అధికారులు సమన్వయంతో పనిచేయాలి
నల్లగొండ క్రైం :జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేసి.. ప్రమాద రహిత జిల్లాగా మార్చాలని కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పిలుపునిచ్చారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆయన ఎస్పీ ప్రకాశ్‌రెడ్డితో కలిసి జాతీయ, రాష్ట్ర, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, జీఎంఆర్ రహదారుల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల్లో ప్రమాద స్థలాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దయ్యాలగండి వద్ద జరిగిన సంఘటనపై కలెక్టర్ ఆరా తీశారు. రోడ్డు వెడల్పు లేదని, రేడియం లైట్స్, సైన్ బోర్డులు, సమ్మక్క–సారక్క నుంచి విజయ్ విహార్ వరకు ఎలాంటి హెచ్చరిక బోర్డులను ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాటు చేయలేదని సీఐ వివరించారు. ఆ తర్వాత కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రమాదంలో హోంగార్డు, సామాన్య పౌరులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసినప్పుడు.. రోడ్డు భవనాల శాఖాధికారులుగా నిర్లక్ష్యం వహించినందుకు మీపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించారు.
కనీస జాగ్రత్త చర్యలు, సూచన బోర్డులు ఏర్పాటు చేయకపోతే మీరేం చేస్తున్నట్లు.. ప్రాణాలు పోతే కొన్ని కుటుంబాలు రోడ్డున పడతాయి.. ఒక్కసారి ఆలోచించండి సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సంఘటనలు జరగవన్నారు. ఏ రోడ్డులో ప్రమాద స్థలాలున్నాయో గుర్తించి.. పరిష్కారాలు సూచిస్తూ నివేదిక అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేసిన ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి, ఎస్‌ఐ శ్రీనయ్యను, హరితాహారంలో మొక్కలు పెంచినందుకు ఎస్‌ఐ రాఘవేందర్, గౌరీనాయుడు, సతీష్‌కు కలెక్టర్ బహుమతులు అందజేశారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వీడియోగ్రఫి పోటీల్లో విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. సమావేశంలో డీటీసీ చంద్రశేఖర్‌గౌడ్, ఓఎస్డీ వెంకటేశ్వర్లు, జిల్లా ఫారెస్ట్ అధికారి శాంతారామ్ పాల్గొన్నారు.