nagapuri Ramesh
-
ఎస్జీఎఫ్ జాతీయ క్రీడలు షురూ
వరంగల్ స్పోర్ట్స్ : వ్యాయామ విద్య ద్వారా విద్యార్థులకు క్రమశిక్షణాయుత ప్రవర్తన అలవడుతుందని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, శాయ్ అథ్లెటిక్ కోచ్ నాగపురి రమేష్ అన్నారు. 62వ ఎస్జీఎఫ్ అండర్-19 నేషనల్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, టెన్నిస్, వాలీబాల్ విభాగాల్లో జరుగనున్న పోటీల్లో పాల్గొనేందుకు 29 రాష్ట్రాల నుంచి వెయ్యి మందికిపైగా క్రీడాకారులు జిల్లాకు చేరుకున్నారు. ఈ పోటీలను ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారుల నుంచి మార్చ్ఫాస్ట్ ద్వారా గౌరవ వందనం స్వీకరించారు. నాగపురి రమేష్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన దేశాన్ని సాధించాలంటే వ్యాయామ విద్యను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందన్నారు. సరైన గైడెన్స్ ఉంటే దేశం నుంచి ఎంతోమంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారవుతారన్నారు. యూరి దాడిలో మృతిచెందిన భారత సైనికులకు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం ప్రకటించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పేరిణి నృత్య ప్రదర్శన, ప్రముఖ కూచిపూడి నృత్య శిక్షకురాలు రేణుక శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తెలంగాణ బతుకమ్మ ఆటపాటలు ఆకట్టుకున్నాయి. ఎస్జీఎఫ్ అండర్-19 జిల్లా సెక్రటరీ డాక్టర్ కోట సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వాలీబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ బాధ్యుడు వాంక్వా, , ఎస్జీఎఫ్ రాష్ట్ర అబ్జర్వర్ రామిరెడ్డి, ఇంటర్ ఆర్ఐఓ షేక్ అహ్మద్, డీఎస్డీఓ ఇందిర, సత్యనారాయణ, భారత జ్యోతి అవార్డు గ్రహీత జగన్మోహన్ మెల్టా, కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ జి పాణి, జూడో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కైలాష్ యాదవ్, బాబూరావు, డాక్టర్ జె.వెంకటేశ్వర్లు, పీడీ బరుపాటి గోపి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వాసిగా గర్విస్తున్నా
తెలంగాణ బిడ్డలకు పురస్కారం అంకితం ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్ నాగపురి సాక్షి, హన్మకొండ : ‘వరంగల్ గడ్డ మీద పుట్టినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. మన నీళ్లు, మన నేలకు పోరాట స్వభావం ఉంది. అందుకే అండ లేకున్నా, అడ్డంకులు ఎదురైనా పోరాడుతూ ఈ స్థాయికి చేరుకున్నా’ అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. తన ఎదుగుదలకు కారణమైన వరంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతన్నానని అన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న పోరాట స్వభావం వల్లే ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించడం నేర్చుకున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే తన ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో రాష్ట్రస్థాయిలో బెస్ట్కోచ్గా కృపాచార్య అవార్డుకు తనను ఎంపిక చేశారని, మెమెంటో ఇచ్చారని అయితే, రివార్డుగా ఇవ్వాల్సిన రూ. 50 వేలు ఇంతవరకు అందలేదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంటే నిర్లక్ష్యం ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వారందరికీ తన అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు. -
అసాధారణ ద్రోణచార్యుడు
అపజయం నుంచి విజయం వైపు అంకితభావంతో ఆంగ్లంపై పట్టు స్ట్రీట్ఫైట్లను వద్దని మైదానానికి అంకితం భద్రకాళి గుట్టలపై రన్నింగ్ ప్రాక్టీస్ సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ వీవీఎస్ లక్ష్మణ్‌కు పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌గా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్ నగరంలోని కాపువాడలో పెంకుటిల్లులో నివాసం.. గ్యాస్ దీపం కింద చదువు.. పెళ్లిళ్లలో బరాత్‌కు డ్యాన్సు లు చేసే సామాన్యుడు నాగపూరి రమేశ్. పరుగు పందెంపై ఉన్న మక్కువ ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది. రన్నింగ్ ప్రాక్టీస్ కోసం భద్రకాళి దేవస్థానం గుట్టలపైకి పరుగెత్తడం ప్రారంభించి చివరకు.. దేశ రాజధాని ఢిల్లీలో ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఈనెల 29న రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నేపథ్యంలో నాగపూరి రమేష్ ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. –సాక్షి, హన్మకొండ ఒక మనిషి జీవితంలో అతడు పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇష్టాఇష్టాలు, వ్యక్తుల పరిచయాలు, కష్టాలు, సవాళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటికి మనం ఎలా స్పందిస్తామనే అంశంపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా క్రీడారంగంలో కఠోరమైన శ్రమ ఉండాలి. పోటీల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యత ప్రదర్శించాలి. అప్పుడే ఆటల్లో గెలిచి పతకాలు సాధించవచ్చు. మంచి పేరు సంపాదించవచ్చు. గోడకు కొట్టిన బంతిలా 2014లో జరిగిన కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో 400 ‘ 4 రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ లక్ష్యంగా రెండేళ్లకు పైగా శ్రమించి మంచి అథ్లెటిక్స్ టీమ్‌ను తయారు చేశాను. రేయింబవళ్లు క్రీడాకారుల ఫిట్నెస్ను కాపాడుతూ శిక్షణ ఇచ్చాను. దురదృష్టం కొద్ది కామన్వెల్త్ గేమ్స్‌లో మా టీమ్ అనుకున్న ఫలితాలు సాధించలేదు. దీనికి నన్ను బాధ్యుడిని చేస్తూ స్పోర్ట్స్ అధికారులు ఏషియన్ గేమ్స్ జాతీయ శిబిరం శిక్షణ బాధ్యతల నుంచి తప్పించారు. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నాలుగు వారాల వ్యవధిలోనే ఏషియన్ గేమ్స్ ఉండడంతో అథ్లెటిక్స్‌కు మరో కోచ్‌ను నియమించారు. ఈ ఆటల్లో 400 ‘ 4 విభాగంలో గోల్డ్‌మెడల్‌తో పాటు ఏషియన్ గేమ్స్ రికార్డు బద్దలు అయింది. ఈ క్రెడిట్ అంతా కొత్తగా వచ్చిన కోచ్‌కు వెళ్లింది. రెండేళ్ల నా శ్రమ మరుగున పడిపోయింది. ఈ సమయంలో ఎంతో బాధగా అనిపించింది. నా కష్టం గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చింది. సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ కోచ్ బాధ్యతల నుంచి స్పోర్ట్స్ అధికారులు నన్ను తప్పించడంతో కొన్ని నెలలపాటు నేను ఖాళీగా ఉన్నాను. ఈ సమయంలో ఇండియా బ్యాడ్మింటన్ లెజండ్, కోచ్ గోపీచంద్ నన్ను పిలిచి తన అకాడమీలో క్రీడాకారులకు ఫిట్నెస్ శిక్షణ ఇవ్వాలని కోరాడు. అలా 2014 నుంచి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో క్రీడాకారులకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తున్నాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అథ్లెట్ ద్యుతిచంద్ తన స్వరాష్ట్రం ఒడిషా నుంచి నాకు ఫోన్ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఇతర క్రీడా సంస్థలు పట్టించుకోకపోవడంతో తన ¿¶ విష్యత్ ప్రమాదంలో పడిందని చెప్పింది. ఈ విషయంపై గోపీచంద్‌తో మా ట్లాడగా.. తన అకాడమీలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ద్యుతిచంద్ను హైదరాబాద్‌కు రప్పించి ఆమె శిక్షణను సవాల్‌గా స్వీకరించాను. 2015 జనవరి నుంచి ద్యుతికి 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యున్నత శిక్షణ ఇచ్చాను. ఈ మేరకు గత జూన్‌లో జరిగిన రియో ఒలింపిక్స్ అర్హత పోటీలో ఆమె విజయం సాధించింది. 32 ఏళ్ల తర్వాత పీటీ ఉష అనంతరం ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా ద్యుతిచంద్ గుర్తింపు పొందింది. వీవీఎస్ లక్ష్మణ్‌కు ఫిట్నెస్ కోచ్‌గా.. 1996–99 కాలంలో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో పనిచేశాను. ఈ సమయంలో స్కూల్ ప్రిన్సిపాల్, సాయ్ రీజినల్ డైరెక్టర్ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో నేను బలయ్యాను. ఈ సందర్భంగా అకారణంగా నన్ను బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్‌కు సరెండర్ చేశారు. అక్కడ 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వెళ్తున్న హాకీ జట్టుకు ఫిట్నెస్ కోచ్‌గా పని చేశాను. ఈ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఒక సారి విమానంలో హాకీ జట్టు ఇండియా కెప్టెన్ ముకే ష్, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ముకేష్ ఫిట్నెస్ గురించి లక్ష్మణ్ వాకబు చేయగా.. ఆయన నా పేరు చెప్పారు. దీంతో 2000లో వీవీఎస్ లక్ష్మణ్‌కు పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌గా పనిచేశాను. ఏడాది వ్యవధిలోనే ఆయన ఫిట్నెస్ మెరుగుపడింది. 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆయన 271 పరుగులు సాధించారు. అలా ఆనాడు ఆయనతో ఏర్పడిన బంధం క్రికెట్‌కు రిటైర్డ్మెంట్ ప్రకటించే వరకు కొనసాగింది. ఇంగ్లిష్తో ఇబ్బంది జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరించే వారు వివిధ భాషలు మాట్లాడే వారితో పనిచేయాల్సి ఉంటుంది. నేను ఇంగ్లిష్‌లో పట్టు సాధించేందుకు హన్మకొండ బాలసముద్రానికి చెందిన మల్లేశం సారు, నా సీనియర్, గైడ్ ప్రదీప్లే కారణం. డిగ్రీలో ఉన్నప్పుడు బాలసముద్రంలో మల్లేశం సారు దగ్గర మూడు నెలలపాటు స్పోకెన్ ఇంగ్లిష్‌లో కోచింగ్ తీసుకున్నాను. దీనికి ఫీజు ప్రదీప్ కట్టాడు. ఎంపీఈడీ చేసేందుకు తమిళనాడులోకి కారైకుడికి వెళ్లినప్పుడు తొలిసారిగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. వాళ్లకు తెలుగురాదు.. నాకు తమిళం రాదు. మల్లేశం సారు చెప్పిన పాఠాలు గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటు చేసుకున్న. హిందూ పేపర్, ఇంగ్లిష్ వార్తా చానళ్లు చూస్తూ ఆ భాషపై పట్టు సాధించాను. స్ఫూర్తి నింపిన స్నేహం హన్మకొండలోని కాపువాడలో మా ఇల్లు. సాయంత్రం అయితే మా వీధి పోరగాళ్లు టిప్‌టాప్‌గా తయారై అలంకార్ సెంటర్లో ఉన్న క్యాంటీన్, డబ్బాల కాడికి పోతుండేవాళ్లు. నేను స్పోర్ట్స్ బనీను, షార్ట్ వేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్‌కు పోతుండేవాడిని. నేను వాళ్లలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నానని అని అప్పుడప్పుడు అనిపించేంది. మా వాడకు చెందిన పిల్లలు ఎక్కువ స్ట్రీట్ఫైట్లకు వెళ్లేవారు. నేను ఉదయం, సాయంత్రం గ్రౌండ్లో ఉండడం వల్ల, ఆ ప్రభావం నా మీద పడలేదు. మైదానంలో నా సీనియర్, జాతీయస్థాయి క్రీడాకారుడు ప్రదీప్ నాకు పరిచయమయ్యారు. అతడి ప్రభావం నాపై ఎక్కువ పడింది. తను కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తుండేవారు. తనతో పాటు ఆయన నన్ను యూనివర్సిటీకి తీసుకెళ్లేవారు. అక్కడ పీజీ చేసే వాళ్లను చూస్తే నాకు గొప్పగా అనిపించేది. ఇక ప్రదీప్ వాళ్ల ఇంటికి వెళితే.. వాళ్ల ఫ్యామిలీలో డాక్టర్లు, ఇంజినీర్లు ఉండేవాళ్లు. వాళ్లను చూస్తే కొత్త ఉత్సాహం కలిగేది. అప్పుడే ఆటల మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయెుద్దని నిర్ణయించుకున్న. మా నాన్న హన్మకొండ నక్కలగుట్ట కరెంటాఫీసులో అటెండర్‌గా పని చేస్తుండే వారు. సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ గ్రౌండ్‌కు వచ్చి నా ప్రాక్టీస్‌ను చూసి సంబరపడేవారు. వీధిలో మిగతా పిల్లలకు భిన్నంగా నేను గ్రౌండ్లో చెమటోడ్చడం ఆయనకు నచ్చేది. మడికొండ దాకా ఉరుకుడే ఆ రోజుల్లో వరంగల్‌లో ప్రొఫెషనల్ కోచ్‌లు అందరికీ అందుబాటులో లేరు. రామకృష్ణ సార్ కోచింగ్‌లో నేను రన్నింగ్‌లో మెళకువలు, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకున్న. మంచి ఎన్విరాన్మెంట్ కండీషన్, ఫుడ్ లభించడం కష్టంగా ఉండేది. అయినప్పటికీ రన్నింVŠ పై ఇష్టంతో ఉదయం, సాయంత్రం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసేందుకు హన్మకొండ జేఎన్ఎస్ నుంచి మడికొండ వరకు 20 కిలోమీటర్లు, జేఎన్ఎస్ నుంచి హంటర్‌రోడ్డులోని రైస్‌మిల్లుల వరకు 12 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తేవాడిని. ఈ శ్రమ ఫలించి 3000 మీటర్ల పరుగు పందెలో ఆలిండియా జూనియర్ లెవల్లో బంగారు పతకం, ఆలిండియా యూనివర్సిటీ లెవల్లో చాంపియన్‌గా నిలిచాను. ఆడలేను అనుకున్నా.. నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ కోసం భద్రకాళీ గుట్టల్లో పరుగెత్తేవాడిని. ఒక సారి జారి పడితే కాలు ఫ్రాక్చర్ అయింది. 21 రోజులు పూర్తిగా మంచంపైనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఆటలే లోకంగా బతికాను. నా కాలు విరగడంతో భవిష్యత్ ఏమవుతుందో అన్ని భయపడ్డాను. ఆ తర్వాత ఆటగాడిగా, కోచ్‌గా నా ప్రస్థానం ద్రోణాచార్య అవార్డు అందుకునే వరకు వచ్చింది. ఈ అవార్డు నా జీవితంలో మరిచిపోలేనిది. నేను ఈ స్థాయికి చే రేందుకు ప్రోత్సహించిన అమ్మానాన్న, స్నేహితులు, కోచ్‌లు, కుటుంబసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాను. -
ద్రోణాచార్యుడు రమేష్
-
ద్రోణాచార్య.. నాగపురి రమేష్
జిల్లాకు తొలిసారిగా దక్కిన గౌరవం హన్మకొండలో పుట్టి పెరిగిన రమేష్ కనీస సౌకర్యాలు లేని రోజుల్లో భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శిష్యులు ఏషియన్, కామన్వెల్త్, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం సాక్షి, హన్మకొండ : వరంగల్ పరుగుల యంత్రం నాగపూరి రమేష్‌కు క్రీడారంగంలో దేశంలో అత్యున్నత పురస్కారమైన ద్రోణాచార్య అవార్డు వరించింది. అథ్లెటిక్స్ విభాగంలో ఇరవై రెండేళ్ల ప్రస్థానంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేసింది. ఆగస్టు 29న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జిల్లా నుంచి ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా నాగపూరి రమేష్ గుర్తింపు పొందారు. హన్మకొండ మచిలీబజార్ ఆయన స్వస్థలం కాగా తల్లిదండ్రులు నాగపూరి మల్లయ్య, ఉప్పలమ్మ. వీరికి ఐదుగురు సంతానంలో నాలుగో వాడైన నాగపూరి రమేష్ చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ ప్రదర్శించేవారు. అలా జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 1992 నుంచి అథ్లెట్ కోచ్‌గా పని చేస్తున్నారు. ఇరవై రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడాకారులను సానబెట్టి ఏషియన్, కామన్వెల్త్ క్రీడల్లో అథ్లెటిక్స్ విభాగంలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. ఒలంపిక్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించింది తక్కువ. ఇందులో నాగపూరి రమేష్ శిక్షణలో రాటుదేలిన సత్తి గీత, ద్యుతిచంద్ ఏథెన్స్, రియోడిజనీరో ఒలింపిక్‌లో పాల్గొనడం విశేషం. భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్ ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘సాక్షి’ నాగపూరి రమేష్‌ను ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు రమేష్ మాటల్లోనే... నేను పుట్టి పెరిగింది హన్మకొండలోని మచిలీబజార్. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్‌పై ఆసక్తి ఉండేది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న భద్రకాళి గుట్టల వైపు వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని. తర్వాత జేఎన్ఎస్ స్టేడియంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేశాను. 1985–87 సమయంలో జాతీయ స్థాయిలో జూనియర్ లెవల్లో 3000 మీటర్ల పరుగు పందెం, ఆలిండియా యూనివర్సిటీ పోటీలో చాంపియన్‌గా నిలిచాను. శిక్షకుడిగా.. నేను ఆటగాడిగా ఎదిగే రోజుల్లో రామకృష్ణ సార్ నాకు కోచింగ్ ఇచ్చారు. నా సీనియర్లు సారంగపాణి, ప్రదీప్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా ప్రదీప్ నుంచి స్ఫూర్తి పొందాను. 1990 తర్వాత తమిళనాడులోని కారైకుడిలో ఎంపీఈడీ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఇక్కడ నాకు గోల్డ్‌మెడల్ వచ్చింది. దీంతో 1992లో స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో అథ్లెటిక్స్ కోచ్‌గా త్వరగా ఉద్యోగం వచ్చింది. అలా అథ్లెటిక్ శిక్షకుడిగా నా పరుగు మొదలైంది. విజయ పరంపర.. శిక్షకుడిగా నా ప్రస్థానంలో తొలి విజయం 1996 న్యూఢిల్లీలో జరిగిన జూనియర్ ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లో లభించింది. హన్మకొండకే చెందిన అథ్లెట్ మాధవి లాంగ్‌జంప్‌లో పతకం సాధించింది. దీంతో జాతీయస్థాయిలో కోచింగ్ ఇచ్చే బాధ్యతలు వరించాయి. 2002, 2006, 2010, 2014 వరుసగా నాలుగు ఏషియన్ గేమ్స్‌లో నా శిష్యులు సత్తి గీత, మృదుల, సౌజన్య, మౌనిక, మాధవి 4“400 రిలే పోటీలో బంగారు పతకాలు సాధించారు. 2004, 2008ల్లో ఏథెన్స్, బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో సత్తి గీత ప్రాతినిధ్యం వహించింది. పీఈటీలకు అంకితం.. ఎటువంటి స్వార్థం లేకుండా పని చేసే పీఈటీలు, ఎలాంటి అండదండలు లేని క్రీడాకారులను గుర్తించి, వారికి వెన్నుదన్నుగా నిలిచే పీఈటీలకు నాకు వచ్చిన ద్రోణాచార్య అవార్డును అంకితం ఇస్తున్నాను. వీరితో పాటు జూనియర్ క్రీడాకారులకు మార్గదర్శులుగా నిలుస్తూ, జూనియర్ల ప్రతిభకు మెరుగులు దిద్దే సీనియర్ క్రీడాకారులకు ఈ అవార్డు అంకితం. శిష్యుల విజయాలనే తమ విజయాలుగా భావించే పీఈటీలు, సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు. పీటీ ఉష తర్వాత రమేష్ శిష్యురాలే.. ప్రస్తుతం రియోలో జరుగుతున్న ఒలింపిక్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో రమేష్ శిక్షణలో రాటుదేలిన ద్యుతీచంద్ ప్రాతినిధ్యం వహించింది. పీటీ ఉష తర్వాత 32 ఏళ్లకు ఈ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ద్యుతీకి రావడం విశేషం. అయితే, రియోకు క్రీడాకారులను పంపించే సమయంలో ద్యుతీచంద్, రమేష్‌ను ఒకేసారి కాకుండా వేర్వేరుగా పంపించారు. ఒలింపిక్స్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. అయితే, ఒలింపిక్స్‌లో ద్యుతీ విఫలమైంది. కానీ ద్యుతీ, రమేష్‌ను ఒకేసారి రియోకు పంపిస్తే ఫలితం వేరేగా రావడంతో పాటు సింధు విషయంలో గోపీచంద్‌కు దక్కిన ప్రశంసలే రమేష్‌కు కూడా దక్కేవన్న అభిప్రాయం క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతోంది. ప్రొఫైల్ పేరు : నాగపురి రమేష్ తల్లిదండ్రులు : ఉప్పలమ్మ–మల్లయ్య స్వస్థలం : మచిలీబజార్, హన్మకొండ భార్య : విద్యుల్లత పిల్లలు : అనూష, సాయిభవిత