handcaps
-
పెరిగిన ఆసరా...
సాక్షి, మెదక్: ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 1,03,410 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దివ్యాంగులకు రూ.1,500, మిగితా వారికి వెయ్యి రూపాయల చొప్పున అందచేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి దివ్యాంగులకు రూ.3,016, మిగిలిన లబ్ధిదారులకు రూ.2,016 పింఛన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మూడు రోజుల క్రితం విడుదల చేశారు. నూతన మార్గదర్శకాలు జిల్లా అధికారులకు అందాల్సి ఉంది. 57 సంవత్సరాలు నిండిన వృద్ధులు పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు కార్డులోని వయస్సును ప్రామాణికంగా తీసుకొని పింఛన్‌కు అర్హులయ్యే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అర్హత వయస్సు నిండిన వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పింఛన్ డబ్బులు చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి నిధులు కేటాయించి ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతో పాటు, కొత్త వారికి పింఛన్ అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఆసరా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. నవంబరు 19న ప్రకటించిన తుది జాబితా ప్రకారం వారిని ఎంపిక చేశారు. జిల్లాలో 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు 36,954 మంది ఉన్నట్లు గుర్తించారు. పింఛన్ పొందేందుకు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు లోపు సంవత్సర ఆదాయం మాత్రమే ఉండాలి. మూడెకరాల లోపు తరి భూమి, ఏడున్నర ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులుగా ఉంటారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ అందజేస్తారు. ప్రస్తుతం జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్డీఓ) అధికారులు సేకరించిన వివరాలపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేయించనున్నారు. పోలింగ్ బూత్‌స్థాయి అధికారులకు జాబితాను అందచేసి వారి ద్వారా పరిశీలింపచేస్తారు. తర్వాత డీఆర్డీఓ అధికారులు, గ్రామైక్య సంఘం, ఇందిరా క్రాంతి పథకం సీసీల చేత క్షుణ్ణంగా విచారణ చేయించనున్నారు. అలాగే ఎంపిక చేసిన వారి ఇళ్ళకు వెళ్లి ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబర్లను సేకరించనున్నారు. ఒకటికి రెండుమార్లు వడపోత అనంతరం లబ్ధిదారుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఈ జాబితాను కలెక్టర్ ఆమోదించిన తర్వాత పింఛన్ మంజూరుకు ఉన్నతాధికారులకు పంపిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం కింద ప్రతినెలా రూ.10.78 కోట్లు చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించడం, దివ్యాంగులు, మిగితా వారికి పింఛన్ మొత్తం పెంచనుండటంతో ప్రభుత్వంపై భారం పడనుంది. జిల్లాలో కొత్తగా లబ్ధిదారుల చేరికతో సుమారు రూ.50 లక్షలకు పైగా భారం పడనుంది. ఏప్రిల్ నుంచి పింఛన్ మొత్తం పెంచితే పాత, కొత్త లబ్ధిదారులతో కలిపి జిల్లాలో సుమారు రూ.30 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ... గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపిక చేసిన జాబితాను గ్రామసభల ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వచ్చిన వాటిని పరిశీలించి తుదిజాబితాను రూపొందించడం జరుగుతుంది. లబ్ధిదారుల ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓలు, పట్టణాల్లోని లబ్ధిదారుల జాబితాను కమిషనర్లు పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాఫ్ట్‌వేర్‌లో లబ్ధిదారుల వివరాలను అప్లోడ్ చేస్తారు. త్వరలోనే తుది జాబితా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు ఉన్న వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ మేరకు పోలింగ్‌బూత్ అధికారుల ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తేల్చడం జరుగుతుంది. గ్రామైఖ్య సంఘం, సీసీలతో విచారణ జరిపించి తుది జాబితాను రూపొందిస్తాం. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. –భీమయ్య, డీఆర్డీఓ ఏడీ, మెదక్ -
ఆసరా రూ.80 కోట్లు !
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఎన్నికల హామీల అమలుకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుడుతోంది. కొత్త ప్రభుత్వంలో ఆసరా పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి, వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 57కు కుదిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అటు ఇటుగా రూ.39 కోట్ల వరకు పింఛన్ల కోసం ప్రభుత్వం వెచ్చిస్తోంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్ఐవీ, ఫైలేరియా పేషంట్లకు ఆసరా పింఛన్ల ద్వారా ఈ మొత్తాన్ని ప్రభుత్వ ఆసరాగా ఇస్తోంది. సర్కారు పింఛన్లను రెట్టింపు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం డబుల్ కానుంది. వృద్ధాప్య పింఛన్ల వయస్సును 64 నుంచి 57కు తగ్గించడంతో వేలాది మంది కొత్తగా వృద్ధాప్య పింఛన్లకు అర్హులు కానున్నారు. ఈ మేరకు నెలకు సుమారు రూ.80కోట్ల పైనే ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారులకు చెల్లించనున్నారు. ఈ పెరిగిన ఆసరా పింఛన్లు ఏ నెల నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో చేరుతాయనే దానిపై స్పష్టత రావడం లేదు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు 57 వృద్ధాప్య పింఛన్లు పొందాలంటే 64 సంవత్సరాలు ఉండాలనేది దేశవ్యాప్తంగా ఉన్న నిబంధన. ఈ నిబంధనను సడలించి 57 ఏళ్లు నిండిన వారందిరికి వృద్ధాప్య పింఛన్లు అందజేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ఈ మేరకు కసరత్తు ప్రారంభించారు. వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఓటర్ల జాబితాలోని వయస్సునే ప్రామాణికంగా తీసుకోనుండడంతో ఆ మేరకు పంచాయతీల వారీగా అర్హుల గుర్తింపు ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. 1953 నుంచి 1961 లోపు జన్మించిన వారందరిని గుర్తిస్తున్నారు. ఓటర్ల జాబితాల్లోని వయసు ఆధారంగా కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. ఇప్పటికే మెజారిటీ వీఆర్ఓలు గ్రామాలలో అర్హుల జాబితాలను తయారు చేసి తహసీల్దార్లకు అందజేయగా, వారు కలెక్టర్లకు కూడా పంపించారు. ఈ జాబితాను పరిశీలించి కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తారు. రెట్టింపు కానున్న పింఛన్లు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రస్తుతం 3,62,721 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 1,13,941 మంది వృద్ధాప్య పింఛనుదారులే ఉన్నారు. వీరి తర్వాత వితంతువులైన మహిళా పింఛనుదారులు 1,26,669 మంది. ఇక ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, కల్లు గీత కార్మికులతోపాటు హెచ్ఐవీ, ఫైలేరియా పేషంట్లు 10 కేటగిరీల్లో కలిపి నెలకు సుమారు రూ.39 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లింపులు జరుపుతోంది. ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, వితంతుల, ఒంటరి మహిళలలు, ఇతర కేటగిరీల్లోని వారికి ఇప్పుడిస్తున్న రూ.1,000ని రూ. 2,016 , దివ్యాంగుల పింఛన్లను రూ.1500 నుంచి రూ.3016కు పెంచారు. ఈ లెక్కన ఆసరా పింఛన్ల బడ్జెట్ కూడా రెట్టింపు కానుంది. ఇక వృద్ధాప్య పింఛన్లకు అర్హత వయస్సును 64 నుంచి 57కు కుదించడం వల్ల ప్రతి జిల్లాలో వేలాది మంది కొత్తగా పింఛనుదారులు కానున్నారు. ఈ లెక్కన ఉమ్మడి ఆదిలాబాద్‌లో పింఛన్లకు రూ.80 కోట్లపైనే వెచ్చించాల్సి ఉంటుంది. నిర్మల్‌లోనే అధికం ఆసరా పింఛన్ల లబ్ధిదారులు నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు. ఇక్కడ బీడీ కార్మికులు ఏకంగా 63,206 మంది ఉండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. అన్ని కేటగిరీల పింఛను దారులు కలిపి 1,48,679 మంది ఉండగా, వీరి కోసం ప్రభుత్వం రూ.15.37 కోట్లు నెలకు వెచ్చిస్తోంది. అతి తక్కువగా కుమురంభీం జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య 51,201గా ఉంది. వీరికి నెల నెలా రూ.6.10 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తోంది. వయస్సు పరిమితి తగ్గించడంతో ఈసారి కుమురంభీం జిల్లాలో కూడా లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
‘ఓటు’.. సపోర్టు
దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్న ఎన్నికల కమిషన్ నేరుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లుఅవసరమైన రవాణా, ర్యాంపులు, వీల్‌చైర్ సౌకర్యం అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు కొందరు పుట్టుకతో.. మరికొందరు ప్రమాదవశాత్తూ దివ్యాంగులయ్యారు. ప్రభుత్వాలు వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తున్నా.. దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన భారత ఎన్నికల సంఘం అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా సకల ఏర్పాట్లు చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ప్రాధాన్యతను వివరిస్తూ.. అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. సామాన్యులతోపాటు దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించి అండగా నిలిచింది. సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో గల 1,303 పోలింగ్ బూత్‌లలో 27,773 మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించారు. వాహన ప్రమాదంలో వైకల్యం పొందినవారు 18,375 మంది, మూగ, చెవిటి వారు 2,498, చూపు లేనివారు 3,582 మంది ఉన్నారు. ఇతర దివ్యాంగులు 3,318 మంది ఉన్నారు. వీరంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎంతమంది వికలాంగులు ఉన్నారనే దానిపై బీఎల్ఓ(బూత్ లెవల్ అధికారులు)లు సమగ్ర సమాచారం సేకరించారు. దీనిని అనుసరించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల సంఖ్యనుబట్టి ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయాలా? లేదంటే సాధారణ బూత్‌లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. దివ్యాంగులకు సమాచారం.. జిల్లాలోని నియోజకవర్గాలవారీగా.. బూత్‌లవారీగా దివ్యాంగులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఇప్పటికే బీఎల్ఓలు సేకరించారు. దీని ఆధారంగా ముందస్తుగా దివ్యాంగుల వద్దకు వెళ్లిన అధికారులు వారికి ఓటరు స్లిప్‌లు అందించి.. రవాణా సౌకర్యం కల్పించి బూత్ వరకు తీసుకెళ్తామని, అక్కడ ఓటు వేయించి తీసుకువస్తామని చెబుతారు. వారు వెంటనే ఓటు వేసేలా సర్వం సిద్ధం చేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహిస్తోంది. శనివారం టీటీడీసీలో దివ్యాంగులకు సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ పాల్గొని.. దివ్యాంగులకు పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఓటు వేయడానికి వచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించనున్నారు. ప్రతి దివ్యాంగుడు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రత్యేక ఏర్పాట్లు.. గుర్తించిన దివ్యాంగుల ఇళ్ల వద్ద నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి.. బూత్ వద్దకు చేర్చే వరకు సంబంధిత బూత్‌స్థాయి అధికారులు, సిబ్బంది దివ్యాంగుల పక్కనే ఉంటారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన దివ్యాంగులను వీల్‌చైర్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంపులతో బూత్‌లోకి చేర్చనున్నారు. అలాగే దివ్యాంగుల సంఖ్యనుబట్టి ప్రత్యేక బూత్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. వీరికోసం ఉదయం కొన్ని గంటలను కేటాయించి.. ఆ సమయంలో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అదేరీతిలో వారి ఇళ్ల వద్దకు చేర్చనున్నారు. ఇటువంటి చర్యలతో దివ్యాంగుల్లో ఓటు వేయాలనే ఆసక్తి పెరుగుతుందని, తద్వారా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దివ్యాంగులకు కావాల్సిన వాహనాలను అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక వీల్చైర్లు దాదాపు 790 వరకు అవసరం అవుతుండగా.. ఇప్పటికే 190 వరకు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 600 వీల్చైర్లను కొనుగోలు చేయాలా? లేకపోతే అద్దెకు తీసుకోవాలా? అనేది కలెక్టర్‌తో చర్చించిన అనంతరం అధికారులు నిర్ణయించనున్నారు. ఓటు హక్కు వినియోగించుకుంటా.. మా లాంటి వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టంగా ఉంటుంది. మాకు ఇంటి వద్ద నుంచి రవాణా సౌకర్యంతోపాటు పోలింగ్ బూత్ వరకు వెళ్లడానికి వీల్‌చైర్ వంటి సౌకర్యం కల్పించడంతో మేము ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యముంది.. అలాంటి ఓటును మేము వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉంది. – నిడుమోలు అనిల్‌కుమార్, దివ్యాంగుడు, ఇందిరానగర్ కాలనీ, ఖమ్మం -
కనిపించని కనికరం
సాక్షి కడప: అతనికి చిన్నప్పుడే పోలియో సోకి కాళ్లు చచ్చుపడిపోయాయి..ఎంతదూరమైనా కాళ్లను ఈడ్చుకుంటూ..వంగి చేతుల సాయంతో కదలాలే తప్ప మరో మార్గంలేని దివ్యాంగుడు..ఇతని అన్న దాసరయ్య ..వదిన అనారోగ్యంతో కానరాని లోకాలకు వెళ్లారు. అన్న పిల్లల పోషణ కోసం దివ్యాంగుడిగా ఉన్న (చిన్నాన్న) వెంకటేశ్వర్లు కష్టాలు పడుతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో మంచాన పడిన తల్లి లక్షుమ్మ (85)ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు జీవనపోరాటం సాగిస్తున్నారు.సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల్లో మూడుసార్లు కలెక్టరేట్ మీ కోసంకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. ఎంత కష్టం బద్వేలు పరిధిలోని గోపవరం మండలం మడకలవారిపల్లె పరిధిలోని భావనారాయణనగర్‌కు చెందిన పెగడ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు. రెండుకాళ్లు ఎంతమాత్రం పనిచేయవు. సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కుటుంబానికి ఆదరువు అని వెంకటేశ్వర్లు గోడు వెళ్లబోసున్నారు. ఇప్పటికి మూడుసార్లు వచ్చానని...రెవెన్యూ అధికారులు దరఖాస్తు చూసి ఇక నువ్వు పో.. వస్తుందంటారు.. కానీ కలెక్టర్‌ను కలిసి ఎక్కడో సెక్షన్లో రిజిష్టర్ చేయిస్తే తప్ప రాదని స్థానిక అధికారులు చెబుతున్నారని, దిక్కుతెలియడం లేదని దివ్యాంగుడు ఆందోళన వ్యక్తం చేశారు.అన్ని కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడికి పదేపదే వస్తున్నా పనులు జరగకపోతే బాధగా ఉంటుందని వాపోయారు. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు కడప కలెక్టరేట్ మొదలుకొని తహసీల్దార్ కార్యాలయం వరకు పదేపదే ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే అధికారులే కనిపించడం లేదు. ఇప్పటికే సంబంధిత దరఖాస్తులను పూర్తి చేసి బద్వేలు పరిధిలోని తహసీల్దార్ కార్యాలయంలోకూడా అందజేశారు. అయితే అక్కడి అధికారులు ఇక్కడ చేసేదేమీ లేదు..కడపలోనే కలెక్టరేట్లో చేయించుకోవాలని చెప్పడంతో పలుమార్లు కడపకు కూడా వచ్చాడు. దివ్యాంగుడైన వెంకటేశ్వర్లు పదేపదే అన్నిచోట్ల తిరుగుతున్నా పని చేసే పెట్టే అధికారులే కరువవడం ఆందోళన కలిగించే పరిణామం. ఆడపిల్లల సంరక్షణ కోసం సరిగ్గా రెండేళ్ల క్రితం అన్న దాసరయ్య టీబీకి గురయ్యాడు. మందులు వాడుతూనే మంచానికి పరి మితమై తనువు చాలించాడు. అన్న భార్య నరసమ్మ కూడా కేన్సర్‌కు గురి కావడంతో ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువాత పడింది. దాసరయ్య, నరసమ్మలకు ఇద్దరు ఆడపిల్లలైన లక్ష్మిదేవి, వెంకటసుబ్బమ్మలను దివ్యాంగుడైన వెంకటేశ్వర్లే పోషిస్తున్నారు. అంతా తానై చూసుకుంటున్నారు. పెళ్లి కూ డా చేసుకోకుండా అన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. వెంకటేశ్వర్లు దివ్యాం గుడు కావడంతో పనులు చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వారి పోషణ గగనంగా మారింది. దీంతో రేషన్‌బియ్యం వండుకునితింటూ కాలం గడుపుతున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే కాస్తయినా ఉపశమనంగా ఉంటుందని భావిస్తూ అన్నిచోట్ల తిరుగుతున్నా కనికరం కరవవుతోంది. అమ్మను చూసుకుంటూ.. దివ్యాంగుడైన వెంకటేశ్వర్లు తల్లిని, అన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లికి సపరిచర్యలు చేస్తూనే మరోవైపు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తిరగని చోటంటూ లేకుండా తిరుగుతున్నాడు.ఇతనికి ప్రభుత్వం ఇంతవరకు సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయలేదు. ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. సీఎంను కలవాలని అమరావతికి పోయినా అక్కడ కూడా అధికారుల అనుమతి లేకపోవడంతో వెనక్కి వచ్చారు. చనిపోయిన వారికి సంబంధించి కూడా ఎలాంటి సొమ్ము ఒక్క పైసా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కనికరించరేమయ్యా!
ఈ ఫొటోలోని ఇద్దరూ దివ్యాంగులు. ఒకరు నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురానికి చెందిన చెన్నమ్మ కాగా మరొకరు పెళ్లకూరు మండలం శిరసనంబేడుకు చెందిన ఇందిరాకుమారి. ఇద్దరికీ రెండు కాళ్లూ పనిచేయవు. గత కొన్నేళ్లుగా సాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చెన్నమ్మ ట్రై సైకిల్ తుప్పు పట్టిపోయింది. కొత్త సైకిల్ కోసం అధికారులను ప్రాథేయపడుతోంది. ఇందిరాకుమారి రుణం కోసం అర్థిస్తోంది. ఎన్నిసార్లు కలెక్టరేట్ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. సోమవారం కూడా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్‌డేకు తమ సమస్యలు విన్నవించుకుందామని వచ్చారు. చెన్నమ్మ తుప్పుపట్టిన ట్రైసైకిల్‌పైనే కలెక్టరేట్‌కు వచ్చింది. అది ముందుకు కదలక మొరాయించింది. చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు. ఒక్కరూ ఆమెను పట్టించుకోలేదు. అటూ.. ఇటూ తిరుగుతున్న కలెక్టరేట్ సిబ్బందికి ఆమె అవస్థ పట్టలేదు. పక్కనే ఉన్న ఇందిరాకుమారి, చెన్నమ్మ కష్టాన్ని చూసింది. పాకుకుంటూ వెళ్లింది. నీకు నేనున్నానంటూ ట్రైసైకిల్ చక్రాన్ని సరిచేసి సాయం అందించింది. ఒకరికొకరు సాయం చేసుకుని ముందుకుసాగుతున్న వీరి కష్టాలు మాత్రం అధికారులకు కనిపించడం లేదు. ఎప్పటిలాగే వీరు అధికారులను కలిశారు. వినతిపత్రాలు ఇచ్చారు. మా సమస్య ఎప్పటికి తీరుతుందోనంటూ వారు వెనుదిరిగారు. ఫొటో– వి.సాంబశివరావు, నెల్లూరు (పొగతోట) నెల్లూరు(పొగతోట): సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్‌కు వచ్చి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తమ గోడు అధికారుల ఎదుట వెళ్లబోసుకుంటున్నా ఫలితం ఉండడం లేదని వాపోయారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జేసీ కె.వెట్రిసెల్వి, జేసీ–2 కమలకుమారి, టీజీపీ ప్రత్యేక కలెక్టర్ భార్గవి అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. నీటి ప్రవాహాన్ని పెంచండి పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నెల్లూరు జిల్లాకు నీటిని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానదికి వరద అధికంగా వస్తోందని, ప్రకాశం బ్యారేజ్ నుంచి వాటిని సముద్రంలోకి వదిలేస్తున్నారన్నారు. రాష్ట్రమంతా వర్షాలు కురుస్తున్నా జిల్లాలోకురవడం లేదన్నారు.కరువుతో ప్రజలు అలమటిస్తున్నారని, పొతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులెటర్ నుంచి నీటి ప్రవాహాన్ని పెంచి జిల్లాలోని చెరువులను నీటితో నింపేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. న్యాయ విచారణ జరిపించాలి జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు రుణాలు మంజూరు చేయడం లేదు. మండలానికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల విలువ చేసే జేసీబీలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్లు పెద్ద పెద్ద భూస్వాములకు అందజేశారు. జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే ఇచ్చారు. గత మూడేళ్ల నుంచి గిరిజనులకు రుణాలు కూడా మంజూరు చేయలేదు. జన్మభూమి కమిటీల దారదత్తంపై న్యాయ విచారణ జరిపించాలి. గ్రామానికి 10 నుంచి 20 మందికి రుణాలు మంజూరు చేయకపోతే ఈ నెల 22 నుంచి జిల్లావ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తాం. – ఎస్.మల్లి తదితరులు, దళిత సంఘర్షణ సమితిజిల్లా అధ్యక్షుడు -
అవిటివారిని ఆదుకుంటాం
కరీంనగర్: జిల్లాలోని వికలాంగులను ఆదుకుంటామని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం అంబేద్కర్ స్టేడియంలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. మోటివేషన్ ఇండియా సహాయ సహకారాలతో ట్రైసైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. వినికిడి కోల్పోయిన 10 మందికి ఒక ఆపరేషన్‌కు రూ.8 లక్షల చొప్పు ఖర్చు భరించి శస్త్రచికిత్సలు నిర్వహించామని.. వారికి తిరిగి వినికిడి శక్తి వచ్చిందని తెలిపారు. జిల్లాలో వినికిడి కోల్పోయిన వారు ఎవరైనా ఉంటే వాళ్లందరికీ దాతల సహకారంతో ఆపరేషన్లు నిర్వహిస్తావుని మంత్రి తెలిపారు. అలాంటి వారి వివరాలు సేకరించాలని వికలాంగుల శాఖ ఏడీని ఆదేశించారు. ట్రై సైకిళ్లన్నీ అమెరికాలో తయారు చేశారని.. వాటిని మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వాలు మాత్రమే అన్ని పనులు చేయలేవని.. మానవతాదృక్పథంతో ముందుకు వచ్చిన సంస్థల సహకారంతో వికలాంగులందరికీ సహాయ సహకాలందిస్తామని అన్నారు. అంతుకు ముందు మాట్లాడిన అమెరికాకు చెందిన న్యూటన్ మాట్లాడుతూ ఎల్డీఎస్ చారిటబుల్ ట్రస్టు ప్రతినిధిగా వచ్చినట్లు తెలిపారు. సైకిళ్ల పంపిణీతో 280 కుటుంబాలకు లబ్ధిచేకూరిందని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ నీతూప్రసాద్, వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ న ళిని తదితరులు పాల్గొన్నారు.