సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల హామీల అమలుకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. కొత్త ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి, వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 57కు కుదిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అటు ఇటుగా రూ.39 కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, ఫైలేరియా పేషంట్లకు ఆసరా పింఛన్ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఆసరాగా ఇస్తోంది. సర్కారు పింఛన్లను రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం డబుల్ కానుంది. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 64 నుంచి 57కు తగ్గించడంతో వేలాది మంది కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు అర్హులు కానున్నారు. ఈ మేరకు నెలకు సుమారు రూ.80కోట్ల పైనే ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు చెల్లించనున్నారు. ఈ పెరిగిన ఆసరా పింఛన్లు ఏ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతాయనే దానిపై స్పష్టత రావడం లేదు.
వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 57
వృద్ధాప్య పింఛన్లు పొందాలంటే 64 సంవత్సరాలు ఉండాలనేది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. ఈ నిబంధనను సడలించి 57 ఏళ్లు నిండిన వారందిరికి వృద్ధాప్య పింఛన్లు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఓటర్ల జాబితాలోని వయస్సునే ప్రామాణికంగా తీసుకోనుండడంతో ఆ మేరకు పంచాయతీల వారీగా అర్హుల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. 1953 నుంచి 1961 లోపు జన్మించిన వారందరిని గుర్తిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లోని వయసు ఆధారంగా కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటికే మెజారిటీ వీఆర్‌ఓలు గ్రామాలలో అర్హుల జాబితాలను తయారు చేసి తహసీల్దార్లకు అందజేయగా, వారు కలెక్టర్లకు కూడా పంపించారు. ఈ జాబితాను పరిశీలించి కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు.
రెట్టింపు కానున్న పింఛన్లు
ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రస్తుతం 3,62,721 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 1,13,941 మంది వృద్ధాప్య పింఛనుదారులే ఉన్నారు. వీరి తర్వాత వితంతువులైన మహిళా పింఛనుదారులు 1,26,669 మంది. ఇక ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులతోపాటు హెచ్‌ఐవీ, ఫైలేరియా పేషంట్లు 10 కేటగిరీల్లో కలిపి నెలకు సుమారు రూ.39 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింపులు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, వితంతుల, ఒంటరి మహిళలలు, ఇతర కేటగిరీల్లోని వారికి ఇప్పుడిస్తున్న రూ.1,000ని రూ. 2,016 , దివ్యాంగుల పింఛన్లను రూ.1500 నుంచి రూ.3016కు పెంచారు. ఈ లెక్కన ఆసరా పింఛన్ల బడ్జెట్ కూడా రెట్టింపు కానుంది. ఇక వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 64 నుంచి 57కు కుదించడం వల్ల ప్రతి జిల్లాలో వేలాది మంది కొత్తగా పింఛనుదారులు కానున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పింఛన్లకు రూ.80 కోట్లపైనే వెచ్చించాల్సి ఉంటుంది.
నిర్మల్‌లోనే అధికం
ఆసరా పింఛన్ల లబ్ధిదారులు నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ బీడీ కార్మికులు ఏకంగా 63,206 మంది ఉండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. అన్ని కేటగిరీల పింఛను దారులు కలిపి 1,48,679 మంది ఉండగా, వీరి కోసం ప్రభుత్వం రూ.15.37 కోట్లు నెలకు వెచ్చిస్తోంది. అతి తక్కువగా కుమురంభీం జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 51,201గా ఉంది. వీరికి నెల నెలా రూ.6.10 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. వయస్సు పరిమితి తగ్గించడంతో ఈసారి కుమురంభీం జిల్లాలో కూడా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
ఆసరా రూ.80 కోట్లు !
Published Sun, Dec 23 2018 8:05 AM | Last Updated on Sun, Dec 23 2018 8:05 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment