చెప్పినట్లు వాంగ్మూలం ఇవ్వాల్సిందే.. లేకపోతే అంతుచూస్తా
పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌కు బెదిరింపులు
కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ బరితెగింపు
అయ్యన్నార్ బెదిరింపులను హైకోర్టుకు నివేదించనున్న విద్యాసాగర్
సాక్షి, అమరావతి: అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మరింతగా బరితెగించింది. వలపు వలతో బడా బాబులను బురిడీ కొట్టించే కాదంబరి జత్వానీ కుట్రపూరితంగా ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ బెదిరింపులకు దిగుతోంది. ఇందులో భాగంగా సీఐడీ చీఫ్‌గా ఉన్న అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ రంగంలోకి దిగడం.. న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా బెదిరింపులకు పాల్పడటం విభ్రాంతి కలిగిస్తోంది.
ఈ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారణ పేరుతో తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అయ్యన్నార్‌పై హైకోర్టుకు ఫిర్యాదు చేసేందుకు కుక్కల విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు సిద్ధపడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఏమిటంటే..
వేరే గదిలోకి తీసుకువెళ్లి బెదిరింపులు..
హనీట్రాప్ ట్రాక్ రికార్డ్ ఉన్న కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుతో పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్టుచేసి న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఇటీవల సీఐడీకి బదిలీచేసింది. దీంతో ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులు విద్యాసాగర్‌ను విచారణ నిమిత్తం న్యాయస్థానం అనుమతితో మూడ్రోజుల కస్టడీకి తీసుకున్నారు.
గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆయన్ని ఆదివారం విచారించారు. విచారణ ప్రక్రియను పూర్తిగా ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అందుకు సీఐడీ కార్యాలయంలో ఓ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేస్తూ కొంతసేపు విచారించారు. ఆ తర్వాత ఆయన్ను మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ గదిలో ఆడియో, వీడియో రికార్డింగ్‌కు ఏర్పాట్లుచేయకపోవడం గమనార్హం. మరి ఆయన్ని ఆ గదిలోకి ఎందుకు తీసుకువెళ్లారన్నది అర్థంకాలేదు.
కానీ, కొన్ని క్షణాలకే సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం స్పష్టమైంది. ఆడియో, వీడియో రికార్డింగ్‌లేని ఆ గదిలో విద్యాసాగర్‌ను రవిశంకర్ అయ్యన్నార్ తీవ్రస్థాయిలో బెదిరించినట్లు సమాచారం. తాము చెప్పినట్లుగా వాంగ్మూలం ఇవ్వాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన పోలీసు శైలిలో హెచ్చరించారు. తాము చెప్పిన కొందరి పేర్లను వాంగ్మూలంలో పేర్కొనాలని.. వారు చెప్పినట్లే తాను చేశానని.. అంతా వారి ప్రమేయంతోనే జరిగిందనే అసత్య వాంగ్మూలాన్ని ఇవ్వాలని బెదిరించినట్లు తెలిసింది.
ఈ సందర్భంగా గతంలో తాము ఎవరెవర్ని ఎలా కేసుల్లో ఇరికించింది.. ఎంతగా వేధించిందీ చెబుతూ బెదిరించారు. ఓ సమయంలో ఆయన నిగ్రహం కోల్పోయి మరీ తీవ్రస్థాయిలో విరచుకుపడినట్లు తెలిసింది. దీంతో అసలక్కడ ఏం జరుగుతోందోనని సీఐడీ వర్గాలే కాసేపు ఆందోళన చెందాయి.
అయ్యన్నార్ బెదిరింపులపై హైకోర్టుకు నివేదన..
న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని నిర్వహిస్తున్న విచారణ సందర్భంలోనే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నిబంధనలను ఉల్లంఘించడంపట్ల విస్మయం వ్యక్తమవుతోంది. ఆయన వ్యవహారశైలి న్యాయస్థానం ఆదేశాలకు పూర్తి విరుద్ధంగా ఉందన్నది స్పష్టమవుతోంది. మరోవైపు.. అయ్యన్నార్ బెదిరింపులను విద్యాసాగర్ తరఫు న్యాయవాదులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లేందుకు వారు సమాయత్తమవుతున్నారు.
కస్టడీలో వేధింపులు, కోర్టు ఆదేశాల ధిక్కరణ తదితర అభియోగాలతో అయ్యన్నార్‌కు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. విద్యాసాగర్ కూడా తనను రవిశంకర్ అయ్యన్నార్ ఏ రీతిలో బెదిరించిందీ.. అంతుచూస్తానని హెచ్చరించిందీ న్యాయస్థానానికి విన్నవించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ కేసుకు సంబంధించి తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment