సాక్షి, మెదక్: ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో 1,03,410 మంది లబ్ధిదారులు ఆసరా పింఛన్లు పొందుతున్నారు. వీరిలో దివ్యాంగులకు రూ.1,500, మిగితా వారికి వెయ్యి రూపాయల చొప్పున అందచేస్తున్నారు. ప్రస్తుతం లబ్ధిదారులకు వారి బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమచేస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెల నుంచి దివ్యాంగులకు రూ.3,016, మిగిలిన లబ్ధిదారులకు రూ.2,016 పింఛన్ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను మూడు రోజుల క్రితం విడుదల చేశారు. నూతన మార్గదర్శకాలు జిల్లా అధికారులకు అందాల్సి ఉంది.
57 సంవత్సరాలు నిండిన వృద్ధులు పింఛన్ పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓటరు కార్డులోని వయస్సును ప్రామాణికంగా తీసుకొని పింఛన్‌కు అర్హులయ్యే లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. అర్హత వయస్సు నిండిన వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పింఛన్ డబ్బులు చేతికందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు గాను 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకానికి నిధులు కేటాయించి ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు పెంచిన పింఛన్ సొమ్ముతో పాటు, కొత్త వారికి పింఛన్ అందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఆసరా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు.
నవంబరు 19న ప్రకటించిన తుది జాబితా ప్రకారం వారిని ఎంపిక చేశారు. జిల్లాలో 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు 36,954 మంది ఉన్నట్లు గుర్తించారు. పింఛన్ పొందేందుకు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు లోపు సంవత్సర ఆదాయం మాత్రమే ఉండాలి. మూడెకరాల లోపు తరి భూమి, ఏడున్నర ఎకరాల లోపు మెట్ట భూమి ఉన్న వారు అర్హులుగా ఉంటారు. కుటుంబంలో ఒకరికి మాత్రమే పింఛన్ అందజేస్తారు. ప్రస్తుతం జిల్లా గ్రామీణాభివృద్ధి (డీఆర్‌డీఓ) అధికారులు సేకరించిన వివరాలపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలన చేయించనున్నారు.
పోలింగ్ బూత్‌స్థాయి అధికారులకు జాబితాను అందచేసి వారి ద్వారా పరిశీలింపచేస్తారు. తర్వాత డీఆర్‌డీఓ అధికారులు, గ్రామైక్య సంఘం, ఇందిరా క్రాంతి పథకం సీసీల చేత క్షుణ్ణంగా విచారణ చేయించనున్నారు. అలాగే ఎంపిక చేసిన వారి ఇళ్ళకు వెళ్లి ఆధార్ కార్డు, సెల్‌ఫోన్ నంబర్లను సేకరించనున్నారు. ఒకటికి రెండుమార్లు వడపోత అనంతరం లబ్ధిదారుల తుదిజాబితాను ప్రకటించనున్నారు.
ఈ జాబితాను కలెక్టర్ ఆమోదించిన తర్వాత పింఛన్ మంజూరుకు ఉన్నతాధికారులకు పంపిస్తారు. ప్రస్తుతం జిల్లాలో ఆసరా పథకం కింద ప్రతినెలా రూ.10.78 కోట్లు చెల్లిస్తున్నారు. లబ్ధిదారుల అర్హత వయస్సును 57 సంవత్సరాలకు కుదించడం, దివ్యాంగులు, మిగితా వారికి పింఛన్ మొత్తం పెంచనుండటంతో ప్రభుత్వంపై భారం పడనుంది. జిల్లాలో కొత్తగా లబ్ధిదారుల చేరికతో సుమారు రూ.50 లక్షలకు పైగా భారం పడనుంది. ఏప్రిల్ నుంచి పింఛన్ మొత్తం పెంచితే పాత, కొత్త లబ్ధిదారులతో కలిపి జిల్లాలో సుమారు రూ.30 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు.
పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ...
గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో బిల్ కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపిక చేసిన జాబితాను గ్రామసభల ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. జాబితాలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వచ్చిన వాటిని పరిశీలించి తుదిజాబితాను రూపొందించడం జరుగుతుంది. లబ్ధిదారుల ఆధార్ నంబరు, బ్యాంకు ఖాతా, ఫొటోలను పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓలు, పట్టణాల్లోని లబ్ధిదారుల జాబితాను కమిషనర్‌లు పరిపాలన అనుమతి కోసం కలెక్టర్లకు పంపిస్తారు. కలెక్టర్ ఆమోదం తెలిపిన అనంతరం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాఫ్ట్‌వేర్‌లో లబ్ధిదారుల వివరాలను అప్‌లోడ్ చేస్తారు.
త్వరలోనే తుది జాబితా
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓటరు జాబితా ప్రకారం ప్రస్తుతం 57 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాల వరకు ఉన్న వారి వివరాలను సేకరించడం జరుగుతుంది. ఈ మేరకు పోలింగ్‌బూత్ అధికారుల ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తేల్చడం జరుగుతుంది. గ్రామైఖ్య సంఘం, సీసీలతో విచారణ జరిపించి తుది జాబితాను రూపొందిస్తాం. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఆసరా పింఛన్‌లు లబ్ధిదారులకు అందించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. –భీమయ్య, డీఆర్‌డీఓ ఏడీ, మెదక్
Comments
Please login to add a commentAdd a comment