
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లాల విభజన తర్వాత ఏడాదిలో అన్ని రంగాల్లో .. అన్నిశాఖల సమన్వయంతో ప్రగతి సాధించామని, పలు సంక్షేమ పథకాల్లో రాష్ట్రంలోనే జిల్లా ముందంజలో ఉందని.. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది కూడా నిర్దేశించిన టార్గెట్లు పూర్తిచేస్తామని కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ అన్నారు. జిల్లా విభజన జరిగి ఏడాది అయిన సందర్భంగా ఆయన బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ప్రగతిని వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళనలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, ఇప్పటివరకు 105 గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయితే.. 40 గ్రామాల్లో ఎలాంటి తప్పులు లేకుండా రికార్డులు సిద్ధమయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ బృందాల పనితీరు ప్రశంసనీయమని, రైతుల సహకారం అభినందనీయమని కొనియాడారు. ప్రక్షాళన కార్యక్రమంతా మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. గొర్రెల పంపిణీలో రాష్ట్రంలో.. జిల్లా రెండో స్థానంలో ఉందని తెలిపారు. ఇప్పటివరకు 7,368 యూనిట్లు పంపిణీ చేశామని, రీసైక్లింగ్ చేయవద్దంటూ పోలీసులు, సీనియర్ అధికారుల బృందాలతో లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అటవీ విస్తీర్ణం 9 శాతం మాత్రమే ఉందని, ఈ ఏడాది 1.75 కోట్ల మొక్కలను హరితహారం కింద నాటామన్నారు.
ఈ ఏడాది 2 వేల డబుల్‌బెడ్ రూం ఇళ్లు టార్గెట్‌గా పెట్టుకుంటే, ఇప్పటివరకు 600 పైగా ఇళ్లకు పునాదులు పడ్డాయని పేర్కొన్నారు. గతంలో నిర్మించిన 15 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులకు త్వరలోనే బిల్లులు చెల్లిస్తామని ప్రకటించారు. మిషన్ కాకతీయతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. పత్తి రాష్ట్రంలోనే ఎక్కువగా మన దగ్గర సాగు చేశారని, 4.50 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశామన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయించి మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం వేగవంతంగా నడుస్తుందని, 1,700 ఆవాసాలకు మంచినీళ్లు అందించడం ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. అమృత్ పథకంతో నల్లగొండ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు రూ.150 కోట్లు వచ్చాయని, దేవరకొండకు రూ 40 కోట్లు మంజూరైతే ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. డిండి ప్రాజెక్టు విషయంలో నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజి ఇస్తున్నామన్నారు.
అదుపులో శాంతిభద్రతలు
ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిఘా వ్యవస్థను పటిష్టం చేయడంతో జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. జిల్లా అంతటా 510 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇంకా అవసరమున్న పట్టణాల్లో త్వరలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 15 షీంటీలు ఉన్నాయని, 48 గ్రామాలను పోలీస్ శాఖ దత్తత తీసుకొని సామాజిక దురాచారాలపై అవగాహన కల్పిస్తుందన్నారు. జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ భూ రికార్డుల ప్రక్షాళన పారదర్శకంగా జరుగుతుందన్నారు. డిండి ప్రాజెక్టు భూ సేకరణ కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎఫ్‌ఓ శాంతారాం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment