Physical Education
-
20 నుంచి అంతర్జాతీయ వ్యాయామ విద్య సెమినార్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వ్యాయామ విద్య డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి అంతర్జాతీయ సెమినార్ జరుగనుంది. ‘వ్యాయామ విద్య, స్పోర్ట్స్ సైన్స్’లలో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మూడు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 600 మంది క్రీడాధికారులు ఇందులో పాల్గొననున్నారు. వీరితో పాటు వ్యాయామ విద్య ప్రొఫెసర్లు, స్పోర్ట్స్ సైంటిస్టులు, కోచ్‌లు, ట్రెయినర్లు, స్పోర్ట్స్ డాక్టర్లు, వ్యాయామ విద్య స్కాలర్లు, టీచర్లు ఈ సదస్సుకు హాజరై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన కార్యక్రమంలో శాట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి ఈ సదస్సుకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమెరికా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నాగరాజు, నిజాం కాలేజి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్, ఉస్మానియా యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రాజేష్ కుమార్, జూనియర్ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ బి. లక్ష్మయ్య , విశాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు . -
ఆటలకో పీరియడ్: సీబీఎస్ఈ ఆదేశం
న్యూఢిల్లీ: తన అనుబంధ పాఠశాలలన్నీ వచ్చే సంవత్సరం నుంచి విధిగా రోజూ క్రీడలకే ఒక పీరియడ్ కేటాయించాలని సీబీఎస్ఈ ఆదేశించింది. 9–12 తరగతి విద్యార్థుల్లో శారీరక, మానసిక ఉల్లాసం నింపేలా ఆటలు ఆడించాలని సూచిస్తూ 150 పేజీల మార్గదర్శకాలను విడుదల చేసింది. హెల్త్, ఫిజికల్ విద్య(హెచ్‌పీఈ)ని అకడమిక్స్‌లో భాగం చేస్తూ రూపొందించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం..పాఠశాలల్లో రోజూ జరిగే ఆటల పీరియడ్‌లో విద్యార్థులంతా మైదానానికి వెళ్లి, బోర్డు పేర్కొన్న జాబితాలోని ఏదో ఒక ఆట లేదా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. అందులో విద్యార్థులకు ఇచ్చే గ్రేడ్లను పాఠశాలలు సీబీఎస్ఈ వెబ్సైట్లో పొందుపర్చాలి. విద్యార్థులు వార్షిక పరీక్షలకు హాజరవ్వాలంటే హెచ్‌పీఈలో పాల్గొనడం తప్పనిసరి. అయితే ఇలా వచ్చే గ్రేడ్లను ప్రధాన పరీక్షలో వచ్చిన మార్కులకు కలపరు. -
టీఆర్టీ దరఖాస్తుల్లో సవరణకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: టీఆర్టీ ఆన్లైన్ దరఖాస్తుల్లో తప్పుల సవరణకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇస్తున్నట్లు టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని, ఇకపై మళ్లీ అవకాశం ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్, లాంగ్వేజ్ పండిట్, స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్), ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల దరఖాస్తుల్లో అభ్యర్థులు తమ జిల్లా విషయంలో పొరపాట్లు చేశారని దీంతో వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చామని పేర్కొంది. ఆ సమయంలోనూ చాలా మంది మళ్లీ పొరపాట్లు చేశా రని తెలిపింది. 31 జిల్లాల ప్రకారం చేసిన దరఖాస్తుల్లోనూ పొరపాట్లు చేశారని వెల్ల డించింది. మరోసారి అవకాశం ఇవ్వాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారని తెలిపింది. -
వ్యాయామ విద్యను విస్తరించాలి
జాతీయ సదస్సులో హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ వ్యాఖ్య ఉస్మానియా యూనివర్సిటీ: ఆరోగ్యంతో పాటు చురుగ్గా ఉండేందుకు వ్యాయామ విద్యను మరింత విస్తరించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ‘ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్–2017’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఓయూ వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షత వహించగా, వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వ్యాయామ విద్య విస్తరించాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో వ్యాయామ విద్యపై ఆసక్తిని పెంచాలన్నారు. విశ్వవిద్యాలయాల కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హెచ్‌సీఏ తరఫున ఓయూ క్యాంపస్‌లో ఆధునిక హంగులతో క్రికెట్ పిచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఓయూలో సింథటిక్ ట్రాక్‌ను కూడా నిర్మిస్తామని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, పది దేశాల నుంచి 450 ప్రతినిధులు హాజరయ్యారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ చెప్పారు. అధ్యాపకులు, పరిశోధన విద్యార్థుల నుంచి 300 పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, వ్యాయామ విద్య వీసీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
విజేతలు రమేశ్, తేజస్వి
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్‌లో ఆదివారం జరిగిన సమ్మర్ రోడ్ రన్ పోటీల్లో రమేశ్, తేజస్వి విజేతలుగా నిలిచారు. అథ్లెటిక్స్ కోచింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన పురుషుల 5కె రన్లో సికింద్రాబాద్ పీజీ కాలేజ్‌కి చెందిన రమేశ్ 15 నిమిషాల 55.7 సెకన్లలో పరుగు పూర్తి చేసి టైటిల్ సాధించాడు. ఈ పోటీల్లో సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థకు చెందిన పవన్ తేజ (16ని.00.9 సెకన్లు), జెడ్పీహెచ్ఎస్ మేకగూడకి చెందిన శ్రీనివాస్ (16ని.00.9 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల 5కె రన్లో పి.తేజస్వి (సెయింట్ పాయిస్–25ని.02.1 సెకన్లు) విజేతగా నిలిచింది. హిమబిందు (రెడ్డి కాలేజ్–26ని.03.2 సెకన్లు), నిత్య (జేజీఎస్–26ని.20.1 సెకన్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. విజేతలకు లయన్స్ క్లబ్ రీజనల్ చైర్మన్ లయన్ శ్రీనివాస్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఇతర విభాగాల ఫలితాలు: బాలురు: అండర్–16 5కె: 1. అజయ్‌కుమార్ ( (డీఎల్ఎస్–17ని.56.3 సెకన్లు), 2. రాయుడు (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ, 18.01.1), 3. సుమిత్ (హైదరాబాద్,18.04.3). అండర్–13 (2.5 కి.మీ): 1. రమేశ్ సింగ్ (ఆర్మీ స్కూల్, 9.18.1), 2. చిన్నయ్య (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 9.29.3), 3. రంజిత్ కుమార్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 9.32.2). అండర్–10 (1.5 కి.మీ): 1. నందు ( జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.35.6), 2. భార్గవ్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.36.7), 3. రాజేశ్ (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.45.2). మాస్టర్ పురుషులు (2.5 కి.మీ): 1. సంజయ్ కుమార్ (లయన్స్ క్లబ్ ,12.14.1), 2. స్వాములు (12.45.9), 3. సుందర్ రాజన్ (ఎస్బీఐ, 14.12.6). బాలికలు: అండర్–16 (5 కి.మీ): 1. కీర్తి (రైల్వే జూనియర్ కాలేజ్, 20.59.1), 2. సౌజన్య (ఎస్జీబీహెచ్ఎస్, 21.59.1), 3. జువేరియా (హైదరాబాద్, 22.24.6); అండర్–13 (2.5 కి.మీ): 1. తస్లీమా (తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్, 10.22.1), 2. యువిక (కెన్నడీ వీబీ, 10.29.1), 3. పి. శ్రేయ (మమత హెచ్ఎస్, 11.10.5); అండర్–10 (1.5 కి.మీ): 1. తేజస్వి (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.58.1), 2. శిరీష (జెడ్పీహెచ్ఎస్, మేకగూడ 8.59.6), 3. శ్రేయ (హైదరాబాద్, 9.44.7). మాస్టర్ మహిళలు: (2.5 కి.మీ) 1. రూప (14.01.1), 2. సునీత (హైదరాబాద్, 15.00.3), 3. సుబ్బలక్ష్మి (16.10.1). -
ఎస్జీఎఫ్ జాతీయ క్రీడలు షురూ
వరంగల్ స్పోర్ట్స్ : వ్యాయామ విద్య ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణాయుత ప్రవర్తన అలవడుతుందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, శాయ్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. 62వ ఎస్జీఎఫ్ అండర్-19 నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టెన్నిస్, వాలీబాల్ విభాగాల్లో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మందికిపైగా క్రీడాకారులు జిల్లాకు చేరుకున్నారు. ఈ పోటీలను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి మార్చ్ఫాస్ట్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. నాగపురి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన దేశాన్ని సాధించాలంటే వ్యాయామ విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. సరైన గైడెన్స్ ఉంటే దేశం నుంచి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారన్నారు. యూరి దాడిలో మృతిచెందిన భారత సైనికులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పేరిణి నృత్య ప్రదర్శన, ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు రేణుక శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తెలంగాణ బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా సెక్రటరీ డాక్టర్ కోట సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ బాధ్యుడు వాంక్వా, , ఎస్జీఎఫ్ రాష్ట్ర అబ్జర్వర్ రామిరెడ్డి, ఇంటర్ ఆర్ఐఓ షేక్ అహ్మద్, డీఎస్డీఓ ఇందిర, సత్యనారాయణ, భారత జ్యోతి అవార్డు గ్రహీత జగన్మోహన్ మెల్టా, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జి పాణి, జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్ యాదవ్, బాబూరావు, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, పీడీ బరుపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ పీసెట్ షెడ్యూల్ విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం: రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామ విద్యా కళాశాలల్లో 2015-16 విద్యా సంవత్సరంలో బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తున్న పీసెట్- 2015 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్ రెడ్డి విడుదల చేశారని పీసెట్ కన్వీనర్, ఏఎన్‌యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డీన్ ఆచార్య వై.కిషోర్ తెలిపారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం జరిగిన పీసెట్ కమిటీ సమావేశంలో పీసెట్ షెడ్యూల్ ఖరారు చేశామని తెలిపారు. నోటిఫికేషన్ ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభమవుతుందనీ, దరఖాస్తు చేసుకోవటానికి ఈ నెల 30 ఆఖరు తేదీ అని, అపరాధ రుసుముతో ఏప్రిల్ 13వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చన్నారు. పరీక్షలు ఈ ఏడాది మే నెల 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. విద్యార్థులు మే నెల 7వ తేదీ నుంచి వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. -
‘ఎడ్యుకేషన్’ పోస్టుల భర్తీలో అక్రమాలు
కొన్ని చోట్ల అనర్హులను ఎంపిక చేసి పంపిన కమిటీలు తొలగించే పనిలో అధికారులు ఫిర్యాదులపై విచారణ షురూ విద్యారణ్యపురి : తెలంగాణ సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) జిల్లా ప్రాజెక్టు పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇటీవల వర్క్ ఎడ్యుకేషన్, ఆర్ట్ ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ బోధించేం దుకు అభ్యర్థుల ఎంపికలో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. సర్టిఫికెట్లతో పని లేకుండా పైరవీల కు, అమ్యామ్యాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లు వి మర్శలు వస్తున్నారుు. ఇదే విషయమై పలువురు అభ్యర్థులు కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో ఫిర్యాదు చేయగా అధికారులు విచారణ చేపట్టడంతో అక్రమాలు వెలుగు చూస్తున్నారుు. జిల్లాలో ఖాళీగా ఉన్న వర్క్ ఎడ్యుకేషన్ - 133, ఆర్ట్ ఎడ్యుకేషన్- 65, ఫిజికల్ ఎడ్యుకేషన్ - 15 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. టీటీసీ(టీచర్ టెక్నికల్ సర్టిఫికెట్) హయ్యర్లో ఉత్తీర్ణత సాధించడం అర్హతగా ప్రకటించారు. అభ్యర్థులకు నెలకు రూ.6 వేల వేతనం ఇవ్వాలని నిర్ణరుుంచారు. ఈ మేరకు పోస్టులు ఖాళీగా ఉన్న పాఠశాలల్లో ఆయూ హెచ్ఎంలే ఈ దరఖాస్తులు స్వీకరించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, హెచ్ఎం, స్కూల్ కాంప్లెక్స్ బాధ్యులు కమిటీగా ఏర్పడి ఆయా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసి గత నెలలోనే సర్వశిక్షాభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారులకు పంపారు. అరుుతే ఎంపిక చేసిన అభ్యర్థుల్లో కొందరు అనర్హులు కూడా ఉన్నట్లు అధికారుల సర్టిఫికెట్ల పరిశీలనలో వెల్లడైంది. కొందరు అభ్యర్థులు టీటీసీ లోయర్ సర్టిఫికెట్లను మాత్రమే కలిగి ఉన్నప్పటికీ వారిని పలుచోట్ల వివిధ పాఠశాలల కమిటీలు ఎంపిక చేసి పంపారు. ఆయా పోస్టులకు విద్యార్హతల మార్గదర్శకాలను ముందే జారీ చేసినప్పటికీ తమ ఇష్టానుసారంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కొందరు అభ్యర్థులు తమతమ పాఠశాలల పరిధిలో కమిటీలపై ఒత్తిడి చేసి ఎంపిక చేయించుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అన్యా యం జరిగిన అభ్యర్థులు కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్‌లోనూ ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ప్రాజెక్టు అధికారులు ఐదుగురు ఉద్యోగులతో విచారణ జరిపిస్తున్నారు. అనర్హులను ఎంపిక చేసిన పాఠశాలలకు వెళ్లి అక్కడ వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తి చేసి తుది జాబితా ఎప్పుడు వెల్లడిస్తారోనని అభ్యర్థులు వేచి చూస్తున్నారు. -
డీఎస్సీ-2014 విజేతగా నిలవాలంటే..
సంక్షోభ పరిస్థితుల కారణంగా చాలా నెలలుగా ప్రభుత్వ కొలువుల ప్రకటనలు లేకపోవడంతో నిరుద్యోగ యువత మనో వేదనకు గురైంది. ఇప్పుడు రాష్ట్ర విభజన అనంతరం కొత్త రూపు సంతరించుకున్న నవ్యాంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందన్న వార్తలు యువతలో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం రోజున గురువుల నియామకాలకు ప్రకటన వెలువరించనున్నట్లు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకటించడంతో ఔత్సాహికులు గెలుపే లక్ష్యంగా సన్నద్ధతను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష విధానం ఎలా ఉంటుంది? విజయానికి వ్యూహాలేమిటి? తదితరాలపై ఫోకస్.. సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి సెప్టెంబర్ 5న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా, ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న ప్రతి నిమిషాన్నీ టీచర్ ఉద్యోగాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి. తొలుత సిలబస్‌పై అవగాహన పెంపొందించుకొని, సరైన ప్రణాళికతో సన్నద్ధం కావాలి. ఎస్జీటీ పరీక్ష విధానం: సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు జీకే, కరెంట్ అఫైర్స్ 20 10 విద్యా దృక్పథాలు 20 10 లాంగ్వేజ్-1 (తెలుగు) 18 9 లాంగ్వేజ్-2 (ఇంగ్లిష్) 18 9 మ్యాథ్స్ కంటెంట్ 18 9 సైన్స్ కంటెంట్ 18 9 సోషల్ కంటెంట్ 18 9 టీచింగ్ మెథడాలజీ 30 15 మొత్తం 160 80 మెథడ్స్‌కు సంబంధించి తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్‌లో ఒక్కో దాన్నుంచి ఆరు ప్రశ్నలు చొప్పున మొత్తం 30 ప్రశ్నలు వస్తాయి. వీటికి 15 మార్కులుంటాయి. డీఎస్సీలో టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. టెట్‌లో సాధించిన ప్రతి 7 1/2 మార్కులకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఉంటుంది. జీకే, కరెంట్ అఫైర్స్: ఈ విభాగంలో స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. భౌగోళిక నామాలు; నదీ తీర నగరాలు; ప్రపంచ దేశాలు-రాజధానులు; ప్రపంచంలో మొట్టమొదట చోటుచేసుకున్న సంఘటనలు; సర్వోత్తమమైనవి; సైన్స్ అండ్ టెక్నాలజీ; అవార్డులు; సదస్సులు; వార్తల్లో వ్యక్తులు; క్రీడారంగ విశేషాలు; కేంద్ర, రాష్ర్ట వార్షిక బడ్జెట్లు; అంతర్జాతీయ రాజకీయ అంశాలు; భారతదేశంలో రాష్ట్రాల విభజన తదితర అంశాలపై దృష్టిసారించాలి. పరీక్షకు ముందు 8 నెలల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాలి. వర్తమాన వ్యవహారాల కు దినపత్రికలు చదవాలి. విద్యా దృక్పథాలు: భారతదేశంలో విద్యా చరిత్ర- కమిటీలు; వర్తమాన భారతదేశంలో విద్యా సంబంధిత అంశాలు; ఉపాధ్యాయ సాధికారత; చట్టాలు-హక్కులు; జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం (2005), విద్యా హక్కు చట్టం వంటి అంశాలను చదవాలి. గత డీఎస్సీలో అన్ని అంశాలకూ సమాన ప్రాధాన్యమిచ్చారు. ప్రిపరేషన్ కోసం డీఎడ్ స్థాయి విద్యా దృక్పథాలు ప్రభుత్వ పాఠ్యపుస్తకాన్ని అభ్యసనం చేయాలి. కంటెంట్: కంటెంట్ కోసం పదో తరగతి వరకు రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను అధ్యయనం చేయాలి. సోషల్‌లో భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం; మ్యాథ్స్‌లో సంఖ్యామానం, అంకగణితం, బీజగణితం, సమితులు- సంబంధాలు, క్షేత్రగణితం, రేఖాగణితం; తెలుగులో కవులు-కావ్యాలు, భాషా రూపాలు, పరుషాలు-సరళాలు; ఇంగ్లిష్‌లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వొకాబ్యులరీ, ఆర్టికల్స్-ప్రిపొజిషన్స్ తదితర అంశాలపై దృష్టిసారించాలి. మెథడాలజీ: బోధనా లక్ష్యాలు, భాషా నైపుణ్యాలు, బోధనా ప్రణాళిక, మూల్యాంకనం తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిని కంటెంట్‌లోని అంశాలకు అన్వయించుకుని అధ్యయనం చేయాలి. గత డీఎస్సీలో ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, తెలుగు మెథడాలజీ నుంచి క్లిష్టమైన ప్రశ్నలు వచ్చాయి. సన్నద్ధత కోసం డీఎడ్ రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను చదవాలి. సక్సెస్ మంత్రఓ విజేత సూచనలు..కంటెంట్ చదివేటప్పుడు క్రమపద్ధతిని అనుసరించాలి. ఉదాహరణకు మూడో తరగతిలో విశ్వానికి సంబంధించిన అంశాలుంటే మొదట వాటిని చదివి, సంబంధిత అంశాలు ఏ తరగతుల్లో ఉన్నాయో గుర్తించి వాటన్నింటినీ ఒకేసారి అధ్యయనం చేయాలి. ఏదైనా ఒక అంశం ఎనిమిదో తరగతి వరకు ఉండి, 9, 10 తరగతి పుస్తకాల్లో పునరావృతమవుతుందో వాటి మీద అధిక దృష్టి పెట్టాలి. టీచింగ్ మెథడాలజీ అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాలి. అప్పుడే చదివిన అంశాలు గుర్తుంటాయి. ఉదాహరణకు సైన్స్ మెథడాలజీలో ‘ప్రాజెక్టు పద్ధతి’ అనే అంశాన్ని చదివిన వెంటనే మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్‌ల మెథడాలజీలోని ప్రాజెక్టు పద్ధతిని కూడా అధ్యయనం చేయాలి. అప్పుడే ప్రాజెక్టు అంటే ఏమిటి? దాని లక్ష్యాలు ఏమిటి? వంటి అంశాలపై పూర్తిస్థాయి అవగాహన వస్తుంది. అప్పుడు ‘ప్రాజెక్టు’ నుంచి ప్రశ్న ఎలా ఇచ్చినా తేలిగ్గా సమాధానం గుర్తించగలం. సొంతంగా నోట్స్ తయారు చేసుకున్నప్పుడూ ఇదే క్రమాన్ని అనుసరించాలి. రోజూ దినపత్రికలను తప్పనిసరిగా చదవాలి. ముఖ్యమైన అంశాలతో నోట్స్ తయారు చేసుకోవాలి. ఏదైనా అంశంపై వార్త వస్తే వాటి అనుబంధ విషయాలను కూడా అధ్యయనం చేయాలి. ప్రశ్న నేరుగా రాని సందర్భాల్లో ఇలాంటి ప్రిపరేషన్‌తో లాభపడతాం. కొందరు మొదటే శిక్షణ సంస్థల మెటీరియల్‌ను చదవడం ప్రారంభిస్తారు. ఇది సరికాదు. తొలుత పాఠ్యపుస్తకాలను బాగా చదివిన తర్వాతే మెటీరియల్‌ను చదవాలి. శిక్షణ సంస్థలు నిర్వహించే మాక్ టెస్ట్‌లకు హాజరుకావాలి. అప్పుడే ప్రిపరేషన్లో లోటుపాట్లు తెలుస్తాయి. ఏ అంశాల్లో బలహీనంగా ఉన్నామో తెలుస్తుంది. వాటికనుగుణంగా ప్రణాళికను మార్చుకునేందుకు వీలవుతుంది. ప్రశ్నను అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, వేగాన్ని, కచ్చితత్వాన్ని పెంపొందించుకునేందుకు నమూనా పరీక్షలు ఉపయోగపడతాయి. క్లిష్టంగా ఉన్న అంశాలను పేపర్‌పై రాసుకొని, గదిలో గోడకు అతికించుకొని, వీలున్నప్పుడల్లా చదివితే వాటిపై వారం రోజుల్లో పట్టు సాధించవచ్చు. ఒక వారం దేశాలు-రాజధానులు; మరో వారం ప్రముఖ యుద్ధాలు-జరిగిన తేదీలు.. ఇలా వివిధ అంశాలను తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. సెల్‌ఫోన్ వాయిస్ రికార్డర్‌తో క్లిష్టమైన అంశాలను రికార్డు చేసుకొని, నిద్రపోయే ముందు వినొచ్చు. ఇలా ఎవరికివారు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టకుండా ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే తీవ్ర పోటీ ఉన్న డీఎస్సీలో విజయం సాధించగలం. ఏ అంశాన్నీ నిర్లక్ష్యం చేయకూడదు. రకరకాల కారణాల వల్ల ఒకశాతం అంశాల్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ ఒక్కశాతమే విజయావకాశాలను దెబ్బతీస్తుందని గుర్తించాలి.ప్రారంభంలోనే దాదాపు రూ.22 వేల వేతనం; ఆహ్లాదకరమైన పని వాతావరణం; ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్దే సదవకాశం.. ఇవన్నీ టీచర్ ఉద్యోగంతో ఖాయం చేసుకోవచ్చు. ఓ ఐదు నెలల పాటు పటిష్ట ప్రణాళికతో సాధన చేస్తే విజయం మీదే! - డి.అజయ్ కుమార్; ఎస్జీటీ విజేత; పశ్చిమగోదావరి. స్కూల్ అసిస్టెంట్ పరీక్ష విధానం సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు జీకే, కరెంట్ అఫైర్స్ 20 10 విద్యా దృక్పథాలు 20 10 కంటెంట్ (సంబంధిత సబ్జెక్ట్) 88 44 మెథడాలజీ 32 16 మొత్తం 160 80 ప్రతి ప్రశ్నకు 0.5 (అర) మార్కు. మొత్తం 160 ప్రశ్నలకు 80 మార్కులు కేటాయించారు. టెట్ స్కోర్‌కు వెయిటేజ్ 20 మార్కులకు ఉంటుంది. ఎస్జీటీలోని జీకే, కరెంట్ అఫైర్స్; విద్యా దృక్పథాలు; టీచింగ్ మెథడాలజీ, కంటెంట్ అంశాలు స్కూల్ అసిస్టెంట్‌లోనూ ఉంటాయి. కంటెంట్‌కు ఆరు నుంచి ఇంటర్ వరకు పాఠ్య పుస్తకాలు చదవాలి. స్కూల్ అసిస్టెంట్- సోషల్ స్టడీస్ కంటెంట్: భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు; ఖండాలు; భారతదేశ ఉనికి-భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి. 15 మార్కులకుగాను 30 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో ప్రపంచ భూగోళశాస్త్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్ర: మధ్యయుగ ప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆధునిక ప్రపంచం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులు; సమకాలీన ప్రపంచం అంశాల నుంచి 15 మార్కులకుగాను 30 ప్రశ్నలు వస్తాయి. పౌరశాస్త్రం: భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశం పాత్ర; ఐక్యరాజ్య సమితి వంటి పాఠ్యాంశాల నుంచి 7 మార్కులకుగాను 14 ప్రశ్నలు వస్తాయి. అర్థశాస్త్రం: ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి పాఠ్యాంశాల నుంచి 7 మార్కులకుగాను 14 ప్రశ్నలు వస్తాయి. 2012 డీఎస్సీలో 9, 10 తరగతుల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధనోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో బోధనోపకరణాలు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీకి డీఎడ్, బీఎడ్ స్థాయి పాఠ్యపుస్తకాలను చదవాలి. ఎస్ఏ- గణిత శాస్త్రం కంటెంట్: ప్రధానంగా బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాల నుంచి 44 మార్కులకు 88 ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో వైశ్లేషిక రేఖాగణితం, బహుపదులు, త్రికోణమితి నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ఈ విభాగంలో ప్రధానంగా గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో బోధనా పద్ధతులు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. ఎస్ఏ-బయాలజీ కంటెంట్: ప్రధానంగా జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జీవశాస్త్రం-ఆధునిక పోకడలు; జంతు ప్రపంచం వంటి పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలుంటాయి. 2012 డీఎస్సీలో జువాలజీ కంటే బోటనీ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. మెథడాలజీ: ప్రధానంగా జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. గత డీఎస్సీలో అన్ని అంశాలకు సమ ప్రాధాన్యమిచ్చారు.