- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
సాక్షి, అమరావతి: సామాజిక పింఛన్లను తనిఖీ చేసి, అనర్హులను తేల్చాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారని చెప్పారు. ఆయన సోమవారం బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. పింఛన్లకు ఎవరు అర్హులు, ఎవరు కాదో తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. రూ.15,000 పింఛను తీసుకుంటున్న 24 వేల మంది ఇంటికెళ్లి పరిశీలించాలన్నారు.
మూడు నెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చెయ్యాలని, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చేందుకు నియమించిన మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలపై మరింత కసరత్తు చేసి సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చట్టాన్ని తేవాలని చెప్పారు.
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చట్టం తెస్తామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు న్యాయ పోరాటం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో ఎస్‌ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్ వంటివి, వీటి ద్వారా విద్యార్థులకు బోధిస్తామన్నారు. 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలన్నారు. మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, ఎస్.సవిత, అధికారులు పాల్గొన్నారు.
ప్రపంచ పండుగ క్రిస్మస్: సీఎం చంద్రబాబు
ప్రపంచమంతా పెద్దఎత్తున జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని సీఎం చంద్రబాబు అన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్‌లో సోమవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసిన చంద్రబాబు పాస్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవ్యమన్నారు. నమ్మినవారి కోసం బలిదానానికి కూడా వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధి కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు
Comments
Please login to add a commentAdd a comment