ప్రస్తుత జెడ్పీ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత ఇదే మొదటిది చిరంజీవులు కలెక్టర్‌గా ఉన్నప్పుడు కొత్త కమిటీకి సన్నాహాలు మళ్లీ ఉపసంహరణ.. అప్పటి నుంచీ ఊసే లేని కమిటీ మూలుగుతున్న రూ.కోటికి పైగా నిధులు మారిన నలుగురు సూపరింటెండెంట్లు.. ఇద్దరు కలెక్టర్లు మందుల కొనుగోళ్లకూ ఇబ్బందులు 150 పడకల ఆస్పత్రి విస్తరణకు గ్రహణం నేడు ఏం తీర్మానాలు చేస్తారో...?
సాక్షి, నల్లగొండ : జిల్లా కేంద్ర ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఎట్టకేలకు ఖరారైంది. అప్పుడెప్పుడో జిల్లా పరిషత్ చైర్మన్‌గా కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నప్పుడు 2013లో సమావేశం జరగగా.. మళ్లీ నాలుగేళ్ల తర్వాత ముహూర్తం కుదిరింది. నిత్యం వేలాది మంది రోగులకు సేవలందించే ఈ ఆస్పత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు జిల్లా పరిషత్ చైర్మన్ అధ్యక్షతన ప్రతి ఆరు నెలలకోసారి కమిటీ సమావేశం నిర్వహించాలి. ఆస్పత్రి నిర్వహణతోపాటు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష, కొత్త అభివృద్ధి పనుల మంజూరు, ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై ఇందులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి.
సుమారు 48 నెలలుగా సమావేశం జరగకున్నా.. పట్టించుకునే నాథుడే లేడు. జెడ్పీ కొత్త పాలకవర్గం ఏర్పాటైనప్పటి తొలినాళ్లలో రాజకీయ సమస్యలు ఎదురయ్యాయి. ఆ తర్వాత తొలగిపోయినప్పటికీ ఈ సమావేశం గురించి ఆలోచన కూడా చేయలేదు. ఫలితంగా ఆస్పత్రి అభివృద్ధి కుంటుపడగా.. ఉమ్మడి జిల్లాలోని రోగులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మందులు, సిరంజీల కొనుగోళ్లకు ఈ కమిటీ ఆమోదం తెలపాల్సిన పరిస్థితుల్లోనూ సమావేశం నిర్వహించకపోవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలో బుధవారం జరిగే సమావేశంలో ఏం తీర్మానాలు చేస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కొత్త కమిటీ వేసినా...
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చిరంజీవులు కలెక్టర్‌గా ఉన్న సమయంలో కొత్త కమిటీ వేసే ప్రయత్నం జరిగింది. అప్పట్లో కమిటీ చైర్మన్‌గా ఉండాల్సిన జిల్లా పరిషత్ చైర్మన్‌తోపాటు స్థానిక ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు ప్రతిపక్షంలో ఉండడంతో ఆ ప్రయత్నం సఫలం కాలేదు. కొత్త కమిటీ నియామకానికి ఉత్తర్వులు వచ్చినప్పటికీ..
రాజకీయ కారణాలతో విరమించుకోవాల్సి వచ్చింది. ఇక.. ఆ తర్వాత ఆ కమిటీ ఊసే లేకుండా పోయింది. జిల్లా పరిషత్ చైర్మన్‌తోపాటు స్థానిక ఎంపీ అధికార పార్టీలో చేరినప్పటికీ.. ఆ కమిటీ ప్రయత్నమే జరగలేదు. ఈ నాలుగేళ్లలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి నలుగురు సూపరింటెండెంట్లు మారారు. ఇద్దరు కలెక్టర్లు కూడా మారిపోయారు. అయితే.. జిల్లాల విభజన అనంతరం నల్లగొండ కలెక్టర్‌గా డాక్టర్ గౌరవ్‌ఉప్పల్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లా కేంద్ర ఆస్పత్రిపై కొంత పర్యవేక్షణ పెరిగింది. స్వయంగా కలెక్టర్ డాక్టర్ కావడంతో ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజే జిల్లా కేంద్ర ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు.
ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు ఆస్పత్రికి వెళ్లి స్వయంగా పరిశీలించిన కలెక్టర్ వారం వారం క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆస్పత్రులపై శ్రద్ధపెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ చొరవచూపి సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నేడు జరిగే సమాశానికి జిల్లా పరిషత్ చైర్మన్, కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీపీ, ఆస్పత్రి పరిధిలోని స్థానిక కౌన్సిలర్, మహిళా సమాఖ్య, స్వచ్ఛంద సంస్థ సభ్యులు, ఆస్పత్రి సూపరింటెండెంట్, ఆర్‌ఎం, డీసీహెచ్‌లు హాజరుకానున్నారు.
సమస్యలే.. సమస్యలు
ఆస్పత్రిలో 250 పడకల సామర్థ్యం ఉంటే.. నిత్యం 300 నుంచి 400 మంది రోగులు రోజూ ఇన్‌పేషెంట్లుగా వస్తుంటారు. ఓపీ సేవల కోసం మరో 400 మంది వరకు వస్తున్నారు. అత్యవసర సమయాల్లో జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి వచ్చే వారి సంఖ్య తక్కువేమీ కాదు.
జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రసూతి అంటేనే హడలిపోయే పరిస్థితి ఉంది. ప్రసూతి సేవల కోసం రోజూ 70 మంది వరకు మహిళలు వస్తుండగా.. కనీసం 10 కాన్పులు జరుగుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రసూతి కేంద్రంలో పడకల సామర్థ్యం 40 నుంచి 50 మాత్రమే. దీంతో గర్భిణులు, బాలింతలకు నేలపైనే వైద్య సేవలందించాల్సి వస్తోంది.
ఆస్పత్రిలో సిరంజీలు, సెలైన్ బాటిళ్లు లేవని రోగులు చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తామే బయటి నుంచి కొనుగోలు చేస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి.
కలెక్టర్ అనుమతి తీసుకుని అత్యవసర మందులు కొనుగోలు చేస్తున్నప్పటికీ.. అవసరమైన మరికొన్ని మందులను రోగులు బయటి నుంచి కొనుగోలు చేయక తప్పడం లేదు.
అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించకపోవడంతో మరో 150 పడకల విస్తరణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి.
మూలుగుతున్న రూ.కోటి నిధులు
ప్రభుత్వం ఇచ్చే ఫండ్‌తోపాటు ఆరోగ్యశ్రీ సేవల కింద 20 శాతం నిధులు వస్తున్నప్పటికీ.. కమిటీ సమావేశం కాని కారణంగా ఖర్చు చేయలేని పరిస్థితి నెకొంది. దీంతో రూ. కోటికిపైగా నిధులు ఆస్పత్రి ఖజానాలో మూలుగుతున్నాయి. రూపాయి కూడా ఖర్చు చేయలేని పరిస్థితుల్లో ఆస్పత్రి విభాగాలు కొట్టుమిట్టాడుతున్నాయి. ఎమర్జెన్సీ వార్డుతో పాటు ఆపరేషన్ థియేటర్‌లో చెడిపోయిన ఏసీలను బాగు చేయించుకోవడానికి 5 నుంచి 6 నెలల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది.
ఎన్నాళ్ల్లకో..!
Published Wed, Feb 8 2017 3:24 AM | Last Updated on Thu, Mar 21 2019 8:23 PM
Advertisement
Advertisement