రన్ రాణీ రన్ | National Sports Institute in Punjab | Sakshi
Sakshi News home page

రన్ రాణీ రన్

Published Sun, Jul 3 2016 10:22 PM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

రన్ రాణీ రన్

రన్ రాణీ రన్

  ద్యుతీ చంద్
రెండేళ్ల క్రితం ఓ రోజు పంజాబ్‌లోని నేషనల్ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌లో ద్యుతీచంద్ ట్రయినింగ్ ముగించుకుని రిలాక్స్ అవుతోంది. అదే సమయంలో ఢిల్లీలోని భారత అథ్లెటిక్ సంఘం కార్యాలయం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. అర్జెంట్‌గా ఢిల్లీ రమ్మని ఆ కాల్ సారాంశం. అప్పటికి ఆమెకు 18 ఏళ్లు. జూనియర్ స్థాయిలో పలు పతకాలు గెలిచి... గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలకు వెళ్లాలనే లక్ష్యంతో కష్టపడుతోంది.  గ్లాస్గోకు వెళతావనే మంచి వార్త చెప్పడానికి పిలిచారేమో అని సంతోషపడింది. కానీ ద్యుతీకి తెలియదు. తాను పెద్ద అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని!
 
  అంతా అయోమయం

 ఐదు గంటల బస్ ప్రయాణం తర్వాత ద్యుతీ ఢిల్లీలోని అథ్లెటిక్ సంఘం కార్యాలయానికి వెళ్లింది. క్లినిక్ వెళితే టెస్ట్ చేస్తారని ఆమెకు అక్కడి అధికారి చెప్పారు. అథ్లెట్లందరికీ నిర్వహించే డోపింగ్ పరీక్షేమో అనుకుంది. అక్కడికి వెళ్లగానే డాక్టర్ అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తామని చెప్పారు. దీంతో ద్యుతీలో అయోమయం! ఎందుకు అని అడిగింది. రొటీన్ పరీక్షల్లో భాగమేనని డాక్టర్ చెప్పారు.
 
 మిన్ను విరిగి మీద పడింది!
 మూడు రోజుల తర్వాత భారత అథ్లెటిక్ సంఘం ప్రభుత్వ స్పోర్ట్స్ అథారిటీకి రాసిన ఓ లేఖ కాపీ ద్యుతీకి కూడా వచ్చింది. ‘ద్యుతీచంద్ అనే అథ్లెట్‌కు సంబంధించి సందేహాలు ఉన్నాయి. ఆమెకు లింగనిర్ధారణ పరీక్ష జరపాలి. ఇలాంటి వారివల్ల దేశానికి చెడ్డ పేరు వస్తుంది’... ఇదీ ఆ లేఖ సారాంశం! ఒక్కసారిగా ద్యుతీకి ఏమీ అర్థం కాలేదు. దుఃఖం కట్టలు తెంచుకుంది. పరీక్ష కోసం బెంగళూరులోని ఓ ప్రై వేట్ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెలోని సహజ హార్మోన్ల స్థాయి తెలుసుకునేందుకు పరీక్ష కోసం రక్తం తీసుకుంటున్నామని చెప్పారు. హార్మోన్లు అంటే ఏంటో ద్యుతీకి తెలియదు. తర్వాత ఎంఆర్‌ఐ చేశారు. ఆ వెంటనే క్రోమోజోమ్స్ విశ్లేషణ చేశారు. ఇంకా ఏవేవో ద్యుతీకి తెలియని, అర్థం కాని పదాలు చెప్పారు. తను మాత్రం మౌనంగా డాక్టర్లు ఏం చెబితే అది చేసింది.
 
  ద్యుతీ అమ్మాయి కాదా!!
 కొద్ది రోజుల తర్వాత పరీక్ష ఫలితాలు వచ్చాయి. ద్యుతీలో పురుష హార్మోన్ల స్థాయి చాలా ఎక్కువగా ఉందని నివేదిక ఇచ్చారు. అథ్లెటిక్ సంఘం అధికారి ద్యుతీకి ఫోన్ చేశారు. ‘నిన్ను నిషేధిస్తున్నాం. ఇకపై శిక్షణ కేంద్రంలో వద్దు’ అని చెప్పారు. ‘నేనేం తప్పు చేశాను..?’ ద్యుతీ ప్రశ్నించింది. ఆ తర్వాత మీడియా ప్రతినిధులు వచ్చి... మీకు లింగ నిర్ధారణ పరీక్ష చేశారా? అని ప్రశ్నించారు. ‘అంటే ఏమిటి?’ ద్యుతీ సమాధానం. మీడియా చెలరేగింది. ‘ద్యుతీచంద్ పురుషుడు’... ‘ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిన ద్యుతీ’... ఇలా ఎవరిష్టం వారిది. ఒక్కసారిగా భూమి బద్దలవుతున్నట్లు అనిపించింది. దాదాపు ఐదేళ్లుగా పడ్డ కష్టం మొత్తం బూడిదపాలయింది. కళ్లముందే తన కలలన్నీ కుప్పకూలిపోతున్నాయి. ఏం చేయాలి...? నిద్రలేని రాత్రులు.
 
  కలలా మెదిలిన గతం
 ఒడిశాలోని ఓ మారుమూల గ్రామం గోపాల్ పూర్  ద్యుతీచంద్ స్వస్థలం. చాలా పేద కుటుంబం. తల్లి, తండ్రి ఇద్దరూ చేనేత పని చేసేవారు. ఇద్దరూ కలిసి పని చేసినా నెలకు రెండువేల రూపాయలు కూడా వచ్చేవి కావు. ఏడుగురు పిల్లలు... వారినెలా పోషించాలో తెలియదు. చిన్న మట్టి గుడిసెలో నివాసం. టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. ద్యుతీకి నాలుగేళ్ల వయసులో పరుగంటే ఏంటో తెలిసింది. ఆమె అక్క సరస్వతికి పరుగు పందేల్లో పాల్గొనడం ఇష్టం. ప్రాక్టీస్ కోసం ఎవరూ తోడు లేరు. కాబట్టి తనకన్నా పదేళ్లు చిన్నదే అయినా తన చెల్లి ద్యుతీని తోడు తీసుకెళ్లేది. కాళ్లకు చెప్పులు లేకుండా బురదలో, ఇసుకలో, మట్టిరోడ్లపై పరుగు తీసేది. ద్యుతీకి ఏడేళ్ల వయసు వచ్చాక తల్లిదండ్రులు తిట్టారు. వెళ్లి చేనేత పని నేర్చుకోక ఈ పరుగులు ఎందుకని కోప్పడ్డారు. కానీ సరస్వతి ఒప్పుకోలేదు. తన చెల్లిలో అద్భుతమైన నైపుణ్యం ఉందని ఆమె గుర్తించింది. అప్పటికి సరస్వతి మారథాన్‌లో పాల్గొని ప్రై జ్‌మనీ తెచ్చి ఇంట్లో ఇస్తోంది. అందుకని సరస్వతి మాటకు తల్లిదండ్రులు ఎదురు చెప్పలేదు. తర్వాతి రోజు తన చెల్లిని తీసుకుని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణానికి వెళ్లింది సరస్వతి. అక్కడ ఒక జత బూట్లు కొని చెల్లికి ఇచ్చింది. తిరిగి ఇంటికి బస్‌లో వస్తున్నప్పుడు ఏడేళ్ల ద్యుతీ అడిగింది. ‘ఈ బూట్లతో పరిగెడితే ఏం వస్తుంది’ ఏడేళ్ల ద్యుతీ అమాయకపు ప్రశ్న అది. దానికి సరస్వతి అద్భుతమైన సమాధానం చెప్పింది. ‘ఇలా కోళ్లతో, సామాన్లతో నిండిన బస్ ఎక్కాల్సిన పని ఉండదు. విమానం ఎక్కి విదేశాలకు వెళ్లి రావచ్చు’. అంతే! ఆ చిన్నారికి ఆ క్షణమే ఓ అందమైన భవిష్యత్ కనిపించింది.
 
  పెద్ద కలలు... పెద్ద పెద్ద లక్ష్యాలు
 మూడేళ్లు అక్క శిక్షణలో రాటుదేలిన తర్వాత ద్యుతీకి 2006లో ప్రభుత్వ శిక్షణ కేంద్రంలో అవకాశం వచ్చింది. అక్కడ ఆహారం ఉంది, టాయిలెట్స్ ఉన్నాయి, శిక్షణ ఉంది. అంతేకాదు... తాను ఏదైనా ప్రై జ్‌మనీ గెలిస్తే ఇంటికి పంపొచ్చు.. ద్యుతీలో పట్టుదల పెరిగింది. అంతే. ద్యుతీచంద్ అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. 16 ఏళ్ల వయసులో అండర్-18 విభాగంలో జాతీయ చాంపియన్‌గా నిలిచింది. తర్వాతి రెండేళ్లలో ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100మీ. 200మీ. విభాగాల్లోనూ స్వర్ణం గెలిచింది.  జీవితం తాను కోరుకున్నట్లే సాగుతోంది. కామన్వెల్త్ క్రీడలు, ఒలింపిక్స్... పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. అంతలో ఈ షాక్.
 
 అంతర్జాతీయ కోర్టుకు ద్యుతి
 పయోషినీ మిత్రా... క్రీడల్లో ఇలాంటి విషమ పరిస్థితుల్లో ఉన్న అథ్లెట్లను గతంలో ఆదుకున్న లాయర్. ‘ద్యుతీచంద్ డోపింగ్ చేయలేదు. ఎవరినీ మోసం చేయలేదు. శరీరంలో హార్మోన్ల స్థాయి ఏంటో ఆమెకు ఎలా తెలుస్తుంది? చాలా పేద కుటుంబం నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చిన అమ్మాయిని ఎలా నిషేధిస్తారు..?’... ద్యుతీ తరఫున మిత్రా రంగంలోకి దిగారు. క్రీడల్లో వివాదాలను పరిష్కరించడానికి స్విట్జర్లాండ్‌లో ఉన్న ఆర్బిట్రేషన్ కోర్టుకు కేసును తీసుకెళ్లమని ద్యుతీకి సూచించారు. ద్యుతీ స్విట్జర్లాండ్ వెళ్లింది. మార్చి 2015లో ముగ్గురు జడ్జిల బందం విచారణ ప్రారంభించింది. క్రీడాకారిణుల హార్మోన్ల స్థాయి అంటూ వివక్షతో కూడిన పరీక్షలు నిర్వహిస్తున్నారని, ఇది తప్పని ద్యుతీ వాదన. సైంటిస్ట్‌లు, అథ్లెట్లు, అధికారులు... ఇలా 16 మంది సాక్ష్యాలు తీసుకున్నారు. గతంలో ఇలాంటి వివక్ష, అవమానం ఎదుర్కొన్న విదేశీ అథ్లెట్లు ద్యుతీకి మద్దతుగా మాట్లాడారు. కేవలం హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ప్రదర్శన మెరుగవదని, ఒకవేళ హార్మోన్ల స్థాయి ఫలితాలను నిర్దేశిస్తే చాలామంది చాంపియన్లు అయ్యేవారని లాయర్లు వాదించారు. పురుషుల్లో హార్మోన్ల స్థాయి ఎంత ఎక్కువగా ఉన్నా పట్టించుకోనప్పుడు.. మహిళల హార్మోన్ల స్థాయి గురించి ఎలా పట్టించుకుంటారని ప్రశ్నించారు. ఇది  వివక్షే అని బల్లగుద్దారు.
 
  నిరూపించలేకపోయారు
 2015 జూలై. ముగ్గురు జడ్జీల బందం తీర్పు ఇచ్చింది. ‘అంతర్జాతీయ అథ్లెటిక్ సమాఖ్య గానీ, వారి సైంటిస్టులు గానీ హార్మోన్ల స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల ప్రదర్శన ఎలా మెరుగవుతుందో చెప్పే సంతప్తికర వివరణ ఇవ్వలేదు. కాబట్టి 2017 జూలై వరకు సమయం ఇస్తున్నాం. దీనిని నిరూపించే ఆధారాలతో రావాలి. అప్పటివరకు ద్యుతీచంద్‌తో పాటు ప్రపంచంలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్న అథ్లెట్లు అందరూ పోటీల్లో పాల్గొనవచ్చు.’ ఇదీ తీర్పు. ద్యుతీలో చెప్పలేని ఆనందం. ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఇదో సంచలనం. మొత్తానికి ద్యుతీ గెలిచింది.  
 - జయప్రకాష్ బత్తినేని
 
 అండగా హైదరాబాదీ
 నాగపురి రమేశ్... హైదరాబాద్‌కు చెందిన అథ్లెటిక్ కోచ్. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)లో పాటియాలలో కోచ్. భారత షార్ట్‌డిస్టెన్స్ రన్నర్స్ అందరికీ శిక్షణ ఇచ్చేవారు. నిషేధానికి ముందు రమేశ్ శిక్షణలో ద్యుతీ రాటుదేలింది. నిషేధం ఉన్న సమయంలో శిక్షణ తీసుకోవడానికి క్యాంప్‌కు వెళ్లే అవకాశం లేదు. దీంతో రమేశ్ తనకున్న పరిచయాలతో హైదరాబాద్‌లో ద్యుతీకి వ్యక్తిగతంగా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. భారత బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్ హైదరాబాద్‌లోని తన అకాడమీలో సౌకర్యాలను వినియోగించుకోవడానికి అవకాశం ఇచ్చారు. గోపీ అకాడమీలో వసతి, ఆహారం, జిమ్, ట్రాక్ అన్నీ ఉచితంగా ఇచ్చారు. శిక్షణ రమేశ్ చూసుకున్నారు. ఏడాది క్రితం స్విట్జర్లాండ్‌లోని కోర్టు నుంచి ద్యుతీకి అనుమతి రాగానే రమేశ్ సాయ్ అధికారులతో మాట్లాడారు. తను ఆమెకు వ్యక్తిగతంగా శిక్షణ ఇస్తానని, ఫలితాలు బాగా వస్తాయని ఒప్పించారు.  ‘రమేశ్ సర్ లేకపోతే నాకు జీవితం లేదు. ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో నాకు ధైర్యం చెప్పారు. ఈ రోజే కాదు, భవిష్యత్‌లో నేను ఏం సాధించినా అది రమేశ్ సర్ పుణ్యమే’ అన్న ద్యుతీ మాటలు కోచ్‌గా రమేశ్ ఆమెకు చేసిన సాయానికి నిదర్శనం.
 
 ‘‘ఈమె వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుంది.’’
 రెండేళ్ల క్రితం భారత అథ్లెటిక్ సంఘం ప్రభుత్వం స్పోర్ట్స్ అథారిటీకి రాసిన లేఖలోని ఒక వాక్యం ఇది. కానీ ఆమె వల్లే నేడు.. 36 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ వేదికపై భారత్‌కు100మీ.లో ప్రాతినిధ్యం దొరికింది! ఆమె వల్లే దేశానికి కీర్తి ప్రతిష్టలు రాబోతున్నాయి. పేదరికాన్ని జయించి గొప్ప క్రీడాకారులుగా ఎదిగిన వారు చాలామందే ఉంటారు. కానీ పేదరికంతో పోరాడుతూనే ముందుకు సాగుతున్న ఓ అమ్మాయి... పరిస్థితులతో, సమాజంతో పోరాడి మరీ లక్ష్యాన్ని చేరుకోవడం చాలా గొప్ప విషయం. ఆ ఘనత ద్యుతీచంద్‌ది. 1980లో పీటీ ఉష తర్వాత భారతదేశం నుంచి ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్లు ఎవరూ లేరు. 11.32 సెకన్లలో పరుగును పూర్తి చేస్తే ఒలింపిక్స్‌కు వెళ్లొచ్చు. ఈ అర్హత ప్రమాణాన్ని గత 36 ఏళ్లలో ఎవరూ అందుకోలేదు. కానీ ద్యుతీచంద్ మాత్రం... 11.25 సెకన్లలో రేసును పూర్తిచేసి సగర్వంగా రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ద్యుతీచంద్ కష్టం, పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement