వాషింగ్టన్: భారత రాజ్యాంగ రూపశిల్పి బీఆర్ అంబేద్కర్ అత్యంత ఎత్తయిన విగ్రహాన్ని అమెరికా రాజధాని వాషింగ్టన్ శివారులోని మేరీల్యాండ్‌లో ఆవిష్కరించారు. అంబేడ్కర్ వర్థంతి రోజైన ఈ నెల 14వ తేదీన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ ప్రెసిడెంట్ రామ్ కుమార్ 19 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’గా పిలుచుకునే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి 500 మందికి పైగా భారతీయ అమెరికన్లతోపాటు, భారత్, తదితర దేశాల నుంచి కూడా తరలివచ్చారు.
‘మేం దీనిని సమానత్వ విగ్రహం అని పిలుస్తున్నాం. అసమానత్వమనే సమస్య భారతదేశంలో మాత్రమే కాదు, ప్రతిచోటా వివిధ రూపాల్లో ఇది ఉనికిలో ఉంది’అని ఈ సందర్భంగా రామ్ కుమార్ అన్నారు. ఈ విగ్రహాన్ని ప్రఖ్యాత శిల్పి రామ్ సుతార్ రూపొందించారు. గుజరాత్‌లో నర్మదా తీరాన ఏర్పాటైన సర్దార్ పటేల్ విగ్రహం ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ని రూపొందించింది కూడా ఈయనే. అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు సరిగ్గా 22 మైళ్ల దూరంలో ఉన్న అకోకీక్ టౌన్‌షిప్‌లోని 13 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో బుద్ధా గార్డెన్‌తోపాటు లైబ్రరీ, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ సెంటర్ ఆవరణలోనే అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు.
Comments
Please login to add a commentAdd a comment