వ్యాయామ విద్యను విస్తరించాలి
జాతీయ సదస్సులో హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ వ్యాఖ్య
ఉస్మానియా యూనివర్సిటీ: ఆరోగ్యంతో పాటు చురుగ్గా ఉండేందుకు వ్యాయామ విద్యను మరింత విస్తరించాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్షుడు వివేక్ అన్నారు. శనివారం ఓయూ క్యాంపస్ దూరవిద్య కేంద్రంలో ‘ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్‌నెస్ అండ్ స్పోర్ట్స్ సైన్స్–2017’ అనే అంశంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఓయూ వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ కార్యక్రమానికి ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్, సదస్సు చైర్మన్ ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అధ్యక్షత వహించగా, వివేక్ ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా వ్యాయామ విద్య విస్తరించాలన్నారు.
పాఠశాల స్థాయి నుంచే క్రీడల పట్ల అవగాహన కల్పిస్తూ విద్యార్థుల్లో వ్యాయామ విద్యపై ఆసక్తిని పెంచాలన్నారు. విశ్వవిద్యాలయాల కృషితోనే ఇది సాధ్యమవుతుందన్నారు. హెచ్‌సీఏ తరఫున ఓయూ క్యాంపస్‌లో ఆధునిక హంగులతో క్రికెట్ పిచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... ఓయూలో సింథటిక్ ట్రాక్‌ను కూడా నిర్మిస్తామని చెప్పారు. రెండు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, పది దేశాల నుంచి 450 ప్రతినిధులు హాజరయ్యారని సదస్సు కన్వీనర్ ప్రొఫెసర్ రాజేశ్ కుమార్ చెప్పారు. అధ్యాపకులు, పరిశోధన విద్యార్థుల నుంచి 300 పరిశోధన పత్రాలను సమర్పించనున్నట్లు చెప్పారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ భట్టు సత్యనారాయణ, వ్యాయామ విద్య వీసీ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొని ప్రసంగించారు.