దివ్యాంగులకు భరోసా కల్పిస్తున్న ఎన్నికల కమిషన్ నేరుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లుఅవసరమైన రవాణా, ర్యాంపులు, వీల్‌చైర్ సౌకర్యం అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సదస్సులు కొందరు పుట్టుకతో.. మరికొందరు ప్రమాదవశాత్తూ దివ్యాంగులయ్యారు. ప్రభుత్వాలు వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాల భర్తీలో ప్రాధాన్యం ఇస్తున్నా.. దివ్యాంగుల ఇబ్బందులను గుర్తించిన భారత ఎన్నికల సంఘం అంగవైకల్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా సకల ఏర్పాట్లు చేస్తోంది. శాసనసభ ఎన్నికల్లో ప్రాధాన్యతను వివరిస్తూ.. అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. సామాన్యులతోపాటు దివ్యాంగులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించి అండగా నిలిచింది.
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో గల 1,303 పోలింగ్ బూత్‌లలో 27,773 మంది దివ్యాంగులు ఉన్నట్లు గుర్తించారు. వాహన ప్రమాదంలో వైకల్యం పొందినవారు 18,375 మంది, మూగ, చెవిటి వారు 2,498, చూపు లేనివారు 3,582 మంది ఉన్నారు. ఇతర దివ్యాంగులు 3,318 మంది ఉన్నారు. వీరంతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో ఎంతమంది వికలాంగులు ఉన్నారనే దానిపై బీఎల్‌ఓ(బూత్ లెవల్ అధికారులు)లు సమగ్ర సమాచారం సేకరించారు. దీనిని అనుసరించి ఆయా పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగుల సంఖ్యనుబట్టి ప్రత్యేక బూత్ ఏర్పాటు చేయాలా? లేదంటే సాధారణ బూత్‌లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటారు.
దివ్యాంగులకు సమాచారం..
జిల్లాలోని నియోజకవర్గాలవారీగా.. బూత్‌లవారీగా దివ్యాంగులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని ఇప్పటికే బీఎల్‌ఓలు సేకరించారు. దీని ఆధారంగా ముందస్తుగా దివ్యాంగుల వద్దకు వెళ్లిన అధికారులు వారికి ఓటరు స్లిప్‌లు అందించి.. రవాణా సౌకర్యం కల్పించి బూత్ వరకు తీసుకెళ్తామని, అక్కడ ఓటు వేయించి తీసుకువస్తామని చెబుతారు. వారు వెంటనే ఓటు వేసేలా సర్వం సిద్ధం చేస్తారు. దీనిపై అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక సదస్సులు కూడా నిర్వహిస్తోంది. శనివారం టీటీడీసీలో దివ్యాంగులకు సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్ పాల్గొని.. దివ్యాంగులకు పోలింగ్ బూత్‌లలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, ఓటు వేయడానికి వచ్చేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించనున్నారు. ప్రతి దివ్యాంగుడు ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
ప్రత్యేక ఏర్పాట్లు..
గుర్తించిన దివ్యాంగుల ఇళ్ల వద్ద నుంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసి.. బూత్ వద్దకు చేర్చే వరకు సంబంధిత బూత్‌స్థాయి అధికారులు, సిబ్బంది దివ్యాంగుల పక్కనే ఉంటారు. పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన దివ్యాంగులను వీల్‌చైర్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాంపులతో బూత్‌లోకి చేర్చనున్నారు. అలాగే దివ్యాంగుల సంఖ్యనుబట్టి ప్రత్యేక బూత్‌లను సైతం ఏర్పాటు చేయనున్నారు. వీరికోసం ఉదయం కొన్ని గంటలను కేటాయించి.. ఆ సమయంలో వారందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత అదేరీతిలో వారి ఇళ్ల వద్దకు చేర్చనున్నారు. ఇటువంటి చర్యలతో దివ్యాంగుల్లో ఓటు వేయాలనే ఆసక్తి పెరుగుతుందని, తద్వారా ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దివ్యాంగులకు కావాల్సిన వాహనాలను అంచనా వేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇక వీల్‌చైర్లు దాదాపు 790 వరకు అవసరం అవుతుండగా.. ఇప్పటికే 190 వరకు అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. మిగిలిన 600 వీల్‌చైర్లను కొనుగోలు చేయాలా? లేకపోతే అద్దెకు తీసుకోవాలా? అనేది కలెక్టర్‌తో చర్చించిన అనంతరం అధికారులు నిర్ణయించనున్నారు.
ఓటు హక్కు వినియోగించుకుంటా..
మా లాంటి వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవడం కష్టంగా ఉంటుంది. మాకు ఇంటి వద్ద నుంచి రవాణా సౌకర్యంతోపాటు పోలింగ్ బూత్ వరకు వెళ్లడానికి వీల్‌చైర్ వంటి సౌకర్యం కల్పించడంతో మేము ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యముంది.. అలాంటి ఓటును మేము వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేయడం సంతోషంగా ఉంది. – నిడుమోలు అనిల్‌కుమార్, దివ్యాంగుడు, ఇందిరానగర్ కాలనీ, ఖమ్మం
Comments
Please login to add a commentAdd a comment