ఇందూరు(నిజామాబాద్ అర్బన్): ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాల్లో నిలువు దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతోంది. సేవలను బట్టి వసూళ్ల పర్వం నడుస్తోంది. నూతన ఆధార్ కార్డులు, పాత కార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా మార్పులు తదితర సేవల కోసం ఆధార్ కేంద్రాల నిర్వాహకులు అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ పెన్షన్ పొందడానికి లబ్ధిదారుల వయస్సును 57 సంవత్సరాలకు కుదించిన విషయం తెలిసిందే. దీంతో ఆసరా పెన్షన్ పొందడానికి ఉవ్విళ్లూరుతున్న జనం, వారి ఆధార్ కార్డుల్లో వయస్సు మార్పిడి చేసుకోవడానికి ఆధార్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు.
దీంతో ప్రజల అవసరాన్ని ‘ఆసరా’గా చేసుకుని ఆధార్ నిర్వాహకులు నిబంధనలకు విస్మరించి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారు. జిల్లాలో గల మండలానికో శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాన్ని మీ సేవా నిర్వాహకులకు అధికారులు మంజూరు చేశారు. జిల్లా వ్యాప్తంగా 36 కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 27 కేంద్రాలు మండలాల్లో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ(ఈఎస్‌డీ) సంస్థకు చెందిన 20 ఆధార్ కేంద్రాలుండగా, సీఎస్‌సీకి చెందిన ఆధార్ కేంద్రాలు 16 ఉన్నాయి. ఆధార్ కేంద్రాల్లో సేవల పేరిట అడ్డగోలుగా వసూళ్ల పర్వం నడుస్తున్నా.. పర్యవేక్షణ చేసే సంబంధిత అధికారులు ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే విమర్శలకు తావిస్తోంది. ఇటు తహసీల్దార్లు కూడా చూసీ చూడనట్లు ఉంటున్నారు. తనిఖీల మాటే లేకుండా పోయింది. ఆధార్ కేంద్రాల నిర్వాహకులతో అధికారులు మిలాఖత్ అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇలా గుంజుతున్నారు..
ఆధార్ కేంద్రాల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేట్టాయి. వీలైనంత త్వరలో ప్రయివేటు వ్యక్తులు నడుపుతున్న ఆధార్ కేంద్రాలను తొలగించి మండల, పట్టణ ప్రాంత కేంద్రాల్లో గల ప్రభుత్వ కార్యాలయాల్లోకి తరలించాలని, వీటిని ప్రభుత్వమే నిర్వహిస్తుందని ఇటీవల తెలిపింది. దీంతో తాము నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాలకు గడ్డుకాలం వచ్చి పడిందని దోపిడీకి తెరలేపారు. ఇదే సమయంలో ఆధార్ కార్డుల్లో వయసు మార్పిడికి డిమాండ్ పెరగడం కూడా వారికి అవకాశంగా మారింది. నిజానికి కొత్తగా ఆధార్ కార్డు నమోదు చేసుకునే వారి నుంచి ఎలాంటి రుసుము తీసుకోకూడదు. కానీ రూ. 200 వరకు తీసుకుంటున్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి.
అదే విధంగా పాత కార్డుల్లో చేర్పులు మార్పులకు రూ. 25 రుసుము తీసుకోవాల్సి ఉండగా రూ. 300 పైగా తీసుకుంటున్నారు. ఆధార్ కార్డులో వయస్సు మార్పిడి జరిగితే తమకు రూ. 2 వేల పెన్షన్ వస్తుందనే ఆశతో ఆధార్ నిర్వాహకులు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తున్నారు. దీంతో ఈ విషయం దాదాపు బయటకు రావడం లేదు. ఇంద ల్వాయితో పాటుగా మాక్లూర్, డిచ్‌పల్లి మండలాల్లో కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు గుంజుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే సిరికొండ, నవీపేట్, నిజామాబాద్ నగరం, బాల్కొండ, భీమ్‌గల్, బోధన్ ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment