6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలుతో మారనున్న బోధనా పద్ధతులు
తొలి రెండేళ్లూ ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, యోగా, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కు ప్రాధాన్యత
నాలుగేళ్లలో 10 ఆన్‌లైన్ కోర్సులు నేర్చుకునే అవకాశం
ఏదైనా కారణంతో కోర్సు పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు డిప్లొమా సర్టిఫికెట్
మిగిలిన కోర్సును ఎప్పుడైనా పూర్తిచేసే అవకాశం
6వ డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీ ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం
సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యలో ఒకే విధమైన విద్యా ప్రమాణాలతో పాఠ్యాంశాలు, విద్యాబోధన అమల్లోకి వచ్చింది. ఇకపై 60 శాతం విద్యాబోధన ప్రయోగశాలల్లోనే జరగనుంది. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) 6వ డీన్స్ కమిటీ సిఫార్సులను ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచే అమలు చేస్తూ దేశంలోనే తొలి విశ్వవిద్యాలయంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిలిచింది.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఒకే రకమైన విద్యాబోధన తీసుకురావాలన్న లక్ష్యంతో ఐసీఏఆర్ 2021లో ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ ఇటీవలే తన నివేదికను సమర్పించింది.
కమిటీ సిఫార్సులను జాతీయ, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, డీమ్డ్ వ్యవసాయ వర్సిటీల్లో అమల్లోకి తీసుకురావాలని ఐసీఏఆర్ సంకల్పించింది. దీంతో ఈ నూతన విద్యా విధానంలో పాఠ్యాంశాలతో పాటు బోధనా పద్ధతులు మారిపోనున్నాయి.
కోర్సు మధ్యలో ఆపేస్తే..
నూతన విద్యావిధానం ప్రకారం కళాశాలల్లో చేరిన విద్యార్థులలో బెరకును పోగొట్టి, వివిధ కోర్సులపై అవగాహన కల్పించడం, విద్యార్థుల మధ్య తారతమ్యాలు తొలగించేందుకు తొలుత రెండు వారాల ‘దీక్షారంభ్’ నిర్వహిస్తారు. వ్యవసాయ కోర్సులలో తొలి రెండేళ్లూ నిర్దేశించిన ప్రాథమిక కోర్సుల బోధనతో పాటు నైపుణ్యాభివృద్ధి కోర్సులలో శిక్షణకు ప్రాధాన్యతిస్తారు.
తరగతి గది బోధనతో పాటు తొలి ఏడాది ఎన్‌ఎస్‌ఎస్/ఎన్‌సీసీ/ఫిజికల్ ఎడ్యుకేషన్/యోగా వంటి వాటిని అభ్యసించేలా ప్రోత్సహిస్తారు. 3వ ఏడాది పూర్తిగా వ్యవసాయ శాస్త్రానికి చెందిన కోర్సులు బోధిస్తారు. నాలుగో ఏడాదిలో ఎంపిక చేసిన కోర్సులలో విద్యాబోధన సాగిస్తారు. 8వ సెమిస్టర్‌లో ఇండస్ట్రియల్ అటాచ్‌మెంట్, అనుభవంతో కూడిన బోధన, హ్యాండ్–ఆన్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్న్‌షిప్‌కు ప్రాధాన్యత ఇస్తారు.
4వ ఏడాది వ్యవసాయం, అనుబంధ శాస్త్రాలతో పాటు 10 ఆన్‌లైన్ కోర్సులను నేర్చుకునే వెసులుబాటు కల్పిస్తారు. పైగా నాలుగేళ్ల కోర్సులో ప్రయోగాత్మక అంశాలను నేర్చుకోవడానికి 60 శాతం సమయాన్ని కేటాయిస్తారు. విద్యార్థి కోర్సుని పూర్తి చేయలేకపోతే.. తొలి రెండేళ్లకు గానూ డిప్లొమా సర్టిఫికెట్ జారీ చేస్తారు. మిగిలిన కోర్సును విద్యార్థి తనకు ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు.. దేశంలో ఏ వ్యవసాయ కళాశాలలో అయినా పూర్తిచేసే వెసులుబాటు కల్పించారు.
అమలులో తొలి వర్సిటీగా ఎన్జీ రంగా
6వ డీన్స్ కమిటీ సిఫార్సుల అమలు కోసం యూనివర్సిటీ ఫ్యాకల్టీ బోర్డ్ ఆఫ్ అగ్రికల్చర్, 113వ అకడమిక్ కౌన్సిల్ సమావేశాల్లో ఆమోద ముద్ర వేయడం ద్వారా సిఫార్సులు అమలు చేస్తున్న తొలి విశ్వవిద్యాలయంగా ఎన్జీ రంగా వర్సిటీ నిలిచింది.
బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అందించే 7 వ్యవసాయ ప్రభుత్వ కాలేజీలు, 6 అనుబంధ కళాశాలలు, 2 ఫుడ్ సైన్స్ కళాశాలలు, 2 అగ్రి ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో కూడా వీటిని అమల్లోకి తెచ్చింది. డిజిటల్ టెక్నాలజీకి తగినట్టుగా విద్యార్థులను సన్నద్ధం చేసే లక్ష్యంతో బయో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర కోర్సులతో పాటుగా వ్యక్తిత్వ వికాసం కోర్సులను చేర్చారు.
విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకతను మెరుగుపరిచే విధంగా ప్రోగ్రెసివ్ మూల్యాంకనం ద్వారా ప్రతిభను గుర్తిస్తారు. ఆన్‌లైన్, ఓపెన్ డిస్టాన్స్ లెర్నింగ్ (ఓడీఎల్), బ్లెండెడ్ లెర్నింగ్ వంటి వినూత్న బోధనా విధానాలను ఆచరణలోకి తీసుకొచ్చారు.
తొలి విశ్వవిద్యాలయం మనదే
జాతీయ విద్యావిధానం–2020లో భాగంగా ఐసీఏఆర్ ఏర్పాటు చేసిన 6వ డీన్స్ కమిటీ సిఫార్సులు సంపూర్ణంగా అమలు చేసిన తొలి వర్సిటీగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిలిచినందుకు గర్వంగా ఉంది.
ఏటా పెద్ద సంఖ్యలో నూతన వంగడాలను మార్కెట్‌లోకి విడుదల చేస్తూ పరిశోధనల్లో అగ్రస్థానంలో ఉన్న వర్సిటీని నూతన విద్యావిధానం అమల్లో కూడా అదే స్థానంలో నిలుపుతాం. – డాక్టర్ శారద జయలక్ష్మి, వీసీ, ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ
Comments
Please login to add a commentAdd a comment