‘పాలమూరు’కు పచ్చజెండా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి దశ పనులకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.14,590 కోట్లతో చేపట్టనున్న మొదటిదశ పనులకు సంబంధించిన ఫైలుపై సీఎం కేసీఆర్ గురువారం రాత్రి సంతకం చేశారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు శుక్రవారం వెలువడే అవకాశముంది.
మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల పరిధిలో సుమారు 10లక్షల ఎకరాలకు సాగు నీరందించడం పాలమూరు ఎత్తిపోతల పథకం లక్ష్యం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ప్రాజెక్టు సర్వేకు నాలుగు నెలల క్రితం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా సర్వే చేసి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసింది.
ఈ పథకం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 7లక్షలు, రంగారెడ్డిలో 2.70లక్షలు, నల్లగొండ జిల్లాలో 0.30లక్షల ఎకరాలకు సాగునీరందుతుంది. వర్షాకాలంలో జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని నెల రోజుల వ్యవధిలో ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందుకోసం 160 మెగావాట్ల సామర్థ్యమున్న 14 పంపులను ఏర్పాటు చేయనున్నారు. తొలిదశలో జూరాల జలాశయం బ్యాక్‌వాటర్ నుంచి కోయిలకొండ మండలంలో నిర్మించే రిజర్వాయర్‌కు నీటిని తరలిస్తారు. కోయిలకొండ రిజర్వాయర్ నిర్మాణం ద్వారా కోయిలకొండ, మద్దూరు మండలాల పరిధిలో 23 గ్రామాలు నీట మున గడంతో పాటు 5,014 కుటుంబాలకు చెందిన 26,630 మంది నిరాశ్రయులవుతారని అంచనా వేశారు.
పాలమూరు ఎత్తిపోతల పథకం మొదటి దశకు రూ.16వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఇటీవల జిల్లా పర్యటనలో సూచనప్రాయంగా వెల్లడించారు. సీఎం కేసీఆర్ కూడా జిల్లా పర్యటన సందర్భంగా త్వరలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో గురువారం ఆమోదముద్ర వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జిల్లాలో ఉన్న ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసిన తర్వాతే పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టాలని జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
పాలమూరు పునరుజ్జీవనం : శ్రీనివాస్‌గౌడ్
పాలమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా పునరుజ్జీవనం పొందుతుందని పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. వలసల జిల్లాగా పేరొందిన పాలమూరులో వ్యవసాయం ఊపందుకుంటే ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగి వచ్చే అవకాశముందన్నారు. గతంలో ఎందరు ముఖ్యమంత్రులు మారినా పాలమూరు ఎత్తిపోతల పథకం దిశగా ఆలోచించ లేదన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా చవకబారు విమర్శలు కట్టిపెట్టి ప్రభుత్వానికి సహకరించాలన్నారు.