![38th National Games concluded in Uttarakhand](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/sports.jpg.webp?itok=RAu3nH2_)
తదుపరి జాతీయ క్రీడలు 2027లో
ఉత్తరాఖండ్‌లో ముగిసిన 38వ జాతీయ క్రీడలు
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో అలరించిన జాతీయ క్రీడలు అట్టహాసంగా ముగిశాయి. తదుపరి మేఘాలయ జాతీయ క్రీడల ఆతిథ్యానికి సిద్ధం కానుంది. 2027లో అక్కడ 39వ నేషనల్ గేమ్స్ జరుగనున్నాయి. శుక్రవారం మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా క్రీడాజ్యోతి అందుకోవడంతో దీనికి సంబంధించిన లాంఛన ప్రకియ కూడా ముగిసింది. 18 రోజుల పాటు విజయవంతంగా నిర్వహించిన తాజా జాతీయ క్రీడల్లో సర్వీసెస్ 121 పతకాలతో ఓవరాల్ చాంపియన్‌షిప్ గెలుచుకుంది.
సర్వీసెస్ క్రీడాకారులు 68 స్వర్ణాలు, 26 రజతాలు, 27 కాంస్యాలు గెలిచారు. మహారాష్ట్ర అత్యధికంగా 198 పతకాలు గెలిచినప్పటికీ పసిడి వేట (54 స్వర్ణాలు)లో వెనుకబడిపోవడంతో రెండో స్థానంలో నిలిచింది. 71 రజతాలు, 73 కాంస్యాలు మరాఠా క్రీడాకారులు చేజిక్కించుకున్నారు.
హరియాణా 153 పతకాలు (48 పసిడి, 47 రజతాలు, 58 కాంస్యాలు) మూడో స్థానంలో నిలువగా, ఆతిథ్య ఉత్తరాఖండ్ 24 స్వర్ణాలు, 35 రజతాలు, 44 కాంస్యాలతో మొత్తం 103 పతకాలు సాధించి ఏడో స్థానంలో నిలిచింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ (14 పతకాలు) 18వ స్థానంలో, తెలంగాణ (18 పతకాలు) 26వ స్థానంలో నిలిచాయి.
2036 ఒలింపిక్స్‌కు సిద్ధం: అమిత్ షా
జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విశ్వక్రీడల నిర్వహణకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. ‘క్రీడల్లో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉంది. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉంది. ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమిగా ప్రసిద్ధి. అయితే తాజా ఈవెంట్ నిర్వహణ ద్వారా ఖేల్ భూమి అయ్యింది. కేవలం క్రీడల నిర్వహణే కాదు.
ఆటగాళ్లు రాటుదేలిన తీరు సాధించిన ప్రగతి రాష్ట్ర ప్రభుత్వం క్రీడారంగంలో చేసిన విశేష కృషికి నిదర్శనం. గత జాతీయ క్రీడల్లో ఉత్తరాఖండ్ 21వ స్థానంలో నిలిచింది. తాజా క్రీడల్లో ఏడో స్థానానికి ఎగబాకింది. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం వల్లే క్రీడారంగంలో ఆ రాష్ట్రం ఇంతలా ఎదిగింది. ఇదే జోరు ఇకమీదటా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి, కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష, మేఘాలయ ముఖ్యమంత్రి కొంగ్‌కల్ సంగ్మా తదితరులు పాల్గొన్నారు. పీటీ ఉష మాట్లాడుతూ ‘ఈ మహత్తర ప్రయాణం ఇక్కడితో ముగిసేది కాదు. ఎల్లప్పుడు దిగి్వజయంగా సాగేది.
భారత క్రీడల ప్రగతిని చాటేది’ అని ఆమె కితాబిచ్చారు. కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయ మాట్లాడుతూ ‘2036 విశ్వక్రీడల్లో టాప్–10లో నిలిచేందుకు ఇదొక గొప్ప ఆరంభం. దేశంలో క్రీడాసంస్కృతి పెరుగుతుందనడానికి ఇదో నిదర్శనం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment