ప్రణాళికలు సిద్ధం చేయాలి | Plans should be prepared said Collector Gaurav Uppal | Sakshi
Sakshi News home page

ప్రణాళికలు సిద్ధం చేయాలి

Published Tue, Jun 6 2017 2:17 PM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM

ప్రణాళికలు సిద్ధం చేయాలి - Sakshi

ప్రణాళికలు సిద్ధం చేయాలి

► కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌
 
నల్లగొండ టూటౌన్‌ : హరితహారం కింద మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాకు 2 కోట్ల 22 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్ణయించామని, దానికి అనుగుణంగా గ్రామ పంచాయతీల్లో 40 వేల మొక్కలు నాటే విధంగా ప్రణాళిక తయారు చేసుకుని గంతలు తీయించాలని ఆదేశించారు.
 
మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న భూములను గుర్తించా లని, గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు. 13 నుంచి 17 వరకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, బడి బాట కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారులు విధిగా పాల్గొనాలని ఆదేశించారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పిం చాలని సూచించారు. రంజాన్‌ పండు గ సందర్భంగా జిల్లాలో 16న దుస్తుల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, 18వ తేదీన ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో నాలుగు మసీదులను ఎంపిక చేసి  కార్యక్రమాలను నిర్వహించే విధంగా మసీద్‌ కమిటీలతో సమావేశం నిర్వహించి గత రెండేళ్లలో లబ్ధిపొందని వారిని గుర్తించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ నారాయణరెడ్డి, డీఆర్‌డీఓ అంజయ్య పాల్గొన్నారు.
 
అర్జీలకు పరిష్కారం చూపాలి
ప్రజావాణిలో ప్రజల నుంచి వచ్చే ఆర్జీలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజావాణి ద్వారా ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు ప్రతి ఆర్జీదారుని సమస్య పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మన మీద నమ్మకంతో ఇక్కడి వచ్చి ఆర్జీలు ఇస్తున్నారని, ఒక వేళ సమస్య పరిష్కారం కాకున్నా దానిపై స్పష్టమైన వివరాలతో ఆర్జీదారునికి సమాధానం పంపించాలని ఆదేశించారు. మండల కార్యాలయాల్లో చిన్న పనుల కోసం ప్రజలను తిప్పుకోకుండా సంబంధిత శాఖల జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
నాలెడ్జ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ప్రారంభం
నల్లగొండ : జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు దిక్సూచిగా నిలిచేందుకు జిల్లా జ్ఞాన, ఆవిష్కరణ కేంద్రం (డిస్ట్రిక్‌ నాలెడ్జ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌) ప్రారంభమైంది. అభివృద్ధి ప్రణాళికలకు తోడు జిల్లాలో నెలకొన్న సమస్యలను అనుభవజ్ఞులైన అధ్యాపకులతో పరిశోధనల ద్వారా అధ్యయనం చేసేందుకు ఈ కేంద్రం వేదికగా నిలవనుంది. జిల్లా అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించినందున సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ చేతుల మీదుగా నాలెడ్జ్‌ సెంటర్‌ ప్రారంభించారు.
 
ప్రభుత్వ కార్యక్రమాల గురించి జిల్లా యంత్రాంగానికి అవగాహన కలిగించడంతో పాటు సరికొత్త ఆలోచనల ద్వారా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించేందుకు వీలుగా ఈ కేంద్ర ం పనిచేయనుంది. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే డేటాను విశ్లేషించి దాని ద్వారా ప్రతి అంశంపై తగు నిర్ణయాలు తీసుకుని ప్రణాళికలు సిద్ధం చేసేందుకు ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్‌ వివరించారు. ప్రభుత్వ శాఖల్లో డేటాను విశ్లేషించేందుకు నాలెడ్జ్‌ సెంటర్‌ పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో లోటుపాట్లను సవరించి తగిన సలహాలు, సూచనలు చేయవచ్చన్నారు.  
 
బీసీ గురుకులం పరిశీలన
జిల్లా కేంద్రంలో రెడ్డి హాస్టల్‌లో ఏర్పాటు చేసిన బీసీ గురకుల పాఠశాలను ప్రభుత్వ సంక్షేమ సలహాదారు రామ్‌లక్ష్మణ్‌తో కలిపి బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అశోక్‌కుమార్‌ పరిశీలించారు. కార్యక్రమంలో సెక్రటరీ మల్లయ్యబట్టు, కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్, కన్వీనర్‌ శోభ, బీసీ సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణచారి పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement