గూగుల్ క్లౌడ్ సీఈవోకు చంద్రబాబు వినతి
మూలపేటలో పెట్టుబడులకు పెట్రోనాస్ సంస్థకు ఆహ్వానం
రాష్ట్రంలో డీపీ స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి
విశాఖలో గ్లోబల్ డెలివరీ సెంటర్ పెట్టాలని పెప్సికోకు వినతి
దావోస్‌లో పలు కంపెనీల అధినేతలతో సీఎం భేటీ
సాక్షి, అమరావతి: విశాఖలో చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సర్వర్‌ల నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌ను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. మూడో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లో పెట్టుబడులు పెట్టాలని మలేసియాకు చెందిన పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్‌ను సీఎం ఆహ్వానించారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు.
ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాట్లింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్.. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్‌కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పెప్సీకో సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్‌ఎఫ్‌తో భాగస్వామ్యం కావాలని సూచించారు.
బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం సమావేశమయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఏపీకి రావాలని వారిని కోరారు.
స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కంటైనర్ టెర్మినల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూల పేట ఇందుకు అనుకూలమని వివరించారు.
రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లో, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు.
బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ
ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను చంద్రబాబు కోరారు.
రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.
ఏపిలో పామాయిల్ ఇండస్ట్రీ!
యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని యూనిలీవర్ భావిస్తోంది.
బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విల్లెం ఉజ్జెన్‌కు బాబు వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు.
గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు.
Comments
Please login to add a commentAdd a comment