అసాధారణ ద్రోణచార్యుడు | Unusual dronacharya | Sakshi
Sakshi News home page

అసాధారణ ద్రోణచార్యుడు

Published Sat, Aug 27 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM

అసాధారణ ద్రోణచార్యుడు

అసాధారణ ద్రోణచార్యుడు

  • అపజయం నుంచి విజయం వైపు
  • అంకితభావంతో ఆంగ్లంపై పట్టు
  • స్ట్రీట్‌ఫైట్లను వద్దని మైదానానికి అంకితం
  • భద్రకాళి గుట్టలపై రన్నింగ్‌ ప్రాక్టీస్‌
  • సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ
  • వీవీఎస్‌ లక్ష్మణ్‌కు పర్సనల్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌గా
  • ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్‌
  • నగరంలోని కాపువాడలో పెంకుటిల్లులో నివాసం.. గ్యాస్‌ దీపం కింద చదువు.. పెళ్లిళ్లలో బరాత్‌కు డ్యాన్సు లు చేసే సామాన్యుడు నాగపూరి రమేశ్‌. పరుగు పందెంపై ఉన్న మక్కువ ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది. రన్నింగ్‌ ప్రాక్టీస్‌ కోసం భద్రకాళి దేవస్థానం గుట్టలపైకి పరుగెత్తడం ప్రారంభించి చివరకు.. దేశ రాజధాని ఢిల్లీలో ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఈనెల 29న రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నేపథ్యంలో నాగపూరి రమేష్‌ ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..                       –సాక్షి, హన్మకొండ


     ఒక మనిషి జీవితంలో అతడు పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇష్టాఇష్టాలు, వ్యక్తుల పరిచయాలు, కష్టాలు, సవాళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటికి మనం ఎలా స్పందిస్తామనే అంశంపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా క్రీడారంగంలో కఠోరమైన శ్రమ ఉండాలి. పోటీల్లో ఎప్పటికప్పుడు  నైపుణ్యత ప్రదర్శించాలి. అప్పుడే ఆటల్లో గెలిచి పతకాలు సాధించవచ్చు. మంచి పేరు సంపాదించవచ్చు.


    గోడకు కొట్టిన బంతిలా
    2014లో జరిగిన కామన్‌వెల్త్, ఏషియన్‌ గేమ్స్‌లో 400 ‘ 4 రన్నింగ్‌ విభాగంలో గోల్డ్‌ మెడల్‌ లక్ష్యంగా రెండేళ్లకు పైగా శ్రమించి మంచి అథ్లెటిక్స్‌ టీమ్‌ను తయారు చేశాను. రేయింబవళ్లు క్రీడాకారుల ఫిట్‌నెస్‌ను కాపాడుతూ శిక్షణ ఇచ్చాను. దురదృష్టం కొద్ది కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో మా టీమ్‌ అనుకున్న ఫలితాలు సాధించలేదు. దీనికి నన్ను బాధ్యుడిని చేస్తూ స్పోర్ట్స్‌ అధికారులు ఏషియన్‌ గేమ్స్‌ జాతీయ శిబిరం శిక్షణ బాధ్యతల నుంచి తప్పించారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ తర్వాత నాలుగు వారాల వ్యవధిలోనే ఏషియన్‌ గేమ్స్‌ ఉండడంతో అథ్లెటిక్స్‌కు మరో కోచ్‌ను నియమించారు. ఈ ఆటల్లో 400 ‘ 4 విభాగంలో గోల్డ్‌మెడల్‌తో పాటు ఏషియన్‌ గేమ్స్‌ రికార్డు బద్దలు అయింది. ఈ క్రెడిట్‌ అంతా కొత్తగా వచ్చిన కోచ్‌కు వెళ్లింది. రెండేళ్ల నా శ్రమ మరుగున పడిపోయింది. ఈ సమయంలో ఎంతో బాధగా అనిపించింది. నా కష్టం గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చింది.  


    సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ
    కోచ్‌ బాధ్యతల నుంచి స్పోర్ట్స్‌ అధికారులు నన్ను తప్పించడంతో కొన్ని నెలలపాటు నేను ఖాళీగా ఉన్నాను. ఈ సమయంలో ఇండియా బ్యాడ్మింటన్‌ లెజండ్, కోచ్‌ గోపీచంద్‌ నన్ను పిలిచి తన అకాడమీలో క్రీడాకారులకు ఫిట్‌నెస్‌ శిక్షణ ఇవ్వాలని కోరాడు. అలా 2014 నుంచి గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో క్రీడాకారులకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తున్నాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అథ్లెట్‌ ద్యుతిచంద్‌ తన స్వరాష్ట్రం ఒడిషా నుంచి నాకు ఫోన్‌ చేసింది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌), ఇతర క్రీడా సంస్థలు పట్టించుకోకపోవడంతో తన ¿¶ విష్యత్‌ ప్రమాదంలో పడిందని చెప్పింది.

    ఈ విషయంపై గోపీచంద్‌తో మా ట్లాడగా.. తన అకాడమీలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ద్యుతిచంద్‌ను హైదరాబాద్‌కు రప్పించి ఆమె శిక్షణను సవాల్‌గా స్వీకరించాను. 2015 జనవరి నుంచి ద్యుతికి 100 మీటర్ల స్ప్రింట్‌ విభాగంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యున్నత శిక్షణ ఇచ్చాను. ఈ మేరకు గత జూన్‌లో జరిగిన రియో ఒలింపిక్స్‌ అర్హత పోటీలో ఆమె విజయం సాధించింది. 32 ఏళ్ల తర్వాత పీటీ ఉష అనంతరం ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా ద్యుతిచంద్‌ గుర్తింపు పొందింది.


    వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఫిట్‌నెస్‌ కోచ్‌గా..
    1996–99 కాలంలో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్‌ స్కూల్‌లో పనిచేశాను. ఈ సమయంలో స్కూల్‌ ప్రిన్సిపాల్, సాయ్‌ రీజినల్‌ డైరెక్టర్‌ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో నేను బలయ్యాను. ఈ సందర్భంగా అకారణంగా నన్ను బెంగళూరు స్పోర్ట్స్‌ స్కూల్‌కు సరెండర్‌ చేశారు. అక్కడ 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వెళ్తున్న హాకీ జట్టుకు ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేశాను. ఈ ఒలింపిక్స్‌ ముగిసిన తర్వాత ఒక సారి విమానంలో హాకీ జట్టు ఇండియా కెప్టెన్‌ ముకే ష్, హైదరాబాద్‌ స్టార్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రయాణించారు. ఈ సందర్భంగా ముకేష్‌ ఫిట్‌నెస్‌ గురించి లక్ష్మణ్‌ వాకబు చేయగా.. ఆయన నా పేరు చెప్పారు. దీంతో 2000లో వీవీఎస్‌ లక్ష్మణ్‌కు పర్సనల్‌ ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేశాను. ఏడాది వ్యవధిలోనే ఆయన ఫిట్‌నెస్‌ మెరుగుపడింది. 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆయన 271 పరుగులు సాధించారు. అలా ఆనాడు ఆయనతో ఏర్పడిన బంధం క్రికెట్‌కు రిటైర్డ్‌మెంట్‌ ప్రకటించే వరకు కొనసాగింది.

    ఇంగ్లిష్‌తో ఇబ్బంది
    జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరించే వారు వివిధ భాషలు మాట్లాడే వారితో పనిచేయాల్సి ఉంటుంది. నేను ఇంగ్లిష్‌లో పట్టు సాధించేందుకు హన్మకొండ బాలసముద్రానికి చెందిన మల్లేశం సారు, నా సీనియర్, గైడ్‌ ప్రదీప్‌లే కారణం. డిగ్రీలో ఉన్నప్పుడు బాలసముద్రంలో మల్లేశం సారు దగ్గర మూడు నెలలపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్‌లో కోచింగ్‌ తీసుకున్నాను. దీనికి ఫీజు ప్రదీప్‌ కట్టాడు. ఎంపీఈడీ చేసేందుకు తమిళనాడులోకి కారైకుడికి వెళ్లినప్పుడు తొలిసారిగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. వాళ్లకు తెలుగురాదు.. నాకు తమిళం రాదు. మల్లేశం సారు చెప్పిన పాఠాలు గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటు చేసుకున్న. హిందూ పేపర్, ఇంగ్లిష్‌ వార్తా చానళ్లు చూస్తూ ఆ భాషపై పట్టు సాధించాను.

    స్ఫూర్తి నింపిన స్నేహం
    హన్మకొండలోని కాపువాడలో మా ఇల్లు. సాయంత్రం అయితే మా వీధి పోరగాళ్లు టిప్‌టాప్‌గా తయారై అలంకార్‌ సెంటర్‌లో ఉన్న క్యాంటీన్, డబ్బాల కాడికి పోతుండేవాళ్లు. నేను స్పోర్ట్స్‌ బనీను, షార్ట్‌ వేసుకుని రన్నింగ్‌ ప్రాక్టీస్‌కు పోతుండేవాడిని. నేను వాళ్లలాగా ఎంజాయ్‌ చేయలేకపోతున్నానని అని అప్పుడప్పుడు అనిపించేంది. మా వాడకు చెందిన పిల్లలు ఎక్కువ స్ట్రీట్‌ఫైట్‌లకు వెళ్లేవారు. నేను ఉదయం, సాయంత్రం గ్రౌండ్‌లో ఉండడం వల్ల, ఆ ప్రభావం నా మీద పడలేదు. మైదానంలో నా సీనియర్, జాతీయస్థాయి క్రీడాకారుడు ప్రదీప్‌ నాకు పరిచయమయ్యారు. అతడి ప్రభావం నాపై ఎక్కువ పడింది.

    తను కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తుండేవారు. తనతో పాటు ఆయన నన్ను యూనివర్సిటీకి తీసుకెళ్లేవారు. అక్కడ పీజీ చేసే వాళ్లను చూస్తే నాకు గొప్పగా అనిపించేది. ఇక ప్రదీప్‌ వాళ్ల ఇంటికి వెళితే.. వాళ్ల ఫ్యామిలీలో డాక్టర్లు, ఇంజినీర్లు ఉండేవాళ్లు. వాళ్లను చూస్తే కొత్త ఉత్సాహం కలిగేది. అప్పుడే ఆటల మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయెుద్దని నిర్ణయించుకున్న. మా నాన్న హన్మకొండ నక్కలగుట్ట కరెంటాఫీసులో అటెండర్‌గా పని చేస్తుండే వారు. సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ గ్రౌండ్‌కు వచ్చి నా ప్రాక్టీస్‌ను చూసి సంబరపడేవారు. వీధిలో మిగతా పిల్లలకు భిన్నంగా నేను గ్రౌండ్‌లో చెమటోడ్చడం ఆయనకు నచ్చేది.

    మడికొండ దాకా ఉరుకుడే
    ఆ రోజుల్లో వరంగల్‌లో ప్రొఫెషనల్‌ కోచ్‌లు అందరికీ అందుబాటులో లేరు. రామకృష్ణ సార్‌ కోచింగ్‌లో నేను రన్నింగ్‌లో మెళకువలు, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకున్న. మంచి ఎన్విరాన్‌మెంట్‌ కండీషన్, ఫుడ్‌ లభించడం కష్టంగా ఉండేది. అయినప్పటికీ రన్నింVŠ పై ఇష్టంతో ఉదయం, సాయంత్రం గ్రౌండ్‌లో ప్రాక్టీస్‌ చేసేవాడిని. ఆ రోజుల్లో ప్రాక్టీస్‌ చేసేందుకు హన్మకొండ జేఎన్‌ఎస్‌ నుంచి మడికొండ వరకు 20 కిలోమీటర్లు, జేఎన్‌ఎస్‌ నుంచి హంటర్‌రోడ్డులోని రైస్‌మిల్లుల వరకు 12 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తేవాడిని. ఈ శ్రమ ఫలించి 3000 మీటర్ల పరుగు పందెలో ఆలిండియా జూనియర్‌ లెవల్‌లో బంగారు పతకం, ఆలిండియా యూనివర్సిటీ లెవల్‌లో చాంపియన్‌గా నిలిచాను.

    ఆడలేను అనుకున్నా..
    నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు రన్నింగ్‌ ప్రాక్టీస్‌ కోసం భద్రకాళీ గుట్టల్లో పరుగెత్తేవాడిని. ఒక సారి జారి పడితే కాలు ఫ్రాక్చర్‌ అయింది. 21 రోజులు పూర్తిగా మంచంపైనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఆటలే లోకంగా బతికాను. నా కాలు విరగడంతో భవిష్యత్‌ ఏమవుతుందో అన్ని భయపడ్డాను. ఆ తర్వాత ఆటగాడిగా, కోచ్‌గా నా ప్రస్థానం ద్రోణాచార్య అవార్డు అందుకునే వరకు వచ్చింది. ఈ అవార్డు నా జీవితంలో మరిచిపోలేనిది. నేను ఈ స్థాయికి చే రేందుకు ప్రోత్సహించిన అమ్మానాన్న, స్నేహితులు, కోచ్‌లు, కుటుంబసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement