Social Pension Scheme
-
సామాజిక పింఛన్లను తనిఖీ చేయండి
సాక్షి, అమరావతి: సామాజిక పింఛన్లను తనిఖీ చేసి, అనర్హులను తేల్చాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో దివ్యాంగుల పింఛన్లు పొందుతున్న వారిలో అనేక మంది అనర్హులు ఉన్నారని చెప్పారు. ఆయన సోమవారం బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష చేశారు. పింఛన్లకు ఎవరు అర్హులు, ఎవరు కాదో తేలాలంటే నిర్థిష్టమైన నిబంధనలు అమలవ్వాలన్నారు. రూ.15,000 పింఛను తీసుకుంటున్న 24 వేల మంది ఇంటికెళ్లి పరిశీలించాలన్నారు. మూడు నెలల్లో దివ్యాంగుల పింఛన్లపై తనిఖీలు పూర్తి చెయ్యాలని, తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చే డాక్టర్లు, అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తెచ్చేందుకు నియమించిన మంత్రుల కమిటీ ప్రాథమికంగా ఇచ్చిన నివేదికలపై మరింత కసరత్తు చేసి సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చట్టాన్ని తేవాలని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలు కోసం చట్టం తెస్తామన్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేందుకు న్యాయ పోరాటం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో ఎస్ఆర్ శంకరన్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించాలని ఆదేశించారు. స్కిల్ ఎడ్యుకేషన్‌లో భాగంగా స్పోకెన్ ఇంగ్లీష్, సోషల్ ఎమోషనల్ స్కిల్స్ వంటివి, వీటి ద్వారా విద్యార్థులకు బోధిస్తామన్నారు. 104 బీసీ హాస్టళ్లలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని అమలు చేయాలన్నారు. మంత్రులు డోలా బాల వీరాంజనేయస్వామి, ఎస్.సవిత, అధికారులు పాల్గొన్నారు.ప్రపంచ పండుగ క్రిస్మస్: సీఎం చంద్రబాబు ప్రపంచమంతా పెద్దఎత్తున జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అని సీఎం చంద్రబాబు అన్నారు. లోక రక్షకుడైన ప్రభువు కరుణ మనందరిపై ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ హాల్లో సోమవారం జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తొలుత పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసిన చంద్రబాబు పాస్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సేవకు ప్రతీక క్రైస్తవ్యమన్నారు. నమ్మినవారి కోసం బలిదానానికి కూడా వెనుకాడని క్రీస్తు గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధి కోసం బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. చర్చిల నిర్మాణానికి, పునరుద్ధరణకు ఆర్థిక సాయం అందిస్తామన్నారు -
అర్హుల గుర్తింపులో సాంకేతిక సమస్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సామాజిక పింఛన్ల పథకం తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఈనెల 8వతేదీ నుంచి అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామంటూ హడావుడిగా ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించిన సర్కారు ప్రస్తుతం నెమ్మదించింది. లబ్ధిదారుల అర్హతలో నెలకొన్న తీవ్ర అయోమయం కారణంగా.. ఒకట్రెండు రోజులు ఉరుకులు, పరుగులు పెట్టిన అధికారులు.. తాజాగా చేతులు ముడుచుకున్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సాకుగా చూపుతున్న ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేయడం గమనార్హం. దీంతో జిల్లావ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద లబ్ధిదారులు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పంచింది 10వేల లోపే..! జిల్లాలో సామాజిక పింఛన్ల కోసం 3,69,118 మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొత్తంగా 2,37,443 మందిని ఆసరా పథకానికి అర్హులుగా నిర్ధారించారు. ఆ తర్వాత లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో వివరాల నమోదుకు ఉపక్రమించి.. ఇప్పటివరకు 2,05,940 మంది వివరాలను ఆన్లైన్లో ఎంట్రీ చేశారు. ఎంట్రీ అనంతరం ఈ వివరాలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి లాగిన్ ఐడీలోని సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో సరిపోల్చి.. లబ్ధిదారులకు అర్హత కార్డులను ముద్రించి ఇవ్వాలి. కానీ డాటాఎంట్రీ ప్రక్రియలో తలెత్తిన సమస్యతో వేలాది మంది అర్హుల పేర్లు.. అనర్హులుగా ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆసరా అర్హులు అంశం మళ్లీ మొదటికొచ్చింది. అసలు సమస్య ఎక్కడ ఉత్పన్నమైందనే విషయం చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 8, 9 తేదీల్లో మండల కేంద్రాల్లో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టి ఒక్కో మండలంలో గరిష్టంగా రెండు వందల మంది చొప్పున.. జిల్లా వ్యాప్తంగా 10వేలలోపు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. పూర్తిస్థాయి అర్హుల జాబితా తేలకపోవడం.. సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్య పరిష్కారం కాకపోవడంతో ఏకంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియనే నిలిపివేశారు. సమన్వయ లోపంతోనే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమానికి సంబంధించి వివరాల నమోదు ప్రక్రియ అంతా ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్ సెంటర్) పర్యవేక్షించింది. తాజాగా సామాజిక పింఛన్లకు సంబంధించి అర్హుల డాటా ఎంట్రీ ప్రక్రియను టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) రూపొందించిన సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేశారు. అయితే సమగ్ర కుటుంబ సర్వే వివరాలు, దరఖాస్తులను పరిశీలించి అర్హులుగా తేల్చిన లబ్ధిదారుల వివరాలను సరిపోల్చి కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో రెండు సాఫ్ట్వేర్లలో నిక్షిప్తం చేసిన వివరాలు సరిపోలక వేలాది పేర్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో యంత్రాంగంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి సాఫ్ట్‌వేర్‌ను రూపొందించిన సంస్థల మధ్య సమన్వం లేకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని స్పష్టమవుతోంది. కొలిక్కి వచ్చేదెన్నడో.. మరో 10రోజుల్లో నవంబర్ నెల ముగియనుంది. ఈలోపు అర్హులందరికీ పింఛన్లు పంపిణీ చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కన్పించడంలేదు. ముందుగా సాఫ్ట్‌వేర్‌లో నెలకొన్న సమస్యను పరిష్కరించిన తర్వాతే అర్హులపై స్పష్టత రానుంది. కానీ ఈ సమస్య ఇప్పట్లో కొలిక్కివచ్చే అవకాశంలేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సమస్య పరిష్కరించాలంటే కనిష్టంగా నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే పింఛన్ల పంపిణీపై స్పష్టత వస్తుందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
ఇక ‘ఆసరా’..!
ఆదిలాబాద్ అర్బన్ : సామాజిక పింఛన్ల పథకం ఇక ‘ఆసరా’గా మారింది. ‘ఆసరా’ పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని రకాల పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు పింఛన్‌దారుని సంతకం తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది. జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులుండగా.. ప్రతి నెలా రూ.7.75 కోట్ల పింఛన్ పంపిణీ అవుతోంది. ఆసరా పథకాన్ని ఈ నెల 8న నియోజకవర్గ, 9న మండల, 10న గ్రామ స్థాయిలో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల మంజూరుకు 3,19,957 లక్షల దరఖాస్తులు రాగా, ఇంటింటి సర్వే చేసిన 2.01 లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించారు. మిగతా 1.39 లక్షల దరఖాస్తులు తిరస్కరించారు. 2.62 లక్షల మంది లబ్ధిదారులు జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 10 వరకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు 1,35,750 ఉండగా, చేనేత 537, వికలాంగులు 26,964, వితంతువులు 79,921, కల్లుగీత కార్మికులు 283, అభయహస్తం కింద 18,549 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు. ప్రతినెలా వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులకు ప్రతినెలా రూ.500 చొప్పున పింఛన్ అందజేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా 7.75 కోట్లు పింఛన్ రూపంలో డీఆర్డీఏ చెల్లిస్తోంది. బయోమెట్రిక్ విధానం ద్వారా 1.50 లక్షల మందికి రూ.4.35 కోట్లు పంపిణీ కాగా, మిగతాది పోస్టల్ ద్వారా పంపిణీ చేస్తోంది. పంపిణీ పలు రకాలు... గతంలో గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పింఛన్లు పంపిణీ చేసేవారు. సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పింఛన్ ఇచ్చేవారు. చనిపోయిన వారికి, ఊరు వదిలివెళ్లిపోయిన వారికి, అనర్హులకు పించన్లు ఇస్తున్నారని సర్కారు దృష్టికి రావడంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో యాక్సిస్ బ్యాంకు ద్వారా 18 మండలాల్లో, పోస్టల్ శాఖ ద్వారా 34 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. బయోమెట్రిక్ ఆధార్ కార్డు లింకుగా ఉండడంతో అనుసంధానం కాకపోవడం, వేలిముద్రలు సరిగా పడకపోవడం, బ్యాంక్ ఖాతాలు తెరవకపోవడం తదితర కారణాలతో అర్హులకు సైతం పింఛన్లు రాలేదు. అనంతరం ఐరీష్ విధానంతో పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. పంపిణీ మిషన్లకు బ్యాటరీ బ్యాకప్ లేకపోవడం, సిగ్నల్స్ అందకపోవడం, ఆపరేటింగ్ విధానం తెలియకపోవడంతో అది గాడిలో పడలేదు. ప్రభుత్వం కొత్తగా ఆసరా పథకం ప్రారంభించడంతో పింఛన్లు పొందుతున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నెలనెలా పింఛన్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.