అక్రమ కేసులతో ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునే ఎత్తుగడ
మంత్రి లోకేశ్ అండతో ఉత్తరాది లాబీ హల్‌చల్
పోలీసు శాఖపై దీర్ఘకాలిక పట్టుకు ఎత్తు
ఆధిపత్య పోరుతో గాడి తప్పుతున్న వైనం
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంటోంది. డీజీపీ పోస్టే లక్ష్యంగా మూడు ముక్కలాటతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడమే కొలమానంగా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు డీజీ స్థాయి ఐపీఎస్‌లు పోటీ పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది.
డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తన పదవీ కాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా... విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పోలీస్ బాస్ పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు.
హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్‌కుమార్ లడ్హా, కేంద్ర సర్వీసులో ఉన్న అమిత్ గర్గ్‌లతో కూడిన ఉత్తరాది లాబీ మంత్రి నారా లోకేశ్ అండదండలతో పోలీసు శాఖపై దీర్ఘకాలిక ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదుపుతోంది. పోలీసు ఉన్నతాధికారుల అధికారిక లాలసను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు వారిని తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు.
దీర్ఘకాలిక పట్టుకు ఉత్తరాది లాబీ గూడుపుఠాణి
చంద్రబాబు, లోకేశ్‌ను ‘అన్ని విధాలుగా’ ప్రసన్నం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తున్న ఉత్తరాది ఐపీఎస్ లాబీ దీర్ఘకాలిక వ్యూహానికి తెర తీయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. సర్వం తానై రెడ్‌బుక్ వేధింపులు, పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్‌కుమార్ లడ్హా ఈ లాబీకి నేతృత్వం వహిస్తున్నారు.
హరీశ్‌కుమార్ గుప్తాతోపాటు ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న అమిత్ గర్గ్ ఇందులో కీలక సభ్యులు. రానున్న నాలుగేళ్లపాటు పోలీసు శాఖపై పూర్తిగా తమ పట్టే ఉండాలన్నది ఆ లాబీ ఉద్దేశం. ఈ క్రమంలో ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాత హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా చేయాలని పట్టుబడుతోంది. ఆ దిశగా ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైంది.
ఆగస్టులో హరీశ్ కుమార్ గుప్తాకు పొడిగింపు ఇవ్వాలని... ఆ తరువాత ఆయన రిటైరయ్యాక అమిత్ గర్గ్‌ను డీజీపీగా చేయాలన్నది ఉత్తరాది లాబీ వ్యూహం. అనంతరం వచ్చే ఎన్నికల నాటికి మహేశ్ కుమార్ లడ్హా డీజీపీ కావాలన్నది ఎత్తుగడ. తద్వారా 2029 వరకు పోలీసు శాఖ పూర్తిగా తమ ఆధిపత్యంలోనే ఉండాలని హరీశ్ కుమార్ గుప్తా, అమిత్ గర్గ్, మహేశ్ కుమార్ లడ్హా పట్టుదలతో ఉన్నారు.
ఇప్పటికే మహేశ్ కుమార్ లడ్హా ఏం చెప్పినా చంద్రబాబు సరే అంటున్నారు. ఇక లోకేశ్ పూర్తిగా హరీశ్ కుమార్‌గుప్తాకు అనుకూలంగా ఉన్నారు. దీంతో తాము అనుకున్నది సాధిస్తామని ఆ ముగ్గురు ఐపీఎస్‌లు పూర్తి ధీమాతో ఉన్నారు. ఆ ముగ్గురి లాబీయింగ్ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
డీజీపీ పోస్టు కోసం ఆధిపత్య పోరుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నా అటు ప్రభుత్వ తీరులోగానీ ఇటు ఐపీఎస్ అధికారుల వైఖరిలోగానీ ఏమాత్రం మార్పు రావడం లేదు.
ఏం చేయమన్నా చేసేస్తా...! లోకేష్ అండతో గుప్తా జోరు
మంత్రి లోకేశ్ అండదండలే అర్హతగా విజిలెన్స్– ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా డీజీపీ పోస్టుకు గురి పెట్టారు. రెడ్‌బుక్ వేధింపులకు విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని సాధనంగా మార్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థి పార్టీల నేతలు, ఇతరులపై విజిలెన్స్– ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించుకోవడం.. వాటి ఆధారంగా ఏసీబీ, సీఐడీ కేసులు నమోదు చేస్తూ వేధిస్తుండటం అంతా పక్కా పన్నాగంతో సాగుతోంది.
లోకేశ్ సహకారంతో హరీశ్ కుమార్ గుప్తాకు డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2014–19లో టీడీపీ హయాంలో గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించాలని చంద్రబాబు భావించినప్పటికీ మంత్రి లోకేశ్‌ను ‘తనదైన శైలిలో ప్రసన్నం’ చేసుకుని ఆర్పీ ఠాకూర్ పోలీస్ బాస్ పోస్టును దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
లోకేశ్ అండదండలు ఉన్నప్పటికీ హరీశ్ గుప్తా ఏమాత్రం ఉదాసీనతకు తావివ్వకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తనకు డీజీపీగా అవకాశం ఇస్తే ప్రభుత్వ పెద్దలు ఏం చేయమన్నా సరే సంకోచించకుండా చేసేస్తానని హామీ ఇస్తున్నారు. మరోవైపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్‌లకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు, ఇతర అంశాలను వివిధ మార్గాల్లో చంద్రబాబు, లోకేశ్‌కు చేరవేసేలా పావులు కదుపుతున్నారు.
రెడ్‌బుక్‌కు రాచబాట వేశా.. డీజీపీ ద్వారకా చివరి యత్నాలు
రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకానికి మౌన ప్రేక్షకుడిగా సహకరిస్తున్నప్పటికీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ కాలం పొడిగింపుపై ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. ఆయన ఈ నెలాఖరుకు రిటైర్ కానుండటంతో తన పదవీకాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌తో ఇటీవల విడివిడిగా సమావేశమై తన మనోగతాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది.
అయితే రెడ్‌బుక్ వేధింపులు, అక్రమ కేసులు తాము ఆశించినస్థాయిలో లేవని.. మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతగా అక్రమ కేసులు బనాయిస్తున్నా మరింత బరి తెగించాలని ప్రభుత్వ పెద్దలు పట్టుబడుతుండటాన్ని ఆయన కొందరు సీనియర్ ఐపీఎస్‌ల వద్ద ప్రస్తావించినట్టు సమచారం.
ఇప్పటికే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోందని... ఇంకా దిగజారితే పోలీసు అధికారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కొందరు డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్వవస్థను దుర్వినియోగం చేస్తోందని పరోక్షంగా వెల్లడించారు. అంతే కాదు.. పోలీసు అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లైందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
బాబుపై కేసులు నీరుగార్చడమే అర్హతగా.. రవిశంకర్ అయ్యన్నార్
సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరు గార్చాలని స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన్ను సీఐడీ చీఫ్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించారు. అందువల్లే గతంలో చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ సీఆర్‌సీపీ 164 వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేస్తోంది.
గతంలో సిట్‌లో పని చేసిన కిందిస్థాయి అధికారులను బెదిరించి వారి ద్వారా చంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చే కార్యాచరణ చేపట్టింది. వీటిని ప్రస్తావిస్తూ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాతే తననే డీజీపీగా నియమించాలని కోరుతున్నారు. అయితే లోకేశ్ ఇప్పటికే గుప్తాను డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలియడంతో రవిశంకర్ అయ్యన్నార్ రెండో ఆప్షన్ కూడా రెడీ చేసుకున్నారు.
హరీశ్‌కుమార్ గుప్తా ఆగస్టులో రిటైరైన తరువాత తనకు డీజీపీగా అవకాశం ఇస్తామనే హామీ తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ అందుకు చంద్రబాబు, లోకేశ్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లభించకపోవడంతో ఆయన కాస్త కలవరపడుతున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment