Dyuti Chand
-
వెండితెరకు ద్యుతీ జీవితం
బాక్సాఫీస్ వద్ద స్పోర్ట్స్ పర్సనాలిటీస్ బయోపిక్స్‌కు మంచి వసూళ్లు ఉంటాయి. ‘భాగ్ మిల్కా భాగ్ (2013), మేరీకోమ్ (2014), దంగల్ (2016)’ వంటి చిత్రాల రికార్డు కలెక్షన్లే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బయోపిక్ ‘సైనా’ పేరుతో తెరకెక్కుతోంది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా బయోపిక్స్‌పై ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అథ్లెట్ ద్యుతీ చంద్ బయోపిక్ తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జాతీయ అవార్డుగ్రహీత హిమాన్షు ఖతువా దర్శకత్వం వహిస్తారు. ‘‘ఎన్నో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు నా బయోపిక్‌ను నిర్మించడానికి సంప్రదింపులు జరిపాయి. కానీ, నేను ఎవరికీ హక్కులు ఇవ్వలేదు. హిమాన్షుగారి ప్రతిభ గురించి నాకు తెలుసు. నా కథకు న్యాయం చేయగలరనే నమ్మకం ఉంది. ఈ బయోపిక్‌ను కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్‌గానే కాదు.. చూసినవారు కూడా స్ఫూర్తి పొందేలా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు ద్యుతీ చంద్. ‘‘ఫస్ట్ డ్రాఫ్ట్ స్కిప్ట్ర్ వర్క్ పూర్తయింది. ద్యుతి చిన్నతనం నుంచి ఆమె జీవితంలోని ఎత్తుపల్లాలను కూడా సినిమాలో చూపిస్తాం. ద్యుతీగా ఎవరు నటించబోతున్నారనే విషయంపై త్వరలో చెబుతాం’’ అని పేర్కొన్నారు హిమాన్షు. -
100 మీ.లో ద్యుతీ చంద్ కొత్త జాతీయ రికార్డు
రాంచీ: భారత మహిళా స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ 100 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్‌ఛాంపియన్ షిప్ లో ఈ ఒడిశా అథ్లెట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణకు చెందిన కోచ్ నాగపురి రమేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న ద్యుతీ చంద్ ఫైనల్ రేసును 11.25 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్ రేసులో ద్యుతీ చంద్ 11.22 సెకన్లలో గమ్యానికి చేరింది. ఈ క్రమంలో 11.26 సెకన్లతో సంయుక్తంగా తన పేరిట (ఏప్రిల్, 2019లో), రచితా మిస్త్రీ (జూలై, 2000లో) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. -
పరుగుల రాణికి నగదు పురస్కారం
భువనేశ్వర్ : జకార్తాలో జరుగుతున్న 18వ ఏషియన్ క్రీడల్లో రాష్ట్రానికి చెందిన ద్యుతీ చాంద్ వరుసగా పతకాల్ని సాధిస్తోంది. తాజాగా ఆమె 200 మీటర్ల పరుగు పందెంలో రెండో రజత పతకం సాధించింది. లోగడ 100 మీటర్ల పరుగు పందెంలో తొలి రజత పతకం సాధించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెకు రెండోసారి రూ.1.5 కోట్ల నగదు పురస్కారం ప్రకటించారు. త్వరలో జరగనున్న ఒలింపిక్ క్రీడల పోటీ సాధనకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ముఖ్యమంత్రి గురు వారం ప్రకటించారు. రెండో రజత పతకం సాధించిన సందర్భంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆమెతో ప్రత్యక్షంగా ఫోన్లో మాట్లాడి అభినందనలు తెలియజేశారు. ఏషియన్ క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించిన తొలి క్రీడాకారిణిగా ద్యుతీ చాంద్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. జాతీయస్థాయిలో ఆమె రెండో క్రీడాకారిణిగా స్థానం సాధించడం మరో విశేషం. లోగడ 1982లో న్యూ ఢిల్లీలో జరిగిన ఏషియన్ క్రీడల పోటీల్లో పి. టి. ఉష 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందాల్లో రెండు రజత పతకాల్ని సాధించిన తొలి క్రీడాకారిణిగా నిలిచారు. -
అసాధారణ ద్రోణచార్యుడు
అపజయం నుంచి విజయం వైపు అంకితభావంతో ఆంగ్లంపై పట్టు స్ట్రీట్ఫైట్లను వద్దని మైదానానికి అంకితం భద్రకాళి గుట్టలపై రన్నింగ్ ప్రాక్టీస్ సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ వీవీఎస్ లక్ష్మణ్‌కు పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌గా ద్రోణాచార్య అవార్డు గ్రహీత నాగపూరి రమేశ్ నగరంలోని కాపువాడలో పెంకుటిల్లులో నివాసం.. గ్యాస్ దీపం కింద చదువు.. పెళ్లిళ్లలో బరాత్‌కు డ్యాన్సు లు చేసే సామాన్యుడు నాగపూరి రమేశ్. పరుగు పందెంపై ఉన్న మక్కువ ఆయన జీవిత గమనాన్ని మార్చేసింది. రన్నింగ్ ప్రాక్టీస్ కోసం భద్రకాళి దేవస్థానం గుట్టలపైకి పరుగెత్తడం ప్రారంభించి చివరకు.. దేశ రాజధాని ఢిల్లీలో ద్రోణాచార్య అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. ఈనెల 29న రాష్ట్రప్రతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న నేపథ్యంలో నాగపూరి రమేష్ ‘సాక్షి’తో తన అనుభవాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే.. –సాక్షి, హన్మకొండ ఒక మనిషి జీవితంలో అతడు పుట్టిన ప్రదేశం, తల్లిదండ్రులు, స్నేహితులు, ఇష్టాఇష్టాలు, వ్యక్తుల పరిచయాలు, కష్టాలు, సవాళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటికి మనం ఎలా స్పందిస్తామనే అంశంపై మన జీవితం ఆధారపడి ఉంటుంది. నా జీవితంలో ఇలాంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా క్రీడారంగంలో కఠోరమైన శ్రమ ఉండాలి. పోటీల్లో ఎప్పటికప్పుడు నైపుణ్యత ప్రదర్శించాలి. అప్పుడే ఆటల్లో గెలిచి పతకాలు సాధించవచ్చు. మంచి పేరు సంపాదించవచ్చు. గోడకు కొట్టిన బంతిలా 2014లో జరిగిన కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో 400 ‘ 4 రన్నింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ లక్ష్యంగా రెండేళ్లకు పైగా శ్రమించి మంచి అథ్లెటిక్స్ టీమ్‌ను తయారు చేశాను. రేయింబవళ్లు క్రీడాకారుల ఫిట్నెస్ను కాపాడుతూ శిక్షణ ఇచ్చాను. దురదృష్టం కొద్ది కామన్వెల్త్ గేమ్స్‌లో మా టీమ్ అనుకున్న ఫలితాలు సాధించలేదు. దీనికి నన్ను బాధ్యుడిని చేస్తూ స్పోర్ట్స్ అధికారులు ఏషియన్ గేమ్స్ జాతీయ శిబిరం శిక్షణ బాధ్యతల నుంచి తప్పించారు. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నాలుగు వారాల వ్యవధిలోనే ఏషియన్ గేమ్స్ ఉండడంతో అథ్లెటిక్స్‌కు మరో కోచ్‌ను నియమించారు. ఈ ఆటల్లో 400 ‘ 4 విభాగంలో గోల్డ్‌మెడల్‌తో పాటు ఏషియన్ గేమ్స్ రికార్డు బద్దలు అయింది. ఈ క్రెడిట్ అంతా కొత్తగా వచ్చిన కోచ్‌కు వెళ్లింది. రెండేళ్ల నా శ్రమ మరుగున పడిపోయింది. ఈ సమయంలో ఎంతో బాధగా అనిపించింది. నా కష్టం గోడకు కొట్టిన బంతిలాగా వెనక్కి వచ్చింది. సవాల్‌గా ద్యుతిచంద్‌కు శిక్షణ కోచ్ బాధ్యతల నుంచి స్పోర్ట్స్ అధికారులు నన్ను తప్పించడంతో కొన్ని నెలలపాటు నేను ఖాళీగా ఉన్నాను. ఈ సమయంలో ఇండియా బ్యాడ్మింటన్ లెజండ్, కోచ్ గోపీచంద్ నన్ను పిలిచి తన అకాడమీలో క్రీడాకారులకు ఫిట్నెస్ శిక్షణ ఇవ్వాలని కోరాడు. అలా 2014 నుంచి గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో క్రీడాకారులకు ఫిట్‌నెస్‌లో శిక్షణ ఇస్తున్నాను. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలోనే అథ్లెట్ ద్యుతిచంద్ తన స్వరాష్ట్రం ఒడిషా నుంచి నాకు ఫోన్ చేసింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(సాయ్), ఇతర క్రీడా సంస్థలు పట్టించుకోకపోవడంతో తన ¿¶ విష్యత్ ప్రమాదంలో పడిందని చెప్పింది. ఈ విషయంపై గోపీచంద్‌తో మా ట్లాడగా.. తన అకాడమీలో ఉచిత వసతి, భోజనం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు ద్యుతిచంద్ను హైదరాబాద్‌కు రప్పించి ఆమె శిక్షణను సవాల్‌గా స్వీకరించాను. 2015 జనవరి నుంచి ద్యుతికి 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో ఉదయం, సాయంత్రం వేళల్లో అత్యున్నత శిక్షణ ఇచ్చాను. ఈ మేరకు గత జూన్‌లో జరిగిన రియో ఒలింపిక్స్ అర్హత పోటీలో ఆమె విజయం సాధించింది. 32 ఏళ్ల తర్వాత పీటీ ఉష అనంతరం ఈ ఘనత సాధించిన అథ్లెట్‌గా ద్యుతిచంద్ గుర్తింపు పొందింది. వీవీఎస్ లక్ష్మణ్‌కు ఫిట్నెస్ కోచ్‌గా.. 1996–99 కాలంలో హైదరాబాద్‌లోని హకీంపేట స్పోర్ట్స్ స్కూల్లో పనిచేశాను. ఈ సమయంలో స్కూల్ ప్రిన్సిపాల్, సాయ్ రీజినల్ డైరెక్టర్ మధ్య జరిగిన ఆధిపత్య పోరులో నేను బలయ్యాను. ఈ సందర్భంగా అకారణంగా నన్ను బెంగళూరు స్పోర్ట్స్ స్కూల్‌కు సరెండర్ చేశారు. అక్కడ 2000 సంవత్సరంలో జరిగిన సిడ్నీ ఒలింపిక్స్‌కు వెళ్తున్న హాకీ జట్టుకు ఫిట్నెస్ కోచ్‌గా పని చేశాను. ఈ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత ఒక సారి విమానంలో హాకీ జట్టు ఇండియా కెప్టెన్ ముకే ష్, హైదరాబాద్ స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రయాణించారు. ఈ సందర్భంగా ముకేష్ ఫిట్నెస్ గురించి లక్ష్మణ్ వాకబు చేయగా.. ఆయన నా పేరు చెప్పారు. దీంతో 2000లో వీవీఎస్ లక్ష్మణ్‌కు పర్సనల్ ఫిట్నెస్ కోచ్‌గా పనిచేశాను. ఏడాది వ్యవధిలోనే ఆయన ఫిట్నెస్ మెరుగుపడింది. 2001లో కోల్‌కతాలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో ఆయన 271 పరుగులు సాధించారు. అలా ఆనాడు ఆయనతో ఏర్పడిన బంధం క్రికెట్‌కు రిటైర్డ్మెంట్ ప్రకటించే వరకు కొనసాగింది. ఇంగ్లిష్తో ఇబ్బంది జాతీయ జట్టు కోచ్‌గా వ్యవహరించే వారు వివిధ భాషలు మాట్లాడే వారితో పనిచేయాల్సి ఉంటుంది. నేను ఇంగ్లిష్‌లో పట్టు సాధించేందుకు హన్మకొండ బాలసముద్రానికి చెందిన మల్లేశం సారు, నా సీనియర్, గైడ్ ప్రదీప్లే కారణం. డిగ్రీలో ఉన్నప్పుడు బాలసముద్రంలో మల్లేశం సారు దగ్గర మూడు నెలలపాటు స్పోకెన్ ఇంగ్లిష్‌లో కోచింగ్ తీసుకున్నాను. దీనికి ఫీజు ప్రదీప్ కట్టాడు. ఎంపీఈడీ చేసేందుకు తమిళనాడులోకి కారైకుడికి వెళ్లినప్పుడు తొలిసారిగా నేను ఎంతో ఇబ్బంది పడ్డాను. వాళ్లకు తెలుగురాదు.. నాకు తమిళం రాదు. మల్లేశం సారు చెప్పిన పాఠాలు గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా ఇంగ్లిష్‌లో మాట్లాడం అలవాటు చేసుకున్న. హిందూ పేపర్, ఇంగ్లిష్ వార్తా చానళ్లు చూస్తూ ఆ భాషపై పట్టు సాధించాను. స్ఫూర్తి నింపిన స్నేహం హన్మకొండలోని కాపువాడలో మా ఇల్లు. సాయంత్రం అయితే మా వీధి పోరగాళ్లు టిప్‌టాప్‌గా తయారై అలంకార్ సెంటర్లో ఉన్న క్యాంటీన్, డబ్బాల కాడికి పోతుండేవాళ్లు. నేను స్పోర్ట్స్ బనీను, షార్ట్ వేసుకుని రన్నింగ్ ప్రాక్టీస్‌కు పోతుండేవాడిని. నేను వాళ్లలాగా ఎంజాయ్ చేయలేకపోతున్నానని అని అప్పుడప్పుడు అనిపించేంది. మా వాడకు చెందిన పిల్లలు ఎక్కువ స్ట్రీట్ఫైట్లకు వెళ్లేవారు. నేను ఉదయం, సాయంత్రం గ్రౌండ్లో ఉండడం వల్ల, ఆ ప్రభావం నా మీద పడలేదు. మైదానంలో నా సీనియర్, జాతీయస్థాయి క్రీడాకారుడు ప్రదీప్ నాకు పరిచయమయ్యారు. అతడి ప్రభావం నాపై ఎక్కువ పడింది. తను కాకతీయ యూనివర్సిటీలో పీజీ చేస్తుండేవారు. తనతో పాటు ఆయన నన్ను యూనివర్సిటీకి తీసుకెళ్లేవారు. అక్కడ పీజీ చేసే వాళ్లను చూస్తే నాకు గొప్పగా అనిపించేది. ఇక ప్రదీప్ వాళ్ల ఇంటికి వెళితే.. వాళ్ల ఫ్యామిలీలో డాక్టర్లు, ఇంజినీర్లు ఉండేవాళ్లు. వాళ్లను చూస్తే కొత్త ఉత్సాహం కలిగేది. అప్పుడే ఆటల మోజులో పడి చదువును నిర్లక్ష్యం చేయెుద్దని నిర్ణయించుకున్న. మా నాన్న హన్మకొండ నక్కలగుట్ట కరెంటాఫీసులో అటెండర్‌గా పని చేస్తుండే వారు. సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తూ గ్రౌండ్‌కు వచ్చి నా ప్రాక్టీస్‌ను చూసి సంబరపడేవారు. వీధిలో మిగతా పిల్లలకు భిన్నంగా నేను గ్రౌండ్లో చెమటోడ్చడం ఆయనకు నచ్చేది. మడికొండ దాకా ఉరుకుడే ఆ రోజుల్లో వరంగల్‌లో ప్రొఫెషనల్ కోచ్‌లు అందరికీ అందుబాటులో లేరు. రామకృష్ణ సార్ కోచింగ్‌లో నేను రన్నింగ్‌లో మెళకువలు, ఫిట్‌నెస్‌పై అవగాహన పెంచుకున్న. మంచి ఎన్విరాన్మెంట్ కండీషన్, ఫుడ్ లభించడం కష్టంగా ఉండేది. అయినప్పటికీ రన్నింVŠ పై ఇష్టంతో ఉదయం, సాయంత్రం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ రోజుల్లో ప్రాక్టీస్ చేసేందుకు హన్మకొండ జేఎన్ఎస్ నుంచి మడికొండ వరకు 20 కిలోమీటర్లు, జేఎన్ఎస్ నుంచి హంటర్‌రోడ్డులోని రైస్‌మిల్లుల వరకు 12 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తేవాడిని. ఈ శ్రమ ఫలించి 3000 మీటర్ల పరుగు పందెలో ఆలిండియా జూనియర్ లెవల్లో బంగారు పతకం, ఆలిండియా యూనివర్సిటీ లెవల్లో చాంపియన్‌గా నిలిచాను. ఆడలేను అనుకున్నా.. నేను డిగ్రీ సెకండియర్‌లో ఉన్నప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ కోసం భద్రకాళీ గుట్టల్లో పరుగెత్తేవాడిని. ఒక సారి జారి పడితే కాలు ఫ్రాక్చర్ అయింది. 21 రోజులు పూర్తిగా మంచంపైనే ఉన్నాను. చిన్నప్పటి నుంచి ఆటలే లోకంగా బతికాను. నా కాలు విరగడంతో భవిష్యత్ ఏమవుతుందో అన్ని భయపడ్డాను. ఆ తర్వాత ఆటగాడిగా, కోచ్‌గా నా ప్రస్థానం ద్రోణాచార్య అవార్డు అందుకునే వరకు వచ్చింది. ఈ అవార్డు నా జీవితంలో మరిచిపోలేనిది. నేను ఈ స్థాయికి చే రేందుకు ప్రోత్సహించిన అమ్మానాన్న, స్నేహితులు, కోచ్‌లు, కుటుంబసభ్యులకు జీవితాంతం రుణపడి ఉంటాను. -
రన్ రాణీ రన్
ద్యుతీ చంద్ రెండేళ్ల క్రితం ఓ రోజు పంజాబ్‌లోని నేషనల్ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్లో ద్యుతీచంద్ ట్రయినింగ్ ముగించుకుని రిలాక్స్ అవుతోంది. అదే సమయంలో ఢిల్లీలోని భారత అథ్లెటిక్ సంఘం కార్యాలయం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. అర్జెంట్‌గా ఢిల్లీ రమ్మని ఆ కాల్ సారాంశం. అప్పటికి ఆమెకు 18 ఏళ్లు. జూనియర్ స్థాయిలో పలు పతకాలు గెలిచి... గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు వెళ్లాలనే లక్ష్యంతో కష్టపడుతోంది. గ్లాస్గోకు వెళతావనే మంచి వార్త చెప్పడానికి పిలిచారేమో అని సంతోషపడింది. కానీ ద్యుతీకి తెలియదు. తాను పెద్ద అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని! అంతా అయోమయం ఐదు గంటల బస్ ప్రయాణం తర్వాత ద్యుతీ ఢిల్లీలోని అథ్లెటిక్ సంఘం కార్యాలయానికి వెళ్లింది. క్లినిక్ వెళితే టెస్ట్ చేస్తారని ఆమెకు అక్కడి అధికారి చెప్పారు. అథ్లెట్లందరికీ నిర్వహించే డోపింగ్ పరీక్షేమో అనుకుంది. అక్కడికి వెళ్లగానే డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామని చెప్పారు. దీంతో ద్యుతీలో అయోమయం! ఎందుకు అని అడిగింది. రొటీన్ పరీక్షల్లో భాగమేనని డాక్టర్ చెప్పారు. మిన్ను విరిగి మీద పడింది! మూడు రోజుల తర్వాత భారత అథ్లెటిక్ సంఘం ప్రభుత్వ స్పోర్ట్స్ అథారిటీకి రాసిన ఓ లేఖ కాపీ ద్యుతీకి కూడా వచ్చింది. ‘ద్యుతీచంద్ అనే అథ్లెట్‌కు సంబంధించి సందేహాలు ఉన్నాయి. ఆమెకు లింగనిర్ధారణ పరీక్ష జరపాలి. ఇలాంటి వారివల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుంది’... ఇదీ ఆ లేఖ సారాంశం! ఒక్కసారిగా ద్యుతీకి ఏమీ అర్థం కాలేదు. దుఃఖం కట్టలు తెంచుకుంది. పరీక్ష కోసం బెంగళూరులోని ఓ ప్రై వేట్ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెలోని సహజ హార్మోన్ల స్థాయి తెలుసుకునేందుకు పరీక్ష కోసం రక్తం తీసుకుంటున్నామని చెప్పారు. హార్మోన్లు అంటే ఏంటో ద్యుతీకి తెలియదు. తర్వాత ఎంఆర్ఐ చేశారు. ఆ వెంటనే క్రోమోజోమ్స్ విశ్లేషణ చేశారు. ఇంకా ఏవేవో ద్యుతీకి తెలియని, అర్థం కాని పదాలు చెప్పారు. తను మాత్రం మౌనంగా డాక్టర్లు ఏం చెబితే అది చేసింది. ద్యుతీ అమ్మాయి కాదా!! కొద్ది రోజుల తర్వాత పరీక్ష ఫలితాలు వచ్చాయి. ద్యుతీలో పురుష హార్మోన్ల స్థాయి చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఇచ్చారు. అథ్లెటిక్ సంఘం అధికారి ద్యుతీకి ఫోన్ చేశారు. ‘నిన్ను నిషేధిస్తున్నాం. ఇకపై శిక్షణ కేంద్రంలో వద్దు’ అని చెప్పారు. ‘నేనేం తప్పు చేశాను..?’ ద్యుతీ ప్రశ్నించింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు వచ్చి... మీకు లింగ నిర్ధారణ పరీక్ష చేశారా? అని ప్రశ్నించారు. ‘అంటే ఏమిటి?’ ద్యుతీ సమాధానం. మీడియా చెలరేగింది. ‘ద్యుతీచంద్ పురుషుడు’... ‘ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిన ద్యుతీ’... ఇలా ఎవరిష్టం వారిది. ఒక్కసారిగా భూమి బద్దలవుతున్నట్లు అనిపించింది. దాదాపు ఐదేళ్లుగా పడ్డ కష్టం మొత్తం బూడిదపాలయింది. కళ్లముందే తన కలలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఏం చేయాలి...? నిద్రలేని రాత్రులు. కలలా మెదిలిన గతం ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం గోపాల్ పూర్ ద్యుతీచంద్ స్వస్థలం. చాలా పేద కుటుంబం. తల్లి, తండ్రి ఇద్దరూ చేనేత పని చేసేవారు. ఇద్దరూ కలిసి పని చేసినా నెలకు రెండువేల రూపాయలు కూడా వచ్చేవి కావు. ఏడుగురు పిల్లలు... వారినెలా పోషించాలో తెలియదు. చిన్న మట్టి గుడిసెలో నివాసం. టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ద్యుతీకి నాలుగేళ్ల వయసులో పరుగంటే ఏంటో తెలిసింది. ఆమె అక్క సరస్వతికి పరుగు పందేల్లో పాల్గొనడం ఇష్టం. ప్రాక్టీస్ కోసం ఎవరూ తోడు లేరు. కాబట్టి తనకన్నా పదేళ్లు చిన్నదే అయినా తన చెల్లి ద్యుతీని తోడు తీసుకెళ్లేది. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో, ఇసుకలో, మట్టిరోడ్లపై పరుగు తీసేది. ద్యుతీకి ఏడేళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు తిట్టారు. వెళ్లి చేనేత పని నేర్చుకోక ఈ పరుగులు ఎందుకని కోప్పడ్డారు. కానీ సరస్వతి ఒప్పుకోలేదు. తన చెల్లిలో అద్భుతమైన నైపుణ్యం ఉందని ఆమె గుర్తించింది. అప్పటికి సరస్వతి మారథాన్‌లో పాల్గొని ప్రై జ్‌మనీ తెచ్చి ఇంట్లో ఇస్తోంది. అందుకని సరస్వతి మాటకు తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. తర్వాతి రోజు తన చెల్లిని తీసుకుని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లింది సరస్వతి. అక్కడ ఒక జత బూట్లు కొని చెల్లికి ఇచ్చింది. తిరిగి ఇంటికి బస్‌లో వస్తున్నప్పుడు ఏడేళ్ల ద్యుతీ అడిగింది. ‘ఈ బూట్లతో పరిగెడితే ఏం వస్తుంది’ ఏడేళ్ల ద్యుతీ అమాయకపు ప్రశ్న అది. దానికి సరస్వతి అద్భుతమైన సమాధానం చెప్పింది. ‘ఇలా కోళ్లతో, సామాన్లతో నిండిన బస్ ఎక్కాల్సిన పని ఉండదు. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి రావచ్చు’. అంతే! ఆ చిన్నారికి ఆ క్షణమే ఓ అందమైన భవిష్యత్ కనిపించింది. పెద్ద కలలు... పెద్ద పెద్ద లక్ష్యాలు మూడేళ్లు అక్క శిక్షణలో రాటుదేలిన తర్వాత ద్యుతీకి 2006లో ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో అవకాశం వచ్చింది. అక్కడ ఆహారం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, శిక్షణ ఉంది. అంతేకాదు... తాను ఏదైనా ప్రై జ్‌మనీ గెలిస్తే ఇంటికి పంపొచ్చు.. ద్యుతీలో పట్టుదల పెరిగింది. అంతే. ద్యుతీచంద్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. 16 ఏళ్ల వయసులో అండర్-18 విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. తర్వాతి రెండేళ్లలో ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100మీ. 200మీ. విభాగాల్లోనూ స్వర్ణం గెలిచింది. జీవితం తాను కోరుకున్నట్లే సాగుతోంది. కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్... పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. అంతలో ఈ షాక్. అంతర్జాతీయ కోర్టుకు ద్యుతి పయోషినీ మిత్రా... క్రీడల్లో ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్న అథ్లెట్లను గతంలో ఆదుకున్న లాయర్. ‘ద్యుతీచంద్ డోపింగ్ చేయలేదు. ఎవరినీ మోసం చేయలేదు. శరీరంలో హార్మోన్ల స్థాయి ఏంటో ఆమెకు ఎలా తెలుస్తుంది? చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన అమ్మాయిని ఎలా నిషేధిస్తారు..?’... ద్యుతీ తరఫున మిత్రా రంగంలోకి దిగారు. క్రీడల్లో వివాదాలను పరిష్కరించడానికి స్విట్జర్లాండ్‌లో ఉన్న ఆర్బిట్రేషన్ కోర్టుకు కేసును తీసుకెళ్లమని ద్యుతీకి సూచించారు. ద్యుతీ స్విట్జర్లాండ్ వెళ్లింది. మార్చి 2015లో ముగ్గురు జడ్జిల బందం విచారణ ప్రారంభించింది. క్రీడాకారిణుల హార్మోన్ల స్థాయి అంటూ వివక్షతో కూడిన పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది తప్పని ద్యుతీ వాదన. సైంటిస్ట్‌లు, అథ్లెట్లు, అధికారులు... ఇలా 16 మంది సాక్ష్యాలు తీసుకున్నారు. గతంలో ఇలాంటి వివక్ష, అవమానం ఎదుర్కొన్న విదేశీ అథ్లెట్లు ద్యుతీకి మద్దతుగా మాట్లాడారు. కేవలం హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ప్రదర్శన మెరుగవదని, ఒకవేళ హార్మోన్ల స్థాయి ఫలితాలను నిర్దేశిస్తే చాలామంది చాంపియన్లు అయ్యేవారని లాయర్లు వాదించారు. పురుషుల్లో హార్మోన్ల స్థాయి ఎంత ఎక్కువగా ఉన్నా పట్టించుకోనప్పుడు.. మహిళల హార్మోన్ల స్థాయి గురించి ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఇది వివక్షే అని బల్లగుద్దారు. నిరూపించలేకపోయారు 2015 జూలై. ముగ్గురు జడ్జీల బందం తీర్పు ఇచ్చింది. ‘అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య గానీ, వారి సైంటిస్టులు గానీ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ప్రదర్శన ఎలా మెరుగవుతుందో చెప్పే సంతప్తికర వివరణ ఇవ్వలేదు. కాబట్టి 2017 జూలై వరకు సమయం ఇస్తున్నాం. దీనిని నిరూపించే ఆధారాలతో రావాలి. అప్పటివరకు ద్యుతీచంద్తో పాటు ప్రపంచంలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అథ్లెట్లు అందరూ పోటీల్లో పాల్గొనవచ్చు.’ ఇదీ తీర్పు. ద్యుతీలో చెప్పలేని ఆనందం. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఇదో సంచలనం. మొత్తానికి ద్యుతీ గెలిచింది. - జయప్రకాష్ బత్తినేని అండగా హైదరాబాదీ నాగపురి రమేశ్... హైదరాబాద్‌కు చెందిన అథ్లెటిక్ కోచ్. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)లో పాటియాలలో కోచ్. భారత షార్ట్డిస్టెన్స్ రన్నర్స్ అందరికీ శిక్షణ ఇచ్చేవారు. నిషేధానికి ముందు రమేశ్ శిక్షణలో ద్యుతీ రాటుదేలింది. నిషేధం ఉన్న సమయంలో శిక్షణ తీసుకోవడానికి క్యాంప్‌కు వెళ్లే అవకాశం లేదు. దీంతో రమేశ్ తనకున్న పరిచయాలతో హైదరాబాద్‌లో ద్యుతీకి వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ హైదరాబాద్‌లోని తన అకాడమీలో సౌకర్యాలను వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. గోపీ అకాడమీలో వసతి, ఆహారం, జిమ్, ట్రాక్ అన్నీ ఉచితంగా ఇచ్చారు. శిక్షణ రమేశ్ చూసుకున్నారు. ఏడాది క్రితం స్విట్జర్లాండ్‌లోని కోర్టు నుంచి ద్యుతీకి అనుమతి రాగానే రమేశ్ సాయ్ అధికారులతో మాట్లాడారు. తను ఆమెకు వ్యక్తిగతంగా శిక్షణ ఇస్తానని, ఫలితాలు బాగా వస్తాయని ఒప్పించారు. ‘రమేశ్ సర్ లేకపోతే నాకు జీవితం లేదు. ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో నాకు ధైర్యం చెప్పారు. ఈ రోజే కాదు, భవిష్యత్‌లో నేను ఏం సాధించినా అది రమేశ్ సర్ పుణ్యమే’ అన్న ద్యుతీ మాటలు కోచ్‌గా రమేశ్ ఆమెకు చేసిన సాయానికి నిదర్శనం. ‘‘ఈమె వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుంది.’’ రెండేళ్ల క్రితం భారత అథ్లెటిక్ సంఘం ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీకి రాసిన లేఖలోని ఒక వాక్యం ఇది. కానీ ఆమె వల్లే నేడు.. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వేదికపై భారత్‌కు100మీ.లో ప్రాతినిధ్యం దొరికింది! ఆమె వల్లే దేశానికి కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. పేదరికాన్ని జయించి గొప్ప క్రీడాకారులుగా ఎదిగిన వారు చాలామందే ఉంటారు. కానీ పేదరికంతో పోరాడుతూనే ముందుకు సాగుతున్న ఓ అమ్మాయి... పరిస్థితులతో, సమాజంతో పోరాడి మరీ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా గొప్ప విషయం. ఆ ఘనత ద్యుతీచంద్ది. 1980లో పీటీ ఉష తర్వాత భారతదేశం నుంచి ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్లు ఎవరూ లేరు. 11.32 సెకన్లలో పరుగును పూర్తి చేస్తే ఒలింపిక్స్‌కు వెళ్లొచ్చు. ఈ అర్హత ప్రమాణాన్ని గత 36 ఏళ్లలో ఎవరూ అందుకోలేదు. కానీ ద్యుతీచంద్ మాత్రం... 11.25 సెకన్లలో రేసును పూర్తిచేసి సగర్వంగా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ద్యుతీచంద్ కష్టం, పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. -
ద్యుతీకి మరో స్వర్ణం
ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తావోయుయాన్ సిటీ(తైవాన్): ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్ రెండో స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. ఇక్కడ జరుగుతున్న ఈ పోటీల 200 మీటర్ల విభాగంలో 23.52 సెకన్లతో ద్యుతీ అగ్రస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన శ్రావణి నందా (23.55 సె.), జ్యోతి (23.93 సె.) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. తన అత్యుత్తమ టైమింగ్ (23.34 సె.) ను అందుకోవడంలో కూడా విఫలమైన ద్యుతీ... ఇంకా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. మహిళల 4ఁ100 మీ. రిలే జట్టు బ్యాటన్‌ను అందుకోవడంలో చేసిన పొరపాటుతో అనర్హతకు గురైంది. -
ద్యుతీ చంద్కి స్వర్ణం
తావోయువాన్ సిటీ: తైవాన్ ఓపెన్ అథ్లెటిక్స్‌లో స్ప్రింటర్ ద్యుతీ చంద్ స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన 100మీ. పరుగును తను 11.50 సెకన్ల టైమింగ్‌తో ముగించింది. అయితే ఇది ఒలింపిక్స్ అర్హత ప్రమాణాలకు (11.32 సె.) సరిపోలేదు. ద్యుతీచంద్‌కు తెలంగాణకు చెందిన రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. -
ద్యుతీ ‘డబుల్’
జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ కోల్‌కతా : జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశాకు చెందిన వివాదాస్పద మహిళా అథ్లెట్ ద్యుతీ చంద్ మరో రెండు స్వర్ణ పతకాలను సాధించింది. ఇప్పటికే 100 మీటర్ల విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఆమె, శనివారం జరిగిన 200 మీటర్లు, 4ఁ100 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. రైల్వేస్ తరఫున పోటీపడుతున్న ద్యుతీ 200 మీటర్ల రేసును 23.69 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది. ఆ తర్వాత తన సహచరులు హిమశ్రీ రాయ్, శర్బాని నందా, మెర్లిన్ జోసెఫ్‌లతో కలిసి 4ఁ100 మీటర్ల విభాగంలో రైల్వేస్‌కు అగ్రస్థానాన్ని అందించింది. మరోవైపు ఆసియా చాంపియన్ టింటూ లూకా మహిళల 800 మీటర్ల రేసును 2ని:00.56 సెకన్లలో ముగించి స్వర్ణ పతకాన్ని దక్కించుకుం ది. అంతేకాకుండా 2ని:01.06 సెకన్లతో 1997లో రోసా కుట్టీ నెలకొల్పిన మీట్ రికార్డును టింటూ లూకా తిరగరాసింది. శనివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో రైల్వేస్ 267 పాయింట్లతో చాంపియన్‌గా నిలిచింది.