ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
 
 సామాజిక పింఛన్ల పంపిణీ  ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి?
 పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం అవుతుంది. ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలోని 3.04లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ ఇస్తాం. ప్రతి లబ్ధిదారునికి నవంబర్, డిసెంబర్ నెలల పింఛన్ నగదు రూపంలో ఇవ్వాలని నిర్ణయించాం. జిల్లాలో ఎక్కడైనా ఎవరికైనా రెండు నెలల పింఛన్ ఇవ్వకుంటే కలెక్టరేట్‌లోని టోల్‌ఫ్రీనంబర్ 18004251445కు ఫిర్యాదు చేయవచ్చు. అదే విధంగా పింఛన్ల మంజూరుకు మరో 80వేల వరకు విజ్ఞప్తులు వచ్చాయి. వాటిని కూడా పరిశీలిస్తున్నాం. అందులో మరో 25వేల వరకు అర్హత సాధించవచ్చని అంచనా. అన్నీ కలిపితే జిల్లాలో 3.30లక్షల మందికి సామాజిక పింఛన్లు అందే అవకాశం ఉంది. అయితే, ఈ 25వేల మందికి ఈనెల 20-25 వరకు పింఛన్లు ఇస్తాం. ఎవరూ పింఛన్లు రాలేదని నిరాశపడొద్దు. పింఛన్లు, ఆహారభద్రత కార్డుల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ. అనవసర ఆందోళనకు గురయి దళారులను ఆశ్రయించవద్దు.
 
 ఆహార భద్రత కార్డుల పరిస్థితి ఏంటి?
 ఆహారభద్రత కార్డుల కోసం జిల్లాలో దాదాపు 11లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఆ దరఖాస్తుల పరిశీలన జరుగుతోం ది. ఇప్పటివరకు 7.24లక్షల దరఖాస్తులు పరిశీలించాం. అందులో 71 శాతం అంటే 5.14లక్షల దరఖాస్తులు అర్హత సాధించాయి. మిగిలిన ప్రక్రియను కూడా పూర్తి చేసి డిసెం బర్31కల్లా లబ్ధిదారుల తుదిజాబితా తయారుచేస్తాం. జనవరి1 నుంచి కొత్త కూపన్లపై రేషన్ ఇస్తాం. ఫిబ్రవరికల్లా కార్డులు కూడా వస్తాయి. గతంలో మాదిరిగా రేషన్‌బియ్య ంపై సీలింగ్ లేదు. ఎంతమంది కుటుంబ సభ్యులుంటే అంతమందికి ఆరుకిలోల చొప్పున బియ్యం కిలో రూపాయికి అందిస్తాం. అదే విధంగా జనవరి నుంచి సం క్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నా యి. ఇందుకోసం వార్డెన్ల నుంచి ఇండెంట్ తెప్పిస్తున్నాం.
 
 వాటర్‌గ్రిడ్ పైలాన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు? అసలు జిల్లాలో వాటర్‌గ్రిడ్ ప్రణాళికలేంటి? ఎప్పటివరకు ఈ ప్రణాళిక పూర్తవుతుంది?
 దీర్ఘకాలికంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న జిల్లాకు వాటర్‌గ్రిడ్ ద్వారా పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్నాం. వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాకు కృష్ణాజలాలు అందుతాయి. గతంలో తలసరి నీటి వినియోగం 40లీటర్లు కాగా, ఇప్పుడు 100 లీటర్లుగా పరిగణించి జిల్లాకు 8టీఎంసీల నీరు కావాలని అంచనా వేస్తున్నాం. ఇందుకోసం మూడు చోట్ల మేజర్‌గ్రిడ్‌లు, కొన్ని సబ్‌గ్రిడ్‌లు, ట్రంక్లయిన్స్, పైప్‌లైన్ల విస్తరణ, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణం చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను మొత్తం 3,500 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా. అయితే, పూర్తిస్థాయి ప్రణాళిక మరోవారం పది రోజుల్లో రెడీ అవుతుంది.
 
 యాదగిరిగుట్ట అభివృద్ధి కార్యాచరణ ఏమిటి?
 గుట్టను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలన్నది సీఎం కేసీఆర్ ఆలోచన. అందుకు అనుగుణంగా రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటికే ఆలయ భూమి 130 ఎకరాలుంది. మరో 300 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇస్తున్నాం. మిగిలిన 1500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ సేకరించాల్సిన భూమిని కూడా గుర్తించాం. త్వరలోనే దేవస్థాన నిర్వహణ కమిటీని కూడా ప్రకటించవచ్చు. అదే విధ ంగా యాదగిరిగుట్టను టెంపుల్‌టౌన్‌గా ప్రకటిస్తూ త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సే యోచనలో ఉంది.
 
 హరిత హారం ఏ దశలో ఉంది?
 హరితహారం కింద జిల్లాలో 14.40కోట్ల మొక్కలు నాటాల ని నిర్ణయించాం. ఇందుకోసం 480నర్సరీలను ఎంపిక చే శాం. ఈ నర్సరీలకు భూమి కూడా గుర్తించాం. వనసేవకులకు శిక్షణనిస్తున్నాం. ఔట్‌సోర్సింగ్‌ద్వారా కొందరు ఉ ద్యోగులను నియమించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో భా గంగా 50శాతం టేకు మొక్కలను నాటాలని నిర్ణయించాం. మిగిలినవి పెరటిమొక్కలు, ఇతర మొక్కలను నాటుతాం.
 
 జిల్లాలో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ఇంకా ప్రారంభం కానట్టుంది?
 జిల్లాలో మిషన్‌కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ వచ్చే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పటివరకు 25 చెరువులకు టెండర్లు పూర్తయ్యాయి. జిల్లాలోని 4600 చెరువులకు గాను 900 చెరువులను ఈ ఏడాది పునరుద్ధరిస్తాం. టెండర్లు పూర్తయితే కానీ ఖర్చు లెక్క రాదు.
 
 దళితులకు భూపంపిణీ నత్తనడకన నడుస్తోందా?
 ఈ ప్రక్రియలో కొంత వెనుకబాటు ఉన్న మాట వాస్తవమే. అయితే, ఇందుకు భూసమస్యలున్నాయి. భూమిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండి, అమ్మడానికి పట్టాదారులు సిద్ధంగా ఉన్నా టైటిళ్లు సరిగా లేవు. ఈ టైటిళ్ల సమస్య కారణంగా కొంత జాప్యం జరుగుతోంది. అసలు జిల్లాలో భూరికార్డుల నిర్వహణ కూడా అంత సమగ్రంగా లేదు. అందుకే జనవరి 16 నుంచి మార్చి 30వరకు రెవె న్యూ సదస్సులు పెట్టబోతున్నాం. ఆ సదస్సుల్లో రికార్డుల ను కంప్యూటరీకరించే ప్రక్రియకు పూనుకుంటున్నాం. దళి తులకు భూపంపిణీకి సంబంధించి  ఇప్పటివరకు 66 ఎకరాల రిజిస్ట్రేషన్ పూర్తయింది. మరో 60 ఎకరాలు ప్రాసెస్‌లో ఉంది.
 
 వరుసగా వస్తున్న కార్యక్రమాలతో ప్రభుత్వ ఉద్యోగులపై పనిఒత్తిడి కనిపిస్తోంది? మీపై కూడా కొందరు ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నట్టున్నారు?
 నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం కనుక అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తోంది. ఈ కార్యక్రమాలను శరవేగంతో అమలు చేయడంతో పాటు అమలులో పారదర్శకత ఉండాలి. ఇందుకు ఉద్యోగులు మరింత శ్రమ చేయాల్సి వస్తోంది. ఇది కొందరికి ఇబ్బంది అనిపించినా తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను పూర్తి చేయాలంటే ఒత్తిడి అనివార్యం. అయినా, పోరాడి సాధించుకున్న రాష్ట్రం కోసం అంకితభావం,  ఉత్సాహంతో పనిచేయడం ఉద్యోగుల బాధ్యత. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మనస్ఫూర్తిగా స్వీకరించి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం అంకితభావంతో పనిచేసినప్పుడే భావితరాలకు మేలు చేసిన వాళ్లవుతాం. ఈ అసంతృప్తి సమస్య అన్ని జిల్లాల్లో ఉంది. మన దగ్గరే కాదు. అయినా, అన్ని ప్రభుత్వ పథకాల అమలులో మనమే ముందున్నాం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement