ఎస్‌జీఎఫ్ జాతీయ క్రీడలు షురూ
ఎస్‌జీఎఫ్ జాతీయ క్రీడలు షురూ
Published Wed, Oct 5 2016 12:05 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
వరంగల్ స్పోర్ట్స్ : వ్యాయామ విద్య ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణాయుత ప్రవర్తన అలవడుతుందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, శాయ్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. 62వ ఎస్‌జీఎఫ్ అండర్-19 నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టెన్నిస్, వాలీబాల్ విభాగాల్లో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మందికిపైగా క్రీడాకారులు జిల్లాకు చేరుకున్నారు. ఈ పోటీలను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి మార్చ్‌ఫాస్ట్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. నాగపురి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన దేశాన్ని సాధించాలంటే వ్యాయామ విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. సరైన గైడెన్స్ ఉంటే దేశం నుంచి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారన్నారు. యూరి దాడిలో మృతిచెందిన భారత సైనికులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పేరిణి నృత్య ప్రదర్శన, ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు రేణుక శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తెలంగాణ బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఎస్‌జీఎఫ్ అండర్-19 జిల్లా సెక్రటరీ డాక్టర్ కోట సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ బాధ్యుడు వాంక్వా, , ఎస్‌జీఎఫ్ రాష్ట్ర అబ్జర్వర్ రామిరెడ్డి, ఇంటర్ ఆర్‌ఐఓ షేక్ అహ్మద్, డీఎస్‌డీఓ ఇందిర, సత్యనారాయణ, భారత జ్యోతి అవార్డు గ్రహీత జగన్మోహన్ మెల్టా, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జి పాణి, జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్ యాదవ్, బాబూరావు, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, పీడీ బరుపాటి గోపి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement