కనిపించని కనికరం | Handicapped Pension Certification Problems YSR Kadapa | Sakshi
Sakshi News home page

కనిపించని కనికరం

Published Tue, Aug 28 2018 8:04 AM | Last Updated on Tue, Aug 28 2018 8:04 AM

Handicapped  Pension Certification  Problems YSR Kadapa - Sakshi

కలెక్టరేట్‌ వద్ద దివ్యాంగుడు వెంకటేశ్వర్లు

సాక్షి కడప: అతనికి చిన్నప్పుడే పోలియో సోకి కాళ్లు చచ్చుపడిపోయాయి..ఎంతదూరమైనా కాళ్లను ఈడ్చుకుంటూ..వంగి చేతుల సాయంతో కదలాలే తప్ప మరో మార్గంలేని దివ్యాంగుడు..ఇతని అన్న దాసరయ్య ..వదిన అనారోగ్యంతో కానరాని లోకాలకు వెళ్లారు. అన్న పిల్లల పోషణ కోసం దివ్యాంగుడిగా ఉన్న (చిన్నాన్న) వెంకటేశ్వర్లు కష్టాలు పడుతున్నారు. ఒకవైపు అనారోగ్యంతో మంచాన పడిన తల్లి లక్షుమ్మ (85)ను కంటికి రెప్పలా కాపాడుకుంటూనే మరోవైపు జీవనపోరాటం సాగిస్తున్నారు.సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మూడు నెలల్లో మూడుసార్లు కలెక్టరేట్‌ మీ కోసంకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు.

ఎంత కష్టం
బద్వేలు పరిధిలోని గోపవరం మండలం మడకలవారిపల్లె పరిధిలోని భావనారాయణనగర్‌కు చెందిన పెగడ వెంకటేశ్వర్లు దివ్యాంగుడు. రెండుకాళ్లు ఎంతమాత్రం పనిచేయవు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వస్తే  కుటుంబానికి ఆదరువు అని వెంకటేశ్వర్లు గోడు వెళ్లబోసున్నారు. ఇప్పటికి మూడుసార్లు వచ్చానని...రెవెన్యూ అధికారులు దరఖాస్తు చూసి ఇక నువ్వు పో.. వస్తుందంటారు.. కానీ కలెక్టర్‌ను కలిసి ఎక్కడో సెక్షన్‌లో రిజిష్టర్‌ చేయిస్తే తప్ప రాదని స్థానిక అధికారులు  చెబుతున్నారని, దిక్కుతెలియడం లేదని దివ్యాంగుడు ఆందోళన వ్యక్తం చేశారు.అన్ని కష్టనష్టాలకు ఓర్చి ఇక్కడికి పదేపదే వస్తున్నా పనులు జరగకపోతే బాధగా ఉంటుందని వాపోయారు.

కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
కడప కలెక్టరేట్‌ మొదలుకొని తహసీల్దార్‌ కార్యాలయం వరకు పదేపదే ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరించే అధికారులే కనిపించడం లేదు. ఇప్పటికే సంబంధిత దరఖాస్తులను పూర్తి చేసి బద్వేలు పరిధిలోని తహసీల్దార్‌ కార్యాలయంలోకూడా అందజేశారు. అయితే అక్కడి అధికారులు ఇక్కడ చేసేదేమీ లేదు..కడపలోనే కలెక్టరేట్‌లో చేయించుకోవాలని చెప్పడంతో పలుమార్లు కడపకు కూడా వచ్చాడు. దివ్యాంగుడైన వెంకటేశ్వర్లు పదేపదే అన్నిచోట్ల తిరుగుతున్నా పని చేసే పెట్టే అధికారులే కరువవడం ఆందోళన కలిగించే పరిణామం.

ఆడపిల్లల సంరక్షణ కోసం
సరిగ్గా రెండేళ్ల క్రితం అన్న దాసరయ్య టీబీకి గురయ్యాడు. మందులు వాడుతూనే మంచానికి పరి మితమై తనువు చాలించాడు. అన్న భార్య నరసమ్మ కూడా కేన్సర్‌కు గురి కావడంతో ఆమె కూడా ఆస్పత్రిలో మృత్యువాత పడింది. దాసరయ్య, నరసమ్మలకు ఇద్దరు ఆడపిల్లలైన లక్ష్మిదేవి, వెంకటసుబ్బమ్మలను దివ్యాంగుడైన వెంకటేశ్వర్లే పోషిస్తున్నారు. అంతా తానై చూసుకుంటున్నారు. పెళ్లి కూ డా చేసుకోకుండా అన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. వెంకటేశ్వర్లు దివ్యాం గుడు కావడంతో పనులు చేయడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వారి పోషణ గగనంగా మారింది. దీంతో రేషన్‌బియ్యం వండుకునితింటూ కాలం గడుపుతున్నారు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ వస్తే కాస్తయినా ఉపశమనంగా ఉంటుందని భావిస్తూ అన్నిచోట్ల తిరుగుతున్నా కనికరం కరవవుతోంది.

అమ్మను చూసుకుంటూ..
దివ్యాంగుడైన వెంకటేశ్వర్లు  తల్లిని, అన్న బిడ్డలను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అనారోగ్యంతో మంచంలో ఉన్న తల్లికి  సపరిచర్యలు చేస్తూనే మరోవైపు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం తిరగని చోటంటూ లేకుండా తిరుగుతున్నాడు.ఇతనికి ప్రభుత్వం ఇంతవరకు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరు చేయలేదు. ఆరు నెలల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు. సీఎంను కలవాలని అమరావతికి  పోయినా అక్కడ కూడా అధికారుల అనుమతి లేకపోవడంతో వెనక్కి వచ్చారు. చనిపోయిన వారికి సంబంధించి కూడా ఎలాంటి సొమ్ము ఒక్క పైసా కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement