నల్లగొండ : అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్
కలెక్టర్ చిరంజీవులు
ఘనంగా అంబేద్కర్ జయంతి
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్,బడుగు బలహీనవర్గాలు ఉన్నత విద్యను అభ్యసించి పేదరికం నుంచి బయటపడడం ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయాలని కలెక్టర్ చిరంజీవులు పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక డీఈఓ కార్యాలయం ఎదుట గల అంబేద్కర్ విగ్రహానికి సోమవారం కలెక్టర్ తోపాటు పలువురు అధికారులు, దళిత సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నేటికీ జిల్లాలో 33 శాతం మంది నిరక్షరాస్యులుగా ఉండడం శోచనీయమన్నారు. ప్రతి ఒక్కరు చదువుకోవడానికి చదువుకున్న వారు కృషి చేయాలని చెప్పారు. ఎన్ని పండుగలు ఉన్నా బడుగు, బలహీన వర్గాలకు అంబేద్కర్ జయంతి మాత్రమే నిజమైన పండుగని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకే కాకుండా అంబేద్కర్ యావత్ మానవాళికి ఆదర్శమూర్తిగా నిలిచిన వ్యక్తి అని కొని యాడారు. మానవచరిత్రను మార్చిన మహనీయులలో గౌతమబుద్ధుడు, కారల్‌మార్క్స్ తోపాటు అంబేద్కర్ కూడా నిలిచారన్నారు.
జిల్లాలో అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. ఎస్పీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని సాంఘిక దురాచారాలు, అంటరాని తనాన్ని సమాజం నుంచి పాలద్రోలడానికి పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేసీ హరిజవహర్‌లాల్, ఏజేసీ వెంకట్రావ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వెంకటనర్సయ్య, జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, దళిత సంఘాల నాయకులు బొర్ర సుధాకర్, కత్తుల నర్సింహ, ఎంఎన్ భూషి.
బీసీ సంఘం నాయకులు రామరాజు,వైద్యుల సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, గోలి అమరేందర్‌రెడ్డి, కూతురు శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, సయ్యద్‌హాషం, సీపీఐ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి, రత్నాకర్‌రావు, బీఎస్పీ నాయకులు సిద్దార్ధపూలే తదితరులు పాల్గొన్నారు.