మూసాపేట: వచ్చేది మా ప్రభుత్వమే.. కాబోయే సీఎంను.. అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా అంటూ మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి వైపు వేలు చూపిస్తూ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఆహ్వానం పంపలేదని కలెక్టర్‌పై చిందులు తొక్కారు. దీంతో కలత చెందిన కలెక్టర్ సభలో మొహం చిన్నబుచ్చుకున్నారు. కూకట్‌పల్లి వైజంక్షన్‌లో శనివారం నిర్వహించిన అంబేడ్కర్ జయంత్యుత్సవాల సభ ఈ వివాదానికి వేదికైంది. సభ కొనసాగుంతుండగా వేదిక వద్దకు సర్వే వచ్చారు. ఆ సమయంలో కలెక్టర్ ప్రసంగిస్తుండగా దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు నపారి చంద్రశేఖర్ స్టేజీపైకి పిలవడంతో సర్వే వెళ్లి ఆసీనులయ్యారు. కలెక్టర్ ప్రసంగం ముగియడంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని మాట్లాడాల్సిందిగా కోరారు.
దీంతో మెట్రో ఎండీ మాట్లాడుతుండగా మధ్యలో సర్వే సత్యనారాయణ కలెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. కలెక్టర్ స్పందిస్తూ ఇది అధికారిక కార్యక్రమం అని, ప్రొటోకాల్ ప్రకారం పిలిచినట్లు చెప్పారు. అధికారిక కార్యక్రమం అయితే ప్రభుత్వ పథకాలు ఎందుకు చెబుతున్నావంటూ సర్వే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంవీ రెడ్డి ప్రతిస్పందిస్తుండగానే.. ‘నో మోర్ ఆరగ్యమెంట్.. మా ప్రభుత్వం వస్తే నేనే సీఎం’ అంటూ వాగ్వాదానికి దిగారు. ఈక్రమంలో సర్వేను మాట్లాడాల్సిందగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆయనకు మైక్‌ను అందించారు. సర్వే సత్యనారాయణ మైక్‌ను అందుకుంటూనే.. ‘అందరి లెక్కలు తీస్తున్నా.. మీ సంగతి చూస్తా’ అంటూ ప్రసంగం ప్రారంభించారు.
బీజేపీ దళితుల పట్ల వివక్ష చూపిస్తోందని, ఇలాగే చేస్తే దళికిస్తాన్ అని ప్రత్యేక దేశం కోరుతాం.. ఖబడ్దార్ మోదీ అని హెచ్చరిస్తుండగా.. దళిత ఐక్యవేదిక అధికార ప్రతినిధి కట్టా నర్సింగరావు కల్పించుకుని ఇది పార్టీ సమావేశం కాదని, అంబేడ్కర్ గురించి చెప్పాలని చేతులు జోడించి వేడుకున్నారు. దీంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కల్పించుకుని రాజకీయాలు మాట్లాడవద్దని కలెక్టర్‌కు సూచించిన మీరే రాజకీయాలు మాట్లాడితే ఎలా అంటూ సర్వేను ప్రశ్నించారు. సభను తప్పుదోవపట్టించేలా వ్యవహరించడంపై సర్వేను ఎమ్మెల్యే నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకులు సైతం వేదికపైకి చేరడంతో సభ రసాభాసగా మారింది.
తోపులాటలో కలెక్టర్‌కు రక్షణగా నిల్చొన్న ఆర్‌ఐ అశ్విన్‌కుమార్ ముక్కుకు గాయాలయ్యాయి. మైక్‌లు విరిగిపోయాయి. దీంతో డీసీపీ వెం కటేశ్వర్‌రావు, ఏసీపీ భుజంగరావు వేదికపైకి చేరుకున్న దళిత నాయకులను, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నాయకులను అదుపు చేసి వివాదం సద్దుమణిగేలా చూశారు. తనను అకారణంగా దూషించడంతో కలత చెందిన కలెక్టర్ రెండు చేతులు జోడించి సర్వేకు మొక్కి కంటతడి పెట్టుకుంటూ సభలోంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సర్వే సత్యనారాయణ నిష్క్రమించారు. అందరూ వెళ్లిపోవడంతో సభ అర్ధంతరంగా ముగిసింది.
సర్వేపై కేసు నమోదు..
కేపీహెచ్‌బీ కాలనీ: ఈ ఘటనపై తహసీల్దార్ నాగరాజు ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సీఐ వడ్డే ప్రసన్నకుమార్ తెలిపారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డితో సర్వే సత్యనారాయణ వాగ్వాదానికి దిగారని, కలెక్టర్‌కు రక్షణగా వచ్చిన తహసీల్దార్ నాగరాజు, ఆర్‌ఐ అశ్విన్‌కుమార్‌లపై దాడికి పాల్పడ్డారని తహసీల్దార్ ఫిర్యాదు మేరకు సర్వే సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
‘సర్వే’పై చర్యలు తీసుకోండి: రెవెన్యూ ఉద్యోగుల డిమాండ్
కేపీహెచ్‌బీకాలనీ: మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని మేడ్చల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేశారు. శనివారం సర్వే సత్యనారాయణ చర్యలను నిరసిస్తూ తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. కూకట్‌పల్లిలో జరిగిన అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో కలెక్టర్ ఎంవీ రెడ్డిపై దుర్భాషలాడటం, బెదిరించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఆర్‌ఐపై అకారణంగా చేయి చేసుకోవడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సర్వే సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏసీపీ భుజంగరావు, సీఐ ప్రసన్నకుమార్‌లకు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ కలెక్టర్‌ల అసోసియేషన్ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్‌ల సంఘం అధ్యక్షుడు గౌతంకుమార్, ఆర్డీఓ మధుసూదన్, తహసీల్దార్ నాగరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment