కంప్యూడర్!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ మరింత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఆసరా’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పింఛన్ల పంపిణీకి అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా లబ్ధిదారులను ఎంపిక చేసి తుదిజాబితా తయారు చేసేందుకు అవసరమైన కంప్యూటరైజేషన్ కష్టతరమవుతోంది. కంప్యూటర్ డేటాబేస్‌లో ఉన్న సాంకేతిక తేడాల కారణంగా లబ్ధిదారులకు సంబంధించిన తుదిజాబితా ఇంకా ఖరారు కాలేదు. పింఛన్ దరఖాస్తులకు, సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కేఎస్) వివరాలకు లింకు పెట్టడంతో ఈ పని మరింత జఠిలమవుతోంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీ నాటికి తుది జాబితాలను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించి, 17వ తేదీన ప్రత్యేక అధికారికి అర్జీలు సమర్పించాల్సి ఉన్నా... డేటాఎంట్రీ పూర్తి కాక పోవడంతో ఆ ప్రక్రియ జరగలేదు. ఇప్పుడు ఎంత త్వరగా పూర్తి చేసినా ఈ పింఛన్ల పంపిణీ జిల్లాలో ఓ కొలిక్కి వచ్చేందుకు మరో పది రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే తమ వద్ద ఉన్న మాన్యువల్ డేటా ద్వారా పింఛన్ల పంపిణీ చేసి, వచ్చే నెలలో కంప్యూటరైజేషన్ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
అక్కడ 50, ఇక్కడ 65
ముఖ్యంగా సమగ్ర సర్వేకు, పింఛన్లకు పెట్టిన లింకు అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. సమగ్ర కుటుంబ సర్వే సమయంలో 65 సంవత్సరాల కన్నా తక్కువ వయసు నమోదు చేసుకున్న వారిలో వేలాది మంది ఇప్పుడు తమకు 65ఏళ్లకు పైగా ఉన్నాయని పింఛన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినా, వారికి పింఛన్లు ఇచ్చేందుకు కంప్యూటర్లు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే కంప్యూటర్ డేటాబేస్‌లో సదరు లబ్ధిదారుని వయసు రెండు విధాలుగా ఉండడంతో, దానిని సాఫ్ట్‌వేర్ అంగీకరించడం లేదు. దీంతో ఆ లబ్ధిదారుడి డేటా కంప్యూటరైజ్ కావడం లేదు. దీంతోపాటు జిల్లాలో పింఛన్ల లబ్ధిదారుల కింద ఎంపికైన వారిలో 40వేల మందికి పైగా కుటుంబ సర్వే వివరాల్లేవని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి వారంతా సర్వేలో పాల్గొనలేదా? పాల్గొన్నా వివరాలు కంప్యూటర్‌లో నమోదు కాలేదా అనేది తేలాల్సి ఉంది.
మరోవైపు అటు ఎస్‌కేఎస్ కానీ, ఇటు పింఛన్ల దరఖాస్తులను కూడా కంప్యూటర్‌లో నమోదు చేసేటప్పుడు పొరపాటున ఏదైనా తప్పు జరిగితే దానిని కూడా సాఫ్ట్‌వేర్ అంగీకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో ఎంపికైన 3.02లక్షల మంది లబ్ధిదారుల వివరాల్లో 2.5 లక్షలకు పైగా దరఖాస్తుదారుల వివరాలను కంప్యూటర్‌లో నమోదు చేస్తే కేవలం 1.40 లక్షల మందివి మాత్రమే ఓకే అయినట్టు సమాచారం. ఈ పరిస్థితులను అధిగమించి పూర్తిస్థాయిలో కంప్యూటరైజ్ కావాలంటే జిల్లా అధికారులకు వివరాలను ఎడిట్ చేసుకునే అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, దీనికి వారు అంగీకరించలేదని, కలెక్టర్ సూచన మేరకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇప్పుడు ఆ ఎడిటింగ్ అవకాశం జిల్లా కలెక్టర్లకు ఇచ్చారని చెపుతున్నారు. ఈ అవకాశం ఇప్పుడు ఇచ్చినా ఇవన్నీ సరిదిద్ది కంప్యూటరీకరణ పూర్తి చేసేందుకు మరో 10 రోజులు పడుతుందని అధికారుల అంచనా.
ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయి జాబితా తయారు చేసేందుకే నెలాఖరు వస్తుంది. ఈ పరిస్థితుల్లో కంప్యూటరీకరణ పూర్తికావాలనే నిబంధనను పక్కనపెట్టి 3.02లక్షల మంది లబ్ధిదారుల మాన్యువల్ డేటా ద్వారా ఈనెల పింఛన్ల పంపిణీ చేసే అంశాన్ని జిల్లా యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇలా చేస్తే త్వరలో పింఛన్లు వచ్చే అవకాశం ఉన్నా... అందుకు ప్రభుత్వం అంగీకరించకపోతే మాత్రం పింఛన్లు మరో 10 రోజులు ఆలస్యం కానున్నాయి. మరో విశేషమేమిటంటే తెలంగాణలో మిగిలిన జిల్లాలతో పోలిస్తే మన జిల్లాలోనే ఈ కంప్యూటరీకరణ ప్రక్రియ వేగవంతంగా సాగుతుందట. అదే నిజమైతే మిగిలిన జిల్లాల్లో పింఛన్ల లబ్ధిదారుల పరిస్థితేంటో ఆ కంప్యూటర్‌కే తెలియాలి.