అవార్డు తీసుకున్న అనంతరం ప్రధాని మోదీతో నాగపురి రమేశ్
- తెలంగాణ బిడ్డలకు పురస్కారం అంకితం
- ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్ నాగపురి
సాక్షి, హన్మకొండ : ‘వరంగల్ గడ్డ మీద పుట్టినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. మన నీళ్లు, మన నేలకు పోరాట స్వభావం ఉంది. అందుకే అండ లేకున్నా, అడ్డంకులు ఎదురైనా పోరాడుతూ ఈ స్థాయికి చేరుకున్నా’ అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపురి రమేశ్ అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఆయన ద్రోణాచార్య అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు.
తన ఎదుగుదలకు కారణమైన వరంగల్ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతన్నానని అన్నారు. ఈ ప్రాంతానికి ఉన్న పోరాట స్వభావం వల్లే ప్రతికూల పరిస్థితుల్లోనూ రాణించడం నేర్చుకున్నానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం రావడం వల్లే తన ప్రతిభకు, కష్టానికి తగిన గుర్తింపు లభించిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2006లో రాష్ట్రస్థాయిలో బెస్ట్‌కోచ్‌గా కృపాచార్య అవార్డుకు తనను ఎంపిక చేశారని, మెమెంటో ఇచ్చారని అయితే, రివార్డుగా ఇవ్వాల్సిన రూ. 50 వేలు ఇంతవరకు అందలేదని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలంటే నిర్లక్ష్యం ఉండేదని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న వారందరికీ తన అవార్డును అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు.