కల్వకుర్తి టౌన్: ఆసరా సామాజిక పింఛన్లు రెట్టింపు కానున్నాయి. ఇప్పటివరకు వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న వెయ్యి రూపాయల ఫించన్ రూ.2,016కు పెరగనుంది. అలాగే వికలాంగులకు ఇస్తున్న రూ.1,500లు రూ.3,016కు పెరగనుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు రెట్టింపు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అందుకు అణుగుణంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
దీనికితోడు వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే వయస్సును 65ఏళ్ల నుంచి 57ఏళ్లకు తగ్గించింది. దీనితో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య లక్షకుపైగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలో నిధులు కేటాయించన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
రూ.200 నుంచి రూ.2వేలకు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సామాజిక భద్రత పింఛన్ రూ.200లు ఇచ్చేవారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫించన్లను రూ.వెయ్యికి పెంచింది. వికలాంగులకు రూ.1,500కు పెంచింది. ప్రస్తుతం రెండోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరోసారి పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులు
రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య, వికలాంగులు, వితంతువు, చేనేత, కల్లుగీత కార్మికులు, హెచ్‌ఐవీ, బోధకాలు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు ఇలా అనేక రకాల పింఛన్లు అందిస్తోంది. వీరిలో వృద్ధాప్య, వికలాంగులకు మాత్రమే పింఛన్లు రెట్టింపు కానున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్లు 63,065, వికలాంగులు 23,743 మంది ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో 46,065 మంది వృద్ధాప్య, వికలాంగులు 13,976 మంది లబ్ధిదారులు ఉన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో వృద్ధాప్య 24,314 మంది, వికలాంగులు 11,166 మంది తీసుకుంటున్నారు. వనపర్తి జిల్లాలో 28,536 మంది వృద్ధాప్య, వికలాంగులు 11,047 మంది ఉన్నారు.
వివరాలు సేకరిస్తున్నాం
జిల్లాలో గతంలో ఇస్తున్న ఆసరా పింఛన్లకు అదనంగా 57ఏళ్ల వయస్సు ఉన్నవారి వివరాలు కూడా సేకరిస్తున్నాం. ఓటరు జాబితాల నుంచి సేకరించి, జాబితా సిద్ధం చేస్తున్నాం. ఒక కుటుంబంలో ఒక్కరు మాత్రమే పింఛన్ తీసుకోవడానికి అర్హులు. 57ఏళ్లలోపు వారు, మరే ఇతర ఫించన్ తీసుకుంటున్న వారు అనర్హులు. దానికి సంబంధించి అన్ని వివరాలు సేకరిస్తున్నాం. – సుధాకర్, డీఆర్‌డీఓ పీడీ, నాగర్‌కర్నూల్
Comments
Please login to add a commentAdd a comment