ద్రోణాచార్య.. నాగపురి రమేష్‌ | dronacharya award to Coch Nagapuri Ramesh | Sakshi
Sakshi News home page

ద్రోణాచార్య.. నాగపురి రమేష్‌

Published Tue, Aug 23 2016 12:03 AM | Last Updated on Mon, Sep 4 2017 10:24 AM

రియోలో అథ్లెట్‌ ద్యుతిచంద్‌ తదితరులతో నాగపురి రమేష్‌

రియోలో అథ్లెట్‌ ద్యుతిచంద్‌ తదితరులతో నాగపురి రమేష్‌

  • జిల్లాకు తొలిసారిగా దక్కిన గౌరవం
  • హన్మకొండలో పుట్టి పెరిగిన రమేష్‌
  • కనీస సౌకర్యాలు లేని రోజుల్లో భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్‌
  • అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన శిష్యులు
  • ఏషియన్, కామన్‌వెల్త్, ఒలింపిక్స్‌లో ప్రాతినిధ్యం
  • సాక్షి, హన్మకొండ : వరంగల్‌ పరుగుల యంత్రం నాగపూరి రమేష్‌కు క్రీడారంగంలో దేశంలో అత్యున్నత పురస్కారమైన ద్రోణాచార్య అవార్డు వరించింది. అథ్లెటిక్స్‌ విభాగంలో ఇరవై రెండేళ్ల ప్రస్థానంలో చేసిన సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం ఆయనను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేసింది. ఆగస్టు 29న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు. జిల్లా నుంచి ద్రోణాచార్య అవార్డు అందుకున్న తొలి వ్యక్తిగా నాగపూరి రమేష్‌ గుర్తింపు పొందారు.
     
    హన్మకొండ మచిలీబజార్‌ ఆయన స్వస్థలం కాగా తల్లిదండ్రులు నాగపూరి మల్లయ్య, ఉప్పలమ్మ. వీరికి ఐదుగురు సంతానంలో నాలుగో వాడైన నాగపూరి రమేష్‌ చిన్నతనం నుంచే క్రీడలపై మక్కువ ప్రదర్శించేవారు. అలా జాతీయ స్థాయి అథ్లెట్‌గా ఎదిగారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 1992 నుంచి అథ్లెట్‌ కోచ్‌గా పని చేస్తున్నారు. ఇరవై రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న క్రీడాకారులను సానబెట్టి ఏషియన్, కామన్‌వెల్త్‌ క్రీడల్లో అథ్లెటిక్స్‌ విభాగంలో బంగారు పతకాలు సాధించేలా తీర్చిదిద్దారు. ఒలంపిక్‌లో అథ్లెటిక్స్‌ విభాగంలో భారత క్రీడాకారులు ప్రాతినిధ్యం వహించింది తక్కువ. ఇందులో నాగపూరి రమేష్‌ శిక్షణలో రాటుదేలిన సత్తి గీత, ద్యుతిచంద్‌ ఏథెన్స్, రియోడిజనీరో ఒలింపిక్‌లో పాల్గొనడం విశేషం.
     
    భద్రకాళి గుట్టల్లో ప్రాక్టీస్‌
    ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన సందర్భంగా ‘సాక్షి’ నాగపూరి రమేష్‌ను ఫోన్‌లో పలకరించింది. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన అంశాలు రమేష్‌ మాటల్లోనే... నేను పుట్టి పెరిగింది హన్మకొండలోని మచిలీబజార్‌. చిన్నప్పటి నుంచి నాకు రన్నింగ్‌పై ఆసక్తి ఉండేది. మా ఇంటికి దగ్గర్లో ఉన్న భద్రకాళి గుట్టల వైపు వెళ్లి రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవాడిని. తర్వాత జేఎన్‌ఎస్‌ స్టేడియంలో రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేశాను. 1985–87 సమయంలో జాతీయ స్థాయిలో జూనియర్‌ లెవల్‌లో 3000 మీటర్ల పరుగు పందెం, ఆలిండియా యూనివర్సిటీ పోటీలో చాంపియన్‌గా నిలిచాను.
     
    శిక్షకుడిగా..
    నేను ఆటగాడిగా ఎదిగే రోజుల్లో రామకృష్ణ సార్‌ నాకు కోచింగ్‌ ఇచ్చారు. నా సీనియర్లు సారంగపాణి, ప్రదీప్‌ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. ముఖ్యంగా ప్రదీప్‌ నుంచి స్ఫూర్తి పొందాను. 1990 తర్వాత తమిళనాడులోని కారైకుడిలో ఎంపీఈడీ పూర్తి చేశాను. ఆ తర్వాత బెంగళూరులో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కోచింగ్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఇక్కడ నాకు గోల్డ్‌మెడల్‌ వచ్చింది. దీంతో 1992లో స్పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో అథ్లెటిక్స్‌ కోచ్‌గా త్వరగా ఉద్యోగం వచ్చింది. అలా అథ్లెటిక్‌ శిక్షకుడిగా నా పరుగు మొదలైంది.
     
    విజయ పరంపర..
    శిక్షకుడిగా నా ప్రస్థానంలో తొలి విజయం 1996 న్యూఢిల్లీలో జరిగిన జూనియర్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో లభించింది. హన్మకొండకే చెందిన అథ్లెట్‌ మాధవి లాంగ్‌జంప్‌లో పతకం సాధించింది. దీంతో జాతీయస్థాయిలో కోచింగ్‌ ఇచ్చే బాధ్యతలు వరించాయి. 2002, 2006, 2010, 2014 వరుసగా నాలుగు ఏషియన్‌ గేమ్స్‌లో నా శిష్యులు సత్తి గీత, మృదుల, సౌజన్య, మౌనిక, మాధవి 4“400 రిలే పోటీలో బంగారు పతకాలు సాధించారు. 2004, 2008ల్లో ఏథెన్స్, బీజింగ్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 400 మీటర్ల పరుగు పందెంలో సత్తి గీత ప్రాతినిధ్యం వహించింది. 
     
    పీఈటీలకు అంకితం..
    ఎటువంటి స్వార్థం లేకుండా పని చేసే పీఈటీలు, ఎలాంటి అండదండలు లేని క్రీడాకారులను గుర్తించి, వారికి వెన్నుదన్నుగా నిలిచే పీఈటీలకు నాకు వచ్చిన ద్రోణాచార్య అవార్డును అంకితం ఇస్తున్నాను. వీరితో పాటు జూనియర్‌ క్రీడాకారులకు మార్గదర్శులుగా నిలుస్తూ, జూనియర్ల ప్రతిభకు మెరుగులు దిద్దే సీనియర్‌ క్రీడాకారులకు ఈ అవార్డు అంకితం. శిష్యుల విజయాలనే తమ విజయాలుగా భావించే పీఈటీలు, సీనియర్‌ ప్లేయర్లు ఎంతో మంది ఉన్నారు.
     
    పీటీ ఉష తర్వాత రమేష్‌ శిష్యురాలే..
    ప్రస్తుతం రియోలో జరుగుతున్న ఒలింపిక్‌లో 100 మీటర్ల స్ప్రింట్‌లో రమేష్‌ శిక్షణలో రాటుదేలిన ద్యుతీచంద్‌ ప్రాతినిధ్యం వహించింది. పీటీ ఉష తర్వాత 32 ఏళ్లకు ఈ విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించే అవకాశం ద్యుతీకి రావడం విశేషం. అయితే, రియోకు క్రీడాకారులను పంపించే సమయంలో ద్యుతీచంద్, రమేష్‌ను ఒకేసారి కాకుండా వేర్వేరుగా పంపించారు. ఒలింపిక్స్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. అయితే, ఒలింపిక్స్‌లో ద్యుతీ విఫలమైంది. కానీ ద్యుతీ, రమేష్‌ను ఒకేసారి రియోకు పంపిస్తే ఫలితం వేరేగా రావడంతో పాటు సింధు విషయంలో గోపీచంద్‌కు దక్కిన ప్రశంసలే రమేష్‌కు కూడా దక్కేవన్న అభిప్రాయం క్రీడాభిమానుల నుంచి వ్యక్తమవుతోంది.
     
    ప్రొఫైల్‌
    పేరు : నాగపురి రమేష్‌
    తల్లిదండ్రులు : ఉప్పలమ్మ–మల్లయ్య
    స్వస్థలం : మచిలీబజార్, హన్మకొండ
    భార్య : విద్యుల్లత
    పిల్లలు : అనూష, సాయిభవిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement