ఆదిలాబాద్ అర్బన్ : సామాజిక పింఛన్ల పథకం ఇక ‘ఆసరా’గా మారింది. ‘ఆసరా’ పథకం కింద వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత కార్మికులకు ప్రతి నెలా రూ.వెయ్యి, వికలాంగులకు రూ.1500 పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేర్కొంది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 7వ తేదీ వరకు అన్ని రకాల పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు పింఛన్‌దారుని సంతకం తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులుండగా.. ప్రతి నెలా రూ.7.75 కోట్ల పింఛన్ పంపిణీ అవుతోంది. ఆసరా పథకాన్ని ఈ నెల 8న నియోజకవర్గ, 9న మండల, 10న గ్రామ స్థాయిలో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా పింఛన్ల మంజూరుకు 3,19,957 లక్షల దరఖాస్తులు రాగా, ఇంటింటి సర్వే చేసిన 2.01 లక్షల దరఖాస్తులను అర్హులుగా గుర్తించారు. మిగతా 1.39 లక్షల దరఖాస్తులు తిరస్కరించారు.
2.62 లక్షల మంది లబ్ధిదారులు
జిల్లాలో 2,62,004 మంది లబ్ధిదారులు వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారు. వీరికి ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 10 వరకు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వృద్ధాప్య పింఛన్లు 1,35,750 ఉండగా, చేనేత 537, వికలాంగులు 26,964, వితంతువులు 79,921, కల్లుగీత కార్మికులు 283, అభయహస్తం కింద 18,549 మంది లబ్ధిదారులు పింఛన్లు పొందుతున్నారు.
ప్రతినెలా వృద్ధులు, వితంతువులకు రూ.200, వికలాంగులు, అభయహస్తం పింఛన్‌దారులకు ప్రతినెలా రూ.500 చొప్పున పింఛన్ అందజేస్తున్నారు. జిల్లాలో ప్రతినెలా 7.75 కోట్లు పింఛన్ రూపంలో డీఆర్డీఏ చెల్లిస్తోంది. బయోమెట్రిక్ విధానం ద్వారా 1.50 లక్షల మందికి రూ.4.35 కోట్లు పంపిణీ కాగా, మిగతాది పోస్టల్ ద్వారా పంపిణీ చేస్తోంది.
పంపిణీ పలు రకాలు...
గతంలో గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పింఛన్లు పంపిణీ చేసేవారు. సంతకాలు, వేలిముద్రలు తీసుకుని పింఛన్ ఇచ్చేవారు. చనిపోయిన వారికి, ఊరు వదిలివెళ్లిపోయిన వారికి, అనర్హులకు పించన్లు ఇస్తున్నారని సర్కారు దృష్టికి రావడంతో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో యాక్సిస్ బ్యాంకు ద్వారా 18 మండలాల్లో, పోస్టల్ శాఖ ద్వారా 34 మండలాలు, ఏడు మున్సిపాలిటీల్లో పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.
బయోమెట్రిక్ ఆధార్ కార్డు లింకుగా ఉండడంతో అనుసంధానం కాకపోవడం, వేలిముద్రలు సరిగా పడకపోవడం, బ్యాంక్ ఖాతాలు తెరవకపోవడం తదితర కారణాలతో అర్హులకు సైతం పింఛన్లు రాలేదు. అనంతరం ఐరీష్ విధానంతో పింఛన్లు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. పంపిణీ మిషన్లకు బ్యాటరీ బ్యాకప్ లేకపోవడం, సిగ్నల్స్ అందకపోవడం, ఆపరేటింగ్ విధానం తెలియకపోవడంతో అది గాడిలో పడలేదు. ప్రభుత్వం కొత్తగా ఆసరా పథకం ప్రారంభించడంతో పింఛన్లు పొందుతున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా నెలనెలా పింఛన్ అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ‘ఆసరా’..!
Published Fri, Nov 7 2014 2:04 AM | Last Updated on Mon, Aug 20 2018 6:02 PM
Advertisement
Advertisement